2, జులై 2023, ఆదివారం

ఒకటి అక్కడ పెట్టిపో

 *🌹రాముడు సీతనెందుకు వదిలేసాడు?🌹*


                    *తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రిగారికి మరియు కంచి పరమాచార్యుల వారికి మధ్య జరిగిన సంభాషణ*


                *శాస్త్రి గారి తండ్రి గారు వ్రాసిన ఆ రామాయణం ఎందుకు గొప్పదో లోకానికి తెలియ జెప్పాలని అనుకున్నారు స్వామి వారు. శాస్త్రిగారిని ఇలా అడిగారు.*


                *”ఏమయ్యా రాముడు సీతమ్మ తల్లితో అగ్నిప్రవేశం చెయించాడు కదా. సీత అగ్నిపునీత అని తెలుసు కదా! ఇంత తెలిసిన తరువాత కూడా ఎవరో ఎక్కడో ఒక పౌరుడు ఏదో నింద చేసాడని సీతని పరిత్యజించడం న్యాయమా? సరే రాజారాముడు చిన్న అవమానం వచ్చినా ఆ పదవిలో కూర్చోవడానికి ఇష్టపడడు అందుకే పరిత్యజించాడు అని వాల్మీకి చెప్పాడు. ఎందరో కవులు కూడా అదే చెప్పారు. నేను ఎనభై రామాయణాలు (వాల్మీకి రామాయణం , కంబ రామాయణం, భాస్కర రామాయణం, హనుమద్ రామాయణం, ఆధ్యాత్మ రామాయణం, మొల్ల రామాయణం మొ||) చదివాను. ఒక్కొక్క కవి ఒక్కొక్కరకంగా చెప్పారు. మరి మీ నాన్న గారు ఈ విషయాన్ని ఎలా సమర్థించారు?” అని అడిగారు.*


                  *శాస్త్రి గారు ఆ ఘట్టం తీసి, ఇలా వివరణ ఇచ్చారు “రాముడు సీతమ్మ తల్లిని రాజు కాకముందు పెళ్ళి చేసుకున్నాడు. అప్పడు రాముడు రాజకుమారుడు అంతే. యుద్ధం తరువాత సీత అగ్నిపునీత అని లోకానికి చాటి పట్టాభిషేకం చేసుకున్నాడు. ఒకనాడు మంత్రులలో ప్రభువుకు నీతి పాఠం చెప్పే మంత్రి వచ్చి రాముడు ఏకాంతంలో ఉండగా*


                   *“ప్రభూ! మీరు వైకుంఠంలో ఉన్న శ్రీమన్నారాయణుడు. లోకానికి ధర్మం నేర్పడానికి రామచంద్రమూర్తిగా వచ్చి నరుడిగా ఈ భూమిపై నడుస్తున్నారు. ఇటువంటి మీరు ప్రభువు కాకముందు సీతమ్మను భార్యగా ఉంచుకున్నారు. ధర్మానికి తప్పులేదు. ప్రభువయ్యాక సీతమ్మ భార్యగాఉండవచ్చా?” అని అడిగారు.*


             *“ఎందుకుండకూడదు?” అని అడిగారు రాములవారు. అందుకు మంత్రి, “ప్రభువు భూమిపతి. అంటే ఈ భూమికి భర్త. మరి అప్పుడు భూమాత తనయ సీతమ్మ మీకు ఏమవుతుంది? మీరు రాజారాముడయ్యాక మీరు ఏకపత్నీవ్రతుడు కాబట్టి భూమికి మాత్రమే భర్తగా ఉండాలి. మరి ఇప్పుడు ధర్మం నిలిచిందా?” అని అడిగాడు. ఉలిక్కిపడిన రాముడు కారణం చెప్తూ ధర్మం కోసమే సీతమ్మను అడవికి పంపించాడు రాముడు” అని చెప్పారండి మా నాన్న గారు అని అన్నారు.*


              *ఈ మాటలు విని పరమాచార్యస్వామి వారు పరవశించి పోయారు. ఇన్ని రామాయణాలు విన్నాను గాని ఇలా సమర్థించిన వాణ్ణి వినలేదు అని “ఆ పుస్తకాల సెట్టు ఒకటి అక్కడ పెట్టిపో” అన్నారు.*


*🌹   జయ జయ శంకర హర హర శంకర   🌹*


*🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹*

కామెంట్‌లు లేవు: