22, మార్చి 2025, శనివారం

చేసేవాడు,చేయించేవాడు

 కర్తా కారయితా చైవ ప్రేరక శ్చానుమోదకః 

సుకృతం దుష్కృతం చైవ చత్వారస్సమ భాగినః


అర్థము:-చేసేవాడు,చేయించేవాడు,ప్రేరేపించేవాడు, ఆమోదించువాడు ఈ నలుగురూ కూడా పుణ్య,పాప కార్యము లన్నింటిలోనూ సమభాగులే. (ఈ శ్లోకం పంచతంత్రం లోనిది)


జాడ్యం హ్రీ మతిగణ్యతే వ్రతరతే ద౦భః శుచౌ కైతవం 

శూరే నిర్ఘృణతామునౌ విమతితా దైన్యం ప్రియాలాపిని 

తేజస్వి న్నవలి స్తతా ముఖరతావక్త ర్యా శక్తి: స్థిరే 

తత్కోనామ గుణో భవే త్సుగుణినాం యో దుర్జనై ర్నా౦కితః 

(భర్తృహరి సుభాషితము)

గుణవంతులయందున్న సుగుణములను కూడా దుష్టుడు దోషములుగానే యెంచుతాడు.

బిడియపడేవాడిని రోగియని, వ్రతశీలుని దంభాచారపరుడనీ, శుచిశీలిని కపటియని,

పరాక్రమవంతుని దయాహీనుడని, మౌనిని మతిపోయినవాడని, తేజోవంతుని అహంకారియని, చక్కగా మాట్లాడగలవాడిని వాచాలుడనీ స్థైర్యము గలవానిని అశక్తుడనీ,

ఈ రీతిగా ప్రతివారి యందును దోషములనే ఎంచుట దుర్జనులకు పరిపాటి..,


వాంఛా సజ్జన సంగతౌ పరగుణే ప్రీతి ర్గురౌ నమ్రతా 

విద్యాయాం వ్యసనం స్వయోషితి రతిః లోకాపవాదాద్భయం 

భక్తి శూలిని శక్తి రాత్మ దమనే సంసర్గ ముక్తి: ఖలై:

ఏతే యేషు వసంతి నిర్మల గుణాః తేభ్యో నమః కుర్మహే


అర్థము:-సత్సాహవాసము నందు కోరిక, పరుల గుణముల యందు ప్రీతి, పెద్దల యెడ వినయము, విద్యాలయందు ఆసక్తి, స్వభార్య యందే యనురాగము, లోకనిండా అంటే భయము, శివుని యందు భక్తి, ఆత్మనిగ్రహ శక్తి, దుష్టులకు దూరముగా నుండుట, యను 

నీ నిర్మల గుణములు యెవ్వరియందు యున్నవో అట్టి మహాత్ములకు కైమోడ్పులు.

-------------------------------

ఏది జపియింప నమృతమై యొసగు చుండు 

నేది సద్ధర్మ పథమని యెరుగదగిన

దదియే సద్భక్తి యోగంబు నలవరించు 

మూర్తిమంతంబగు దా హరికీర్తనంబు

అర్థము:- ఏ నామము జపించిన కొద్దీ అమృతమై అతిశయమై అలరారు తూ వుంటుందో, ఏది ఉత్తమమైన ధర్మ మార్గమో అదియే హరినామ సంకీర్తనము.మూర్తీభవించిన భక్తి యోగమే హరినామ జపము అంటాడు అన్నమాచార్యులు. కలియుగ ధర్మం ప్రకారం దేవుని నామ జపమే మోక్ష దాయకము.

.

ఆకసాన లేదు మోక్ష మటు పాతాళమున లేదు 

ఈ కడ భూలోకమందు యెందు లేదు 

పై కొని యాస లెల్లపారద్రోలి వెదికితే 

శ్రీకాంతు పొగిడేటి చిత్తములో నున్నది

అర్థము:-ముక్తి ఎక్కడో ఆకాశము లోనో,పాతాళము లోనో.భూమిపైన నో లేదు.ఆశలవలయం లో చిక్కుకోకుండా ఆ శ్రీకాంతుని స్మరించుకునే మనస్సు లోనే మోక్షము వుంది.మనో నైర్మల్యమే ముక్తికి దారి..

కామెంట్‌లు లేవు: