🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹
. *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*
. ♦️ *ఆర్య చాణక్య*♦️
*పార్ట్ - 82*
"ఇప్పుడు ఈత ఏమిటి ? దాని అమ్మమ్మ కూడా వచ్చేస్తుంది" అని చాణక్యుడు అంటుంటే అప్పటిదాకా నవ్వుని బిగబట్టుకున్న చంద్రగుప్తుడు పక్కున నవ్వేస్తూ "పాపం మన భటులు మీ శిష్యుడిని ఒడ్డుకి రానివ్వరేమో ? అర్ధరాత్రి నదిలో మునిగి ఏమైపోతాడో..." అంటుంటే చాణక్యుడు నవ్వి "ఆ భటులు కూడా నా శిష్యులే. ఏంచెయ్యాలో వాళ్ళకి సూచించాను" అని చెప్పాడు.
"ఆ ! కావలివాళ్ళు కూడా మీ శిష్యులేనా ?" అని చంద్రుడు విస్తుబోతే..
చాణక్యుడు నవ్వి "మరి ...? ఎవరు మిత్రులో, ఎవరు శత్రువులో తెలియని స్థితిలో నీ రక్షణ ముక్కూ మొహం ఎరుగని వాళ్ళకి అప్పగిస్తానా ?" అని ఎదురు ప్రశ్నించాడు.
చాణక్యుడు తన రక్షణ కోసం పడుతున్న శ్రమకి, తన పట్ల చూపిస్తున్న వాత్సల్యానికి చంద్రుని నేత్రాల్లో అశ్రుబిందువులు గిర్రున తిరిగాయి.
అంతలో... "గురుదేవా ... ! గురుదేవా ....!" అంటూ నీళ్లు కారుతున్న దుస్తులలో సిద్ధార్థకుడు హడావిడిగా లోపలికి వచ్చి "ఆ రాక్షసామాత్యుడు మగధ సింహాసనం ఎక్కడానికి సర్వార్ధసిద్ధిని ఒప్పించాడు" అని చెప్పాడు.
"సర్వార్తసిద్ది అంటే...?" అనుమానంగా ప్రశ్నించాడు చంద్రుడు.
"నందుల తండ్రి మహాపద్మానందుడే... మీ తండ్రి మహానందుల వారిని అగ్ని ప్రమాదంలో తన కుమారులు అమానుషంగా కడతేర్చారని విని, జీవితం మీద వ్యామోహం నశించి సన్యాసం తీసుకుని సర్వార్ధ సిద్ధిగా తపస్సు చేసుకుంటున్నాడు" అని చెప్పి, శిష్యుని వైపు తిరిగి "అతనికి ఎంత లేదన్నా డెబ్బైయెళ్ళ పైనే వుంటుంది వయస్సు.. ఆ వయస్సులో మళ్ళీ రాజ్యాధికారానికి ఒప్పుకున్నాడా ?" అడిగాడు చాణుక్యుడు.
సిద్ధార్థకుడు నవ్వి "అతను ఒప్పుకోలేదు. రాక్షసుడే బ్రతిమాలి బామాలీ ఎలాగో ఒప్పించాడు. చాణక్య శపథాన్ని వమ్ము చెయ్యడమే తన లక్ష్యమన్నాడు. నందుల హత్యకి ప్రతీకారం తీర్చుకోవడమే తన జీవితాశయం అని చెప్పి, ఏడ్చి, ఒప్పించాడు" అని చెప్పాడు.
"పాపం... సర్వార్థ సిద్ధి .... మహానందుల వారికి చేసిన ద్రోహానికి ఫలితంగా, పాప పరిహారార్థం వానప్రస్థాశ్రమంలో తపస్సు చేసుకుంటూ 'కృష్ణారామా' అనుకుంటూ పోవాల్సినవాడు ... ప్చ్... రాక్షస నామం జపిస్తూ పోతాడు కాబోలు..." అనుకున్నాడు చాణుక్యుడు జనాంతికంగా.
ఆ మాట విని ఉలిక్కిపడ్డాడు చంద్రుడు. అంతలో శార్జరవుడు తడి బట్టలతో హడావిడిగా వస్తూ "గురువుగారూ...! ఈత కొట్టడం వచ్చేసింది. ఇప్పుడు సముద్రాన్ని కూడా ఎదురీదగలను. చెప్పండి... ఆజ్ఞాపించండి. ఏం చెయ్యమంటారు..." అన్నాడు ఉత్సాహంగా.
"ఆ తడి బట్టలు మార్చుకొని అఘోరించు. లేకపోతే జలుబు చేస్తుంది" అంటూ విశ్రాంతి కోసం తన గదిలోకి వెళ్లిపోయాడు చాణక్యుడు.
"ఆ..... ! " అంటూ ఆశ్చర్యంతో నోరు తెరిచారు శార్జరవుడు.
మర్నాటి ఉదయం చాణక్య చంద్రగుప్తులు స్నానాధికాలు ముగించుకుని ఫలహారాలకి ఉపక్రమించబోతుండగా సేవకుడు ఒకడు వచ్చి "జయము, జయము.. చాణక్యులవారికి ! అమాత్యా రాక్షసుల వారు ఈ మధురఫలాలను చంద్రగుప్తుల వారికి ప్రత్యేకంగా పంపించారు. వారు త్వరలో దర్శనం చేసుకుంటామని చెప్పమన్నారు" అని మనవి చేసుకున్నాడు.
చాణక్యుడు తలపంకించి "చంద్రగుప్తుల వారికోసం... ప్రత్యేకంగా ... సరే ..." అన్నాడు. సేవకుడు నమస్కరించి నిష్క్రమించాడు. చాణక్యుడు అలా కొన్ని పదాలు విడగొట్టి మాట్లాడడం వెనక ఏదో అంతరార్థం ఉందని భావించాడు చంద్రుడు.
అంతలో మరో సేవకుడు ఫలాలతో వచ్చి "రాజమాత మురాదేవి చాణక్య చంద్రగుప్త కోసం పంపించారు" అంటూ వాటిని సమర్పించి నిష్క్రమించాడు. పక్కనే ఉన్న సిద్ధార్థకుడు ఆశ్చర్యంగా ఆ వింత చూస్తున్నాడు.
చాణక్యుడు రెండు పళ్లేల్లో ఉన్న ఫలాలను గమనించాడు. ఒకే రకమైన మామిడి పళ్లు. పళ్ళములే తేడా.
చాణక్యుడు తలెత్తి సిద్ధార్థకుని వైపు చూసి "అటువి యిటూ, యిటువి అటూ మార్చు" అని ఆజ్ఞాపించాడు. సిద్ధార్థకుడు పళ్లని మార్చి వేశాడు. ఇప్పుడు రాక్షసుడు పంపిన పళ్లెంలో మురాదేవి పంపిన ఫలాలు, మురాదేవి పంపిన పళ్లెంలో రాక్షసుడు పంపిన ఫలాలు తారుమారయ్యాయి.
చాణక్యుడు అదోలా సిద్ధార్థకుని వైపు చూసి "ఏం చెయ్యాలో అర్థం అయిందా ?" అడిగాడు. సిద్దార్థకుడు నవ్వి తలూపి రాక్షసుడు పంపిన ఫలాలతో వెళ్ళిపోయాడు.
"ఏమిటి ఇదంతా ?" అడిగాడు చంద్రుడు.
చాణక్యుడు నవ్వి "ఏమిటో... కాసేపు ఆగితే తెలుస్తుంది..." అన్నాడు నర్మగర్భంగా.
(ఇంకా ఉంది)...🙏
*సేకరణ:- శ్రీ రమణమూర్తి గారి వాట్సాప్ పోస్ట్.*
🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి