*పద్మావతీ శ్రీనివాసం*
అలిమేలుమంగమ్మకి అలసటగా అనిపించింది. మగతకళ్ళను నలుపుకోని, *ఇంకా రాడేం నా నామాలస్వామి* అంటూ పలవరించింది. ఆ రోజు శుక్రవారం కావటంతో, ఆమెకీ భక్తుల తాకిడి ఎక్కువగానేవుంది. నిద్ర ముంచుకొస్తోంది. అయినా మునుపు ఏండుకొండలవాడు వచ్చినప్పుడు శుక్రవారం తప్పక వస్తానని చేసిన ప్రమాణం గుర్తుంది.ఎందుకే ఈ ఎదురుచూపులు.
బద్దకంగా లేచి నాలుగు అడుగులు వేసి గుమ్మందాకా వచ్చింది ఆ తల్లి. కనుచూపు సాగినంతవరకు పరికించి ఏడుకొండలవైపు చూసింది. ఏముంది... ఆయన జాడ లేదు సరికదా, ఇసుకేస్తే రాలనట్లు జనం కనిపించారు. ఇంకా వస్తున్నారు.. బస్సుల్లో, కార్లలో, కాలినడకన.. జనం జనం జనం. ఒక పక్క ఒక గుంపు *గోవిందా.. గోవిందా* అని అరిస్తే, అటువైపు వున్నాడేమో అని చూసింది. ఇంతలో మరోవైపు *ఏడుకొండలవాడా వేంకటరమణా...* అని మరో భక్తసమూహం కేకపెడితే, పోనీ అటువైపు కానీ వెళ్ళాడా అని చూసింది. ఎక్కడా ఆయన జాడే లేదు.
అలిమేలుమంగమ్మ మరికాస్త పరికించి, తిరుమల కొండపైకి దృష్టి సారించింది.ఇంకా పవళింపు సేవకి టికెట్లు ఇస్తున్నారు. *నారాయణా... ఇంకా సేవలు వున్నాయా? భక్తపక్షపాతం కాకపోతే ఎప్పుడూ వాళ్ళ సేవలేకానీ, మిమ్మల్ని సేవించి తరించే అవకాశం నాకు ఇవ్వవు కదా?* అంటూ నిట్టూర్చింది. చేసేదిలేక భారంగా అడుగులేసుకుంటూ లోపలికి వచ్చింది. ఆమె శ్రీవారు వస్తే అలంకరించాలనుకున్న వజ్రాలపతకం, పట్టుపీతాంబరం ఆపక్కనే తిరునామం తీర్చిదిద్దడానికి సర్దుకున్న సరంజామా అన్నింటినీ ఒక్కసారి చూసుకుంది.
*ఏం లాభం.. రావటమే ఆలస్యం... ఇంక వీటన్నింటికీ తీరికేది? అసలు ఆయన సక్రమంగా భోజనం చేసి ఎన్నాళ్ళైందో..* అనుకున్నది. ఆ ఆలోచన రాగానే, ఆయన కోసం ఏర్పాటు చేసిన భోజనాల సంగతి గుర్తొచ్చింది. *అయ్యో గోవిందా... అన్నీ చల్లంగా చల్లారిపోయి వుంటాయి...* అంటూ ఒక్కక్క పాత్రపైన మూత తీసి చూసింది. పులిహోర, చక్కర పొంగలి, దద్దోజనం, పాయసం ఇవికాక సాధకాలు, భక్ష్యాలు అన్నీ స్వహస్తాలుతో ప్రేమ రంగరించి మరీ చేసింది ఆ తల్లి. *అలిసిపోయి వస్తాడు... ఇక రుచిపచి కూడా తెలియదైపోయే... ఇంకా అందులో రంగరించిన ప్రేమని ఎక్కడ గుర్తిస్తాడు?* అనుకుంది పద్మావతి.
ఆ వంటకాల సువాసనలు ఆఘ్రాణించిన తరువాత అమ్మ కడుపులో ఆకలి రెండింతలైంది. *మధుసూధనా... త్వరగా రావయ్యా స్వామీ...* అంటూ చనువుగా అంది అక్కడే కూర్చుంటూ. *అంజనాద్రి వరకైనా వచ్చాడో లేక ఇంకా మాడవీధులైనా దాటలేదో...* అనుకుంటూ, ఆలోచిస్తూ క్రమంగా నిద్రలోకి జారుకుంది ఆ అన్నులమిన్న.
స్వామి పరుగులమీద వున్నాడు. అప్పుడెప్పుడో గజేంద్రుడు పిలిచినప్పుడు ఇలా పరిగెత్తాడు. ఈ మధ్య దాదాపు ప్రతిరోజూ ఇదే జరుగుతోంది.అప్పుడన్నా నయం, వచ్చిన దారి సులువైన గగనమార్గం... వద్దన్నా వెంటపరుగెత్తిన పరివారం. మరి ఇప్పుడో... కఠినమైన గుట్టలు, రాళ్ళు నిండిన కొండ దారి. ఇక పరివారమా? అంతా గుళ్ళోనే జోగుతున్నారు. పైగా స్వామీ వెళ్ళేది దేవేరి దగ్గరకేనని వాళ్ళకీ తెలుసు. అందుకే వెంట వస్తామని కూడా అనరు.
*పోనీ నేను రానా స్వామీ* అంది కౌముది అనే గద నిద్రకళ్ళతోనే.
*నువ్వొస్తే నాకు మోత బరువు తప్ప ఉపయోగం ఏముంది? ఆ గరుత్మంతుడు వస్తే ఉపయోగం కానీ* అన్నాడు ఒక మూల నిద్రపోతున్న గరుత్మంతుణ్ణి చూసి.
*పాపం అలసిపోయాడు స్వామీ* అంది కౌముది.
తప్పేదేముంది. దేవేరికి ఇచ్చిన మాట... ఆ మాట జవదాటి అలమేలుకి అలక తెస్తే ఆ అలక తీర్చేందుకు ఎన్ని పారిజాతాలు కావాలో, ఏమేమి సేవలు చెయ్యాలో.
*సరే నేను బయలుదేరుతున్నా... గుడి జాగ్రత్త...* అన్నాడు ద్వారపాలకులని చూస్తూ.
*అలాగే స్వామీ* అన్నారు జయవిజయులు ద్వారబంధం పక్కనే కూలబడుతూ.
స్వామి వడివడిగా నడవసాగాడు.
పద్మావతీవల్లభుడు తిరుచానూరులో గుడికి చేరేసరికి అంతా చీకట్లు కమ్ముకున్నాయి. దేదీప్యమానమైన వెలుగులతో, అంతకు రెండింతలు వెలిగే చంద్రబింబంలాంటి ముఖంతో అలుమేలుమంగ ఎదురొస్తుందని వూహించిన శ్రీనివాసుడు హతాసుడయ్యాడు.
*ఈ చీకట్లు కారణం దేవేరి అలక కాదుకదా?* అంటూ సందేహించాడు. అడుగులు వడివడిగా వేస్తూ, గుడి గడపలు దూకుతూ లోపలికి అడుగుపెట్టాడు. వెంకటేశ్వర పట్టపురాణి కఠినమైన రాతిపై వళ్ళు తెలియక నిద్రపోతోంది. ఆయన రాకతో పాటే లోపలికి ప్రవేశించిన సుగంధ వీచికలను ఆఘ్రాణించి చటుక్కున లేచి కూర్చున్నది అలుమేలుమంగమ్మ.
*వచ్చారా స్వామీ... ఏమిటింత ఆలస్యం? చూడండి మీకోసం వండినవన్నీ చల్లారిపోయాయి...* అంది ఆమె నిద్రతో చదిరిన సింధూరాన్ని సర్దుకుంటూ.
*వాటి సంగతి సరే... ముందు కాస్త స్థిమిత పడనీ..* అంటూ అక్కడే వున్న ఒక రాతి స్థంభాన్ని ఆనుకొని కూర్చున్నాడు దేవదేవుడు.
*అయ్యో... అక్కడ కూర్చున్నారేమండీ... అవునులే పగలంతే నిలబడే వుంటారయ్యే... కాళ్ళు నొప్పులు పుట్టాయేమో...* అంటూ పాంకోళ్ళను తొలగించింది.
*పైగా నీ కోసం పరుగులుపెట్టి వచ్చాను కదా...* అన్నాడు ఆయన. ఆమె తన కోమల హస్తాలతో సుతారంగా ఆయన పాదాలను నొక్కజూసింది.
శ్రీనివాసుడు ఆమెను వారించి – *వద్దు దేవీ, కొత్త పట్టుబట్టలు కట్టారు, అవి కొంచెం గరుకుగా వున్నాయి, నీ చేతులు కందేనేమో..* అన్నాడు.
జలజాక్షి మనోహరంగా నవ్వి – *ఇదంతా ప్రేమే.* అంది సిగ్గుపడుతూ. శ్రీనివాసుడూ నవ్వాడు. ఆలయమంతా వెలుగు పరుచుకుంది.
ఇంతలో గుమ్మం దగ్గర అలికిడి.. *ఎవరదీ.?* అన్నాడు గోవిందుడు. – *నేను చూస్తానుండండి... ఇంత రాత్రివేళ ఎవరో..* అంటూ గబగబా గర్భాలయం వెలుపలికి వచ్చింది ఆమె. ఎవరో నలుగురు సాధువులు.
*ఏమిటయ్యా ఇంత రాత్రివేళ?* అంది కోపంగా.
*నీకు తెలియనిదేముంది తల్లీ.. పైన స్వామివారి దర్శనం దుర్లభమైపోతోంది...క్షణకాల దర్శనం.. చూసినా చూడనట్టే వుంటోంది...* *ఒక్కసారి తనివితీరా చూద్దామని సాయంత్రం నుంచీ ఇక్కడే వేచి వున్నాము.* అన్నాడొక సాధువు భక్తిగా.
*ఓరి అసాధ్యులారా... ఇక్కడికీ దాపురించారా? మాకిద్దరికీ ఏకాంతమనేది ఒకటి వుండనిస్తారా లేదా?* అంది నిష్టూరంగా.
*తప్పే అమ్మా... కానీ ఏం చెయ్యగలం, స్వామివారితో నిముషం గడపాలంటేనే ఎంతో డబ్బు కావాలి... సాధువులం.. సామాన్యులం.. మా దగ్గర అంతంత డబ్బు ఎక్కడ వుంటుంది..* అంటూ ప్రాధేయపడుతూ నమస్కరించారు.
*మరి... ఆయనేమన్నా సామాన్యుడా... కాసులులేనిది వడ్డీకాసులవాడు ఎలా కనిపిస్తాడు...* అంటూ వాళ్లని పంపించే ప్రయత్నంలో వుండగా, వారి ముఖంలో కనిపించిన భక్తితాదాత్మత చూసి ఆగిపోయింది. వెనకకు తిరిగి చూస్తే వెనకే వెంకటేశ్వరుడు.
*దేవదేవా... ఆపద్భాందవా... మీ దర్శనం కోరిన ఈ అల్పులకు సతీసమేతంగా దర్శనమిచ్చావా స్వామీ... గోవిందా.. గోవిందా..* అంటూ నమస్కరించారు. స్వామి చిరునవ్వు నవ్వి, అభయహస్తం చూపించారు.
*సరే.. చూశారుగా.. ఇక అష్టోత్తరనామాలు చదవక కదలండి... లేదంటే తెల్లారిపోగలదు..* అంటూ స్వామి హస్తాన్ని అందుకోని లోపలికి నడిచింది పద్మావతి.
*ఏమిటి స్వామీ మీరు... నేను పంపిస్తున్నానా... అసలు మీరు ఇంట్లో లేరని చెప్పాలనుకుంటుంటే ఇంతలోనే మీరు వచ్చి నిలబడ్డారు...*
*పోనీలే దేవీ, పాపం సాధువులు..*
*బాగానే వుంది... నేను కాబట్టి సరిపోయింది... ఒకప్పుడు మీరిలాగే సాధువని, ఋషి అనీ ఒకాయన కాళ్ళుపడితే లక్ష్మీదేవి ఏం చేసిందో గుర్తులేదా?* అంది అటువైపు తిరుగుతూ.
*అది లక్ష్మి, ఇది పద్మావతి... అది తెలుసు కనుకే ఇంత ధైర్యం..* అన్నాడు స్వామి. ఆమె ఆ మాటకు ఆమె సంతోషపడి, ఆయన వైపు తిరుగుతూ –
*అయ్యో స్వామీ... మాటల్లో పడి మీ భోజనం సంగతే మర్చిపోయాను... రండి తిందురుగానీ..* అంది.
*నీకు చెప్పనేలేదు కదూ పద్మా... నా భోజనం తిరుమలలోనే అయ్యింది... ఇంత రాత్రివేళ తింటే కష్టమనీ అక్కడే కానిచ్చాను..* అంటూ పొట్ట నెమురుకున్నాడు గోవిందుడు.
*అంతేలెండి... ఇక్కడ ఇంతింత నెయ్యిపోసి మీకిష్టమని చక్కరపొంగలి, పాయసాలు చేస్తే ఇవి మీకెందుకు నచ్చుతాయి... ఆ పైన మిషన్లు చేసిన లడ్లు తిని వస్తారు..* అంది ఆమె కోపంగా. తిరుమలేశునికి తిరిగి సమాధానం చెప్పడనికి ఏ సాకు దొరకలేదు. ఇంతలోనే అలుమేలుమంగ దగ్గరగా వచ్చి –
*ఇదంతా ఎందుకు స్వామీ... మీరు సంపాదనలో పడ్డ తరువాత... క్షణం తీరిక దొరుకుతోందా... మనం ఏకాంతంగా అలా వ్యాహ్యాళికి వెళ్ళి ఎన్నిరోజులైంది? కనీసం కడుపారా సమయానికి భోజనం చేసి ఎన్ని రోజులైంది? చెప్పండి* అంది కించిత్ బాధపడుతూ.
*నువ్వు చెప్పిన మాటా నిజమే మంగా... నాడు వకుళమ్మ ఇంటిలో పేదవాడిగా వున్నప్పుడు పొందిన సుఖం, సంతోషం, ఆనందం మళ్ళీ పొందలేదు.* అన్నాడాయన సాలోచనగా.
*మనం మళ్ళీ ఆ రోజులకి వెళ్ళిపోదామండీ...* అంది ఆమె ఆశగా.
*ఆ రోజు మీ నాన్న ఆకాశరాజు డబ్బులేని నన్ను కాదంటాడనే కదా ఈ ఝంజాటంలో పడ్డాను... ఇప్పుడు మనం వద్దనుకున్నా వదులుకోలేను... వదులుకున్న మరుక్షణం కుబేరుడు తగులుకుంటాడు..*
*హూ.. ఇంకా తీరలేదా ఆ అప్పు...* అంది ఆమె కోపంగా.
*నేనేమైనా సొంతానికి వాడుకున్నానా... మన పెళ్ళికి చేసినదే కదా..* నచ్చచెప్పబోయాడు వడ్డికాసులవాడు.
*ఎన్ని యుగాలనాటి పెళ్ళి... ఎన్ని లక్షలకోట్లమంది నిలువుదోపిడీలు... ఇంకా తీరలేదే... ఈ సుడిగుండం నుంచి బయటపడి మనం సుఖంగా వుండే రోజే లేదా... కలియుగ దైవమై కూడా ఈ సమస్యకు పరిష్కారం కనిపెట్టలేరా స్వామీ....* అంది ఆమె.
*నువ్వే చెప్పావుగా కలియుగదైవాన్నని, ఈ కలియుగ ధర్మం పాటించక తప్పుతుందా... ఈ యుగంలో వుండేదంతా మానవులు... మానవుడే సర్వశక్తిమంతుడు... అందువల్ల ఈ సమస్యకి పరిష్కారం కనిపెట్టే బాధ్యతని కూడా మానవులకే వదిలేశాను.. ఆ కారణంగానే వారందరినీ ఇలాంటి చట్రంలోనే ఇరికించాను... రోజల్లా చాకిరీ చెయ్యాల్సిన కార్పొరేట్ వుద్యోగాలు ఇచ్చాను, ఎంత కట్టినా తీరని హోం లోన్, పర్సనల్ లోన్, క్రెడిట్ కార్డ్ ఇచ్చాను... ఎక్కడైనా ఏ ఒక్కరైనా ఈ అప్పుల సుడిగుండాలని దాటి బయటపడతాడేమోనని ఆశగా చూస్తున్నాను... అంతా చేసిన అప్పుల కిస్తు కట్టడానికి చాకిరీలు చేస్తున్నారే తప్ప దాన్ని దాటి ఒక్కడైనా రావటంలేదు... అంతా మనలాగే ఇబ్బంది పడుతున్నారే తప్ప పరిష్కారం కనుక్కోలేక పోయారు...* అని ఆయన చెప్తుండగా కొండపై నుంచి మేలుకొలుపుగా పాడే సుప్రభాతం వినపడింది.
ఇక తప్పదన్నట్లు శ్రీనివాసుడు అలిపిరి వైపు అడుగులేశాడు. అలుమేలుమంగ నిరాశగా చూసింది.
(ఆదివారం ఆంధ్రజ్యోతి, 11 డిసెంబర్ 2011)
(ఈ వ్యాస రచయిత ఎవరో కానీ చాలా బాగా వచ్చిందీ వ్యాసము)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి