10, జనవరి 2026, శనివారం

మహాభారతము

 *సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*

*617 వ రోజు*

అనుశాసనిక పర్వము ద్వితీయాశ్వాసము


స్త్రీలరక్షణ

ధర్మరాజు " పితామహా ! మరి అలాంటి స్త్రీలను ఎలా కాపాడు కోవాలి ? " అని అడిగాడు. భీష్ముడు " ధర్మనందనా ! స్త్రీలు అసురుల మాయల కంటే మించిన మాయలు కల వారు. ఈ సందర్భంలో నీకు ఒకకథ చెప్తాను. మొదట స్త్రీలు దోషము, మాయా మర్మము లేక సాధువులుగా ఉండే వారు. అందుకే స్త్రీలకు దైవత్వము లభించింది. ఇది చూసి అసూయ పడిన దేవతలు బ్రహ్మకు మొర పెట్టుకున్నారు. బ్రహ్మ అప్పుడు మాయలు మర్మాలు స్త్రీల లక్షణముగా ఏర్పరిచి స్త్రీలకు మోహము ఎక్కువగా ఉండేలా చేసాడు. అందు వలన స్త్రీలు మోహపరవశులై పురుషులను వారి కోరికలకు బలి చేయసాగారు. పురుషులు స్త్రీల కొరకు రోషము, కోపముకు లోనై దైవత్వము కోల్పోయారు. ఇది చూసి దేవతలు తృప్తి చెందారు. కనుక స్త్రీల మాయామర్మములు కలవారు కనుక వారి మనసు గ్రహించడం పురుషులకు కష్టమే. ఇందుకు నీకు ఒకకథ చెప్తాను. పూర్వము దేవశర్మ అనే ముని ఉండే వాడు. అతడి భార్య చాలా సౌందర్యవతి. దేవశర్మ ఒక యజ్ఞము కార్యము మీద పోతూ తన శిష్యుడైన విపులుడిని చూసి " విపులా ! నా భార్య అతిలోకసుందరి. ఆమె కొరకు దేవేంద్రుడు పొంచి ఉన్నాడు. నేను ఇంద్రుడి ఉపాయము తిప్పి కొడుతూ నా భార్యను రక్షిస్తున్నాను. నేను ఇప్పుడు యాగము చేయడానికి వెడతాను. ఇంద్రుడికి పరుల భార్యలమీద కన్ను. కనుక నీవు నా భార్యకు రక్షణగా ఉండాలి " అని చెప్పాడు. విపులుడు " గురువుగారూ ! మీరు చెప్పినట్లే చేస్తాను. కాని ఇంద్రుడు మాయావి కనుక ఏరూపంలో వస్తాడో తెలుసుకోవడం ఎలాగ ? " అని అడిగాడు. దేవశర్మ " విపులా ! నీవు చెప్పినది నిజమే ! మాయావి అయిన ఇంద్రుడు పక్షుల రూపంలో జంతువుల రూపంలో కూడా రాగలడు కనుక జాగ్రత్త పడాలి. దేవేంద్రుడు నా భార్య మీద కన్ను వేసి ఆమె చుట్టూ తిరుగుతున్నాడు. అందులో సందేహం లేదు. నేను ఆశ్రమంలో లేనని తెలిసిన ఇంద్రుడు నా భార్య కొరకు తప్పక వస్తాడు. కనుక నీవు జాగరూకత వహించాలి " అని చెప్పాడు. విపులుడు " గురుదేవా ! మీరు చెప్పినట్లు చేస్తాను " అన్నాడు. దేవశర్మ నిశ్చింతగా యాగము చేయడానికి వెళ్ళాడు. విపులుడు జాగ్రత్తగా గురుపత్నిని కాపలా కాస్తున్నాడు. అతడికి ఒక ఆలోచన వచ్చి " నేను గురు పత్నిని యోగశక్తితో ఆవహిస్తాను. అప్పుడు దేవేంద్రుడు గురుపత్నిని ఏమీ చేయలేడు. నేను యోగ శక్తితో ఆవహించిన విషయము గురువుగారికి తెలిసే అవకాశము లేదు " అనుకున్నాడు. ఆ తరువాత శిష్యుడి ఆత్మ గురుపత్నిని ఆవహించింది. శిష్యుడి ఆత్మ ప్రవేశించడంతో ఆమె ఆత్మ జడత్వం పొందింది. ఇంద్రుడు ఆమె మీద కోరికతో పక్కనే ఉన్న శిష్యుడు నిద్ర పోతున్నాడని అనుకుని ఆమెను సమీపించి తన కోరిక తెలిపాడు. ఆమె జడత్వము వహించినందు వలన ఇంద్రుడికి జవాబు ఇవ్వ లేదు. ఇంద్రుడు ఆమెను త్వరపెట్టాడు. గురుపత్నిలో ఉన్న శిష్యుడు ఇంద్రుడితో " ఇంద్రా ! నీవు ఇక్కడకు వచ్చిన పని ఏమి ? " అని అడిగుతూ ఆమెను స్పృహ తప్పేలా చేసాడు. ఇంద్రుడు ఇదంతా చూసి భయపడ్డాడు. శిష్యుడు గురుపత్నిని వదిలి బయటకు వచ్చి ఇంద్రుడితో " గౌతముడి శాపంతో ఒళ్ళంతా కళ్ళు చేసుకున్నా నీకు బుద్ధి రాలేదు కదా ? దేవేంద్రుడివై ఉండి ఇంద్రియములు అదుపులో పెట్టుకోలేని నీ బుద్ధి కుత్సితమైనది కదా నీచుడా. ఇలాంటి పని చేస్తే నా గురువు గారి కోపాగ్నికి భస్మము కాగలవు జాగ్రత్త " అన్నాడు. దేవేంద్రుడు తన యోగబలముతో విపులుడి శక్తి గ్రహించాడు. విపులుడు తిరిగి " మా గురువు దాకా ఎందుకు నేనే నిన్ను దహించగలను కాని మనసు రావడం లేదు బ్రతికి పోయావు వెళ్ళు " అని అన్నాడు. ఇంద్రుడు బతుకు జీవుడా అంటూ వెళ్ళి పోయాడు. గురువు గారు వచ్చిన తరువాత " గురువు గారు ! మీరు లేనప్పుడు దేవేంద్రుడు ఇక్కడకు వచ్చాడు. కాని నా యోగబలానికి భయపడి వెళ్ళి పోయాడు " అని చెప్పి తాను రుచి శరీరంలో ప్రవేశించిన విషయం చెపితే గురువు గారు ఏదైన అనుకుంటాడని చెప్ప లేదు

*రేపు *

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*

*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*

కామెంట్‌లు లేవు: