🌹🌹🌹🌹🌷🌷🌷🌷🌹🌹🌹🌹
. *🪐నవగ్రహా పురాణం🪐*
. *69వ అధ్యాయం*
*పురాణ పఠనం ప్రారంభం*
🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐
*చంద్రగ్రహ చరిత్ర - 7*
మందిరము , మందిరంలోని ఏకాంతమూ తమవే అంటూ రోహిణీ చంద్రున్ని ఉయ్యాలబాపిన ఉల్లాసం ఎక్కువ రోజులు నిలువలేదు. ఆ ఇద్దర్నీ మురిపించి మైమరపించిన ఏకాంతాన్ని దక్షప్రజాపతి రాక ఛిన్నాభిన్నం చేసింది.
*"చంద్రా !"* ముఖద్వారం ముందు నిలుచుని దక్షప్రజాపతి పిలిచిన పిలుపు మందిరమంతా సుళ్ళు తిరుగుతూ , రోహిణీ చంద్రుల కర్ణపుటాలను అరచేతి దెబ్బలా తాకింది. రోహిణి భయపడుతూ చంద్రుడి వైపు చూసింది. చంద్రుడు చిరునవ్వుతో ఆమె భయాన్ని దూరం చేశాడు.
*"చంద్రా ! వెలుపలికి రా !"* దక్షుడి కేక వాళ్ళ వైపు దూసుకుంటూ వచ్చింది. ఇద్దరూ కూర్చున్న చోటు నుండి లేచారు.
ద్వారం ఆవలికి అడుగులు వేసి , అగిన రోహిణీ , చంద్రులకు దక్షుడూ , ఆయన పుత్రికలూ కనిపించారు.
*"రండి ! దయచేయండి !"* చంద్రుడు ఆహ్వానించాడు.
*"నీ మందిరం లోపలకి రావాల్సింది నేను కాదు. నీ పత్నులైన నా పుత్రికలు !"* దక్షుడు రౌద్రంగా చూస్తూ అన్నాడు. *"అంతిమ ప్రయత్నంలో వచ్చాను. అంతిమంగా అడుగుతున్నాను. అగ్ని సాక్షిగ వివాహం చేసుకున్న నా పుత్రికలను భార్యలుగా స్వీకరిస్తావా , లేదా ?"*
*"మీ పుత్రికలకు ఆనాడే చెప్పాను , మామగారూ ! మీ ఇరవై ఆరుగురు కుమార్తెలనూ వివాహం చేసుకున్నది యధార్ధమే , కానీ భార్య భర్తకు 'దాసి' కూడా అవుతుందని మీకు తెలుసు ! వాళ్ళందర్నీ దాసీజనంగా , పరిచారికలుగా స్వీకరించడానికీ , ఆ పదవులలో సపర్యలు చేయించుకోవడానికి నేను ఎప్పుడూ సిద్ధమే !"*
*"చంద్రా !”* దక్షుడు గర్జించాడు.
*"పరిచారికలుగా రోహిణికీ , నాకూ వినయవిధేయతలతో పరిచర్యలు చేస్తూ బ్రతుకులు వెళ్ళదీసుకోవడానికి వాళ్ళు సంసిద్ధంగా ఉంటే - ఇదే నా ఆహ్వానం !"*
*"నికృష్టుడా ! భార్యలు దాసీలు అవుతారు , హృదయ రాణులూ అవుతారు. నీ అహంకారం క్షమార్హం కాదు ! నిన్ను..."*
*“శపిస్తారా ?”* చంద్రుడు వెటకారంగా అడ్డు తగిలాడు. *“ప్రయత్నించండి !”*
*"నిలువెల్లా అహంకారంతో , కామంతో నిండిన నీ శరీరం క్షయ వ్యాధితో క్షీణిస్తుంది ! ఈ దక్షుడి శాపాగ్ని నీకు 'రాజయక్ష్మవ్యాధి'ని శిక్షగా అందిస్తుంది. అనుభవించు !”*2ఆవవవవ దక్షప్రజాపతి కంఠం ఉరుములా శబ్దించింది. *"క్షీణించు ! క్షీణించి , క్షీణించి , కృశించు!"*
చంద్రుడు వెటకారంగా నవ్వాడు. *"మహాప్రసాదం !"*
దక్షుడు రోహిణి వైపు నిప్పులు కక్కుతూ చూశాడు.
*"రోహిణీ ! స్వార్ధంతో , కామంతో నీ అక్క చెల్లెళ్ళను ఆత్మక్షోభకు గురిచేశావు ! నీ తండ్రి శాపం నీకు తాపంగా పరిణమిస్తుంది. వ్యాధి గ్రస్థుడయ్యే ఆ అహంకారిని సేవిస్తూ , మనస్తాపాన్ని అనుభవించు !"*
చంద్రుడి ధైర్యాన్ని భగ్నం చేస్తూ దక్షప్రజాపతి శాపం తన ప్రభావాన్ని చూపించడం ప్రారంభించింది. చంద్రుడి శరీరం కళను కోల్పోయింది. యవ్వన గర్వంతో గంతులు వేస్తున్న అందాల తనువులో బలహీనత , నీరసం ప్రవేశించాయి.
భర్తకు ధైర్యం చెప్పలేకా , తనను తాను ఓదార్చుకోలేకా రోహిణి తీవ్ర మనస్తాపాన్ని అనుభవించ సాగింది. సతీపతులిద్దరిని , అష్టకష్టాలు కలిగిస్తున్న చంద్రుడి క్షయవ్యాధి , లోకాల మీద కూడా తన దుష్ప్రభావాన్ని చూపించింది. చంద్రుడి శరీరాన్ని ఆవరించిన క్షయవ్యాధి.
అంతరిక్షంలో చంద్రమండలం మీదా , చంద్ర బింబం మీదా ప్రతిఫలించింది. చంద్ర కాంతి క్షీణించిపోయిన కారణాన , మొక్కలూ , లతలూ , మూలికలూ , వృక్షజాతీ ప్రాణశక్తిని కోల్పోయి , పెరుగుదల లేకుండా క్షీణించిపోయాయి. ఓషధుల మీద చంద్రుడి క్షయ అత్యధికంగా దుష్ప్రభావాన్ని చూపించింది. ప్రజలు రోగాలతో మరణించసాగారు.
లోకాలలో ఆహార సమస్యా , ఔషధాల సమస్యా తలయెత్తింది. పగటి వేడిమి రాత్రుళ్ళల్లో చల్లబడే అవకాశం లేకుండా పోయింది. చంద్రకాంతి క్షీణించి , రాత్రులలో చీకటి రాజ్యం చేయసాగింది.
ఈ విపరీత పరిణామాల ప్రభావం దేవలోకం మీద పడింది. చంద్ర కాంతిలో క్షీణత ఇంద్రుణ్ణి ఆశ్చర్యంలో పడవేసింది.
అవాంతరానికి కారణాన్ని ఇంద్రాదులు అన్వేషిస్తున్న సమయంలో నారదుడు ఇంద్రసభకు చేరుకున్నాడు. లోకాలకు దాపురించిన ఆ ఉపద్రవానికి కారణం చంద్రుడినే అడిగి తెలుసుకోవడం మంచిదన్నాడు. ఇంద్రాది దేవతలూ , నారుదుడూ చంద్రుడి వద్దకు వెళ్ళారు. వ్యాధితో కళావిహీనుడైపోయి , కృశించి పోయిన చంద్రుణ్ణి చూసి అందరూ ఆశ్చర్య పోయారు.
*"చంద్రా ! నువ్వు ఔషధాలకు మూలరూపాలైన ఓషధులకే అధిపతివి ! నిప్పును నిప్పు కాల్చినట్టు - ఓషధీనాధుడైన నీకు ఈ వ్యాధి ఎందుకు దాపురించింది ?"* ఇంద్రుడు చంద్రుణ్ణి ప్రశ్నించాడు.
చంద్రుడు అనుమానిస్తూ చూశాడు. నారద మహర్షి చిన్నగా నవ్వాడు. *"చేసిన తప్పు చెప్పడం ఎప్పుడూ మంచిదే ! రోగాన్నీ , రోగకారణాన్నీ దాచుకోరాదు సుమా !"* తన వ్యాధికి కారణం దక్షప్రజాపతి శాపం అని వెల్లడించిన చంద్రుడు - ఆ శాపానికి కారణమైన తన రోహిణీ పక్షపాత వైఖరినీ వివరించాడు. *"నన్ను ఎవరి శాపాలూ ఏమీ చేయలేవని గర్వించాను !"* అన్నాడు నీరసంగా.
*"ఆ గర్వంతో శపించి చూడమంటూ , మా తండ్రిగారిని రెచ్చగొట్టారు , కూడా !"* రోహిణి పశ్చాత్తాపంతో అంది.
*"మీరే నన్ను రోగ విముక్తుణ్ణి చేయాలి"* చంద్రుడు ఇంద్రుడితో అన్నాడు దీనంగా. *“అర్థం కాలేదా , చంద్రా ? నీకు వ్యాధి రావడం - ఔషధానికి వచ్చినట్టే ! వైద్యంతో నయమయ్యే వ్యాధి కాదు నీది ! ఇది శాపం చేస్తున్న నిత్య సంహారం ! ఉపసంహారమొక్కటే దీనికి పరిష్కారం !"* ఇంద్రుడు నిష్కర్షగా అన్నాడు.
*"మహేంద్రులు చక్కగా చెప్పారు. ఇప్పుడు జరగాల్సింది శాప ఉపసంహరణ ! అది చేయవల్సింది దక్షుడు - దక్షప్రజాపతి ఒక్కడే !”*
*"ఔను ! మన మందరం చంద్రుడిని వెంటబెట్టుకుని వెళ్ళి ఆయనను అభ్యర్థించుదాం !"* ఇంద్రుడు తన నిర్ణయాన్ని వ్యక్తం చేశాడు.
మహేంద్రుడు చేసిన అభ్యర్థనను ఆలకించిన దక్షుడు ఆలోచనలో పడ్డాడు.
ఆలోచన ముగించి ఇంద్రుడితో ఇలా అన్నాడు.
*"నాయనా , ఇంద్రా ! నువ్వు నా దౌహిత్రుడివి ! నీ అభ్యర్ధనను నిరాదరించలేను. చంద్రుడు అపరాధం చేశాడు. నేనూ , నా పుత్రికలూ ఓరిమితో ప్రసాదించిన అవకాశాలను చిన్న చూపు చూశాడు. అతన్ని శపించడానికి కారణం ఉంది. అది నీకు తెలుసు. చంద్రుడు నా పుత్రికలందర్నీ సాదరంగా , సానురాగంగా , సమ దృష్టితో ఏలుకోవాలి. రోహిణినో , మరొకతినో నెత్తి కెక్కించుకోవడం క్షమార్హంగా చూడబడదు. సప్తవింశతి ధర్మపత్నులనూ సమదృష్టితో సంభావించి సంతోష పరుస్తూ ఉంటానని చంద్రుడు శపథం చేయాలి. అది జరిగిన అనంతరం ఆలోచిస్తాను, ఉపసంహారం గురించి !”*
ఇంద్రుడు చంద్రుడి వైపు ప్రశ్నార్థకంగా చూశాడు. చంద్రుడు దక్షప్రజాపతి పాదాలు స్పశించి , ఆయన నిర్దేశించిన విధంగా శపథం చేశాడు.
*"నేను కూడా నా అపరాధాన్ని అర్థం చేసుకున్నాను. నా అక్కచెల్లెళ్ళను గౌరవంగా చూసుకొంటాను..."* రోహిణి కన్నీళ్ళతో అంది.
*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*
🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి