10, జనవరి 2026, శనివారం

మహాభారతము

 *సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*

*615 వ రోజు*

అనుశాసనిక పర్వము ద్వితీయాశ్వాసము


జనపూజితుడు

ధర్మరాజు " పితామహా ! సర్వజనములతో పూజింపబడు వాడు ఎవరో వివరించండి " అని అడిగాడు. భీష్ముడు " ధర్మనందనా ! ఒకసారి నారదుడు శ్రీకృష్ణుడి వద్దకు వచ్చి శ్రీకృష్ణుడి అతిథిసత్కారాలు అందుకున్నాడు. శ్రీకృష్ణుడు " నారదా ! నీవు అత్యంత మక్కువతో ఎవరిని మొక్కుతావు ? " అని అడిగాడు. " కృష్ణా ! వరుణుడికి, వాయుదేవుడికి, భూమికి, ఆకాశానికి, అగ్నికి, ఈశానుడికి, షణ్ముఖుడికి, మహాలక్ష్మికి, విష్ణువుకు, బ్రహ్మదేవుడికి, బృహస్పతికి, చంద్రుడికి, నీటికి, భూమికి ఎవరు భక్తితో పూజిస్తారో నేను వారిని భక్తితో నమస్కరిస్తాను. ఇంకా వేదాధ్యయనం చేసే వారు, తపోధనులు, దేవతలను పూజించువారు, భూదానము, గోదానము, ధనదానము, ధాన్యదానములను చేయు వారు, అతిథిపూజ చేయువారు, పితృతర్పణం చేయువారు, భిక్షాటనతో శాంత చిత్తముతో జీవించువారు, ఎల్లప్పుడు సత్యమునే పలుకువారు వీరికి నేను భక్తితో నమస్కరిస్తాను. ధర్మము, అర్ధము, కామము సమానంగా భావించు వారు. అహంకారము, అధిక మమకారము లేనివారు, మంచి నడవడి కలవారు, లోలత్వము లేని వారు వీరందరికి నేను నమస్కరిస్తాను. కృష్ణా నీవు కూడా వీరిని పూజించి శుభలు పొందు " అని చెప్పాడు. కనుక ధర్మనందనా ! నీవు కూడా అలా ప్రవర్తించి శుభములు పొందు " అని భీష్ముడు చెప్పాడు.

రాజు కర్తవ్యము

ధర్మరాజు " పితామహా ! రాజ్యము చేసే రాజులకు ప్రధాన కర్తవ్యము ఏమిటో వివరించండి " అని అడిగాడు. భీష్ముడు " ధర్మనందనా ! పట్టాభిషిక్తుడైన రాజుకు ప్రథమకర్తవ్యము బ్రాహ్మణపూజ. బ్రాహ్మణులు సుఖశాంతులతో జీవించు రాజ్యము సుభిక్షంగా ఉంటుంది. బ్రాహ్మణులను అవమానించిన రాజ్యములో అనేక కష్టములు కలుగుతాయి. విప్రులు ఘటనాఘటన సమర్ధులు. విప్రులకు అనుకూలంగా ఉన్న వారు రాజ్యాధిపతులు కాగలరు. విప్రులను అవమానించిన వారు రాజ్యభ్రష్టులు కాగలరు. బ్రాహ్మణుడు కోపిస్తే దేవేంద్రుడు కూడా తట్టుకో లేడు. విప్రులు శాపానుగ్రహ సమర్ధులు. పూర్వము ద్రవిఢ దేశాధిపతులు బ్రాహ్మణులను అవమానించి శూద్రులైనారు. కనుక ధర్మనందనా నీవు ఎల్లప్పుడూ బ్రాహ్మణులను పూజింపుము. సదాచారము కలిగిన బ్రాహ్మణుడికి భోజనము పెట్టిన అతడి పితృదేవతలు తరిస్తారు. భూదేవికి విష్ణుమూర్తికి బ్రాహ్మణుల విషయమై ఒకసారి సంవాదము జరిగింది. విష్ణుమూర్తి భూదేవితో " దేవీ ! నీవు లోకమాతవు కదా ! నిన్ను ఒక విషయము అడుగుతాను. పాపములు పోగొట్టుకోవడానికి చేయవలసిన పనులు ఏవి ? " అని అడిగాడు. భూదేవి " నాధా ! బ్రాహ్మణులను సేవించినా ! పూజించినా ! విప్రులకు హితము చేసినా పాపములు నశిస్తాయి. అహల్యను కోరుకున్నందుకు ఇంద్రుడికి శరీరము నిండా కన్నులు కలుగుతాయని శపించింది బ్రాహ్మణుడైన గౌతముడే కదా ! " అని జవాబు చెప్పింది. కనుక ధర్మనందనా ! నీవు ఏమరపాటు లేక బ్రాహ్మణులకు పూజ చెయ్యి. పుట్టుకతోనే బ్రాహ్మణులు పూజనీయులు. ముందుగా బ్రహ్మదేవుడు బ్రాహ్మణులను సృష్టించి వారితో " మీకు ధర్మనిరతి తప్ప వేరు పని లేదు. మీరు ధర్మమును సదా రక్షించడమే మీ కర్తవ్యము. అందు వలన మీకు శుభములు కలుగుతాయి. బ్రాహ్మణుడు మిగిలిన వర్ణముల వారికి మార్గదర్శకుడిగా ఉండాలి. నిత్యము వేదాధ్యయనము, అగ్నిహోత్రము ఆచరించాలి. క్షత్రియులు మీ మాటను అనుసరించి నడచుకుంటారు. ఎవరైనా అగ్నిని తాకవచ్చు, హిమాలయమును కదిలించ వచ్చు, గంగానదిని మూట కట్టవచ్చు కాని విప్రులను మాత్రము అవమానించ రాదు. విప్రులను కొలవడం కల్పవృక్షము వంటిది " అని బ్రహ్మ చెప్పాడు.


*రేపు *

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*

*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*

కామెంట్‌లు లేవు: