🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
*గణపతి జ్ఞానం*
🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
*"అనుకూలత - ప్రతికూలత" అనేవి కాల లక్షణాలు. ప్రతికూలతను తొలిగించి అనుకూలతను కలిగించే కాలరూప ఈశ్వరచైతన్యమే విఘ్నేశ్వరుడు. మంచి పనులకు విఘ్నాలను తొలగించి, చెడు పనులకు విఘ్నాలను కలిగించే విఘ్న నియామకుడు 'వి-నాయకుడు'.*
*ప్రథమదేవుడు, ప్రధానదేవుడు గణపతి. ఏ కార్యానికైనా - అది భౌతికరంగం కావచ్చు, ఆధ్యాత్మిక సాధన కావచ్చు - వాటి అవరోధాలను తొలగించి సిద్ధినీ, బుద్ధి(సమృద్ధి)నీ ప్రసాదించే దివ్యశక్తినే "గణపతి"గా ఉపాసించడం వేదసంప్రదాయం.*
*శివుడు జ్ఞానమూర్తి - శక్తి ఆనందస్వరూపిణి. జ్ఞానానందాలు విడిగా ఉండవు. ఈ శివశక్తుల ఏకతత్త్వమే గణపతి- అంటే- జ్ఞానానంద సమాహార స్వరూపం. జ్ఞానానంద శక్తి నుండి ఉత్సాహం, కార్యశీలత వంటి దివ్యశక్తులు కలుగుతాయి. ఇవి ఎలాంటి విపరీతాలనైనా తొలగించి, సిద్ధిని ప్రసాదిస్తాయి.*
*కార్యం ప్రారంభించేటప్పుడు భయం, సంశయం, సంకోచం, ఉద్వేగం వంటివి లేకుండా, ఉత్సాహంగా, "తప్పక సిద్ధి లభిస్తుంది" అనే సకారాత్మక భావనతో కూడిన ఆనందాన్ని "ఆమోదం" అనవచ్చు. సిద్ధి కలిగాక లభించే ఆనందాన్ని "ప్రమోదం" అని భావించవచ్చు. ఆనందపు ఈ రెండు భావాలే గణపతి శక్తులు.*
*'పూర్ణ'త్వానికి సంకేతాలుగా మోదకాలు, ఉండ్రాళ్ళు, లడ్డు..వంటివి గణపతికి నైవేద్యాలుగా - ఆయన వలన మనకి ప్రసాదాలుగా లభిస్తాయి. పరిపూర్ణానందతత్త్వమే గణపతి స్వరూపం... ఆ అనుభవమే మనకు ప్రసాదం.*
*వేదాంతపరంగా.. బ్రహ్మజ్ఞానాన్ని గ్రహించకుండా అడ్డుకునే 'వక్ర'మైన మహాశక్తే 'విఘ్నం'. దానిని తొలగించి, తన పరతత్త్వాన్ని ప్రత్యక్షం చేసే విఘ్ననాశకుడు, మాయకి నాయకుడు విఘ్నేశ్వరుడు.*
*శివశక్తుల సమైక్య తత్త్వం, ప్రకృతీ - పురుషుల ఏకత్వం వినాయకముర్తి. శరీరం తల్లి సమకూర్చింది, గజశిరస్సు తండ్రి అమర్చినది. ఈ రెండింటి కూర్పు శివశక్త్యాత్మకం. నరశరీరం జగత్తుకి సంకేతం. గజశిరస్సు పరమేశ్వర తేజస్సుకు ప్రతీక.*
*ప్రపంచంలో శబ్ద, స్పర్శ, రూప, గంధాలను ఇంద్రియ గణాలద్వారా స్వీకరించి, హృదయమనే చిన్న కలుగులో రహస్యంగా అనుభవించే జీవుడే మూషికం. 'ముష్' అనే ధాతువును 'చోరత్వం' అని అర్థం. దీనిని అధిష్ఠించిన మహోన్నత అపరిమిత పరమాత్మ చైతన్యమే - మూషిక వాహనారూఢుఢైన గణపతి.*
*భిన్నత్వంలో ఏకత్వమే గణపతి (గణేశ) తత్త్వం. ఏకం సత్, ఏకం పరబ్రహ్మ, ఏకం దైవత్వం - అని వేదాంతం ప్రవచించినట్లుగా అన్నిటా వ్యాపించిన ఏకచైతన్యమే గణేశుడు. విశ్వమే అనేకగణాలతో కూడిన మహాగణం. విశ్వనాయకుడే మహాగణపతి.*
*గం గం గణేశాయ నమః।*
*ఓం నమః శివాయ॥*
*శుభమస్తు. అవిఘ్నమస్తు.*
*శుభోదయం. శుభదినం.*
🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి