26, ఫిబ్రవరి 2025, బుధవారం

భాగవతం

 ☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

         *శ్రీమద్ భాగవతం*

              *(62వ రోజు)*

 *(నిన్నటి భాగం తరువాయి)*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

             *తారశశాంకం*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

*ఇష్టాయిష్టాలు, అభిమానాలు, ప్రేమలు, వయసులు గుర్తెరిగి మరీ వివాహాలు జరిపించాలి. వయస్సుల్లో మితిమీరిన ఎక్కువ తక్కువలు ఉండడం దాంపత్యానికి సరికాదు. యౌవనవతి భార్య, ముసలి భర్తల కాపురం నిలువదు. ఈ విషయాన్ని వ్యాసుడు భాగవతంలో చాలా చక్కగా చిత్రించాడు.*


*దేవతల గురువు బృహస్పతి వృద్ధుడు. గొప్ప మేధావి. బ్రహ్మజ్ఞాని. తపస్వి. జపతపాదులే అతని దినచర్య. దేవపురోహితుడు కావడంతో యజ్ఞయాగాదుల్లో క్షణం తీరిక లేకుండా గడపడం తప్పనిసరి అతనికి.*


*అందాల యువతి తారను వివాహం చేసుకున్నాడతను. వివాహం చేసుకున్న దగ్గర నుంచీ భర్తకు సేవలు చేయడమే తప్ప, శారీరకంగా తార ఎలాంటి సుఖానికీ నోచుకోలేదు. మనసు పరిపరి విధాల పోతున్నా, అణచుకుంటూ జీవించసాగిందామె. కోరికలను అదుముకోసాగింది.*


*బృహస్పతికి అనేకమంది శిష్యులు ఉండేవారు. వారంతా విద్య నేర్చుకునేందుకు ఆశ్రమాన్ని అంటిపెట్టికుని ఉండేవారు.*


*వారిలో చంద్రుడు ఒకడు. అతను అత్రి-అనసూయల పుత్రుడు. బ్రహ్మదేవుని అంశ. గొప్ప అందగాడు. అతన్ని చూసింది తార . మైమరచింది. మిసమిసలాడే యవ్వనంతో ఉన్నాడు, తగిన ఈడూజోడు అనుకున్నది. మోహించిందతన్ని. వృద్ధుడు బృహస్పతితో తీరని కోరికలన్నీ తీర్చుకునేందుకు తప్పుదోవ పట్టిందామె.*


*భర్త ఇంట లేని వేళ చంద్రునితో సుఖించసాగింది. కొన్నాళ్ళకు గర్భవతి అయింది. ఆమె గర్భంలో ఉన్నది తన ప్రతిరూపం, ఆ రూపాన్ని జాగ్రతగా చూసుకోవాలనుకున్నాడు చంద్రుడు. తారను బృహస్పతికి దూరం చేశాడు.*


*తీసుకునిపోయాడామెను. తన భార్య తనకు కావాలన్నాడు బృహస్పతి. ఇవ్వనన్నాడు చంద్రుడు. ఇద్దరూ యుద్ధానికి సిద్ధమయ్యారు. చంద్ర బృహస్పతుల యుద్ధం దేవదానవ సంగ్రామంగా మారింది. దేవగురువు బృహస్పతి మీద ఉండే ఈర్ష్యాసూయల కారణంగా చంద్రుణ్ణి సమర్థించాడు రాక్షసగురువు శుక్రాచార్యుడు. అదే అదనుగా రాక్షసులంతా చంద్రుని పక్షం వహించారు. రుద్రుడూ, ఇంద్రాది దేవతలూ బృహస్పతి పక్షం వహించారు. ఫలితంగా దేవదానవయుద్ధం చెలరేగింది. బ్రహ్మ జోక్యం చేసుకున్నా యుద్ధాన్ని విరమించలేదెవరూ. ఒక స్త్రీ కోసం ఇంతటి యుద్ధం తగదన్నా వినిపించుకోలేదు. ఆఖరికి చంద్రునికి నచ్చజెప్పి, తారను బృహస్పతికి ఇప్పించాడు బ్రహ్మ. భార్యను వెంటపెట్టుకుని వెళ్ళిపోయాడు బృహస్పతి.*


*కొన్నాళ్ళకు తార ప్రసవించింది. చక్కని కుమారుణ్ణి కన్నది. ఆ కుమారుడు నా వాడంటే నా వాడంటూ అప్పుడు చంద్ర బృహస్పతులిద్దరూ మళ్ళీ తగవు పడ్డారు. తగవు ఎంతటికీ తేలకపోవడంతో ఈసారి కూడా బ్రహ్మే జోక్యం చేసుకున్నాడు. తారను అడిగాడిలా.*


*‘‘ఈ బిడ్డకు తండ్రి ఎవరు?’’*


*‘‘చంద్రుడు’’ నిజం చెప్పింది తార.*


*ఈసారి బృహస్పతికి నచ్చజెప్పి, బిడ్డణ్ణి చంద్రునికి ఇప్పించాడు బ్రహ్మ. అతని పేరే బుధుడు. చక్కదనంలో చంద్రునికీ, బుద్ధిలో బృహస్పతికీ సరయినవాడు బుధుడు. నిత్య యవ్వనుడు. నవగ్రహాలలో ఒకడు.*


*(తర్వాత కథ రేపు చెప్పుకుందాం )*


*ఓం నమో భగవతే వాసుదేవాయ॥*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

కామెంట్‌లు లేవు: