🙏వేదాంత వ్యాసం శివతత్త్వం 🙏
ఆది శంకరాచార్యుల వారి సాహిత్యమును స్తోత్ర (భక్తి) సాహిత్యము, వైరాగ్య ప్రకరణములు అని రెండుగా విభజించవచ్చు... ఆది శంకరాచార్య విరచిత నిర్వాణషట్కం వైరాగ్య ప్రకరణముల కోవలోనిది. నిర్వాణషట్కం భారతీయ వేదాంత మార్గంలో ఉన్నతమైన రచన. నిజానికి ఎంతో దీర్ఘమైన వ్యాఖ్యానము, వివరణ అవసరము. కాని,. భగవంతుని రూపమును, తత్త్వమును తెలిసికొనడం అసాధ్యం కనుక, ఏది భగవంతుడో తెలియనప్పుడు, ఏది భగవంతుని తత్త్వమో తెలియనప్పుడు ఏది భగవంతుని తత్త్వము కాదో తెలిసికొనడం తేలిక కనుక 'ఇది కాదు' 'ఇది కాదు'అని తీసి వేస్తూ చివరికి మిగిలిన వర్ణనకు, వ్యాఖ్యానమునకూ అందని తత్త్వమేదో అదే పరమాత్మ తత్త్వము అని తెలిసికొనడాన్ని వేదాంతంఅంటారు .
''నేతి... నేతి'' అంటే, 'న ఇతి', 'న ఇతి', అంటే, 'ఇది కాదు' 'ఇది కాదు'.. అని చెప్పింది! 'మనో బుద్ధ్యహంకార చిత్తాని నాహం' మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము అనే నాలుగువిధములైన అంతఃకరణ ప్రవృత్తులు వున్నాయి. మనసు అన్నింటికీ అధిపతి. లేని దాన్ని ఉన్నట్లుగా, తనది కాని దాన్ని తనదే అన్నట్లుగా, క్షణికమైన దానిని శాశ్వతమన్నట్లుగా మరులు గొల్పుతుంది, వుసి గొల్పుతుంది, పురి కొల్పుతుంది, భ్రమింప జేస్తుంది, మరిపిస్తుంది, మురిపిస్తుంది. ఆకాశానికెత్తేస్తుంది. కడకు పాతాళానికి తొక్కేస్తుంది.
మనిషికి మనస్సే అన్నింటికి మూల కారణం, ప్రేరణ, ఉత్ప్రేరకం, వినాశకరం.
నాది, నాది కాదు - అనేదే బంధానికి, మోక్షానికి కారణాలు. నాది అనేది, నాకు మాత్రమే అనే విచిత్ర బంధం. ఇతరులగురించి ఆలోచింపజేయదు. ఎవరికి చెందకూడదు అంటుంది. పూర్తి స్వార్థం. ఇది వినాశనానికి దారితీస్తుంది.
నేను అనేది సాత్వికం. నేను కూడా అనేది రాజసిక అహంకారం. నేను మాత్రమే అనేది తామసిక అహంకారం.
నేను ఏమిటి, ఎవరు, ఎందుకు, ఎక్కడ నుండి ఎక్కడికి అనే అన్వేషణ సాత్వికం. మనిషిని ఉన్నతస్థితికి చేర్చుతుంది. నేను కూడా అనేది రాజసికమైనది. నాకు ఒక ఉనికి, నాకు శక్తి ఉంది అని సాధనకు ఉపయోగిస్తుంది. ఈ రెండూ మంచివే, అవసరమే.
నేనుమాత్రమే, నాకు మాత్రమే అనే తామసిక ప్రవృత్తి కల్గిన వారికి, వారిని వారి ద్వారా నే సర్వ నాశనం చేస్తుంది.
*దీనికంతా మనస్సే కారణం.*
కనుకనే మనస్సును బుద్ధికి స్వాధీనం చేసి, బుద్ధి ద్వారా కల్గిన విచక్షణ తో మంచి చెడులు తెలుసుకొని, మంచిని గ్రహించి, చెడును పారద్రోలాలి. కనుక బుద్ధి పరమాత్మ తత్వం.
బుద్ధికి మనస్సును అప్పచెప్పి జీవిత ప్రయాణం చేస్తే, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు దారి తప్పవు. మంచి కర్మలు మిగులుతాయి. అప్పుడు మానవుడు శివుడవుతాడు
వేదాలలో 'యజుర్వేదం' గొప్పది. యజుర్వేదంలో నాల్గవకాండలో ఉన్న 'రుద్రం' ఇంకా గొప్పది. రుద్రం మధ్యలో ఉన్న 'పంచాక్షరి' అంతకంటే గొప్పది. పంచాక్షరి లోని రెండక్షరాలు మరీ గొప్పవి. ఆ రెండక్షరాలు - "శివ". శివ అంటే మంగళం శుభం అని అర్ధం.
- శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామివారు
నామస్మరణాత్ అన్యోపాయం నహి పశ్యామో భవతరణే ... ఈ సంసారిక జీవితంలో మానవజన్మ తరించాలంటే నామ స్మరణ చేయాలి. భగవంతుణ్ణి చేరే మార్గంలో నామస్మరణం ఉత్తమం. శివ అనే రెండక్షరాలు పరబ్రహ్మ స్వరూపం. 'శి' అంటే పాపనాశనం. 'వ'అంటే ముక్తిప్రదానం.
లోకసమస్తాన్ని తనలో నిలుపుకొని, తానే లోకమైన విశ్వనాధుడు ఈశ్వరుడు. ఆదిదేవుడు, ఆద్యంతరహితుడు అయిన శివుడు మన జీవనతాత్త్వికతకు అతిసన్నిహితంగా ఉంటాడు. సుఖదుఃఖాలు అనే ద్వంద్వాల నడుమ సాగే మన జీవనయానంలో ద్వంద్వాలన్నింటినీ ఏకంచేసే అద్వయమూర్తిగా గోచరిస్తాడు.
ప్రమధాది గణాలను నియంత్రించే సర్వాత్మకుడైన పరమశివుడే ఇంద్రియాల్ని నియంత్రించగలిగిన శక్తిమంతుడు.
కాలకూట విషాన్ని, శేషనాగును కంఠంలో ధరించి ఉండటం ద్వారా మృత్యుంజయ రూపత్వం విశదమౌతుంది. గంగను శిరస్సుపై ధరించి విశ్వముక్తి మూలాన్ని స్వాధీనం చేసుకున్నాడు. అగ్నిమయమైన తృతీయ నేత్రం దగ్గరే చంద్రకళను ధరించి ఉండడం వల్ల సంహారకర్త పోషకత్వరూపమై విరుద్ధ ధర్మాశ్రయత్వాన్ని దిగ్దర్శితం చేస్తున్నట్లు తెలుస్తుంది. సర్వలోకాధిపతియై కూడా విభూతీ వ్యాఘ్రచర్మాన్ని ధరించి పామును మెడలో వేసుకొని, కపాలం చేబూని శ్మశానంలో తిరుగాడే లోకశివశంకరుడు వైరాగ్యంనే శ్రేష్ఠమైనదిగా వ్యక్తం చేస్తున్నాడు.
అణిమాది అష్టసిద్దులున్న - ఒంటికి పూసుకునేది భస్మమే. చుట్టుకున్నది గజవస్త్రమే. ధరించేది నాగభరణాలే. శివుని మూడోనేత్రం జ్ఞాననేత్రం. నటరాజు స్వరూపం - కళాంతరంగుడైన శివుని కళా స్వరూపానికి ప్రతీక. స్వచ్ఛతకు హిమాలయం మారుపేరు. ధర్మరూపమైన వృషభమే వాహనం. చంద్రుడు చిత్తానికి ప్రతినిధి. గంగ చంచలత్వానికి గుర్తు. పులి స్వార్ధ చింతనకు మరో రూపం. ఏనుగంటే నిలువంత గర్వం. వాటన్నింటిని జయించమని చెబుతుంది శివతత్వం. నంది ధర్మానికి సర్పాలు నిర్భయత్వానికి నిదర్శనం.
భస్మాన్ని ధరించిన ఆయన దగ్గర ఏముందీ అని అడుగుతారు కొందరు. కానీ,
భస్మాన్ని మించిన పవిత్రమైనది ఈ సృష్టిలో వేరే ఏమీ లేదు. జన్మాంతర పాపాలను దహించి వేసేదే భస్మం. కాబట్టే, భస్మానికి 'విభూతి' అని పేరు. విభూతి అంటే ఐశ్వర్యమనీ అర్ధముంది.
తాను గరళాన్ని మింగి లోకానికి అమృతం దక్కించిన ఈ నీలకంఠుని నెత్తిన నీళ్లు కుమ్మరిస్తే చాలు, మెచ్చి వరాలు కురిపించేస్తాడు. దోసెడు నీళ్ల అభిషేకం, చిటికెడు బూడిద అలంకారం, కూసిన్ని బిల్వపత్రాలు, కాసిన్ని ఉమ్మెత్తపువ్వులు, 'శంభో శంకర శరణు శరణు' అన్న స్మరణకే పొంగిపోయే బోళాశంకరుడు. .
అందుకే,
నీలకంఠుని శిరసుపై నీళ్లుచల్లి
పత్తి రిసుమంత ఎవ్వాడు పాఱవైచు
కామధేనువు వానింటి గాడిపసర
మల్ల సురశాభి వానింటి మల్లెచెట్టు
అని మాదయగారి మల్లన్నవారు కొనియాడరు.
సామాన్యుడైన, సంపన్నుడయినా, విద్యావంతుడయినా, అవిద్యావంతుడయినా, మిత్రుడయినా, శత్రువయినా పశువయినా, పురుగయినా ... అందరూ శివయ్యకు సమానమే. అందుకే -
సుహృద్విపక్ష పక్షమో, తృణారవింద చక్షు షో, ప్రజా మహిమహేంద్రయో, సమ ప్రవృత్తికః ... అని శివతాండవస్తోత్రం లో రావణాసురుడు కీర్తిస్తాడు.
సర్వసృష్టి సమానత్వం శివతత్త్వం. ఆస్తికుడు, నాస్తికుడు, జ్ఞాని, అజ్ఞాని, దేవతలు, రాక్షసులు, బలవంతుడు, బలహీనుడు, సర్వగ్రంధ పారాయణుడు, నిరక్షరాసుడు.... అందర్నీఆదరించి అనుగ్రహించే ప్రేమపరవశుడు శివయ్య.
రావణుడు రాక్షసుడని తెలిసినా అనుగ్రహించాడు. భస్మాసురుడు కృతఘ్నుడని తెలిసినా వరమిచ్చాడు. దోషభూయిష్టుల్ని సైతం నెత్తిన పెట్టుకొనే భక్తసులభడు శంకరుడు. ఎంతటి పాపచరితులనైనా పునీతం చేసే దయాంతరంగడు.
మార్కండేయుడు అల్పాయుష్కుడని తెలిసిన చిరంజీవత్వమును ఒసగేసాడు, తిన్నడు నిరక్షరాసుడయిన ముక్తినిచ్చాడు.
సాలెపురుగు సర్పం, ఏనుగు ప్రేమకే పరవశించి మోక్షాన్ని ప్రసాదించేసాడు. చెట్టునెక్కి, భయంతో రాత్రంతా మెలుకువగా ఉండడం కోసం కొన్ని ఆకులు వేసేసరికి విలుకాడిని కూడా ఆదరంగా అక్కున చేర్చేసుకున్నాడు. అధికపనులతో కష్టింపజేసిన, అవమానించిన, అవరోధించిన .... నొవ్వక నొప్పించక చెదరని భక్తితో, దీపారాధన చేసే చాకలి పోలికి స్వర్గప్రాప్తినిచ్చాడు. ఒకానొక రోజు, విసుగ్గా ఓ ఇల్లాలు విసిరిన మలిన వస్త్రాన్ని ఆనందంగా స్వీకరించి, శుభ్రపరచి, వత్తులుగా చేసి వెలిగించిన బీద బ్రాహ్మణుకి జీవనముక్తినే ప్రసాదించిన కారుణ్యమూర్తి. ఎంతటి కరుణశాలియో కదా, ఈ గుండె చల్లని దేవర.ఇంకా శివుని దయా గుణము గురించి ఏమి చెప్పగలను!
సమర్పణ
మారేపల్లి ఉదయ భాస్కర శర్మ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి