ఒకచో తూర్పున తెల్లవారు నిను డొక్కోయంచు మేల్గొల్పగా
నొకచో మింటను మంటగొల్పు రవి మొర్రోయంచు వాపోవగా
నొకచో పశ్చిమమందగించు ద్యుమణీవ్యూహమ్ము శాంతించగా
నొకరీతిన్ నడువంగరాదుగద! దివ్యోత్పాతసంహర్తకున్
*~శ్రీశర్మద*
సీ.
స్వచ్ఛనీరము లేదు స్నానమ్ము చేయింప
స్వర్గంగ తెప్పించు శక్తి లేదు
శుద్ధమౌ తేనెలజోరు నీకర్పించ
పూదేనె లభియించు పుడమి లేదు
భస్మమ్ము దెచ్చి నిన్ భక్తితో స్నానింప
చితిభస్మమును దెచ్చు చేవ లేదు
పుఱ్ఱెదండల నిన్ను మిఱ్ఱుగా పూజించ
భూరిగా యత్నించి పోరలేను
తే.గీ.
చర్మవస్త్రము లర్పించు మర్మమెఱుగ
భక్తి తోడుత నినుగొల్తు పాడిదప్ప
దిక్కులంబరముగ దాల్చిన దేవదేవ!
భుజగభూషణ నిరతమ్ము బ్రోవుమయ్య!
ఉ.
శీతలమావహించు పెనుచీకటివేళల కార్తికమ్మునన్
భూతలవాసులన్ మిగుల పోరుకు పొమ్మను రీతి వార్ధులన్
మూతులు ముక్కులన్ ముడిచి పోయి మునుంగు మనంగ న్యాయమే?
నీ తలపోత చాటున ననేకము లుండు గదయ్య శంకరా!
*~శ్రీశర్మద*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి