🙏కాళిదాస మహాకవి చాటుకథలు / శ్లోకాలు 🙏
కాలిదాసు గురించి ఎంత చెప్పుకొన్నా తనివి తీరదు.
1. ఒక సారి కాలిదాసు, భోజరాజుల మధ్య ఏదో వైషమ్యం వలన ఆయన ఒక వేశ్య యింట రహస్యంగా ఉన్నాడు (కాలిదాసు వేశ్య యింటనా అనుకోనవసరం లేదు. ఆయన జీవించిన దేశకాల పరిస్థితులు వేరు). ఆయన ఎక్కడున్నాడో తెలుసుకోవడానికి భోజుడు "కుసుమే కుసుమోత్పత్తిః; శ్రూయతే నతు దృశ్యతే" అన్న పద్యాన్ని చక్కగా పూరించినవారికి వంద బంగారు కాసులు ఇవ్వబడుతుందని చాటింపు వేయించాడు. కాలిదాసుకు ఆశ్రయమిచ్చిన వేశ్య ఆ విషయం చెప్పి అదేదో పూరించి యిస్తే తాను వెళ్లి ఆ బహుమానం తెచ్చుకొంటానని అర్థించింది. ఆయన ఇలా పూరించాడు.
కుసుమే కుసుమోత్పత్తిః
శ్రూయతే నతు దృశ్యతే
బాలే తవ ముఖాంబోజే
దృశ్యమిందీవరద్వయం
(పువ్వులోనుండి ఇంకో పూవు పుట్టుతుందని వినడమేకాని ఎన్నడూ చూడలేదు. కానీ ఓ అమ్మాయీ! నీ ముఖమనే తామరపూవులో నాకు రెండు నల్లకలువలు కనిపిస్తున్నాయి).
ఇంకేముంది! ఈ శ్లోకం ఆమె పట్టుకువెళ్లి రాజు ముందు చదవడం, ఆయన ఇది కాలికాసుదేనని గుర్తించి ఆమె వెంట వెళ్లి ఆయనను బ్రతిమాలి మళ్లీ తన వద్దకు రప్పించుకోవడం జరిగాయి.
ఒకసారి కాలిదాసు ఆలయ మండపంలో విశ్రమిస్తుంటే అక్కడ యిద్దరు బాటసారులు మాట్లాడుకోవడం విన్నాడు. వారిరువురూ సోదరులు. పాండిత్యం సంపాదించినవారు. దూరదేశం నుండి వస్తున్నారు. భోజునికి కవిత్వమంటే ప్రీతి అని విని ఏదైనా కవిత వినిపించి కొంత సొమ్ము యాచించాలని వారి ఆలోచన. కానీ వారి పండితులే గానీ కవులు కారు. ఐనా సరే ఏదైనా ఒక్క శ్లోకమైనా తయారుచేసుకొని వెళ్లి రాజుగారిని మెప్పించాలని వారి ప్రయత్నం. చిన్నవాడన్నాడు - 'నువ్వోపాదం చెప్పు, నేనో పాదం చెబుతా. మళ్లీ నువ్వు, తరువాత నేను. ఒక శ్లోకం అయిపోతుంది' అని. మంచి ఆకలి వేళ, దూరం నుండి ప్రయాణించి వచ్చారు. వారికి మరో అలోచన రాలేదు. పెద్దవాడు ప్రారంభించాడు, 'భోజనం దేహి రాజేంద్ర' ఒక పాదం అయిపోయింది. చిన్నవాడు అందుకొన్నాడు, 'ఘృత సూప సమన్వితం' . (అన్నం పెట్టించు మహా ప్రభూ, నెయ్యి పప్పుతో సహా అని అర్థం). మళ్లీ పెద్దవాడి వంతు. ఇంకేం చెప్పాలో తోచడం లేదు. చిన్నవాడికీ ఏమీ తట్టడం లేదు. ఇదంతా వింటూ నవ్వుకొంటున్న కాలిదాసుకు ఈ పండిత సోదరులమీద జాలి కలిగింది. 'తరువాతి రెండు పాదాలు నేను చెబుతాను వ్రాసుకొండి' అని శ్లోకం ఇలా పూరించి యిచ్చాడు.
మాహిషంచ శరచ్చంద్ర
చంద్రికా ధవళం దధిః
(శరత్కాలపు చంద్రుని వెన్నెల వలే తెల్లని ఆవు/గేదె పెరుగు [కూడా పెట్టించు] అని అర్థం)
ఈ శ్లోకం విన్న భోజుడు ఇది కాలిదాసు పూరణగా గుర్తించడం, ఆ పూరణను ఆయన చేసిన సిఫారసుగా భావించి ఆ సోదరులకు యథోచితంగా ధనసహాయం చేయడం తరువాతి కథ.
మరోసారి భోజుడు సరదాగా 'క,ఖ,గ,ఘ' అని ఒక ముక్క చెప్పి దీన్ని ఒక శ్లోకంగా పూరించగలరా అని అడిగాడట. దీనితో ఏం శ్లోకం వస్తుందా అని అలోచిస్తూ ఇంటికి వస్తున్న కాలిదాసు అక్కడి గణిక వీథిలో ఎదురుగా వస్తున్న చిన్న పిల్లను చూసి ముచ్చటపడి పలకరించాడు.
'ఎవరమ్మాయీ నువ్వు?'
'నా పేరు కాంచన మాల అండి'
'అలాగా. ఎవరమ్మాయివో?'
'కనకలత కుమార్తెను'
'ఓహో! ఏమిటో చేతిలో జాగ్రత్తగా తీసుకొని వెళ్లుతున్నావు?'
'తాళ పత్రమండీ. చదువుకోవడానికి తీసుకెళుతున్నాను.'
'మంచిది. ఏం వ్రాసుందో అందులో!'
'క,ఖ,గ,ఘ'.
ఇంకేం. మాటల్లోనే పద్యం పూర్తయిపోయింది.
కా త్వం బాలే? కాంచన మాలా
కస్యా పుత్రీ? కనక లతాయా
హస్తే కిం తే? తాలీ పత్రం
కావా రేఖా? క, ఖ, గ, ఘ
(ఇది ఏ ఛందస్సులో ఉందో, అసలుందో లేదో తెలియడం లేదు. నేను వ్రాసిన దానిలో కూడా తప్పు ఉండవచ్చు).
కాలిదాసుకు, ఇతర కవులకు ఉండే మాత్సర్యంపై కూడా కథలున్నాయి. వీటిలో నిజం ఉండకపోవచ్చు కాని, ఇలాంటి పుకార్లు వినడానికి రంజుగా ఉంటాయి కదా.
కాలిదాసు, దండిలలో ఎవరు గొప్ప వారు అన్న గొడవ వచ్చిందట. అప్పుడు ఉజ్జయినిలోని సరస్వతీ ఆలయంలోనో ఎక్కడో ఇద్దరి రచనలనూ పెట్టి ఎవరు గొప్పకవియో చెప్పమని దేవిని ప్రార్థించారట. ఆ విగ్రహంనుండి "కవిర్దండిః,కవిర్దండిః, కవిర్దండిః నసంశయః" అని వినిపించిందట. అది విని, అందరి ముందు జరిగిన అవమానంతో కోపం పట్టలేక కాలిదాసు "కోఽహం రండే?" అని అరిచాడట. అప్పుడు సరస్వతి "త్వమేవాహం, త్వమేవాహం, త్వమేవాహం" అని ముమ్మారు పలికిందట. కాలిదాసు సరస్వతీ స్వరూపుడని చెప్పడానికి అతని నోట అంతటి పరుషవాక్యాలను పలికించినదెవరో కానీ అది ఆతని స్వభావానికి పూర్తిగా విరుద్ధమైనట్టి మాట.
కాలిదాసు, భవభూతి కవుల మధ్య కూడా స్పర్థ ఉండేదని, వారి వారి శిష్యులు ఇప్పటి మన సినిమా హీరోల అభిమానుల్లా కొట్టుకొనేవారని కథలు ఉన్నాయి.
కవయాః కాళిసాద్యాః
భవభూతిర్మహాకవిః
(కవులు అంటే కాలిదాసు మొదలైనవారు. భవభూతి మహాకవి) అని భవభూతి శిష్యులు విర్రవీగితే
తరవః పారిజాతాద్యాః
స్నుహీ వృక్షం మహాతరుః
(చెట్లు అంటే పారిజాతం మొదలైనవి. స్నుహీ వృక్షం మహావృక్షం) అని కాలిదాసు శిష్యులు బదులిచ్చేవారట. ఈ స్నుహీ వృక్షం అన్నది ఆయుర్వేద పరంగా ఎందుకూ పనికి రాని చెట్టు అట. కనుక దీనిని వ్యంగ్యంగా 'మహావృక్షం' అని ఆయుర్వేద గ్రంథాల్లో పేర్కొంటారట.
"ఏకో రసః, కరుణ ఏవ" అని భవభూతి పలికినా, సంస్కృత కవిత్వం లో రసం, సరసం అంటే వాల్మీకి తరువాత కాలిదాసే.
కాళిదాసు పేరిట ఉన్న చాటువుల్లో సింహభాగం భోజరాజీయం కథలు. క్రీ.శ. తొమ్మిదవ శతాబ్దంలో ధారానగరాన్ని భోజుడనే రాజు పరిపాలించాడు. స్వయానా అయన చాలా గొప్ప కవి.
సమర్పణ
మారేపల్లి ఉదయ భాస్కర శర్మ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి