30, అక్టోబర్ 2023, సోమవారం

*శ్రీ స్వామివారి వివరణ..*

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర...

  

*శ్రీ స్వామివారి వివరణ..*


*(పన్నెండవ రోజు)*


శ్రీ స్వామివారు తన తపోసాధన కొరకు ఆశ్రమం నిర్మించుకోవాలని, అందుకు భూమి కావాలనీ శ్రీధరరావు దంపతులను కోరడం..వారు తర్జన భర్జన పడటం జరుగుతూవుంది..ప్రత్యామ్నాయంగా  పార్వతీదేవి మఠాన్ని బాగు చేయించి..కొన్ని సౌకర్యాలు ఏర్పాటుచేసి.. ఆశ్రమ వాతావరణాన్ని ఈ మాలకొండ మీదే కల్పిస్తే ఎలావుంటుందని దంపతులిద్దరూ తలపోయసాగారు.. కానీ ఈ విషయాన్ని శ్రీ స్వామివారితో ఎలా చెప్పాలా అన్న మీమాంస వాళ్ళిద్దరినీ వెంటాడుతోంది..ఈ ఆలోచన ను తమలోనే దాచుకున్నారు..


వరుసగా ఆరేడు వారాలపాటు శ్రీధరరావు గారొక్కరే మాలకొండ వెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి..ప్రభావతి గారు ఇంటివద్దే ఉండిపోవాల్సివచ్చింది..మాలకొండ మీదకు రోడ్డు వేసే పని మొదలుపెట్టారు..శ్రీధరరావు గారు ఆ పని మీద వున్నారు..కొంతమంది రాజకీయ ప్రముఖులు కూడా మాలకొండ మీదుగా వేరే ఊళ్లకు వెళుతూ శ్రీధరరావు గారితో ఉన్న పరిచయం దృష్ట్యా వారిని కలిసి వెళుతూ వుండేవారు..అలా వచ్చిన వారిలో ఒకరిద్దరికి శ్రీ స్వామివారిని చూపిద్దామని శ్రీధరరావు గారు ప్రయత్నం చేశారు..కానీ అదేమీ చిత్రమో.. శ్రీ స్వామివారు అటు శివాలయం లోగానీ..ఇటు పార్వతీదేవి మఠం లోగానీ కనుపించేవారు కాదు..ఎంత సేపు వేచి చూసినా శ్రీ స్వామివారి జాడే తెలిసేది కాదు..వచ్చిన వారు శ్రీ స్వామివారి దర్శనం చేసుకోకుండానే వెనుదిరిగిపోయేవారు..అలా రెండు మూడు సార్లు శ్రీధరరావు గారికి అనుభవం అయింది..


ఒకరోజు, శ్రీధరరావు గారొక్కరే పార్వతీదేవి మఠం వద్దకు వెళ్లారు..చిత్రం..శ్రీ స్వామివారు ఆ ఆలయం వెలుపల వున్న అరుగుమీద పద్మాసనం వేసుకొని కూర్చుని వున్నారు..శ్రీధరరావు గారిని చూడగానే నవ్వుతూ.."శ్రీధరరావు గారూ నన్ను ప్రదర్శనకు పెడుతున్నారా?.." అన్నారు..


శ్రీధరరావు గారు అవాక్కయ్యారు.."అది కాదు స్వామీ..ప్రముఖ వ్యక్తులు ఇక్కడిదాకా వచ్చారు..మీ దర్శనం చేయిద్దామని అనుకున్నాను..మీరు కనిపించలేదు.." అన్నారు..


"ఇక్కడ నేను తపస్సుచేసుకుంటున్నానని అందరికీ ప్రచారం కావడం..నన్ను చూడటం కోసం వారం కాని వారం లో ఈ మాలకొండ ఎక్కడం..నాకోసం కొండమీద పడిగాపులు కాయడం..నన్ను వెతుక్కుంటూ అన్ని గుహలు తిరగడం..ఒకవేళ నేను కనబడితే..కాళ్లకు మొక్కడం..అది వీలుగాకపోతే..నామీదకు చిల్లర డబ్బులు విసరడం..ఇదంతా ఏమిటి?..నా తపోభంగం కావడం తప్ప వేరే ప్రయోజనం ఉందా?.."


"ఈ మాల్యాద్రి క్షేత్రానికి ఓ నియమం ఉంది శ్రీధరరావుగారూ..మీకూ తెలుసు..వారం లో ఆదివారం నుంచీ శుక్రవారం వరకూ దైవపూజ..ఒక్క శనివారం నాడు మాత్రమే మానవపూజ అని..నా మూలంగా ఈ సాంప్రదాయం తప్పుతోంది..నన్ను చూడటం కోసం జనాలు ఏరోజు పడితే ఆరోజు ఈ కొండమీద సంచరిస్తున్నారు..ఇది నివారిద్దామనే నేను, నా శేష తపోసాధనకు వేరే ప్రదేశం ఎన్నుకోదలచాను.. అందుకే మిమ్మల్ని భూమి అడిగాను.." అంటూ ఒక్కక్షణం ఆగి..


"ఈ పార్వతీదేవి మఠానికి మార్పులు చేసి, నాకు నివాసయోగ్యంగా చేద్దామని తలపోస్తున్నారా?..


"కౌపీన సంరక్షణార్ధం అయం పటాటోపః "


 అన్నట్లుగా అది సమస్యను మరింత జటిలం చేస్తుందేగానీ.. పరిష్కారం కాదు.." అన్నారు..


శ్రీధరరావు గారు ఆశ్చర్యపోయారు..ఈ ప్రతిపాదన తానూ తన భార్య అనుకున్నది..శ్రీ స్వామివారికెలా తెలిసిందీ?..అనుకుంటూ శ్రీ స్వామివారికేసి చూసారు..శ్రీ స్వామివారి మొహంలో అదే చిరునవ్వు..అదే ప్రశాంతత!..


"మీరు ఇతరత్రా ఆలోచనలు పెట్టుకోకండి..ఇంటికెళ్లి అమ్మతో చెప్పండి..ఇక్కడ ఎక్కువకాలం నేను ఉండటం సాధ్యపడదు..దైవానుగ్రహం ఉన్నంత వరకూ అన్ని సాధనలూ సవ్యంగా సాగుతాయి..ఆ లక్ష్మీనృసింహుడి ఆదేశం అయిన తరువాత ఆలస్యం చేయకూడదు..నా తపోసాధన ఇంతవరకూ ఈ శివపార్వతుల ఒడిలో జరిగిపోయింది..ఇకముందు జరగాల్సిన ప్రదేశం కావాలి..అందుకు మిమ్మల్ని స్థలం అడిగాను..అది దత్తక్షేత్రం అవుతుంది.." అని చెప్పి..పార్వతీదేవి మఠం లోపలికి వెళ్లిపోయారు..


శ్రీధరరావు గారు తిరిగి మొగలిచెర్ల కు వచ్చి..శ్రీ స్వామివారితో జరిగిన సంభాషణ అంతా..పూసగ్రుచ్చినట్లు ప్రభావతి గారికి చెప్పేసారు..

"సరే శ్రీవారూ..దైవానుగ్రహం ఎలా వుంటే అలా జరుగుతుంది..అంతగా స్వామివారు చెపుతున్నారు కదా..మన ప్రయత్నం మనం చేద్దాం..మీరే అన్నారుకదా కాలం ఎన్ని మలుపులు తిప్పుతుందో మన జీవితాలను అని..ఆ లక్ష్మీ నరసింహ స్వామి పాదాలను నమ్మి వున్నాము..ఆయన చెంతనే ఈ స్వామివారిని మనం కలిసాము...ఇప్పుడు కూడా ఆ నారసింహుడిదే ఈ భారం.." అని అన్నారు..శ్రీ చెక్కా కేశవులు గారితో కూడా శ్రీ స్వామివారు తపోసాధనకు తమను స్థలం అడిగిన విషయం చెప్పారు శ్రీధరరావు గారు..


ఆ తరువాత మరో రెండురోజుల్లో మళ్లీ మాలకొండ వెళ్లారు శ్రీధరరావు గారు..శ్రీ స్వామివారిని కలిశారు.."అమ్మతో చెప్పావా నాయనా?.." అన్నారు..అవునన్నట్లు తలూపారు శ్రీధరరావు గారు.."మంచిది..అంతా శుభమే జరుగుతుంది.." అన్నారు..


శ్రీధరరావు ప్రభావతి గార్ల అనుభవాలు..రేపటినుంచి..


*మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి చరిత్రను ఆడియో రూపంలో ఈ క్రింద ఇచ్చిన లింక్ ద్వారా యూట్యూబ్ లో వినవచ్చు..*


https://youtube.com/playlist?list=PLZ3oJviTRayHLeRpuozyT55d-H-4xmTHs&si=xqCIrCAE0k1Rmrnx


సర్వం..

శ్రీ దత్తకృప!.


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..SPSR నెల్లూరు జిల్లా..పిన్: 523114..సెల్..94402 66380 & 99089 73699).

కామెంట్‌లు లేవు: