10, జనవరి 2026, శనివారం

*శ్రీ కృష్ణదేవరాయల వైభవ గాథ..*

 *శ్రీ కృష్ణదేవరాయల వైభవ గాథ..* 


​ఆంధ్ర భోజ! శ్రీకృష్ణదేవరాయా!

నీ పరిపాలన ఓ చరిత్ర, నీ వంశం రాజసానికి చిహ్నం,

విదేశీయులు సైతం కొనియాడిన అసమాన వంశం.

హంపి నగరపు సౌరభానికి నీవే నిత్య నిదర్శనం.


​కవిత్వ కథన రంగ విన్యాస చరితా!

అష్టదిగ్గజాల సరసన వెలిగే రాజమార్తాండా!

'ఆముక్తమాల్యద'తో విరిసిన సాహిత్య పారిజాతమా!

నీవు తెలుగు తల్లి ముద్దుల రాజకుమారుడవు.


​రణరంగ విన్యాస శత్రు భయంకరా!

గజపతులకు నీవు గజసింహ స్వప్నానివి.

చేతిలో కత్తి పడితే విజయం నీ చెంతనే..

రణరంగంలోనూ కవిత్వాన్ని పండించిన సాహితీ శిఖరమా!


​లాలిత్య సౌందర్య సంపద వృక్షమా!

సంస్కృతాంధ్ర భాషలలో ఆరితేరిన ప్రవీణా!

అష్టాదశ వర్ణనలలో మేటి అనుభవజ్ఞుడా!

కవన రంగంలో నీవు సాహితీ సార్వభౌముడివి.


​'మూరురాయరగండ' బిరుదాంకితుడా!

సకల ఆంధ్ర రాజ్య పరిపాలన విజేతవు నీవు.

నీ చరితం సువర్ణ హిమ శిఖరం..

దేశ చరిత్రలో నీది సుమధుర, సుస్థిర స్థానం.


​మత సామరస్య పర్యవేక్షక సార్వభౌమా!

హిందూ-ముస్లిం ఐక్యతను చాటిన బోధకుడా!

హైందవ ధర్మ రాజ్య పరిరక్షకా..

ఆంధ్ర వైభవ పరంపరలో నీ నామం చిరస్థాయి.


​శిల్ప సౌందర్య కళాపోషకా!

సకల కళా సమ్మేళనానికి నీవే రూపానివి.

విజయ నగర వైభవ సంస్కృతికి నీవే నిదర్శనం.

భావి తరాలకు నీ పరిపాలనే ఆదర్శం.


​గొప్ప ఆలయాలను నిర్మించిన నిర్మాతవు,

శైవ, వైష్ణవ క్షేత్రాలను పునరుద్ధరించిన పుణ్యమూర్తివి.

కలియుగ దైవానికి మణి మాణిక్యాలర్పించిన భక్తుడివి,

సిరులను కురిపించే సువర్ణ హస్తం నీది.


​అద్భుత చెరువులెన్నో తవ్వించావు,

రైతుల ఇంట సిరులను సాక్షాత్కరించావు.

భూమిపుత్రుడిని ఆదరించి..

ధాన్యలక్ష్మిని సగర్వంగా నిలిపిన అన్నదాతవు.


​నలుదిక్కులా వ్యాపార వృద్ధిని పెంచావు,

రత్నరాసులు వీధుల్లో రాశులుగా పోయించావు.

అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతిని గడించి,

నేటి ఆర్థిక వ్యవస్థకు నీ పరిపాలనే అసలైన దర్పణం!


కొప్పుల ప్రసాద్ 

నంద్యాల 

9885066235

కామెంట్‌లు లేవు: