:
*విష్ణు సహస్ర నామం విశిష్టత ఏమిటి?*
కురుక్షేత్రం యుద్ధం తరువాత, ధర్మరాజు తన తమ్ముళ్ళతో కలిసి అంపశయ్య మీద ఉన్న భీష్మ పితామహుని వద్దకి వచ్చి ఎన్నో ధర్మాలు, శాస్త్రాలు తెలుసుకున్నాడు. అలా తెలుసుకుంటున్నప్పుడే, 'ఏ జీవి అయినా ఈ సంసార చక్రం నుంచీ తప్పించుకోవడానికి తెలుసుకోవాల్సిన తత్త్వం ఏది' అని భీష్ముణ్ణి ధర్మరాజు అడగగా ఆయన ఉపదేశించిన స్తోత్రమే విష్ణు సహస్రనామ స్తోత్రం. అన్ని ధర్మాలకూ మూలమైన ఆ శ్రీమహావిష్ణువుని అనంతమైన నామాలతో కీర్తిస్తే ఆయన సన్నిధికి చేరుకోవడం అతి సులభమని వివరించాడు.
శ్రీమన్నారాయణుని ద్వారా ఎన్నో గొప్ప అనుభవాలను పొందిన ఋషులు తాము దర్శించిన రూపాలను ఈ నామాలుగా గానం చేశారట. అలాంటి ఈ నామాల ద్వారా మనం కూడా ఆ శ్రీహరి అందించే కళ్యాణ గుణాలను అనుభవించవచ్చు అని పెద్దలు అంటారు.
విష్ణు సహస్ర నామ స్తోత్ర ఉత్తర పీఠికలో ఈ స్తోత్రం పఠించడం ద్వార మనం పొందే ఫలశృతిని చక్కగా వివరించారు. ఈ స్తోత్రాన్ని భక్తి, శ్రద్ధలతో నిత్యం పారాయణ చేసేవారు అధోలోకాలను దర్శించే అవసరం లేకుండా, తమ ఆత్మ ఊర్ధ్వలోకాల వైపు మళ్ళుతుందట. అలాగే ఇహము నందు ధర్మ, అర్ధ, కామములు పొంది, అంత్యమున మోక్షం పొందుతారట. రోగపీడ, భయం, బాధ, అసూయ, దురాశ, కపటం, అజ్ఞానం వంటివి దరిచేరవట. ఈ స్తోత్రాన్ని విశ్వాసంతో గానం చేసేవారికి ఎల్లప్పుడూ ఆ పర్మాత్ముని మీదే మనస్సు లగ్నమై, ఆయన మీద ఏకాగ్రత కుదురుతుంది.
ముందు లక్ష్మీ అష్టోత్తర స్తోత్రం చదివిన తరువాత, ఈ స్తోత్రాన్ని పారాయణ చేయడం వల్ల ఆ జగన్మాత ఇంకా సంతోషిస్తుంది. అలాగే ఈ స్తోత్రంలో ఒక్కో నక్షత్ర పాదంలో పుట్టినవారికి ఒక్కో శ్లోకం ఉంటుంది. దానిని మంత్రంలాగా పారాయణ చేయడం కూడా శుభ ఫలితలను ఇస్తుంది అంటారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి