2, జులై 2023, ఆదివారం

సంభాషణల్లో సంవత్సరాల పేర్లు

 *పండితులసంభాషణల్లో తెలుగు సంవత్సరాల పేర్లు :*


తెలుగు సంవత్సరాల పేర్లు ప్రభవ, విభవ, శుక్ల, ప్రమోదూత … అని ఇలా 60 ఉంటాయి. పూర్వం పండితులు తమ చుట్టూ ఉన్న వారికి అర్ధం కాకుండా ఉండాలనో, అర్ధాలు తెలిస్తే చిన్నబుచ్చుకుంటారనో తెలియదు కానీ తమ సంభాషణల్లో కొన్ని పదాలకు బదులు ఆ అర్ధాలు వచ్చే సంవత్సరాల పేర్లు వాడేవారు. వాటిలో కొన్ని తిట్లూ, కొన్ని ప్రశంసలూ, అడపా దడపా విమర్శలూ కూడా ఉంటాయి. వాటి గురించి చెప్పుకుందాం సరదాకి.


*‘ ఒరే! వాడొట్టి ఇరవై ఐదూ, ఇరవై ఆరు రా’* అన్నాడంటే ‘వాడు గాడిద కొడుకు’ అని తిడుతున్నాడని అర్ధం. 25 వ సంవత్సరం పేరు ‘ఖర’ ( అంటే గాడిద). 26 వ సంవత్సరం పేరు నందన( అంటే కొడుకు).


*‘ నీ కొడుక్కేంట్రా ‘ఇరవై తొమ్మిది’ . గొప్పింటి సంబంధాలు వస్తాయి’* అంటే మన్మధుడని. 29 వ సంవత్సరం పేరు ‘మన్మధ’ 


*‘వాడికోసారి ‘నలభై’  జరిగినా తెలిసి రాలేదు’* అంటే ‘పరాభవం జరిగినా’ అని. 40 వ సంవత్సరం ‘ పరాభవ’


*‘వాడి కూతురికి సంబంధాలు రావడం కొంచెం కష్టంరా ‘ముప్పయి’ , ‘ముప్పై మూడు’ కదా! ‘* అన్నాడంటే ‘రూపవతి కాదని’ అర్ధం. 30 వ సంవత్సరం ‘దుర్ముఖి’ 33 వ సంవత్సరం ‘వికారి’


*‘ నీ ‘నలభై ఎనిమిది’ కి కారణమేంటో తెలుసుకోవచ్చా?’* 48 వ సంవత్సరం పేరు ‘ఆనంద’


*‘ వాడితో వాదనెందుకురా వాడో ‘యాభై అయిదు’* . అంటే బుద్ధిలేనివాడని అర్ధం. 55 వ సంవత్సరం ‘దుర్మతి’


 *‘అబ్బ వాళ్ళ పిల్లలతో వేగలేమండీ! అందరూ ‘నలభై ఒకటి’  లే'* అంటే కోతులూ కప్పలూ అని అర్ధం.41 వ సంవత్సరం ‘ప్లవంగ’


*‘ వాడసలే ‘ముప్పై ఎనిమిది’ జాగ్రత్తగా మాట్లాడు.* అంటే కొంచెం కోపిష్టి అని. 38 వ సంవత్సరం పేరు  ‘క్రోధి’

 

---- 😁 మాగంటి శ్రీనివాస్

కామెంట్‌లు లేవు: