☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️
*శ్రీమద్ భాగవతం*
*(83వ రోజు)*
*(క్రితం భాగం తరువాయి)*
☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️
*కృష్ణావతారం*
*చిన్ని కృష్ణుడు - పూతన సంహారం*
☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️
*నందగోపుడు బంధువు.అతన్ని పలకరించేందుకు వచ్చాడు వసుదేవుడు. వసుదేవుణ్ణి చూస్తూనే నందుడు లేచి కౌగిలించుకున్నాడు. కంసుని చెరలో దేవకీ వసుదేవులు కష్టాలపాలయిన సంగతి తలచుకుని, కన్నీరు పెట్టుకున్నాడు. నందుడు కన్నీరు పెట్టుకోవడం గమనించక ఎటో చూస్తూ ఆందోళన చెందసాగాడు వసుదేవుడు.*
*అతని ఆందోళనను గమనించి ఆశ్చర్యపోయాడు నందుడు. కన్నీరు తుడుచుకుని అడిగాడు.‘‘ఏమైంది వసుదేవా? ఎందుకలా ఆందోళనగా ఉన్నావు?’’ ‘‘గోకులానికి ఏదో కీడు మూడనున్నట్టుగా అపశకునాలు తోస్తున్నాయి. దయచేసి నువ్వు తొందరగా వ్రేపల్లెకు బయల్దేరు.’’ చెప్పాడు వసుదేవుడు. అతని మాటను కాదనలేదు నందుడు. వెంటనే పరివారంతో వ్రేపల్లెకు బయల్దేరాడు.*
*పూతన సంహారం:-*
*కంసుని అనుచరి పూతన. రాక్షసి. పిల్లలను చంపుతుందది. దానిని ‘పూతిక’ అని కూడా అంటారు.*
*ఈ పూతన పూర్వజన్మలో బలి చక్రవర్తి కూతురు. పేరు రత్నమాల. శ్రీహరి వామనమూర్తిగా వచ్చి, బలిచక్రవర్తిని దానం అడిగినప్పుడు చూసిందతన్ని. బాలవటువు బాగున్నాడని ముచ్చటపడింది. పుత్రప్రేమ కలిగిందామెకు. ఇలాంటి బాలుడికి చన్నుకుడిపి, పాలు తాగించే అదృష్టానికి నోచుకుంటే బాగుండుననుకున్నది. ఆ కోరికను గ్రహించిన శ్రీహరి, వచ్చే జన్మలో ఆమె కోరిక తీర్చాలనుకున్నాడు.*
*ఫలితంగానే పూతన జన్మించింది. కంసుని ఆజ్ఞమేరకు పూతన పల్లెలు, పట్టణాలు తిరుగుతూ కనిపించిన శిశువునల్లా చంపుతూ వస్తోంది. వ్రేపల్లెకు చేరుకుంది.*
*రాక్షసి రూపంలో గాక చక్కని స్త్రీరూపం ధరించి మరీ చేరుకుందక్కడికి. పట్టుచీరె కట్టుకుంది. మల్లెపూలు పెట్టుకుంది. చెవులకు అద్భుతమయిన కుండలాలు ధరించింది. నడుస్తోంటే కుండలాలు ఊగుతూ కాంతులు విరజిమ్ముతోంటే చూసిన ప్రతి ఒక్కరూ పూతనను మామూలు స్త్రీ కాదు, ఎవరో దివ్యాంగన అనుకున్నారు. ఊరంతా తిరిగింది పూతన. ఆఖరికి నందుడి ఇంటికి చేరింది.*
*చిన్ని కృష్ణుణ్ణి చూసిందక్కడ. యశోద, రోహిణి అతన్ని ముద్దు చెయ్యడాన్ని చూసి, ముందుకొచ్చింది. చిన్నికృష్ణుడు అప్పుడు ఉయ్యాలలో పడుకుని ఉన్నాడు. వస్తున్నది పూతన అని తెలుసతనికి. ఆమె రాక్షసి అని తెలుసు. అయినా ఏమీ తెలియని వాడిలా కళ్ళుమూసుకుని, పిడికిళ్ళు బిగించి పడుకున్నాడు*
*‘‘పిల్లాడు ముద్దొస్తున్నాడు.’’ అన్నది పూతన. కృష్ణుని బొజ్జనొక్కి చూసింది. మెత్తగా ఉన్నది.‘‘కడుపులో పాలులేవు. ఆకలి మీద ఉన్నాడు.’’ అన్నది.*
*యశోద అనుమతి కోసం చూడలేదు. రోహిణి ఏమంటుందోనని భయపడలేదు. కృష్ణుణ్ణి అందుకున్నది. ఒడిలో పెట్టుకున్నది. ఏడుస్తున్న కృష్ణుణ్ణి ఓదారుస్తున్నట్టుగా ఎత్తి ఆడిస్తూ, తర్వాత పాలు కుడిపేందుకు రవికె ముడి విప్పింది. చిన్నికృష్ణుని నోటికి చన్ను అందించింది. ఆనందాశ్చర్యాలలో ఉన్నారు యశోద, రోహిణి. మంత్రముగ్ధుల్లా ఇద్దరూ వారించలేదామెను. తనపాలలో విషాన్ని నింపుతుంది పూతన. ఆ పాలను తాగితే చాలు, చనిపోతారు పిల్లలు. చాలా మంది పిల్లల్ని అలాగే చంపింది.*
*ఈ కృష్ణుడో లెక్కా అనుకుంది. అయితే అందుకు భిన్నంగా జరిగిందంతా. పూతన పాలనే కాదు, ఆమె ప్రాణాలను కూడా పీల్చేశాడు కృష్ణుడు. బాధను భరించలేకపోయింది పూతన. చన్ను నుంచి చిన్నికృష్ణుణ్ణి వేరు చేసేందుకు ప్రయత్నించింది. వీలుకాలేదు. కృష్ణుడు గట్టిగా పట్టుకున్నాడు.*
*‘‘వదులు కృష్ణా! వదులు’’ అంటూ రోదించింది పూతన. వదల్లేదు కృష్ణుడు. లాగి లాగి ఆఖరికి ఆమె ప్రాణాలను హరించాడు. చెమటలు పట్టిపోయింది పూతన. కాళ్ళూ చేతులూ కొట్టుకుంది. పెద్దగా అరుస్తూ వెల్లకిలా పడిపోయింది. ఆమె అరుపునకు భూమి వణికి పోయింది. కొండలు దద్దరిల్లాయి. ఆకాశం కంపించింది. గ్రహతారకలు ఒక్క క్షణం గతులు తప్పి అంతలోనే సర్దుకున్నాయి. అధోలోకాలు అదిరిపడ్డాయి. దిక్కులు ప్రతిధ్వనించాయి. ఒక్కసారిగా వందలాది పిడుగులు పడ్డట్టుగా వినవచ్చిన ఆ శబ్దానికి వ్రేపల్లెవాసులు మూర్ఛపోయారు. చనిపోయిన మరుక్షణం పూతన తన నిజరూపంతో ప్రత్యక్షమయింది. పెద్దపెద్ద కోరలతోనూ, కొండగుహలంత నాసికారంధ్రాలతోనూ, కొండల్లాంటి కుచాలతోనూ, పాడుబడిన బావుల్లాంటి కళ్ళతోనూ, నీళ్ళింకిన చెరువంతటి కడుపుతోనూ, ఎర్రటిజుట్టుతోనూ పూతన నేల మీద వెల్లకిలా పడడంతో చుట్టుపక్కల ఆరుకోసుల వరకూ ఉన్న చెట్లూ, మానులూ ఫెళఫెళా విరిగిపడ్డాయి. పూతన శవాన్ని చూసి పరుగులు పెట్టారు ప్రజలు. చిన్నికృష్ణుడు మాత్రం ఎలాంటి ఆందోళనా చెందక దాని శరీరం మీద ఆడుకోసాగాడు.*
*జరిగింది చూస్తూ యశోదా, రోహిణీ తదితరులు చాలాసేపటి వరకు మనుషులు కాలేకపోయారు. అచేతనులయ్యారు. తర్వాత తేరుకున్నారు. తేరుకుని పరుగుదీసి, పూతన మీద ఆడుకుంటున్న కృష్ణుణ్ణి అందుకున్నారు.*
*(తర్వాత కథ రేపు చెప్పుకుందాం )*
*ఓం నమో భగవతే వాసుదేవాయ॥*
☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి