🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
*జగద్గురు ఆదిశంకరాచార్యులు*
*విరచిత*
*”శివానందలహరి”*
*రోజూ ఒక శ్లోకం*
*పదవిభాగం, తాత్పర్యం, ఆడియోతో*
🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
*జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ*
🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
*ఇప్పుడు తాను ఉన్న స్థితితో ఈశ్వరుని శుశ్రూష చేయ జాలనని శంకరులు చెప్పిన శ్లోకం ఇది.*
*శ్లోకం:30*
*వస్త్రోద్ధూతవిధౌ సహస్రకరతా పుష్పార్చనే విష్ణుతా*
*గంధే గంధ వహాత్మతాన్నపచనే బర్హిర్ముఖాధ్యక్షతా*
*పాత్రే కాంచన గర్భతాస్తి మయిచే ద్బాలేంందు ౘూడామణే !*
*శుశ్రూషాం కరవాణి తే పశుపతే ! స్వామిన్ ! త్రిలోకీ గురో !!*
*పదవిభాగం:~*
*వస్త్రోద్ధూతవిధౌ _ సహస్రకరతా _ పుష్పార్చనే _ విష్ణుతా _ గంధే _ గంధవహాత్మతా _అన్నపచనే _ బర్హిర్ముఖాధ్యక్షతా _ పాత్రే _ కాంచన _ గర్భతా _ అస్తి _ మయి _ చేత్ _బలేందు ౘూడామణే _ శుశ్రూషాం కరవాణి _ తే _ పశుపతే _ స్వామిన్ _ త్రిలోకీ గురో.*
*తాత్పర్యం :~*
*ఓయీ ! సర్వవ్యాపకా ! ఈశ్వరా ।నీకు వస్త్రోపచారం చేయడానికి వేయి చేతులుగల సూర్యుడు కావాలి. నీకు పుష్పోపచారం చేయడానికి , సర్వ వ్యాపకుడైన విష్ణువు కావాలి. నీకు గంధోపచారం చేయడానికి, గంధవహుడు అనగా వాయుదేవుడు కావాలి. వంట చేసి నీకు నైవేద్యం పెట్టడానికి అగ్నిముఖాధ్యక్షుడైన ఇంద్రుడు కావాలి. నీకు అర్ఘ్యపాత్రను సమర్పించడానికి హిరణ్యగర్భుడు కావాలి. అటువంటి సూర్యుడునూ, విష్ణుమూర్తినీ , వాయుదేవుడనూ, దేవేంద్రుడనూ, హిరణ్యగర్భుడనూ అయితే తప్ప నీకు ఉపచారములు చేయడం నా తరముకాదు. (కాబట్టి నీకు నేను నమస్కారమును మాత్రమే చేస్తానని భావం)..*
*వివరణ:~*
*నిత్యమూ భగవంతుని పూజించాలన్నది మన విధి. పూజలో 64 అనగా చతుష్షష్టి ఉపచారాలు చేయాలని, శాస్త్రాలు చెబుతున్నాయి. దానికి శక్తి లేకపోతే , కనీసం 16 ఉపచారాలు అనగా షోడశోపచారాలు చేయాలి. దానికీ శక్తిలేనివారు కనీసం పంచోపచారాలైనా చేయాలి.*
*కొందరు పంచ ఉపచారములు అనగా (1) గంధం (2) పుష్పం (3) దీపం (4) ధూపం (5) నైవేద్యం అని చెపుతారు.*
*మరికొందరు (1) ధ్యానం (2) ఆవాహనం (3) నైవేద్యం (4) నీరాజనం (5) నమస్కారము అని చెపుతారు.*
*నిత్యం పంచోపచారాలతోనైనా ఈశ్వరుని అర్చించాలి. ఈ విధంగా (1) వస్త్రోపచారం (2). పుష్పోపచారం (3) గంధోపచారం (4) నైవేద్యం (5) అర్ఘ్యపాత్రోపచారాలు అనే ఐదు ఉపచారాలు అయినా చేయడానికి తనకు శక్తి లేదని , శంకరులు తన అసహాయతను శివునకు ఈ శ్లోకంలో నివేదించారు.*
*ఓ ఈశ్వరా! నీవు సర్వ శరీరాధ్యక్షుడవు. నీవు పశుపతివి. నీవు ముల్లోకాలకూ గురుడవు. ఇటువంటి నిన్ను సేవించాలంటే నీకు ముందు వస్త్ర సమర్పణం చేయాలి. ఆపని నావల్ల కాదు. ఆపని చేయడానికి సహస్రకరుడైన సూర్యుడు కావాలి. నీకు వస్త్రాలను ఉతికి ఎండబెట్టి ఇవ్వాలంటే వేయి చేతులు కలిగి లోకాలకు వెలుగునూ, వేడినీ ఇచ్చే సూర్యుడు కావాలి.*
*ఇక పుష్పాలను అర్పించి పుష్పోపచారం చేయాలంటే అంతటా వ్యాపించే లక్షణం గల విష్ణుమూర్తికే నిన్ను పుష్పాలతో పూజించే శక్తి వుంటుంది.*
*ఈశ్వరా ! నీకు గంధం అర్పిద్దామంటే , ఆ శక్తి సర్వ గంధాలనూ మోసుకొని పోయే వాయుదేవునికి మాత్రమే వుంటుంది. వాయువు వలె విలక్షణ సుగంధములను పొందించే శక్తి నాకు లేదు.*
*అన్నం వండి నైవేద్యం పెడదామంటే , అగ్ని మొదలయిన దిక్పాలకులకు నాయకుడైన దేవేంద్రుడు కావాలి. సర్వ దిక్పాలకులతో కూడిన దేవేంద్రుడంతటి వాడే నీకు నివేదన చేసే శక్తి కలవాడు. ఆపని నేను చేయలేను.*
*అలాగే పాత్రతో అర్ఘ్యం సమర్పించాలంటే, హిరణ్యగర్భుడైన బ్రహ్మయే కావాలి.*
*ఈశ్వరునికి ఉపచారాలు చేయడం, తనవల్ల కాదని శంకరులే చెప్పారు గదాయని , మనం శివపూజ చేయడం మానరాదు. యథాశక్తిగా పూజించాలి. శివుడు ఎంతో గొప్ప వాడు అని చెప్పడానికే ఈ శ్లోకంలో ఈ ఉదాహరణలు చెప్పారు. అంతేగాని మనం శివపూజకు అర్హులంకాము కాము అని అర్థంకాదు.*
*(తరువాయి శ్లోకం రేపు అధ్యయనం చేద్దాం.)*
*ఓం నమఃశివాయ।*
*నమః పార్వతీ పతయే హర హర మహాదేవ॥*
☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️
*క్రొత్తగా నేర్చుకుంటున్న వారికి ఉపయుక్తంగా ఉంటుందని పై శ్లోకం ఆడియో దిగువనీయబడింది. వినండి*👇
🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి