30, అక్టోబర్ 2023, సోమవారం

వేదవతి గారి కోరిక..*

 *వేదవతి గారి కోరిక..*


"మీరు ప్రసాద్ గారేనా మాట్లాడటం?.." అని ఫోన్ లో అడిగారు ఆవిడ.."అవునండీ..మీరూ..?" అని సందేహంగా అడిగాను.."నా పేరు వేదవతి..మీరు నిర్మల ప్రభావతి గారి కుమారుడే కదా.."? అని అడిగారు.."అవును.." అన్నాను.."బాబూ..మీతో కొంచెం సేపు మాట్లాడాలి..ఇప్పుడు మీకు వీలవుతుందా..?" అన్నారు.."పర్లేదు చెప్పండి.." అన్నాను..


"నా పేరు వేదవతి..భరద్వాజ మాస్టారు గారి ఆధ్వర్యంలో వచ్చిన సాయిబాబా పత్రికలో మీ అమ్మగారు అవధూత తో మా అనుభవాలు అని మొగలిచెర్ల లో సిద్ధిపొందిన దత్తాత్రేయ స్వామివారి చరిత్రను కొన్నాళ్ళు వ్రాసారు..అప్పట్లో అది చదివాను..ఆ తరువాత కొన్నాళ్ళకు నేను మా వారు మొగలిచెర్ల కు వచ్చి, మీ అమ్మ నాన్న గార్లను కలిసాము..ఇదంతా 1996 లో ముచ్చట..అప్పుడే మేము అక్కడ సిద్ధిపొందిన దత్తాత్రేయ స్వామివారి సమాధిని కూడా దర్శించుకున్నాము..ఆ తరువాత కొన్నాళ్ల పాటు మీ అమ్మగారి తో ఉత్తరాల ద్వారా సంబంధాలు ఉండేవి..క్రమంగా సంసార బాధ్యతలు పెరిగే సరికి..అలా ఉత్తరాల ద్వారా పలకరింపులూ ఆగిపోయాయి..ఒకసారి విజయవాడలో ఏదో రచయితల మీటింగ్ లో మీ తల్లిదండ్రులను కలిశాను..ఆ తరువాత లేదు..ఇప్పుడు ఎందుకు చెపుతున్నానంటే..ఈమధ్య మీరు ఆ మొగలిచెర్ల స్వామివారి గురించి సోషల్ మీడియా లో వ్రాస్తున్నారట..మా మనుమరాలు నాకు చూపించింది..అవి చదివిన తరువాత మీకు ఫోన్ చేయాలని అనిపించింది..ఆ స్వామివారి సమాధిని దర్శించి రమారమి పాతికేళ్ళ కాలం గడిచిపోయింది..ఆయన మహిమలు, లీలలు గత ఆరు నెలలుగా  చదువుతున్నాను..చాలా బాగున్నాయి..నాకు ఒక సహాయం చేయగలరా?.." అన్నారు..

"ఏమి చేయమంటారు?.." అన్నాను..


"మా కుమారుడు కోడలు హైదరాబాద్ లో వుంటారు..వాళ్ళ అమ్మాయి..అంటే..మా మనుమరాలికి వివాహం నిశ్చయం అయింది..అబ్బాయి అమెరికా లో ఉంటాడు..ఇంకొక మూడు నెలల్లో పెళ్లి ముహూర్తం పెట్టుకున్నాము..అబ్బాయి ఇక్కడకు రావడానికి ఏదో వీసా సమస్య ఉందట..స్వామివారి వద్ద అర్చన చేయించండి..నిజానికి నేనే అక్కడికి వచ్చి స్వామివారిని వేడుకోవాలి..కానీ..నాకు ఇప్పుడు డెబ్భై రెండేళ్లు..ప్రయాణాలు చేయలేను..మా అబ్బాయికి ఇటువంటి వాటిమీద నమ్మకం లేదు..నేను స్వామివారి సమాధి ఒకసారి చూసిన దాన్ని..మీ అమ్మానాన్న గార్ల ద్వారా స్వామివారి గురించి విని వున్నాను..అందువల్ల ఆయనకు మొర పెట్టుకుంటే సమస్యలు తీరిపోతాయని ఒక నమ్మకంతో నీకు చేస్తున్నాను..స్వామివారు నాకు ఓపిక ఇస్తే..త్వరలో అక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటాను..నాకోసం ఆ పిల్లల పేర్లతో అర్చన చేయించు బాబూ.." అని ప్రాధేయపూర్వకంగా అడిగారు.."అమ్మా..మీరేమీ బాధ పడవద్దు..గోత్రనామాలు మెస్సేజ్ చేయండి..అర్చన చేయిస్తాను..అదీకాక రేపు గురువారం నాడు దత్తహోమము చేస్తున్నాము..అందులో కూడా గోత్రనామాలతో సంకల్పం చేయిస్తాను.." అని చెప్పాను.."మంచిది నాయనా..చాలా ఓపికగా నా మాటలు విని..సమాధానం చెప్పావు..మళ్లీ చెపుతున్నాను..నాకు శక్తి ఇస్తే..ఒక్కసారి ఆ స్వామివారి సమాధిని మళ్లీ దర్శించుకుంటాను..ఆయన దయ ఉండాలి..అంతే.." అన్నారు..


వేదవతి గారితో మాట్లాడిన విదంగానే..ఆవిడగారు పంపిన గోత్రనామాలతో ఆ ప్రక్కరోజు గురువారం నాడు నిర్వహించిన దత్తహోమము లో అర్చన కార్యక్రమాలు చేయించాను..ఆరోజు సాయంత్రం వేదవతి గారికి ఫోన్ లో తెలియచేసాను..ఆవిడ సంతోషించారు..మరో ఆరేడు నెలల తరువాత ఒక గురువారం ఉదయం నాకు వేదవతి గారు ఫోన్ చేసి..ఆ ప్రక్క శనివారం నాడు తాను, తన కుమారుడు కోడలు కలిసి మొగలిచెర్ల వస్తున్నామని..వీలుంటే వసతి కొరకు ఒక గది తీసి పెట్టమని చెప్పారు..అలాగే ఆ శనివారం వచ్చారు..ఆరోజు సాయంత్రం స్వామివారి పల్లకీసేవ లో వేదవతి గారి కుమారుడు కోడలు పాల్గొన్నారు..ఆ రాత్రికి ఆ ముగ్గురూ నా వద్దకు వచ్చి.."బాబూ..స్వామివారి దయవల్ల మా మనుమరాలి సమస్య తీరిపోయింది..దాని పెళ్లి కూడా లక్షణంగా జరిపించాము..ఆ సమస్య తీరితే వీళ్ళిద్దరినీ ఇక్కడికి తీసుకొని వస్తానని ఆరోజే నేను మొక్కుకున్నాను..నన్ను రప్పించడం కోసం స్వామివారే మా కోరిక తీర్చాడేమో..కాకపోతే పాతికేళ్ళ తరువాత నేను ఈ వయసులో ఇక్కడికి రావడమేమిటి?..అంతా..ఆయన లీల.." అని చెప్పారు..ప్రక్కరోజు ఆదివారం ఉదయం స్వామివారి సమాధిని దర్శించుకొని బాగా ఉద్వేగం పొందారు..మరో గంట తరువాత తిరుగు ప్రయాణం అవుతూ..మా దంపతుల వద్దకు వచ్చి..నా భార్యతో.."అమ్మాయీ..మీరిద్దరూ స్వామివారి సేవలో వున్నారు..అదృష్టవంతులు.." అని మమ్మల్ని ఆశీర్వదించి వెళ్లారు..


కొన్ని కొన్ని సంఘటనలు చిత్రంగా ఉంటాయి..వేదవతి గారికి పాతికేళ్ళ విరామం తరువాత స్వామివారి గురించి మళ్లీ తెలియడం..ఆవిడ మొక్కుకోవడం..ఆ కోరిక తీరడం..ఆవిడ అంత వృద్ధాప్యంలోనూ మళ్లీ స్వామివారి సమాధి దర్శించుకోవడం..అంతా మాకు అంతుపట్టని ఒక లీలా వినోదం..


సర్వం..

శ్రీ దత్తకృప!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..వయా కందుకూరు..లింగసముద్రం మండలం..SPSR నెల్లూరు జిల్లా..పిన్ : 523114..సెల్..94402 66380 & 99089 73699)

కామెంట్‌లు లేవు: