16, మార్చి 2025, ఆదివారం

శివానందలహరి

 🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

*జగద్గురు ఆదిశంకరాచార్యులు*

                  *విరచిత*

         *”శివానందలహరి”*

             *రోజూ ఒక శ్లోకం* 

*పదవిభాగం, తాత్పర్యం, ఆడియోతో*

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

*"జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ"*

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

*పరమశివుని పాదాల జంట అనే పక్షి గూటిలో తన మనస్సు అనే పక్షిని విహరింపుమని , శంకరులు ఈ శ్లోకంలో తన మనస్సు కు హితోపదేశం చేశారు.*


*శ్లోకం: 45*


*ఛన్దశ్శాఖి శిఖాన్వితైః ద్విజవరైః సంసేవితే శాశ్వతే*


*సౌఖ్యాపాదిని ఖేదభేదిని సుధాసారైః ఫలైర్దీపితే ।*


*చేతః పక్షి శిఖామణే త్యజ వృథా సంచారం అన్యైరలం*


*నిత్యం శంకరపాదపద్మయుగలీనీడే విహారం కురు ।*

*తాత్పర్యము : ~*


*మనస్సనే పక్షి శ్రేష్ఠమా ! వేదములనే వృక్షాగ్రములయందు ఉన్నట్టి పక్షి శ్రేష్ఠములతో సేవింపబడేదీ, వేదాంతములైన ఉపనిషత్తులతో కూడిన బ్రాహ్మణవర్యులచే సేవింపబడేదీ, స్థిరమైనదీ, సౌఖ్యాన్ని కల్గించేదీ , దుఃఖాన్ని తొలగించేదీ, అమృత సారములైన ఫలాలతో ఒప్పేదీ, అమృత ప్రాయమైన మోక్షానందముతో ప్రకాశించేదీ అయిన శివుని పాదపద్మ యుగం అనే గూటి యందు సర్వదా విహరించు. వ్యర్థసంచారాలు విడచి పెట్టు. ఇతరములతో నీకు పని ఏముంది.*


*వివరణ :~*


*శంకరులు తనమనస్సును ఇలా ప్రబోధించారు. " ಓ మనస్సనే పక్షీ ! నీకు నీడ కోసం మంచి గూడు కావాలి. ఆ గూడులో అన్ని సుఖాలూ ఉండాలి. అటువంటి గూడుకోసం అక్కడా ఇక్కడా వ్యర్థంగా తిరుగకు.*

 

*శంకరుని పాదపద్మాలనే గూడు నీ కోసం సర్వ వస్తువులతో సిద్ధంగా

ఉంది. నీవందులో విహరించు. అది శాశ్వతమైనది.*


*ఇంతకుముందే ఆ గూట్లోకి వేదవృక్షాల కొమ్మల చివుళ్ళను ముట్టిన ద్విజ వరములు చేరిఉన్నాయి. ఆగూడు సౌఖ్యముగావుండి దుఃఖాన్ని పోగొడుతుంది. అమృతసారమైన ఫలములు అక్కడ దండిగా ఉన్నాయి. కాబట్టి పనికిమాలిన తిరుగుళ్ళు మాని ఈశ్వరుని పాదపద్మాలనే గూటికి చేరుకో."*


*తనమనస్సునకు శంకరులు అటువంటి స్థానాన్ని ఈ శ్లోకంలో చూపించారు. కరుణా సముద్రుడైన శివుని పాదాలపై మనస్సునుంచి శరణు వేడితే కానిది ఉండదుకదా !*


*(తరువాయి శ్లోకం రేపు అధ్యయనం చేద్దాం.)*


*ఓం నమఃశివాయ।*

*నమః పార్వతీ పతయే హర హర మహాదేవ॥*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

*క్రొత్తగా నేర్చుకుంటున్న వారికి ఉపయుక్తంగా ఉంటుందని పై శ్లోకం ఆడియో దిగువనీయబడింది. వినండి*👇

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

కామెంట్‌లు లేవు: