*సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*
*616 వ రోజు*
అనుశాసనిక పర్వము ద్వితీయాశ్వాసము
ఇంద్రుడు శంబరుడు
భీష్ముడు ఇంకా " ధర్మనందనా ! ఈ విషయంలో ఇంద్రుడికి శబరుడికి మధ్య జరిగిన సంభాషణ చెప్తాను విను. శంబరుడు జటాసురుడి కొడుకు. జటాసురుడు ఉన్నతమైన స్థానంలో ఉన్నాడు. అప్పుడు ఇంద్రుడు జటాసురుడి వద్దకు వెళ్ళి " నీకు ఈ ఉన్నత స్థితి ఎలా వచ్చింది. జటాసురుడు " నాకు బ్రాహ్మణుల మీద కోపము అసూయ లేవు. నేను ఎల్లప్పుడు బ్రాహ్మణులను రక్షిస్తాను. అందుకే నాకు ఈ వైభవము కలిగింది. దేవాసురయుద్ధములో బ్రాహ్మణుల అనుగ్రహము వలనే కదా దేవతలు గెలిచారు. అది చూసి నా జనకుడు చంద్రుడితో " ఆహా ! విప్రులు మహానుభావులు కదా అందుకే దేవతలు గెలిచారు " అన్నాడు. అప్పుడు నా జనకునితో చంద్రుడు " బ్రాహ్మణులు, తపస్సు, వేదాధ్యయనము ఎల్లప్పుడు ఆచరిస్తారు. బ్రాహ్మణుడు ఎంత దూరము వెళ్ళి అయినా గురుశుశ్రూష చేసి విద్యను అభ్యసిస్తాడు. తరువాత తపస్సు చేస్తాడు. అది బ్రాహ్మణుడికి విధించిన కర్మ. కనుక బ్రాహ్మణుడు అందరికీ అధికుడు. అటువంటి బ్రాహ్మణులను ఆదరించిన శుభములు, అవమానించిన అశుభములు కలుగుతాయి అనడంలో సందేహం లేదు " అని చెప్పగా నేను విన్నాను. చంద్రుడి మాటలు మన్నించి నా జనకుడు బ్రాహ్మణులను పూజించాడు. అందుకనే తేజస్సుతో వెలుగొందుతున్నాడు. నా తండ్రి మాదిరి నేను కూడా బ్రాహ్మణులను పూజించి ఇంతటి ఉన్నత స్థితికి చేరాను " అని శంబరుడు ఇంద్రుడికి చెప్పాడు. కనుక ధర్మనందనా ! నీవు కూడా ఎల్లప్పుడూ బ్రాహ్మణులను పూజించి ఆదరించి శుభములు పొందుము " అని భీష్ముడు చెప్పాడు.
రాజు ఆదరించ తగిన వారు
ధర్మరాజా " పితామహా ! సదా తనవెంట ఉండేవారు దూరంనుండి వచ్చినవారు వీరిలో ఉత్తములెవ్వరు. ఎవరిని ఆదరించాలి " అని అడిగాడు. భీష్ముడు " ధర్మనందనా ! క్రోధమూ, ఈర్ష్య లేని వారు, స్నేహితులు, బంధువులు, సంబంధులు, ఋత్విజులు, పురోహితులు వీరంతా ఆదరించతగిన వారే. దూరం నుండి వచ్చిన వారిలో తెలియని వారిలో ఆచారశీలురు, విద్యావంతులు, గౌరవనీయులు అందరూ పూజింపతగిన వారు " అని భీష్ముడు చెప్పాడు. ధర్మరాజు " పితామహా ! లోకంలో ఉన్న పాపాలన్నింటికీ స్త్రీలు మూలకారణం అంటారు కదా ! అలా ఎందుకు అంటారో చెప్పండి " అని అడిగారు. భీష్ముడు " ధర్మనందనా ! స్త్రీలు నీవు చెప్పినటువంటి వారే. ఈ సందర్భంలో నీకు నారదుడికి పంచచూడ అనే అప్సరసకు జరిగిన సంవాదము తెలుపుతాను. ఒకసారి నారదుడు లోక సంచారము చేస్తూ పంచచూడ అనే అప్సరసను చూసి " లలనా ! నిన్ను ఒక విషయము అడుగుతాను చెప్పు " అని అడిగాడు. పంచచూడ " మహాత్మా ! అడగండి నాకు తెలిసినంత వరకు చెప్తాను " అని పలికింది. నారదుడు " వనితల స్వభావము ఎలా ఉంటుందో నాకు తెలిసేలా చెప్పు " అని అడిగాడు. పంచచూడ " అదేమిటి మహామునీ ! నేను వనితను. వనితలు మరొక వనితల గురించి చెడుగా ఎలా చెప్తారు " అనుకున్నావు. నారదుడు " నీవు నిజము చెప్పిన నీకు దోషము ఏమీ రాదు చెప్పు " అని అడిగాడు. పంచచూడ " మహాత్మా ! స్త్రీస్వభావములు మీరు ఎరుగనివా ! అయినా మీరు అడిగారు కనుక చెప్తాను. మంచి కులమున పుట్టీ, గౌరవమర్యాదలు కలిగి ఉండీ, ఒకరికి భార్య అయి ఉండీ స్త్రీ పరపురుషుడితో తిరుగుతుంది. ఇంది స్త్రీ స్వభావము ఇందుకు ఏమని చెప్పాలి. ఇది ఎవరికి అర్ధము కాదు. స్త్రీలు సర్వదోషముకు కారణము. పురుషుల మంచితనము మగువలకు అర్ధము చేసుకొనక పరాయి పురుషులను పొగుడుతుంటారు. రాజదండన భయము లేకపోతే స్త్రీలను అదుపు చేయడం కష్టమే. ఎన్ని కట్టెలు వేసినా అగ్నికి తృప్తి ఉండదు. ఎన్ని నదులు కలిసినా సముద్రుడికి తృప్తి ఉండదు. ఎంత మంది ప్రాణాలు హరించినా మృత్యుదేవతకు తృప్తి ఉండదు " అని చెప్పిన పంచచూడ మాటలకు నారదుడు తృప్తి చెందాడు. ధర్మనందనా నీ ప్రశ్నకు ఇదే సమాధానము " అని భీష్ముడు చెప్పాడు.
*రేపు *
*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*
*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి