*లేట్ రిజిస్టర్*
*-డా.రాయారావు సూర్యప్రకాశ్ రావు*
విశ్వకార్యాలయంలో
ఉద్యోగిస్తున్న కొందరు
ఈ మధ్య
ఆలస్యంగా రావడం
ఆనవాయితీ చేసుకున్నారు
సంతకం పెట్టి
డ్యూటీ ఎగ్గొట్టడం
హాయిగా కునుకు తీయడం
అలవాటు చేసుకున్నారు
ఏప్రిల్లో రావలసిన మండుటెండయ్య
మేలోగానీ అడుగు పెట్టలేదు
హాజరు పట్టికలో సంతకం పెట్టగానే
విసనకర్రతో విసురుకుంటూ
ఎటో నిష్క్రమించాడు
జూన్ మొదటివారం
హాజరు వేస్కోవలసిన వానమ్మ
నాలుగోవారంలో పలకరించింది
తాపీగా పనిచేస్తోంది
డ్యూటీలో చేరీ చేరగానే
వాతావరణం చల్లగా ఉందని
టీ తాగేందుకు బైటికెళ్ళింది
పరుగులు పెడుతూ
రావలసిన మబ్బయ్య
కర్ణాటక సరిహద్దులోనే
చాలా రోజులు
హఠం వేసుకుని కూచున్నాడు
పేరుకు తగ్గట్టే
మబ్బుగా ఉన్నాడు
మెల్లిగా నడుస్తూ వచ్చి
హాజరు పట్టికలో
తీరిగ్గా సంతకం పెట్టాడు
చల్లదనం తగిలితే తప్ప
పని చేయడం కుదరదంటున్నాడు
గ్లోబలయ్యా!
వీళ్ళందరికీ
లేట్ రిజిస్టర్ పెట్టవల్సిందే!
తోక కత్తిరించి
సమయానికి
హాజరయ్యేలా చేయాల్సిందే!
*(2023 జూన్ 29 'నేటినిజం' దినపత్రికలో ప్రచురితం)*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి