మనిషిలో సహాయ గుణం , దాన ధర్మాలుచేసే మనస్తత్వం, ఎదుటి వారితో ప్రేమ పూర్వకం గా మాట్లాడడం అలంకారాలు మరియు మంచి వ్యక్తిత్వంకి నిదర్శనాలు . పెద్దవారిని గౌరవించడం, పేద ధనిక బేధం లేకుండా అందరితో కలిసి మెలిసి ఉండడం సంస్కారం. ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం ఎంతో పుణ్యం కానీ ఆకలి తీరే మార్గం అంటే జీవనమార్గం చూపించడం ఇంకా ఎక్కువ పుణ్యం . మనం సంపాదించే సమయంలో ధనవంతులం అయ్యే కొలదీ వినయంగా ఉండడం అలవాటు చేసు కుంటే మన వ్యక్తిత్వానికి అందం వస్తుంది. మొక్కలు కూడా ఫలాలను ఇచ్చే సమయం లో వంగి ఉండి.. ఎంతో అందంగా ఉంటాయి . బాహ్య రూపం ఎదుటి వారిని ఆకర్షించవచ్చుకానీ అందమైన వ్యక్తిత్వం , ముఖంలో ప్రేమైక చిరునవ్వు అందరిలోనూ గుర్తింపు ఇస్తుంది . కొంతమంది ఈర్ష్యాపరులు మనతోనే ఉండి, మన వెనక మన గురించి తప్పుగా మాట్లాడుకోవచ్చు... అట్టి వారి గురించి పట్టించుకోవలసిన అవసరం లేదు. ఎందుకంటే వారి స్థానం ఎప్పుడూ వెనకే . మన పయనం గమ్యం వైపు అయినప్పుడు మధ్యలో ఎదురయ్యే వారంతా ఆట విడుపు మాత్రమే . వారికోసం పట్టించుకొని ఆగిపోతే గమ్యం ఎప్పటికీ చేరుకోలేము . కొన్ని ఎదురు దెబ్బలు తినకుండా మంచిస్థానంలోకి చేరుకోలేము స్వచ్ఛమైన బంగారం కూడా ఒక పరిపూర్ణమైన ఆకారం పొందాలంటే ...కాలక తప్పదు, కరగక తప్పదు , నలగక తప్పదు , దెబ్బలు తప్పవు . అలాగే మనిషి కూడా జీవితం లో మంచిస్థానం పొందాలంటే రకరకాల బాధలు తప్పవు . మనిషి విలువ దూరమైతే తెలుస్తుంది , కాలం విలువ గడిచిపోతే తెలుస్తుంది , జీవితం విలువ అనుభవిస్తేనే తెలుస్తుంది . మనిషికి మాట చాలా ముఖ్యం . మాట్లాడే ముందు బాగా ఆలోచించి మాట్లాడాలి. ఎందుకంటే ఒక్కోసారి సరదాగా మాట్లాడే మాట కూడా ఎదుటివారి మనోభావాలను దెబ్బతీసేలా ఉండవచ్చు . దాని వల్ల అపార్థాలు చేసుకుంటే బంధాలు దూరం అయ్యే పరిస్థితి ఏర్పడవచ్చు మరియు ఆ "మాట" మనసులో ఉండి పోతుంది. కాబట్టి తొందర పడి నోటి నుండి మాట జార కూడదు . కొన్ని సంతోషాలు ఎంత డబ్బు ఖర్చు పెట్టినా దొరకదు. డబ్బుతో కొనే వాటిని "సుఖాలు" అంటారు., డబ్బుతో కొనలేని వాటిని "ఆనందాలు" అంటారు . అదే స్నేహం , ఆత్మీయత . ఎంత డబ్బు ఖర్చు పెట్టినా మందులుతో నయం కాని జబ్బులు స్నేహితుల కలయిక తో నయం అయిపోతాయి. ప్రతిరోజూ ఒక అరగంట స్నేహితులతో గడిపితే మనసు ఎంతో ఉల్లాసంగా ఉంటుంది .
ఇతి శివమ్
సర్వేజనాఃసుఖినోభవంతు!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి