శివానందలహరి చదువుతున్నావిడ
మా అమ్మాయి వివాహం చాలా ఆలస్యం అవుతూ ఉంది. అన్ని రకాలుగా సరిపోయిన సంబంధాలు కూడా ఎదో ఒక కారణం వల్ల తప్పుకుంటున్నాయి. ఇది నాకు చాలా దిగులు కలిగించే విషయం అయ్యింది. పరమాచార్య స్వామివారే దారి చూపాలని నేను కోరుకుంటున్నాను. నేను, నా భర్త స్వామివారిని దర్శించుకోవాలని నిర్ణయించుకుని అక్టోబరు 31, 1985న కాంచీపురం వెళ్ళాము.
ఆరోజు శని ప్రదోషం కావడంతో స్వామివారి దర్శనం కోసం చాలామంది భక్తులు వచ్చారు. స్వామివారి సమక్షంలో శ్రీమతి పద్మా సుబ్రహ్మణ్యం మరియు శ్రీమతి శ్యామలా బాలకృష్ణన్ పాడుతున్నారు. మా వంతు రాగానే, ఏమి కావాలని అడిగారు స్వామివారు.
“త్వరగా మా కుమార్తె వివాహం జరగడానికి మీ ఆశీస్సులు కావాలి. తన జాతకాన్ని మీ చేతులతో తాకి, దానిపై కాస్త కుంకుమ పెట్టి . . .”
ఒక పళ్ళబుట్టపై అమ్మాయి జాతకాన్ని ఉంచి స్వామివారికి దగ్గరగా పెట్టాము. స్వామివారు జాతకాన్ని చేతితో తాకలేదు కాని, దూరం నుండే ఆశీస్సులను అందించారు.
“మీకు అమ్మవారి అనుగ్రహం ఉంది. నెల రోజులలో మంచి సంబంధం కుదురుతుంది” అని అన్నారు.
నేను ప్రసాదం తీసుకుని ఇప్పుడు స్వామివారి అధిష్టానం ఉన్న చోట ఉండే చెట్టు కింద కూర్చుని శివానందలహరి చెప్పుకుంటున్నాను. స్వామివారికి దాదాపు ముప్పై అడుగుల దూరంలో కూర్చుని ఉన్నాను. పెద్ద పెద్ద వరుసలలో నిలబడివున్న భక్తులు దర్శనం చేసుకుంటూ చిన్నగా ముందుకు సాగుతున్నారు.
కళ్ళు మూసుకుని ఒక ముప్పై శ్లోకాలు చెప్పుకుని ఉంటాను. అప్పుడు ఒక శాస్త్రిగారు నా వద్దకు వచ్చి నాతో, “పరమాచార్య స్వామివారు మిమ్మల్ని రమ్మన్నారు” అని అన్నారు.
“నేను ఇప్పుడే ప్రసాదాన్ని స్వీకరించాను” అని బదులిచ్చాను.
“శివానందలహరి చదువుతున్న ఆవిడని పిలుచుకునిరమ్మని పెరియవా నన్ను ఆదేశించారు” అన్నారు ఆ శాస్త్రిగారు. నేను నిశ్చేష్టురాలినయ్యాను. వెంటనే స్వామివారి వద్దకు వెళ్లాను.
“నీవు ఎవరు? ఎక్కడి నుండి వస్తున్నావు? నీ భర్త ఎక్కడ?” అని అడిగారు స్వామివారు.
నేను బీసెంట్ నగర్ నుండి వస్తున్నానని తెలిపి నా భర్తకోసం వెతకనారంభించాను. నా భర్త దొరకగానే మరలా స్వామివారి సమక్షంలోకి వచ్చి నమస్కరించాము.
స్వామివారు మమ్మల్ని ఆశీర్వదించి, “అమ్మవారి అనుగ్రహం నీకు ఎల్లప్పుడూ ఉంటుంది. అ అనుగ్రహమే నిన్ను చూసుకుంటుంది” అని తెలిపారు. మేము ప్రసాదం తీసుకుని వచ్చేశాము.
కొన్ని రోజులు గడచిన తరువాత మా అబ్బాయి అడిగాడు, “ఏంటి అమ్మా! నెలలోపల ఎదో జరుగుతుందని చెప్పారు అన్నావు. కాని ఏమి జరగలేదు” అని. పెరియవా చూసుకుంటారులే అని అన్నాను నిశ్చయంగా.
మేము అయిప్పసి నెలలో స్వామివారి దర్శనం చేసుకున్నాము. డిసెంబరు 16 నుండి మార్గళి మాసం ప్రారంభం అవుతుంది. డిసెంబరు 14న మ అమ్మాయి వివాహం నిశ్చయమైందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు అనుకుంటా.
--- సరస్వతి త్యాగరాజన్. vandeguruparamparaam.blogspot.in నుండి
అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।
టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.
t.me/KPDSTrust
#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి