*సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*
*604 వ రోజు*
అనుశాసనిక పర్వము ప్రథమాశ్వాసము
కులము విద్య
ధర్మరాజు " పితామహా ! తక్కువ కులములో పుట్టినా కూడా గొప్పగుణములు, మంచిప్రవర్తన ఉన్న వాడికి మంత్రతంత్ర విద్యలు నేర్పడం దోషమా ధర్మవిరుద్ధమా ! " అని అడిగాడు. భీష్ముడు " ధర్మనందనా ! ఈ సందర్భంలో నీకు ఒక కథ చెప్తాను. పూర్వము హిమాలయాలలో అనేక మంది బ్రాహ్మణులు తపస్సు చేసుకుంటున్నారు. వారి వద్దకు ధర్మనిష్టా గరిష్ఠుడు, మంచి గుణగణములు కలవాడు, గొప్ప ప్రవర్తన కలవాడు అయిన శూద్రుడు వచ్చి అయ్యా ! మీరందరూ తపస్సు చేసుకుంటున్నారు కదా ! నాకు కూడా తపస్సు ఎలా చెయ్యాలో ఉపదేశించండి " అని అడిగాడు. అందుకు బ్రాహ్మణులు " ఓ ధర్మాత్మా ! నీవు శూద్రుడవు కనుక నీకు వైదిక విద్య ఉపదేశించడం తగదు. నీవు మాకు శుశ్రూషలు చేయుటకు తగినవాడవు " అన్నారు. ఆ శూద్రుడు కూడా అలాగే అని అక్కడే చిన్న పర్ణశాల వేసుకుని ఆ విప్రులకు సేవ చేస్తున్నాడు. కాని విప్రులు చేస్తున్న కార్యములు చూస్తూ తాను కూడా అతిథిపూజలు, దేవ, పితృ పూజలు చేస్తున్నాడు. ఒక రోజు అక్కడ తపస్సు చేసుకుంటున్న విప్రులకు గురువు గారు అతడి ఆశ్రమముకు వెళ్ళి అక్కడ శూద్రుడు చేస్తున్న అతిథి, దేవ, పితృ పూజలు చూసి సంతోషించాడు. అతడు చేస్తున్న పూజలలో లోపాలను ఎత్తి చూపి పూజలు సరిగా పద్ధతులు ఉపదేశించి వెళ్ళాడు. ఆ శూద్రుడు కూడా గురువుగారి ఉపదేశమును అనుసరించి ఆచరించాడు. కాల క్రమమున గురువుగారు శూద్రుడు మరణించారు. మరు జన్మలో శూద్రుడు రాజకుమారుడుగా, గురువుగారు సకల వేద శాస్త్రములకు నిలయమైన బ్రాహ్మణుడి ఇంట్లో జన్మించి పెరిగి పెద్ద వాడై గుణసంపన్నుడయ్యాడు. కాలక్రమమున ఆ రాజకుమారుడు ఆ బ్రాహ్మణకుమారుని పురోహితుడిని చేసుకుని సకల సంపదలు సమకూర్చాడు. కాని ఆ రాజకుమారుడు బ్రాహ్మణ కుమారుడిని చూసి సన్నగా నవ్వాడు. ఆ బ్రాహ్మణ కుమారుడికి మాత్రము రాజకుమారుడు తనను చూసి ఎందుకు నవ్వుతున్నాడో అర్ధము కాలేదు. బ్రాహ్మణకుమారుడు " రాజకుమారా ! మీరు నన్ను చూసినప్పుడల్లా సన్నగా నవ్వుకుంటున్నారు. నా వలన ఏదైనా అపరాధము జరిగిందా ! దయ చేసి తెలియజెయ్యండి " అని అడిగాడు. రాజకుమారుడు " విప్రోత్తమా ! నాకు పూర్వజన్మజ్ఞానం ఉంది. కిందటి జన్మలో నేను శూద్రుడను. మీరు గురువు గారు. మీరు నాకు వైదికవిద్యలోని మెళుకువలు, తపస్సు ఎలా చెయ్యాలో, దేవ, పితృకార్యములు ఎలా చెయ్యాలో బోధించారు. తత్ఫలితంగా ఇప్పుడు మీరు ఒక రాజకుమారుడికి సేవ చేస్తున్నారు. అది గుర్తుకు వచ్చి నవ్వుకుంటున్నాను. అంతే కాని మీ వలన ఏదోషము లేదు. ధర్మపరుడివి అయిన నీలో లోపం ఎందుకు ఉంటుంది " అని చెప్పాడు. కనుక ధర్మనందనా ! వైదికవిద్యను, మంత్రతంత్రములను బ్రాహ్మణులకు, క్షత్రియులకు, వైశ్యులలో అర్హత కలిగిన వారికి మాత్రమే ఉపదేశించాలి " అని చెప్పాడు.
లక్ష్మీ నివాసము
ధర్మరాజు " లోకంలో ఉన్న అనేక జనులలో లక్ష్మీదేవి ఎవరింట నివసిస్తుంది " అని అడిగాడు.భీష్ముడు " ధర్మనందనా ! ఒక సారి రుక్మిణీ దేవి లక్ష్మీదేవిని ఈ ప్రశ్న వేసింది. అప్పుడు లక్ష్మీదేవి రుక్మిణీ దేవికి చెప్పిన విషయములు నేను నీకు చెప్తాను. నిత్యము సత్యము పలికే వారు, శుచిగా శుభ్రంగా ఉండే వారు, గురువుల ఎడ భక్తి కలవారు, ఎల్లప్పుడూ అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండేవారు, సదా దక్షతతో దీక్షితులుగా ఉండేవారు, మంచి పనులు చేసే వారు, మలినము లేని వారు, ఎప్పుడూ మంచి పనులు చేసే వారు, వుజ్ఞావంతులు, తపస్సు చేసే వారు, తనకు ఉన్నంతలో దానము చేసే వారు, బ్రహ్మచర్యము పాటించే వారు, ఇంద్రియ నిగ్రహము కల వారు నాకు ప్రేమ పాత్రులు నేను వారి వెంట ఎప్పుడూ ఉంటాను. ఇక క్రూరాత్ములు, నాస్థికులు, కృతఘ్నులు, దుర్మార్గుల వద్ద అసలు ఉండను. ఇక స్త్రీల వాద ఎవరి ఎంగిలి తినని వారు, ఇల్లు వాకిలి శుభ్రంగా ఉంచుకునే వారు వారి అందు నివసిస్తాను. ఇక భర్తకు ఎదురు చెప్పే వారు, ఇతరులను నిందించు వారు, భర్తకు తెలవకుండా పర పురుషుల ఇళ్ళకు వెళ్ళే వారు, ఎప్పుడూ నిద్రించె వారు వారి వద్ద నేను ఉండను. , నేను తామర పువ్వులందు, పూల తోటలందు, ఫలవృక్షముల అందు నేను నివసిస్తాను " అని లక్ష్మీ దేవి రుక్మిణీ దేవికి చెప్పింది " అని భీష్ముడు ధర్మరాజుకు చెప్పాడు.
*రేపు *
*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*
*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి