☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️
*శ్రీమద్ భాగవతం*
*(77వ రోజు)*
*(క్రితం భాగం తరువాయి)*
☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️
*కృష్ణావతారం*
*కంసుడు*, *శ్రీకృష్ణ జననం*
☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️
*ఉగ్రసేనునికి క్షేత్రజ కుమారుడయిన కంసుడేగాక మరి ఎనిమిది మంది కుమారులు జన్మించారు. కంస, కంసవతి మొదలయిన అయిదుగురు కుమార్తెలు కూడా జన్మించారు. ఉగ్రసేనుని తమ్ముడు దేవకుడికి నలుగురు కుమారులు, ఏడుగురు కుమార్తెలు జన్మించారు.ఆ ఏడుగురిలో చివరది దేవకి. ఈ ఏడుగురినీ వసుదేవుడు వివాహం చేసుకున్నాడు. దేవకీ వసుదేవులకే శ్రీకృష్ణుడు జన్మించాడు.*
*దానవాంశంతో జన్మించిన కంసుడు చిన్ననాటి నుంచే ఎన్నో దుష్కృత్యాలకు పాల్పడ్డాడు. పుణ్యాత్ములను, బ్రాహ్మణులను హింసించసాగాడు. జరాసంధుని కుమార్తెలయిన అస్తి, ప్రాప్తిలను వివాహం చేసుకున్నాడతను. శిశుపాలుడు, దంతవక్త్రుడుతో స్నేహం కలుపుకున్నాడు. తండ్రి ఉగ్రసేనుణ్ణి బంధించి, తనని తాను రాజుగా ప్రకటించుకుని ప్రజలను పీడించసాగాడు.*
*శ్రీకృష్ణజననం:~*
*ఆడపిల్లను తొలిసారిగా అత్తవారింటికి పంపేటప్పుడు, ఆమె వెంట అన్నో తమ్ముడో లేదంటే పుట్టింటికి సంబంధించిన మరొక వ్యక్తి ఎవరయినా ఉండడం ఆచారం. తోడుగా వెళ్ళి ఆమెను అత్త ఇంట దిగవిడచి రావడం సంప్రదాయం. ఆ సంప్రదాయాన్ని అనుసరించే దేవకీ వసుదేవుల వివాహం అనంతరం వారిని దిగ విడచి వచ్చేందుకు తోడుగా కంసుడు బయల్దేరాడు.*
*చెల్లెలినీ, బావగారినీ రథంలో కూర్చోబెట్టుకుని, తానే రథాన్ని నడపసాగాడు కంసుడు. ఆ రథాన్ని అనేకమంది దాస దాసీజనం, పరివారం అనుసరించాయి. సకల మర్యాదలతో చెల్లెలిని అత్త వారింటికి తీసుకుని వెళ్తున్నాన్న ఆనందంలో ఉన్నాడు కంసుడు. అప్పుడు ఓ విచిత్రం జరిగింది.*
*ఉత్సాహంగా ఉల్లాసంగా రథాన్ని నడుపుతున్న కంసుణ్ణి ఉద్దేశించి ఆకాశవాణి ఇలా పలికింది.*
*‘‘కంసా! సోదరిని సంతోషంగా అత్తవారింటికి తీసుకుని వెళ్తున్నావు. చేజేతులా చావుని కొని తెచ్చుకుంటున్నావు. ఈ దేవకి కడుపున పుట్టిన ఎనిమిదవ బిడ్డే నీ ప్రాణాల్ని హరిస్తుంది. ఆ బిడ్డ చేతిలో నీకు మరణం తప్పదు.’’*
*వినవచ్చిన ఆ మాటలకు విస్తుపోయాడు కంసుడు. కాసేపు కళ్ళు మూసుకున్నాడు. ఏకదీక్షతో ఆలోచించాడు. ఆకాశవాణి మాటలు నిజం కాకతప్పదు. తనకి మరణం తధ్యం. దానిని తప్పించుకోవాలి. ఎలా?*
*రథం దిగాడు కంసుడు. కొరకొరా చెల్లెలు దేవకిని చూశాడు. ఆమె సిగను పట్టి కిందకి లాగాడు. మొలలోని కత్తిని ఆమె పైకి దూశాడు.*
*‘‘బావా’’ అంటూ అడ్డుకున్నాడు వసుదేవుడు.*
*‘‘ ఇది నా చెల్లెలు కాదు, నా ప్రాణాల్ని హరించే రాక్షసి. దీనిని ఈ క్షణమే హతమార్చి, నన్ను నేను కాపాడుకుంటాను. తప్పుకో.’’ అన్నాడు కంసుడు.*
*వసుదేవుణ్ణి వెనక్కి నెట్టాడు. తూలిపడబోయి నిలదొక్కుకుని, కంసుని కాళ్ళు పట్టుకున్నాడు వసుదేవుడు.*
*‘‘బావా! భోజకులానికే ఎన్నదగినవాడవు. శూరుడవు. నీకు తెలియని ధర్మం లేదు. స్త్రీహత్య మహాపాతకం. చెల్లెలు, కొత్తపెళ్ళికూతురు, కాళ్ళపారాణి కూడా ఆరలేదు. అలాంటిదాన్ని, అమాయకురాలిని చంపుతాననడం ధర్మమా చెప్పు? దయచేసి నా మాట విను, దేవకిని వదలిపెట్టు.’’ ప్రాథేయపడ్డాడు. వినలేదు కంసుడు. దేవకిని చంపితీరుతానన్నాడు. ఎన్నో విధాలుగా నచ్చజెప్పి చూశాడు వసుదేవుడు. అయినా ఒప్పుకోలేదతను.*
*తీవ్రంగా ఆలోచించి అప్పుడు ఇలా అన్నాడు వసుదేవుడు.‘‘ఎనిమిదవ బిడ్డ కదా నీ ప్రాణాల్ని హరించేది. ఎనిమిదవ బిడ్డనే కాదు, దేవకికి పుట్టిన ప్రతిబిడ్డనీ నీకు తెచ్చి ఇస్తాను. నువ్వేం చేసుకుంటావో చేసుకో! దేవకిని వదులు.’’*
*వసుదేవుని వాగ్దానానికి శాంతించాడు కంసుడు. దేవకిని విడచిపెట్టాడు. ‘‘మాట తప్పవు కదా?’’ అడిగాడు వసుదేవుణ్ణి. తప్పనన్నాడతను. ‘‘సరే, వెళ్ళిరండి.’’ కంసుడు ఇద్దరినీ వదిలేశాడు. బ్రతుకుజీవుడా అని భర్త సహా అత్తారింటికి చేరుకున్నది దేవకి.*
*కొన్నాళ్ళకు ఆమె ఓ కుమారుణ్ణి కన్నది. ఇచ్చిన మాట ప్రకారం ఆ కుమారుణ్ణి తీసుకుని, కంసుణ్ణి సమీపించాడు వసుదేవుడు.‘‘తీసుకోబావా’’ అందజేశాడు. పసిబిడ్డను తీసుకుని చూశాడు కంసుడు. వేలెడు లేడు. తనని వీడేం చేస్తాడనుకున్నాడు. సన్నగా నవ్వుకున్నాడు. తర్వాత వసుదేవుని సత్యనిష్ఠకు కూడా సంతోషించి, ఇలా అన్నాడు.‘‘ఆడిన మాటకు కట్టుబడి బిడ్డను తీసుకుని వచ్చావు. ఆనందంగా ఉంది. ఈ పసిగుడ్డు నన్నేం చేస్తుంది. తీసుకునిపో, పిల్లాడితో సుఖంగా ఉండండి.’’ వసుదేవునికి పిల్లాణ్ణి తిరిగి ఇచ్చేశాడు కంసుడు. ఆ బిడ్డపేరే కీర్తిమంతుడు.*
*(తర్వాత కథ రేపు చెప్పుకుందాం )*
*ఓం నమో భగవతే వాసుదేవాయ॥*
☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి