🔯🌹🌷🏹🛕🏹🌷🌹🔯
*🍁మంగళవారం 30 డిసెంబర్ 2025🍁*
``
*ప్రతిరోజూ*
*సంపూర్ణ మహాభారతము*
సరళ వ్యావహారిక భాషలో!
9️⃣0️⃣
*ప్రతిరోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి!*
*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*``
*90 వ రోజు*
*వన పర్వము* *తృతీయాశ్వాసము*
*భాగీరధుని తపస్సు*```
అంశుమంతుని కుమారుడు దిలీపుడు. దిలీపుని తరువాత అతడి కుమారుడు భగీరధుడు రాజ్యపాలనకు వచ్చాడు. కొంతకాలం భగీరధుడు జనరంజకంగా రాజ్యం చేసాడు. సగరుని వృత్తాంతం తెలుసుకున్న భగీరధుడు సాగరాన్ని జలంతో నింపాలనుకున్నాడు. హిమాలయాలకు వెళ్ళి గంగను గురించి ఘోరతపస్సు చేసి ఆమెను ప్రత్యక్షం చేసుకున్నాడు. భగీరధుడు గంగాదేవిని “అమ్మా! నీవు దేవమార్గాన్ని వదిలి భూమికి రావాలి. సాగరాన్ని జలంతో నింపాలి. సగర పుత్రులకు మోక్షం కలిగించాలి” అని కోరాడు.
గంగాదేవి “అలాగే, వస్తాను కానీ నా ఉద్ధృతిని భరించే శక్తి ఒక్క పరమ శివునికే ఉంది. కనుక నువ్వు శివుడిని ప్రసన్నుని చేసుకో” అని చెప్పింది.
తరువాత భగీరధుడు కైలాసానికి వెళ్ళి శివుని ప్రార్ధించాడు.
శివుడు భగీరధుని కోరిక మన్నించి “నీవు గంగను తీసుకురా నేను భరిస్తాను” అన్నాడు.
మరల భగీరధుడు గంగను ప్రార్ధించాడు. గంగ భగీరధుని వెంట భూమికి దిగి వచ్చింది. శివుడు తన జటాజూటంలో ఉధృతంగా దుముకుతున్న గంగను ధరించాడు. తరువాత గంగ భూమి మీదకు వచ్చి సాగరాన్ని నింపింది. అప్పటి నుండి గంగానదికి భాగీరధి అనే నామం వచ్చింది” రోమశుడు గంగావతరణం గురించి ధర్మరాజుకు వివరించాడు.
తరువాత ధర్మరాజు గంగ, నంద, అపరనంద, నదులలో స్నానం చేసాడు. తరువాత వారు హేమకూట పర్వతాన్ని చేరుకున్నాడు. అక్కడ రాళ్ళ నుండి అగ్ని పుడుతూ ఉంది. ఆ అగ్నికి మేఘాలు ఆకర్షితమౌతున్నాయి. ఆ తరువాత వారు విశ్వామిత్రుని ఆశ్రమాన్ని చేరారు. అక్కడికి సమీపంలో ఉన్న ఋష్యశృంగుని సరోవరం చూసారు.```
*ఋష్యశృంగుడు*```
రోమశుడు ధర్మరాజుకు ఋష్యశృంగుని గురించి చెప్పసాగాడు. “ధర్మరాజా! కశ్యపుని కుమారుడు విభాండకుడు. అతను ఒకరోజు సరసులో స్నానం చేస్తున్నాడు. అతనికి ఆ సమయంలో దేవ వేశ్య ఊర్వశి కనిపించింది. అతడు ఆమె పట్ల వ్యామోహ పీడితుడైన కారణంగా రేతఃపతనం జరిగి సరస్సులో పడింది. అతని రేతస్సుతో కూడిన నీటిని త్రాగిన దుప్పి గర్భందాల్చి ఋష్యశృంగుని ప్రసవించింది. విభాండకుడు కుమారుని గుర్తించి పెంచుకోసాగాడు. ఋష్యశృంగునికి తండ్రి తప్ప వేరే ప్రపంచం తెలియదు. ఆ సమయంలో అంగదేశాన్ని రోమపాదుడు అనే రాజు పాలిస్తున్నాడు. అతను తన పురోహితునకు చేసిన అపరాధం కారణంగా రాజ్యంలో క్షామం ఏర్పడింది. రోమపాదుడు తన తప్పు గ్రహించి బ్రాహ్మణులను తిరిగి రప్పించాడు. వారిని వానలు కురవడానికి ఉపాయం చెప్పమని అడిగాడు. వారు "రాజా! ఋష్యశృంగుని నీ రాజ్యానికి రప్పిస్తే వానలు కురుస్తాయి” అన్నారు.
రోమపాదుడు ఋష్యశృంగుని తన రాజ్యానికి రప్పించటానికి కొంత మంది వేశ్యలను పంపాడు. ఒకరోజు విభాంకుడు ఆశ్రమంలో ఋష్యశృంగుని వదిలి పండ్లు, సమిధలు తీసుకురావడానికి వెళ్ళాడు.
ఆ సమయంలో రోమపాదుడు పంపిన వేశ్య ఆశ్రమానికి వచ్చింది. ఋష్యశృంగుడు ఆమె తనలాగే ఋషి కుమారుడు అనుకుని ఆమెకు అతిధి సత్కారం చేసాడు.
ఆమె ఋష్యశృంగుని తనతో స్నేహం చెయ్యమని కోరింది. ఆపై ఆటపాటలతో అలరించి తిరిగి వెళుతూ ఇంటికి రమ్మని ఋష్యశృంగుని ఆహ్వానించింది. ఋష్యశృంగుడు ఆమె ధ్యాసలో పడి ఆహారపానీయాల కూడా ధ్యాస మరిచాడు. విభాంకుడు కొడుకు పరధ్యానం గ్రహించి కారణం అడిగాడు.
ఋష్యశృంగుడు జరిగినది చెప్పాడు. విభాంకుడు “నాయనా! ఋషుల తపస్సు చెడగొట్టడానికి రాక్షసులు ఇలా మాయవేషాలలో తిరుగుతుంటారు. జాగ్రత్తగా ఉండు” అన్నాడు.
మరునాడు కూడా వేశ్య విభాండకుడు లేని సమయం చూసి ఆశ్రమానికి వచ్చింది. ఆమె మోహంలో పడి ఋష్యశృంగుడు ఆమె వెంట అంగరాజ్యానికి వెళ్ళాడు. ఋష్యశృంగుని రాకతో అంగ రాజ్యంలో వానలు కురిసాయి.
రోమపాదుడు సంతోషపడి తన కుమార్తె శాంతను ఋష్యశృంగునికి ఇచ్చి వివాహం చేసాడు.
విభాండకుడు ఆశ్రమంలో కుమారుని జాడ లేక పోవడంతో వెతుక్కుంటూ అంగదేశానికి వచ్చాడు. అక్కడ కొడుకు కోడలిని చూసి సంతోషించి వారిని తన ఆశ్రమానికి తీసుకు వచ్చాడు” అని చెప్పాడు.```
*(సశేషం)*
*సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🌷🙏🌷```
*🚩జై శ్రీ కృష్ణ! జై శ్రీ కృష్ణ!🚩*
ఆధ్యాత్మిక బృందం నుండి వచ్చింది
*సేకరించి*
*భాగస్వామ్యం చేయడమైనది*
*న్యాయపతి నరసింహారావు*
🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి