రామాయణమ్ ..337
...
రాముడా గీముడా అతడెంత ? ఆతడి బలమెంత ? మేము నీ చెంత ఉండగా ఏల నీకు చింత ?
ఇరువురు మానవులకు, కొన్ని కోతులకు మనము ఆలోచించవలసిన అవసరమే లేదు !.
.
దేవదానవ,పన్నగోరగ,యక్షగంధర్వకిన్నరకింపురుషులను జయించి ముల్లోకములను గజగజలాడించిన రాక్షస సార్వభౌముడికి వారొక లెక్కా !!
.
మనము ఏమరపాటుగా ఉన్నప్పుడు ఆ కోతిగాడు చేసిన పనికి మనమేల చింతించవలే !
.
ప్రభూ నేనొక్కడను చాలును అని ప్రహస్తుడు అను సేనా నాయకుడు గర్వముగా పలికెను.
.
హనుమంతుడు చేసిన పరాభవము మరువలేనిది సహింపరానిది ! రామలక్ష్మణసుగ్రీవ సహితముగా వానరులందరినీ నేను మట్టుపెట్టెదను ప్రభూ అని దుర్ముఖుడను సేనా నాయకుడు విర్రవీగుచూ మాటలాడెను.
.
రాజా నా కొక ఉపాయము తోచుచున్నది అని వజ్రదంష్ట్రుడు అను సేనానాయకుడు ఈ విధముగా మాటలాడెను.
.
రాజా! వేలకొలదిగా మన రాక్షస సమూహము మనుష్యరూపములు ధరించి రాముని వద్దకు వెళ్ళి ,మేము నీ తమ్ముడు భరతుడుపంపగా వచ్చినాము అని చెప్పి సేనలో కలిసి అందరూ నిద్రించుసమయమున గాఢసుషుప్తిలో ఉన్నప్పుడు ఏ ఒక్కరూ మిగులకుండా సంహారము చేసి వచ్చెదము!
.
ఎవరికి తోచిన ఉపాయము వారు చెప్పుచూ వీరాలాపములు సేయుచున్నప్పుడు విభీషణుడు వారెల్లరినీ శాంతింపచేసి అంజలి ఘటించి ఇట్లు పలికెను.
.
వూటుకూరు జానకిరామారావు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి