27, సెప్టెంబర్ 2023, బుధవారం

నవగ్రహ పురాణం - 64 వ అధ్యాయం*

 *నవగ్రహ పురాణం - 64 వ అధ్యాయం*

🪷🪻🌿🪷🪻🌿🪷🪻🌿🪷🪻🌿🪷


*చంద్రగ్రహ చరిత్ర - 2*



*"నిజమే అనుకో..."*


*"నారదా ! ఆ చంద్రుడు మా పుత్రికకు తగిన వరుడేనా ?"* ప్రసూతి దేవి అడిగింది. 


*"పుత్రికకు - కాదు , దేవీ ! పుత్రికలకు ! ఇది నా ఆలోచనా , నా ప్రతిపాదనా కావు. మన జనకపాదులు చతుర్ముఖుల సంకల్పం. ఆయన సంకల్పాన్ని సాక్షరమూ , సార్ధకమూ చేయడమే ఈ నారదుని పని !" నారదుడు నవ్వుతూ అన్నాడు. ఇక ఆ ఆత్రేయ చంద్రుడు మన కన్యలకు తగిన వరుడేనా అన్నది మీ సందేహం ! అంత అందగాడు కాకపోతే , ఆ తార అతగాడిని ఎందుకు నెత్తికెత్తుకుంటుంది ; అతగాడికి ఒక సుకుమారుణ్ణి కంటుంది ? మీ కన్యలు ఇరవై ఏడుగురూ చక్కని చుక్కలు ! ఈ చక్కని చుక్కల మధ్య ఆ చంద్రుడిని చూసి తీరాల్సిందే !"*


*"బాగుంది ! చంద్రుడి జననీ జనకులను గౌరవించడం మన విధి. అది ధర్మం. కూడా ! చంద్రుడిని మా అల్లుడిగా స్వీకరించడానికి అత్రీ అనసూయల అనుమతీ, అమోదం తీసుకుందాం !"* దక్ష ప్రజాపతి అన్నాడు.


*"శుభస్య శీఘ్రం , నారదుడు నవ్వుతూ అన్నాడు. "మీ దంపతులు బయలుదేరండి ! మీకు తోడుగా నేనూ వస్తాను !"*


అత్రి అనసూయా దంపతులు దక్ష దంపతులకూ , నారదుడికి స్వాగతం పలికి అతిధి సత్కారాలు అందించారు. అతిధ్యం స్వీకరించిన అనంతరం దక్షుడు అత్రితో తమ రాకకు కారణం వివరించాడు. అత్రి , అనసూయా ముఖాలు చూసుకున్నారు.


*"మా చంద్రుడు గురుపత్నీ గమనంతో ధర్మం తప్పి ప్రవర్తించాడు. తల్లిదండ్రులు తలలు వాల్చుకునేలా చేశాడు. వాని మూలంగా తారకు జన్మించిన బాలుడి పోషణ భారం , విద్యాబోధన బాధ్యతా నేను స్వీకరించి , తలకెత్తుకోవాల్సి వచ్చింది !"* అత్రి కంఠంలో ఆవేదన ధ్వనించింది.


*"ఆ గతాన్ని మరిచిపొండి , అత్రి మహర్షీ !"* నారదుడు నవ్వుతూ అన్నాడు. *"తారాచంద్రుల తనయుడిగా బుధుడు ఆవిర్భవించాల్సి ఉంది. అది జరిగింది ! దక్ష కన్యలను చంద్రుని పత్నులుగా స్వీకరించడం మంచిది !”*


*"బహువచనం ఉపయోగిస్తున్నావు నారదా ?"* అత్రి మహర్షి చిరునవ్వుతో అన్నాడు. 


*"బహువచనమే ! మన చంద్రుడికి బహుపత్నీ లాభం ఉందన్నారు చతుర్ముఖులు !! నారదుడు నవ్వుతూ అన్నాడు..


*"ఆలోచిస్తుంటే మా చంద్రుడి గతాన్నీ , వర్తమానాన్నీ , భవిష్యత్తునూ నియంత్రిస్తోంది. ఆ చతుర్ముఖులేనేమో అనిపిస్తుంది , నారదా!"* అత్రి నవ్వుతూ అన్నాడు.


*"ఆ విషయంలో నాకు ఎలాంటి సందేహమూ లేదు. ఆ బ్రహ్మదేవుల అంశే కదా. నా గర్భాన చంద్రుడిగా జన్మించింది !"* అనసూయ నవ్వుతూ ప్రసూతితో అంది.


*"మా కన్యలను మీ దంపతుల కోడళ్ళుగా చేయమని నారదుడి ద్వారా ఆ చతుర్ముఖులు సూచించారు. అనసూయా !"* ప్రసూతి అంది. 


*"ఇరవై ఏడుగురు కన్యలు..."* అనసూయ సాలోచనగా అంది. *"మంచిదే చంద్రుడికి ఇంక పరసతుల గురించి ఆలోచించే తీరిక కూడా చిక్కదు. సతీ సైన్యం చుట్టు ముట్టి ఉంటుంది !"*


అనసూయ మాటలకు అందరూ నవ్వారు.


*"దక్షప్రజాపతీ ! మీ అభిప్రాయం , మా అభిప్రాయం ఒక్కటయ్యాయి. కళ్యాణం జరిపించండి !"* అత్రి నవ్వుతూ అన్నాడు.


*"శుభం !"* అన్నాడు నారదుడు.


అందరూ వివాహమహోత్సవం గురించి ఉత్సాహంగా చర్చించుకుంటూ ఉంటే , - దర్భలూ , సమిధలూ పట్టుకుని బుధుడు వచ్చాడు.


*"నాయనా , బుధా ! ఇలారా ! దక్షదంపతులకూ , నారద మహర్షికి ప్రణామాలు చేయి !"* అత్రి మహర్షి బుధుడితో అన్నాడు.


బుధుడు వినయంగా ముగ్గురికీ అభివాదం చేసి , ఆశీస్సులు అందుకున్నాడు.


*"బుధుణ్ణి చూస్తుంటే , ఈ వయసులో చంద్రుణ్ణి చూస్తున్నట్టే వుంది !"* నారదుడు నవ్వుతూ అన్నాడు. *"తార నిజమే చెప్పింది ! బుధుడు చంద్ర సుతుడే !"*


అత్రిమహర్షీ , దక్షప్రజాపతి నారదుడి సమక్షంలో ముహూర్త నిర్ణయం చేశారు.


దక్షపుత్రికలు అశ్విని , భరణి , కృత్తిక , శ్రీ పాణి , మృగశిర , ఆర్ద్ర , పునర్వసు , పుష్యమి , ఆశ్లేష , మఖ , పుబ్బ , ఉత్తర , హస్త , చిత్త , స్వాతి , విశాఖ , అనూరాధ , జ్యేష్ఠ , మూల , పూర్వాషాఢ , ఉత్తరాషాఢ , శ్రవణం , ధనిష్ఠ , శతభిషం , పూర్వాభాద్ర , ఉత్తరాభాద్ర , రేవతి - ఆ శుభ ముహూర్తాన చంద్రుడి పత్నులయ్యారు.


తల్లి ప్రసూతీదేవి పనువున ఇరవై ఏడుగురు వధువులూ వెలుగుతున్న జ్యోతులున్న బంగారు పళ్ళేలు పట్టుకుని , తమ వరుని చుట్టూ వలయాకారంగా నిలబడి హారతి ఇస్తున్నారు. ఆ జ్యోతుల కాంతిలో చంద్రుడు వెలిగిపోతున్నాడు. అందరికీ కన్నుల పండువ చేస్తూ.


*"చూశారా ! చక్కని చుక్కలలో చక్కని చంద్రుడు !"* నారదుడు నవ్వుతూ దక్ష దంపతులతో అన్నాడు.


చంద్రుడు చిరునవ్వులు చిందిస్తూ , తన భార్యా బృందాన్ని ఒకరి అనంతరం ఒకరిని చూస్తూ నెమ్మదిగా గుండ్రంగా తిరుగుతున్నాడు.


దీపకళికల కాంతులు ప్రతిఫలిస్తూ తళతళలాడుతున్న అతని కళ్ళు ఒక్కసారి మెరిశాయి. గుండ్రంగా తిరుగుతున్న చంద్రుడు ఆగిపోయాడు. మెరుస్తున్న అతని కళ్ళు ఎదురుగా ఉన్న ఒక వధువు మీద తాపడం అయిపోయాయి. ఆ నవ వధువు పేరు తనకు తెలుసు. అయస్కాంతంలా తనని లాగుతున్న ఆ నవ వధువు పేరు - రోహిణి.


అత్తవారింటి నుండి పత్నీ బృందంతో చంద్రుడు తన మందిర ప్రవేశం చేశాడు. 


నవ వధువులందరూ ఒకరిని మించి ఒకరు ఉత్సాహంగా ఉన్నారు. వరసగా ప్రథమ , ద్వితీయ , తృతీయ పత్నులైన అశ్వినీ , భరణి , కృత్తికా ఆహారం సిద్ధం చేశారు. కొత్త పెళ్ళికొడుకుతో , తమ గృహంలో మొట్టమొదటిసారిగా సహ పంక్తిలో భోజనం చేయబోతున్నందుకు వాళ్ళందరికీ చాలా సంతోషంగా ఉంది. తల్లి తమను సాగనంపే ముందు చెప్పిన మాటలు అందరిలోనూ ఉత్సాహం ఉరకలెత్తేలా చేస్తున్నాయి.


భోజన సమయానికి ముందే ఇరవై ఆరుగురు వధువులూ , చక్కగా అలంకరించుకుని. భోజనశాలలో నిరీక్షిస్తున్నారు. వాళ్ళలో రోహిణి మాత్రం లేదు.


*"చెల్లీ , మూలా ! ఆ రోహిణి మందిరంలో ఏ మూలలో ఉందో చూడవే !"* అశ్విని నవ్వుతూ అంది. అందరూ నవ్వారు.


*"అందరికీ లేని అలసట దానికే వచ్చినట్టుంది !"* అంది మూల వెళ్ళబోతూ.


ఆమెకు ఆ అవకాశం ఇవ్వకుండా చంద్రుడూ , రోహిణీ ఇద్దరూ భోజనశాలకు వచ్చారు. చంద్రుడి చెయ్యి రోహిణి నడుం చుట్టూ ఒడ్డాణంలా చుట్టుకుని ఉంది. ఇద్దరూ నవ్వుకుంటున్నారు.


చంద్రుడు తన ఇతర పత్నుల్ని కన్నెత్తి చూడనేలేదు ! రోహిణి చూసింది , అయితే చూడనట్టు నటిస్తోంది. చంద్రుడు ఒక విస్తరి ముందు కూర్చున్నాడు. రోహిణి అతని పక్కనే కూర్చుంది.


*'తమలో ఎవరెవరు పంక్తిలో కూర్చోవాలి ?'* అంటూ ఆలోచిస్తున్న ఇరవై ఆరుగురు నవ వధువుల సందేహానికి చంద్రుడి మాట పరోక్షంగా సమాధానం చెప్పింది. *"ఎవరు వడ్డిస్తారు. మాకు ?”* దూరంగా నిలుచున్న అశ్వినీ బృందాన్ని కలయజూస్తూ అన్నాడు చంద్రుడు. *"మేం భోజనం చేసి , తోటలో తిరిగి వస్తాం ! ఈలోగా మీరందరూ ఆహారం తీసుకోండి !"*

కామెంట్‌లు లేవు: