11, జులై 2021, ఆదివారం

భాగవత పద్యాలు ప్రార్ధనా శ్లోకాలు:*

 🙏

*బమ్మెర పోతనామాత్యులు రచించిన భాగవత పద్యాలు ప్రార్ధనా శ్లోకాలు:*

👇👇👇👇👇👇👇

1.   తల్లి నిన్ను దలంచి పుస్తకము చేతంబూనితిన్ నీవు నా

యిల్లంబందున నుండి జ్రుంభణముగా నుక్తుల్ సుశబ్దంబు శో

బిల్లం బల్కుము నాదు వాక్కునను సంప్రీతిన్ జగన్మోహినీ

ఫుల్లాబ్జాక్షి సరస్వతీ భరతీ పూర్ణేందు బింబాననా.


2.  అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాల బె

ద్దమ్మ సురారులమ్మ కడుపారడి పుచ్చినయమ్మ దన్ను లో 

నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడియమ్మ దుర్గ మా 

యమ్మ కృపాబ్ధి యిచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ .


3.  శ్రీ కైవల్య పదంబు జేరుటకునై చింతించెదన్ లోక ర 

క్షైకారంభకు భక్త పాలన కళా సంరంభకున్ దానవో 

ద్రేక స్తంభకు గేళి లోలవిలసద్రుగ్జాల సంభూత నా 

నాకంజాత భవాండకుంభకు మహనందాంగనాడింభకున్.


4.  శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా

హార తుషార ఫేన రజతాచల కాశ ఫణీశ కుంద మం

దార సుధా సయోధి సీత తామర సామర వాహినీ శుభా

కారత నొప్పు నిన్ను మది గానగ నెన్నడు గల్గు భరతీ!!


5.  చేతులారంగ శివుని బూజింపడేని, నోరు నొవ్వంగ హరికీర్తి నుడువడేని 

దయయు సత్యంబు లోనుగా దలపడేని, గలుగ నేటికీ దల్లుల కడుపుజేటు.


6.  పలికెడిది భాగవతమట

పలికించు విభుండు రామభాద్రుండట నే 

పలికిన భవహరమగునట 

బలికెద వేరొండు గాధ పలుకగనేల !!


7.  భాగవతము తెలిసి పలుకుట చిత్రంబు

శూలికిన దొమ్మి చూలికైన

విభుద జనుల వలన విన్నంత కన్నంత

దెలియ వచినంత దేటపారుతు.


8.  శారద నీరదేందు ఘనసార పటీర మరాళమల్లికా

హారతుషార ఫేన రజతాచల కాశ ఫణీశ కుంద మం

దార సుధాపయోధి సితతామరసామర వాహినీ శుభా

కారత నొప్పు నిన్ను మది గానగ నెన్నడుకల్గు భారతీ!!

*************************************** 

కుంతీ స్తుతి::

9.  కృష్ణాయ వాసుదేవాయ దేవకీనందనాయ చ

నందగోపకుమరాయ గోవిందాయ నమోనమః

నమః పంకజనాభాయ నమః పంకజమాలినే

నమః పంకజనేత్రాయ నమస్తే పంకజాంఘ్రయే.


10.  యాదవులందు పాండుసుతులందునధీశ్వర నాకు మోహ వి

చ్చేదము సేయుమయ్య ఘనసింధువు చేరెడి గంగ భంగి నీ

పాదసరోజ చింతనముపై ననిశంబు మదీయబుధి న

త్యాదర వృత్తితో గదియునట్ట్లుగ జేయుగాదయ్యయీశ్వరా!


11. శ్రీకృష్ణా! యడుభూషణా నరసఖా శృంగార రత్నాకరా!

లోకద్రోహినరెంద్రవంశదహనా లోకేశ్వరా దేవతా

నీక బ్రాహ్మణగోగణార్తిహరణా! నిర్వాణ సంధాయకా!

నీకున్ మ్రొక్కెద త్రుంపవే భావలతల్ నిత్యానుకంపానిధీ!!

***************************************

12.హరిమయము విశ్వమంతయు హరివిశ్వమయుండు సంశయము పనిలేదా

హరిమయము కానిద్రవ్యము పరమాణువులేదు వంశపావన వింటే.


13.విశ్వాత్ముడు విశ్వేశుడు విశ్వమయుండఖిలనేత విశ్నుజుండీ

విశ్వములో తానుండును విశ్వము తనలోన చాల వేలుగుచునుండన్.

***************************************

14.నారదుడు ధర్మరాజుతో అన్న మాటలు:

కమోత్కంఠత గోపికల్ భయమునన్ గంసుండు వైరక్రియా

సామగ్రిన్ శిశుపాల ముఖ్య నృపతుల్ సంబంధులై వృష్ణులున్

ప్రేమన్ మీరలు భక్తినేము నిదె చక్రింగంటి మెట్లైన ను

ద్ధామధ్యానగారిష్టు‌డైన హరి జెందెన్ వచ్చు ధాత్రీశ్వరా.

*************************************** 


ప్రహ్లాదోపఖ్యనం లోని పద్యాలు:

15.పానీయంబులు త్రావుచున్ కుడుచుచున్ భాషించుచున్ హాసలీ

లానిద్రాదులు సేయుచున్ తిరుగుచున్ లక్షింపుచున్ సంతత 

శ్రీ నారాయణ పాదపద్మయుగళీ చింతామృతాస్వాద సం

ధానుండై మరచెన్ సురారి సుతుడేతద్విశ్వమున్ భూవరా!!


16.మందార మకరంద మాధుర్యమున దేలు మధుపంబు వూవునే మదనములకు

నిర్మల మందాకినీ వీచికల దూగు రాయంచ చనునే తరంగిణులకు

లలిత రసాల పల్లవఖాదియై చొక్కు కోయిల చేరునే కుటజములకు

పూర్ణేందు చంద్రికా స్ఫురిత చాకోరకంబరుగునే సాంద్రనీహారములకు

అంబుజోదర దివ్య పాదారవింద చింతనామృత పానవిశేషమత్త

చిత్తమేరీతి నిరతంబు జేరనేర్చు వినుత గుణశీల మాటలు వేయనేల!


17.చదివించిరి నను గురువులు చదివితి ధర్మర్ధముఖ్యసస్త్రంబులు నే

చదివినవి గలవు పెక్కులు చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రీ!


18.కమలాక్షు నర్చించు కరములు కరములు, శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ 

సుర రక్షకుని జూచు చూడ్కులు చూడ్కులు, శేషశాయి కి మ్రొక్కు శిరము శిరము

విష్ణునా కర్ణించు వీనులు వీనులు, మధు వైరి దవిలిన మనము మనము

భగవంతువలగొను పదములు పదములు, పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి

దేవదేవుని చింతించు దినము దినము చక్రహస్తుని బ్రకటించు చదువు చదువు

కుంభీనీధవు జెప్పెడి గురుడు గురుడు తండ్తి! హరి జేరుమనేడి తండ్రి తండ్రి.


19.కంజాక్షునకునుగాని కాయంబు కాయమే పవన గుంభిత చర్మ భాస్మి గాక

వైకుంఠుబొగడని వక్త్రంబు వక్రమే ఢమఢమ ధ్వనితోడి ఢక్క గాక

హరి పూజనము లేని హస్తంబు హస్తమే తరుశాఖ నిర్మిత దర్వికాక

కమలేశుజూడని కన్నులు కన్నులే తనుకుడ్యజాల రంధ్రములు గాక

చక్రిచింతలేని జన్మంబు జన్మమే తరళ సలిల బుద్బుదంబు గాక

విష్ణుభక్తీలేని విబుధుండు విబుధుడే పాదయుగము తోడి పశువు గాక!


20. బలయుతులకు దుర్బలులకు బలమెవ్వడు నీకు నాకు బ్రహ్మాదులకున్

బలమెవ్వడు ప్రాణులకును బలమెవ్వండట్టి విభుడు బలము సురేంద్రా!


21.కలడంబోధి గలండు గాలి గలదాకసంబునుం గుంభినిన్

గలడగ్నిన్ దిశలం బగళ్ళ నిశలన్ ఖద్యోత చంద్రాత్మలన్

గలదడోంకారమునం ద్రిమూర్తుల ద్రిలింగ వ్యక్తులందంటన్

గలడీశుండు కలండు తండ్రి! వేదకంగానేల నీ యా యెడన్

22. ఇందుగలండందు లేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుం

డెందెందు వెదకి చూచిన అందందే గలడు దానవాగ్రణి! వింటే.


23. నరమూర్తికాదు, కేవల హరిమూర్తియు కాదు మనవాకారము కే

సరి యకారము నున్నది, హరి మాయా రచితమగు యదార్ధము చూడన్.


24. హరికిం పట్టపుదేవివి హరిసేవానిపుణమతివి హరిగాతివి సదా

హరి రతివి నీవు సని నరహరి రోషము డింపవమ్మ హరివరమధ్యా!

***************************************

గజేంద్ర మోక్షము పద్యాలు:

25. ఎవ్వనిచేజనించు జగమెవ్వని లోపలనుండు లీనమై

యెవ్వని యందు డిందు, పరమేశ్వరుడెవ్వడు, మూలకరణం

బెవ్వడనాది మధ్య లయుడెవ్వడు, సర్వము తానయైన వా

డెవ్వడు, వానినాత్మభవునీశ్వరునే శరణంబు వేడెదన్.

26. లోకంబులు లోకేశులు లోకస్థులు తెగిన తుది నాలోకం బాగు పెం

జీకటి కవ్వల నేవ్వడేకాకృతి వెలుగు నతని నేసేవింతున్.


27. కలడందురు దీనులయెడ కలడందురు పరమ యోగి గణముల పాలన్

కలడందురన్ని దిశలను కలడు కలండనెడివాడు కలడో లేడో.


28. కలుగడే నాపాలి కలిమి సందేహింప కలిమిలేములు లేక కలుగువాడు

నా కడ్డపడరాడె నలి నసాధువులచే బడిన సాధుల కడ్డపడెడువాడు

చూడడే నా పాటు చూపుల జూడక చూచువారల గృప చూచువాడు

లీలతో నా మొరాలింపడే మెురుగుల మెురలెరుంగుచు తన్ను మొరగువాడు

అఖిల రూపులు తన రూపమైన వాడు నాది మధ్యాంతములు లేక యడరువాడు

భక్త జనముల దీనుల పాలివాడు వినడె చూడడె తలపడే వీగరాడే.


29. లావొక్కింతయు లేదు ధైర్యంబు విలోలంబయ్యె బ్రాణంబులున్

ఠావుల్ దప్పెను మూర్చ వచ్చె తనువులున్ డస్సెన్ శ్రమంబయ్యెడిన్

నీవే తప్ప నితః పరంబెరుగ మన్నింపన్ దగున్ దీనునిన్

రావే యీశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మకా!


30. అలవైకుంఠ పురంబులో నగరిలోనామూల సౌధంబు దా

పల మందార వనాంతరామృత సరః ప్రాంతేందు కాంతోపలో

త్పలపర్యంకరమావినోది యగు నాపన్న ప్రసన్నుండు వి

హ్వల నాగేంద్రము పాహి పాహియన కుయ్యాలించి సంరంభియై.


31.సిరికిం జెప్పడు శంఖచక్రయుగముం చేదోయి సంధింప డే

పరివారంబునుజీర డభ్రగపతిం బన్నింప డాకర్ణి కాం

పరిచేలాంచలమైన వీడడు గజప్రాణావానోత్సాహియై.


32. తనవెంటన్ సిరి లచ్చి వెంట నవరోధ వ్రాతమున్ దానివె

న్కను బక్షీంద్రుడు వాని పొంతను ధనుఃకౌమొదకీ శంఖ చ

క్ర నికాయంబును నారదుండు ధ్వజనీకాంతుడురావచ్చి రొ

య్యన వైకుంఠపురంబునం గలుగు వారాబాల గోపలమున్.


33. చనుదెంచెన్ ఘనుడల్లవాడె హరి పజ్జం గంటిరే లక్ష్మి శం

ఖ నినాదంబదె చక్రమల్లదె భుజంగధ్వంసియున్ వాడె క్ర

న్నన నేతెంచె నటించు వేల్పులు "నమో నారాయణాయే"తి ని

స్వనులై మ్రొక్కిరి మింట హస్తి దురవస్థా వక్రికిన్ జక్రికిన్.

***************************************

వామనవతారం:

34. వాడుగా! యెవ్వరివాడ వెవ్వడవు సంవాస స్థలం బెయ్యెది

య్యెడకున్ నీవరుదెంచుటన్ సఫలమయ్యెన్ వంశమున్ జన్మమున్

కడుధన్యాత్ముడనైతి నీ మఖము యోగ్యంబెయ్యె నా కోరికల్

కడతేరెన్, సుహుతుంబులయ్యె శిఖులుం కళ్యాణమిక్కాలమున్.


35. వరచేలంబులో మాడలో ఫలములో వన్యంబులో గోవులో

హరులో రత్నములో రధంబులో విమృష్టాన్నంబులో కన్యలో

కరులో కాంచనమో నికేతనములో గ్రామంబులో భూములో

ధరణీఖండమో కాక యే మడిగెదో ధాత్రీసురేంద్రోత్తమా.


36. గొడుగో జన్నిదమో కమండలువో నాకున్ ముంజియో దండమో

వడుగేనెక్కడ భూములెక్కడ కరుల్ వామాక్షు లశ్వంబు లె

క్కడ నిత్యోచిత కర్మమెక్కడ? మదాకాంక్షామితంబైన మూ

డడుగుల్ మేరయ త్రోవకిచుటది బ్రహ్మాండంబు నా పాలికిన్.

 

37. కారే రాజులు రాజ్యముల్ కలుగవే గర్వోన్నతింబొందరే

వారేరీ? సిరిమూట గట్టుకుని పోవంజాలిరే భూమిపై

పెరైనం గలదే శిబిప్రముఖులుం బ్రీతిన్ యశఃకాములై

యీరే కోర్కులు వారలన్ మరచిరే యిక్కాలమున్ భార్గవా?


38. ఆదిన్ శ్రీసతి కొప్పుపై తనువుపై నంసోత్తరీయంబుపై

పాదాబ్జంబులపై కపోలతటిపై పాలిండ్లపై నూత్న మ

ర్యాదం జెందు కరంబు క్రిందగుట మీదై నాకరంబుట మేల్

గాదె రాజ్యము గీజ్యమున్ సతతమే కాయంబు నా పాయమే?


39. ఇంతింతై వటుడింతై మరియు తానింతై నభోవీధిపై

నంతై తోయదమండలాభ్రమున కల్లంతై ప్రభారాశిపై

నంతై చంద్రునికంతయై ధ్రువునిపై నంతై మహర్వాటిపై

నంతై సత్యపదోన్నతుండగుచు బ్రహ్మాండాంత సంవర్దియై.


40. రవిబింబం బుపమింప బాత్రమగు చత్రంబై శిరోరత్నమై

శ్రవణాలంకృతమై గళాభారణమై, సౌవర్ణకేయూరమై

ఛవిమత్కంకణమై కటిస్థలి నుదంచద్ఘంటియై నూపుర

ప్రవరంబై పదపీఠమై వటుడు తాబ్రహ్మన్డమున్ నిండుచోన్.


41.ఎవ్వని కరుణింప నిచ్ఛయించితి వాని యఖిల విత్తంబునేనపహరింతు

సంసారగురుమద స్తబ్ధుడై యెవ్వడు తెగడి లోకము నన్ను ధిక్కరించు

నతడెల్ల కాలంబు నఖిల యోనులయందు పుట్టుచు దుర్గతి పొందు పిదప

విత్తవయో రూప విద్యా బలైశ్వర్య కర్మ జన్మంబుల గర్వముడిగి

ఏకవిధమున విమలుడై యెవ్వడుండు వాడు నాగూర్చి రక్షింపవలయువాడు

స్తంబలోభాభిమాన సంసార విభవమత్తుడై చేడనొల్లడు మత్పరుండు.

***************************************

 దశమ స్కంధం:

42. ఆదౌదేవకీదేవి గర్భజననం గోపీ గృహే వర్ధనం

మాయాపూతనజీవితాపహరణం, గోవర్ధనోద్ధారణం

కంసచ్ఛేదన కురవాదిహననం కౌంతేయసంరక్షణం

ఎతద్భాగవతం పురాణకథితం, శ్రీకృష్ణ లీలామృతం!!


43. విష్ణుకథారాతుడగు నరు విష్ణుకథల్ చెప్పుమనుచు, వినుచుండు నరున్

విష్ణుకథాసంప్రశ్నము విష్ణుపదీజలము భంగి విమలుల జేయున్.


44. అన్నావు నీవు చెల్లెలికి అక్కట మాడలు చీరలిచ్చుటో

మన్నన సేయుటో మధుర మంజుల భాషల నాదరించుటో

మిన్నుల మ్రోతలే నిజాము మేలని చంపకుమన్న మాని రా

వన్న సహింపుమన్న తగదన్న వధింపకుమన్న వేడెదన్.

***************************************

హరియను రెండక్షరములు

హరియించు పాతకంబు నంబుజనాభా

హరి నీ నామస్మరణము

హరి హరి పొగడంగ తరమె హరి శ్రీకృష్ణా !!


నీ పాద కమల సేవయు నీ పాదర్చకులతోడి నెయ్యము నితాం

తాపార భూతదయయును దాపస మందార నాకు దయసేయగదే.

👍

కామెంట్‌లు లేవు: