*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*
*దశమస్కంధము - ఉత్తరార్ధము - డెబ్బది తొమ్మిదవ అధ్యాయము*
*బలరాముడు బల్వలుని సంహరించి, తీర్థయాత్రలను కొనసాగించుట - భీమదుర్యోధనుల గదాయుద్ధమును నివారించుటకు ప్రయత్నించుట*
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
*శ్రీశుక ఉవాచ*
*79.1 (ప్రథమ శ్లోకము)*
*తతః పర్వణ్యుపావృత్తేఙ్ ప్రచండః పాంసువర్షణః|*
*భీమో వాయురభూద్రాజన్ పూయగంధస్తు సర్వశః॥11560॥*
*శ్రీశుకుడు నుడివెను* పరీక్షిన్మహారాజా! ఒకానొక పర్వదినమున భయంకరమైన సుడిగాలులు వీచెను. తీవ్రముగా దుమ్ములు చెలరేగెను. అంతటను దుర్గంధములు వ్యాపించెను.
*79.2 (రెండవ శ్లోకము)*
*తతోఽమేధ్యమయం వర్షం బల్వలేన వినిర్మితమ్|*
*అభవద్యజ్ఞశాలాయాం సోఽన్వదృశ్యత శూలధృక్॥11561॥*
పిమ్మట బల్వలుడు యజ్ఞశాలయందు మలమూత్రాది అపవిత్ర పదార్థములను వర్షించెను. అనంతరము అతడు శూలమును చేబూని కనబడెను.
*79.3 (మూడవ శ్లోకము)*
*తం విలోక్య బృహత్కాయం భిన్నాంజనచయోపమమ్|*
*తప్తతామ్రశిఖాశ్మశ్రుం దంష్ట్రోగ్రభ్రుకుటీముఖమ్॥11562॥*
ఆ బల్వలుడు ముక్కలైన నల్లని కాటుక కొండవలె మహాకాయమును కలిగియుండెను. అతని కేశములు, మీసములు కాచబడిన రాగిరంగులో ఉండెను. అతని ముఖము భయంకరమైన కోఱలతో, బొమముడులతో ఒప్పుచుండెను.
*79.4 (నాలుగవ శ్లోకము)*
*సస్మార ముసలం రామః పరసైన్యవిదారణమ్|*
*హలం చ దైత్యదమనం తే తూర్ణముపతస్థతుః॥11563॥*
అతనిని చూచినవెంటనే బలరాముడు శత్రుసైన్యములను చీల్చి చెండాడగల ముసలాయుధమును, దైత్యులను హతమార్చుటలో సమర్థమైన హలాయుధమును స్మరించెను. అవి క్షణములో ఆయనను చేరెను.
*79.5 (ఐదవ శ్లోకము)*
*తమాకృష్య హలాగ్రేణ బల్వలం గగనేచరమ్|*
*ముసలేనాహనత్క్రుద్ధో మూర్ధ్ని బ్రహ్మద్రుహం బలః॥1564॥*
అప్పుడు బ్రహ్మద్రోహియగు ఆ బిల్వలాసురుడు ఆకాశమున సంచరించుచుండగా చూచి బలదేవుడు మిగుల క్రుద్ధుడై అతనిని తన హలాగ్రముచే లాగి, అతని మూర్ధమపై (మాడుపై) ముసలాయుధమతో బలముగా మోదెను.
*79.6 (ఆరవ శ్లోకము)*
*సోఽపతద్భువి నిర్భిన్నలలాటోఽసృక్సముత్సృజన్|*
.
*ముంచన్నార్తస్వరం శైలో యథా వజ్రహతోఽరుణః॥11565॥*
ఆ దెబ్బతో బల్వలుని నొసలు ముక్కలైపోయెను. అప్పుడు అతడు నోట రక్తము గ్రక్కుచు, ఆర్తనాదములొనర్చుచు, వజ్రాయుధ ప్రహారమునకు దెబ్బతిని, గైరికాది ధాతువులచే ఎర్రబారియున్న కొండవలె నేలపై పడిపోయెను.
*79.7 (ఏడవ శ్లోకము)*
*సంస్తుత్య మునయో రామం ప్రయుజ్యావితథాశిషః|*
*అభ్యషించన్మహాభాగా వృత్రఘ్నం విబుధా యథా॥11566॥*
*79.8 (ఎనిమిదవ శ్లోకము)*
*వైజయంతీం దదుర్మాలాం శ్రీధామామ్లానపంకజామ్|*
*రామాయ వాససీ దివ్యే దివ్యాన్యాభరణాని చ॥11567॥*
పిమ్మట మహాత్ములు, నైమిశారణ్యవాసులు ఐన మునీశ్వరులు బలరాముని స్తుతించి, దేవతలు ఇంద్రునకువలె, ఆ మహానుభావునకు అభిషేకమొనర్చిరి, శుభాశీస్సులనొసంగిరి. ఇంకను ఆ మహర్షులు వాడిపోని కమలములతో ఒప్పారుచుండెడి వైజయంతీమాలను, దివ్యములైన రెంఢు వస్త్రములను, అమూల్యములగు ఆభరణములను ఆ బలదేవునకు కానుకలుగా సమర్పించిరి
(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి దశమ స్కంధములోని ఉత్తరార్ధమునందలి డెబ్బది తొమ్మిదవ అధ్యాయము ఇంకను కొనసాగును)
🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*
7702090319, 9505813235
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి