మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి లీలలు..
*సమాధి..సాక్ష్యం..*
దళిత కుటుంబానికి చెందిన చిన్నయ్య సాధారణ రైతు..తనకున్న కొద్దిపాటి పొలాన్ని సాగు చేసుకుంటూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు..నిజానికి అతని ఆదాయం అంతంత మాత్రమే.. ఉన్నంతలోనే గుట్టుగా సంసారాన్ని పోషించుకుంటున్నాడు..అతనికి, ఆతని కుటుంబానికి శ్రీ దత్తాత్రేయ స్వామి వారి మీద అచంచల భక్తి విశ్వాసాలున్నాయి..తమకు ఏ కష్టం కలిగినా..నేరుగా శ్రీ స్వామివారి సమాధిని దర్శించి మొక్కుకునేవారు..
ఒక సంవత్సరం తన పొలంలో పొగాకు పంట వేసాడు..అదృష్టం బాగుండి..నాణ్యమైన పొగాకు చేతికొచ్చింది..ఇప్పుడు చిన్నయ్యకు ఒక చిక్కు వచ్చింది..పొగాకు అమ్ముకోవాలంటే..అతని పేరుతో బారెన్ రిజిస్టర్ అయి ఉండాలి..అదీకాక, అమ్మకం తాలూకు డబ్బులు కూడా నేరుగా బారెన్ ఉన్న వ్యక్తి యొక్క బాంక్ ఖాతాకు కు జమ అవుతాయి...అందువల్ల తనను తెలిసిన ఒక అగ్రకుల మోతుబరి రైతు సహాయాన్ని అర్ధించాడు..తాను పండించిన పొగాకును ఆ రైతు పేరుతో అమ్మకం చేసిపెట్టి, తన పొగాకు అమ్మకం తాలూకు డబ్బులు బాంక్ లో జమ అయిన తరువాత..తనకు ఇవ్వమని అడిగాడు..ఆ రైతూ ఇందుకు ఒప్పుకున్నాడు..
అనుకున్న ప్రకారమే అమ్మకం జరిగింది..డబ్బులూ బాంక్ లో జమ అయ్యాయి..చిన్నయ్యకు సహాయం చేస్తానన్న మోతుబరికి దుర్బుద్ధి మొదలయింది..బాంక్ లో తన అకౌంట్ కు జమ అయిన చిన్నయ్య తాలూకు డబ్బు ఇవ్వకుండా ఎగ్గొడితే..ఆ డబ్బు తనకు మిగులుతుంది కదా..పైగా ఆ అమ్మిన పొగాకు చిన్నయ్య దే అనే ఋజువు ఎక్కడా లేదు..తన పేరుతోనే అమ్మకం చేసాడు..తన అకౌంట్ కే డబ్బూ జమ అయింది..చిన్నయ్యకు తనతో వైరం పెట్టుకునే స్తోమత లేదు..పైగా చిన్నయ్య దగ్గర ఆధారాలూ లేవు..ఇకనేం!..డబ్బు ఇవ్వకుండా ఎగ్గొడితే సరి!..ఇదే ఆలోచన చేసి..ఆ రైతు నిశ్చింతగా కూర్చున్నాడు..
ఓ వారం తరువాత చిన్నయ్య తనకు రావాల్సిన ధనం గురించి రైతు ను అడిగాడు.."నీకు నేను డబ్బు ఇవ్వడమేమిట్రా?..పిచ్చి పిచ్చిగా మాట్లాడకు!.." అని గట్టిగా కేకలు వేసి..చిన్నయ్యను తరిమేశాడు.. చిన్నయ్యకు ఏమీ పాలుపోలేదు..ఊళ్ళో పెద్ద మనుషుల వద్దకు వెళ్లి తన గోడు వెళ్లబోసుకున్నాడు..ఎవ్వరూ కూడా సహాయం చేయలేమన్నారు..
దిక్కుతోచని చిన్నయ్య.."అయ్యా..మీరందరూ పెద్దవారు..నా పొగాకు అమ్మకం తాలూకు డబ్బు , ఫలానా పెద్దమనిషి వద్ద ఉన్నాయి..ఇందుకు ఋజువు నేను చూపలేను..కానీ ఒక్కసారి, ఆ దత్తాత్రేయ స్వామి సమాధి వద్దకు ఆయన వచ్చి..నాకు డబ్బులు ఇవ్వక్ఖరలేదు అని ప్రమాణం చేయమనండి.. అలా ప్రమాణం చేస్తే..నేనూ ప్రమాణం చేస్తాను..ఆ స్వామే నిర్ణయిస్తాడు..ఈ ఒక్క సహాయం చేయండి.." అన్నాడు..పెద్దమనుషులకు ఈ మాట నచ్చింది..రైతు కు చెప్పి పంపారు..
"ఆ స్వామి వద్దే ప్రమాణం చేస్తాను..ఆయనేమన్నా సమాధి లోంచి లేచి వచ్చి సాక్ష్యం చెపుతాడా?.." అనుకున్న ఆ పెద్దమనిషి.. తాను ఈ పద్దతికి ఒప్పుకుంటున్నట్లు చెప్పి పంపాడు..
ఆరోజు సాయంత్రమే చిన్నయ్య, ఆ రైతు ఇద్దరూ..మొగలిచెర్ల ఫకీరు మాన్యం లో గల శ్రీ స్వామివారి సమాధి మందిరం వద్దకు వచ్చారు..ఊళ్లోని పెద్దలూ వచ్చారు..ముందుగా చిన్నయ్య శ్రీ స్వామివారి సమాధి కి నమస్కారం చేసి..బావి వద్దకు వెళ్లి ఆ నీళ్లను తలమీద పోసుకొని..తడి బట్టలతో మందిరం లోకి వచ్చి, హారతి పళ్లెం వద్ద చేతులు జోడించి.."ఆ స్వామి మీద ప్రమాణం చేస్తున్నా.." అంటూ..తనకు జరిగిన అన్యాయాన్ని చెప్పాడు..
ఇక రైతు వంతు వచ్చింది..అప్పటిదాకా ఎంతో గంభీరంగా వున్న ఆయన ముఖం లో మార్పు రాసాగింది..వళ్ళంతా వణుకు పుట్టింది..ఒక్క సారిగా నిస్సత్తువ ఆవరించింది.."సమాధి లోంచి స్వామి లేచి వచ్చి సాక్ష్యం చెపుతాడా?" అని తాననుకున్న మాటలకు సమాధానంగా ఆ స్వామి తన లోపలినుంచి తన చేతే నిజం చెప్పమని ఒత్తిడి చేస్తున్న భావన కలుగసాగింది..ఇక ఆగలేకపోయాడు..తాను ప్రమాణం చేయలేనని..చిన్నయ్యకు అణా పైసలు తో సహా డబ్బు చెల్లిస్తానని చెప్పాడు..అంతే కాదు..అప్పటికప్పుడే తన మనిషిని ఊళ్ళోకి పంపి, డబ్బు తెప్పించి చిన్నయ్యకు ఇచ్చేసాడు..అతని లో వచ్చిన మార్పు అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది..
చిన్నయ్య ఒక్కటే చెప్పాడు.."నమ్మిన వాళ్ళను స్వామి కాపాడతాడు!.."
అప్పటి నుంచీ..స్వామి వద్ద ప్రమాణం చేయడమంటే..న్యాయం నిలబడుతుంది అని అందరికీ తెలిసివచ్చింది..
సర్వం..
శ్రీ దత్తకృప!
(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా.. పిన్:523114..సెల్..94402 66380 & 99089 73699.)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి