అబద్దం - శిక్ష
శ్రీరామ నామాన్ని ప్రచారం చెయ్యడానికి, రాసే భాగ్యం కలిగించడానికి మహాస్వామి వారు ఒక ఉపాయం అలోచించారు. దాని ప్రకారం ఒక లక్ష సార్లు రామ నామాన్ని రాసిన వారికి బంగారు నాణెం, కుంకుమ ఇచ్చేవారు. మహస్వామి వారి నుండి బంగారు నాణెం తీసుకోవడం కోసం చలా మంది రామ నామాన్ని రాసి వారికి సమర్పించేవారు. చాలా మంది భక్తులు దర్శనానికి వచ్చేటప్పుడు వారు రాసిన పుస్తకాలను తీసుకుని వచ్చి మహాస్వామి వారికి సమర్పించి, బంగారు నాణాన్ని తీసుకునేవారు.
ఈ మంచి అలవాటు ఇంకా వ్యాప్తి చెందటం కోసం, లక్ష సార్లు రామ్ నామాన్ని రాయ్ లేని వాళ్ళు అందులో ఎనిమదవ వంతు అంటే 12,500 సార్లు రాస్తే ఒక వెండి నాణేన్ని బహూకరించేవారు. వారు అనుకున్న విధంగానే రామ నామం రాసే వారి సంఖ్య రోజురోజుకు బాగా పెరగసాగింది.
మహాస్వామి వారి యాత్రా సమయంలో కూడా వారి పరిచారకులు కొన్ని బంగారు వెండి నాణెములను వారితో పాటుగా తీసుకువెళ్ళేవారు. అలా ఒకసారి చెన్నై యాత్రలో సంస్కృత కళాశాలలో మహాస్వామి వారు దర్శనం ఇస్తున్నప్పుడు,
ఒక చిన్న అమ్మాయి వారి వద్దకు వచ్చి మహాస్వామి వారికి నమస్కరించి, తను రాసిన రామ నామ పుస్తకాన్ని అక్కడ ఉంచి “దయచేసి నాకు ఒక వెండి నాణెం ఇవ్వండి” అని అడిగింది.
మహాస్వామి వారు వెండి నాణేన్ని బహూకరించి నవ్వుతూ “రామ నామాన్ని సరిగ్గా రాసావా?” అని అడిగారు.
”అవును” అని చెప్పి ఆ అమ్మయి అక్కడినుండి పరిగెత్తింది. ఈ సంఘటన జరిగింది ఉదయం.
మధ్యాహ్నం అదే అమ్మాయి మహాస్వామి వారి ముందు ఏదో వెతుకుతున్న దానిలా అక్కడ ఇక్కడ వెతుకుతూ ఉంది. కొద్దిసేపటి తరువాత ఆ అమ్మయి కళ్ళు ఏడ్చి ఏడ్చి ఎర్రబడ్డాయి.
ఇదంతా చూసి మహాస్వామి వారు ఒక పరిచారకుణ్ణి పిలిచి ఆ అమ్మాయిని పిలవమన్నారు. ఆ పిల్ల మహాస్వామి వారి వద్దకు వచ్చి కళ్ళు తుడుచుకుంటూ వారి ముందు నిలబడింది.
“బంగారు తల్లీ, ఎందుకు ఏడుస్తున్నావ్? ఏమైనా పోగొట్టుకున్నావా?” ప్రేమ పూరిత మాటలతో ఆ అమ్మయిని అడిగారు. ”అవును, మీరు నాకు ప్రసాదంగా ఇచ్చిన వేడి నాణెం పోయింది.”
“నేను నిన్నొకటి అడుగుతాను ఏమి దాచకుండా నిజం చెప్పాలి. నువ్వు ఇచ్చిన పుస్తకంలో ఎన్ని సార్లు రామ నామాన్ని రాసావు?”
“నేను ఎనిమిది వేల ఐదువందల సార్లు రాసాను” అని చెప్పింది ఆ అమ్మాయి.
“ఓ అలాగా! నీకు తెలియదా? 12,500 సార్లు రాసిన వారికే వెండి నాణెం ఇస్తానని.”
అప్పుడు ఆ అమ్మాయి గట్టిగా ఏడుస్తూ, “నాకు తెలుసు పెరియావ నేను మీతో అబద్దమాడాను మీరు ఇచ్చే వెండి నాణేం కోసం. నేను చేసింది తప్పే నన్ను క్షమించండి.” అని భోరున విలపించింది.
వారి చుట్టూ ఉన్నవారు అనుకున్నరు ఇప్పుడు మహాస్వామి వారు ఆ పిల్ల తల్లి తండ్రులని పిలిచి దండించమని చెప్తారు అని. కాని ఆ అవ్యాజ కరుణా మూర్తి ఏమి చేసారో తెలుసా?
“ఈ చిన్న పిల్ల ఒక తప్పు చేసింది. దాన్ని పెద్దది చెయ్యకండి. ఇప్పుడు ఇక్కడున్న మీరందరూ ఇక్కడ కూర్చుని మిగిలిన 4000 సార్లు రామ నామాన్ని వ్రాయండి.” ఇది విన్న వెంటనే అక్కడున్న వారందరూ పులకించిపోయారు.
ఎందుకు? దానికి రెండు కారణాలు.
ఒకటి చిన్నవారి పై మహాస్వామి వారి అపారమైన కరుణని ప్రేమని క్షమాగుణాన్ని కనులారా చూడటం. రెండవది మహాస్వామి వారి సమక్షమంలో రామ నామం రాయగలిగే అదృష్టం కలగడం. తొదరగా రాయడం పూర్తి చేసి మహాస్వామి వారికి సమర్పించారు.
మహాస్వామి వారు ఆ పాపని పిలిచి “నేను ఇచ్చిన వెండి నాణెం పోయిందని దిగులుపడుతున్నావు కదూ. ఇప్పుడు నేను నీకు బంగారు నాణెం ఇస్తాను. జాగ్రత్తగా ఉంచుకో” అని ఆశీర్వదించి ఒక బంగారు నాణేన్ని ఇచ్చారు. ఆ అమ్మాయి చాలా సంతోషంతో దాన్ని కళ్ళకద్దుకుంది.
#KanchiParamacharyaVaibhavam #Paramacharya
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి