🌸 *దయాసముద్ర తరంగాలు*
( మూడవ భాగము)
(శృంగేరి శారదా పీఠం 36వ పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ భారతీ తీర్థ మహాస్వామి వారి జీవిత విశేషాలు)
3. భక్తుడొకాయన శ్రీచరణుల వద్దకు వచ్చి తనకు శీఘ్రంగా కోపం వస్తుందని, అలా కోపం వచ్చినపుడు తనను తాను మరచి పోతానని చెప్పి, ఆ సమస్య పరిష్కారానికై మార్గాన్ని సూచించ మని ప్రార్థించాడు.
శ్రీజగద్గురువులు : కోపం ఎవరికి వస్తే వారిని అది నాశనం చేస్తుంది. అందువలన జాగ్రత్తగా దాని నుండి తప్పించుకోవాలి. ఇక మీదట ఎప్పుడైనా కోపం వచ్చేటట్లు అనిపిస్తే బిగ్గరగా నవ్వండి.
భక్తుడు : తమరు చెప్పినట్లే చేస్తాను. అయితే ఆ సలహాను పాటించటంలో భక్తుడు విఫలమయ్యాడు. ఆయన సమస్య అలాగే ఉంది. కొన్ని నెలల తరువాత శృంగేరికి మళ్లీ వచ్చినప్పుడు మరోసారి శ్రీచరణులను తన సమస్యకు పరిష్కారాన్ని సూచించమని వేడుకున్నాడు. తాను మొదట సూచించిన సలహాను భక్తుడు చిత్తశుద్ధితో పాటించటం లేదని శ్రీజగద్గురువులు గ్రహించారు. మళ్లీ అదే అభ్యర్థనను భక్తుని నుండి విన్నా శ్రీచరణులకు కోపం కాని, విసుగుకాని రాలేదు. భక్తుని మాటలతో కోపగించుకోలేదు. పూర్వమిచ్చిన సలహాను మళ్లీ చెప్పలేదు. భక్తుని మనస్సులో అది అలాగే ఉంది కదా. మరో సలహాయిచ్చినట్లయితే పాటించటానికి ఎక్కువ అవకాశం ఉంది. శ్రీచరణులు అలా మరోసలహాయిచ్చారు.
శ్రీజగద్గురువులు : మీకు కోపం వచ్చేటట్లు ఉంటే నన్ను తలచుకోండి.
భక్తుడు : క్రిందటిసారి తమను యిదే విషయమడిగినప్పుడు, శ్రీవారు బిగ్గరగా నవ్వమని సలహాయిచ్చారు.
భక్తుని మాటలను అధికప్రసంగంగా చెప్పవచ్చు. ఎందుకంటే శ్రీచరణులకు అత్యద్భు తమైన జ్ఞాపకశక్తి ఉన్నదనే విషయం అతనికి తెలుసు. శ్రీవారి నుంచి పాతసలహానే పొందా లనెడి ఉద్దేశంతో ఆయన మళ్లీ ఆ విషయాన్ని ప్రస్తావించినట్లయితే అది శ్రీవారి విలువైన సమయాన్ని వృధాచేయటమే. అయితే శ్రీ జగద్గురువులు ఆయన ప్రస్తావనను తప్పుగా అర్థం చేసుకోలేదు.
శ్రీజగద్గురువులు : (చిరునవ్వుతో) అవునవును. మాకు గుర్తుంది.
భక్తుడు : శ్రీజగద్గురువులు యిప్పుడు నాకు మరో విధమైన సలహా యిస్తున్నారు. రెండింటిలో నేను దేనిని పాటించాలి?
పూర్వం చెప్పిన సలహానే పాటించమని తిరిగి చెప్పటం, లేదా క్రొత్తగా మరో సలహాచెప్పటం అనే రెండు మార్గాలలో ఏదో ఒకటి శ్రీచరణులు చెప్పాలి. శ్రీచరణులు క్రొత్తగా మరో సలహానే యిచ్చారు. అయితే శ్రీచరణుల రెండు సలహాలలోను అంతరం ఉన్నదనీ, రెండింటి మధ్య అనుకూలత ఉన్నదనీ భక్తుడు అనుకోకుండ చెప్పినట్లయింది. ఈ సందర్భంలో శ్రీచరణులు ఏదో ఒకదానిని పాటించమని చెప్తే, భక్తుని మనస్సులో రెండవది తక్కువ స్థాయిది అనే అభిప్రాయమేర్పడుతుంది. అంతేకాదు. భక్తుడు రెండవది ఎందువలన తనకు మొదట సూచించారనే ప్రశ్నను కూడ వేయవచ్చు.
భక్తుని మనస్సును పూర్తిగా అర్థం చేసుకుని అతనికి ఎటువంటి సందేహాలు మున్ముందు రాకుండ శ్రీజగద్గురువులు యిలా చెప్పారు : "రెండు సూచనలను అనుసరించండి." అలా కోపాగ్నిలో దహించి పోకుండ, భక్తునికి శ్రీచరణులను స్మరించుకొమ్మని, నవ్వుతూ ఉండమని సలహా యివ్వబడింది.
మహాత్ముల వాక్యాలు నిరర్ధకం కావు. సహజంగా నవ్వినా, తెచ్చిపెట్టుకుని నవ్వినా, నవ్వు నవ్వే. అది మన మానసిక స్థితిని సంస్కరిస్తుంది. మన కోపానికి అడ్డుకట్ట వేస్తుంది. అందువలన శ్రీచరణుల మొదటి సలహాను భక్తుడు తప్పనిసరిగా పాటిస్తే అతని సమస్యకు పరిష్కారం లభించేది. అలాగే రెండవ సలహాను పాటించినా ఫలితముంటుంది. ప్రశాంతతకు ప్రతిరూపమా అన్నట్లు ఉండే పూజ్యపాదులు జగద్గురువులు అయిన శ్రీచరణుల రూపాన్ని మదిలో తలచుకున్నప్పుడు భక్తునికి కోపం ఎలా వస్తుంది? కోపంలో ఎలా ఉడికిపోతాడు. భక్తుని హృదయంలో శ్రీచరణుల ఆలోచన రాగానే ఆనందం కలుగుతుంది. ఆనందం నవ్వు కవలలు. అందువలన మొదటి సలహా రెండవ సలహాల మధ్య అనుకూలత ఎక్కువగా ఉంటుందనటంలో ఎటువంటి సందేహం లేదు. శ్రీచరణులను స్మరించుకోగానే, వారిచ్చిన సలహా నవ్వుతూ ఉండమన్నది గుర్తుకు వస్తుంది. కాబట్టి శ్రీచరణులిచ్చిన రెండు సలహాలు ఒకదానితో మరొక దానికి సంబంధ మున్నవే.
ఈ సంఘటన శ్రీచరణులకున్న ఓర్మిని, యితరుల మనస్తత్వాన్ని అర్థం చేసుకునే తీరును, కరుణను, యితరులకు చక్కటి, విలువైన సలహాను యివ్వగలసామర్ధ్యాన్ని ప్రదర్శిస్తుంది. గురుస్మరణ, నవ్వటం అనే విషయాలు ఈ సంఘటనలో ఒక భక్తునికి సూచించ బడినా, వానిని యితరులు కూడ స్వీకరించి, పాటించి సత్ఫలితాలను పొందవచ్చు.
ఆంగ్లమూలం:
కె.సురేష్ చందర్ గారు
తెలుగు అనువాదం :
తుమ్మలపల్లి హరిహరశర్మ గారు.
🌸 *శారదే పాహిమాం శంకర రక్షమాం* 🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి