ॐ ఆషాఢ మాసం - ప్రత్యేకత - IV
చాతుర్మాస దీక్ష - ఆహారం
(డా॥పాటిల్ నారాయణరెడ్డి గారి "ఆచారాలు - శాస్త్రీయత" గ్రంథం ఆధారంగా)
వర్ష ఋతువు ప్రారంభమయ్యే కాలాన ఎక్కువ ఉష్ణమగు - ఉష్ణం చేసే ఆహారం వర్జించాలి.
చాతుర్మాస్య వ్రతం పాటించే ఆషాడ శుద్ధ ఏకాదశి నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకూ
- మొదటి నెలలో కూరలు,
- రెండవ నెలలో పెరుగు,
- మూడవ నెలలో పాలు,
- నాల్గవ మాసం లో ద్విదళ బీజములు (పప్పు దినుసులు) తినకూడదు.
1. ఆషాఢ మాసాన కూరగాయలు - ఆకుకూరలు ఎక్కువగా పండి, లభిస్తాయి. ఇవి భూమియందలి ఉష్ణ సహాయంతో పెరుగుతాయి.
ఆషాఢ మాసానికి ముందు శిశిర, వసంత, గ్రీష్మ ఋతువులందు భూమియందు ఉష్ణం ఎక్కువగా కేంద్రీకరించి ఉంటుంది.
వర్షాకాలం ప్రారంభమయ్యేటప్పడు, భూమికి నీరు చేరి, లోపలి అత్యుష్ణం సస్యాల మూలకంగా విసర్జింపబడుతుంది.
ఈ సస్యాలనుంచీ లభించే కాయగూరలు, ఆకుకూరలు ఈ నెలలో సేవిస్తే, శరీరము నందున్న ఉష్ణము తక్కువగుటకు అవకాశము లభించదు.
మనం సేవించే ఆహార దోషాల మూలకంగానే అనేక రోగాలు వస్తాయి.
అందుచే ఈ కాలాన భూమి నుంచి బహిర్గతమయ్యే ఉష్ణం శాక పత్రాలయందు ఎక్కువగా నిక్షిప్తమై ఉండే కారణాన, ఈ కాలంలో వాటిని సేవించకూడదన్నారు.
2. శ్రావణ శుక్ల ఏకాదశి నుండి ఒక నెల,
దధి అంటే పెరుగు తినకూడదన్నారు.
ఇది ఉష్ణ దీపక గుణాలు కలిగియుంది. అగ్నివర్ధకము.
ఈ నెలలో దీనిని వాడితే, ఉష్ణం మరింత అధికమవుతుంది. కాబట్టి దీని బదులు మజ్జిగ వాడమన్నారు.
3. భాద్రపద శుక్ల ఏకాదశి నుంచీ ఆశ్వియుజ శుక్ల దశమి వరకూ క్షీరం అంటే పాలని సేవించవద్దన్నారు.
వర్షఋతువున గోవులకు ముఖ్య ఆహారమైన పచ్చగడ్డి ఈ మూడవ భాగంలో ఎక్కువగా విస్తారంగా పెరుగుతుంది.
ఈ క్రొత్త పచ్చగడ్డి భూమిలోని వేడితో కూడి ఉంటుంది. కీటకాదులతో కూడా ఉంటుంది.
ఈ గడ్డి తిన్న ఆవులు ఇచ్చే పాలయందు ఉష్ణాంశం ఉంటుంది. కొన్ని రకాల పచ్చగడ్డి తిన్న ఆవుల పాలు, వాసన రావడం కూడా సాధారణం.
ఈ నెలలో ఇటువంటి పాలు మానవుని ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపుతాయి. కాబట్టి ఈ నెలలో పాలు సేవించకూడదనే నియమం ఏర్పరచబడింది.
4. ఆశ్వియుజ శుక్ల ఏకాదశి
నుంచీ కార్తిక శుక్ల దశమి వరకూ ద్విదళ ధాన్యం (కంది, పెసర, సెనగ మొదలైనవి) తినకూడదన్నారు.
ఈ పప్పుదినుసులు కూడా ఇదే ఋతువులో ఎక్కువగా పండి, వాణిజ్యపరంగా అమ్మకానికి వస్తాయి.
నియమాల ఏర్పాటు
* కాలానుగుణంగా, ఏ ఏ నెలలో భూమినుండీ, ఏ ఏ పంటలు అవీ వస్తాయో,
* వాటి ప్రభావం దేహంలో ఏ ఏ విధంగా పనిచేస్తుందో,
* వాతావరణంలో మార్పుకి, దేహానికి సంబంధించి ఏ ఆహారం తీసుకోవాలో
- ఇవన్నీ ఆరోగ్యంపై ఏ విధంగా పరిణమిస్తాయో, పరీక్షించి, మన మహర్షులు,
ఈ నియమాలను మనకు ముందు జాగ్రత్తగా ఏర్పాటు చేశారు.
ఈ నియమాలని పాటిద్దాం.
* పెద్దలిచ్చిన ఆరోగ్య సూత్రాల ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకుందాం.
* చాతుర్మాస్య దీక్షలో ఒక ప్రధాన అంశమైన - ఆరోగ్య లబ్ధిని పొందుదాం.
=x=x=x=
— రామాయణం శర్మ
భద్రాచలం
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి