31, జులై 2023, సోమవారం

ఈషణత్రయము

 *ఈషణత్రయము*



పుత్రదార గృహాదిషు అనభిష్వంగః


*అభిష్వంగః అంటే అతిస్నేహం. అనభిష్వంగః అంటే తగులుకోకుండా ఉండటం*. సంతానం, భార్య భర్త, ఇల్లు మొ॥న విషయాల పట్ల అతిస్నేహం పనికి రాదు. వీటినే *ఈషణత్రయం అంటారు. దారేషణ, ధనేషణ, పుత్రేషణ - వీటిలో మానవుడు తగులుకోరాదు. వీటిని కలిగి ఉండటంలో తప్పులేదు. కాని వాటిపై అతిస్నేహం కూడదు - అని గ్రహించాలి*. నిజంగా ఇవి ఏవీ శాశ్వతం కాదు. అవి నీనుండైనా దూరమౌతాయి, లేదా నీవైనా వాటికి దూరం అవుతావు. ఈ విషయాన్ని గ్రహించి వాటి కొరకే నా జీవితం, అవి లేకపోతే నేను లేను. అనే భ్రమను తొలగించుకోవాలి.


వ్యామోహం అనే జిడ్డును వదిలించుకోవాలి. అద్దాన్ని చూడండి. అది అన్నింటిని కౌగిలించుకొంటుంది. అందరితో సంబంధం పెట్టుకుంటుంది. కాని దేనికీ అంటుకోదు. అన్నింటిని వదిలేస్తుంది. *కనుక సాధకుడు అద్దంలాగా ఉండాలి*.


*ఎలాంటి వారితో సాంగత్యం చేస్తే అలాంటి బుద్ధులే వస్తాయి*.


. దుమ్ము గాలితో స్నేహం చేస్తే ఆకాశానికి ఎగురుతుంది.


. అదే నీటితో స్నేహం చేస్తే అడుగుకు చేరి పోతుంది.


. ఇనుము మట్టితో స్నేహం చేస్తే తుప్పు పట్టి పోతుంది.


. అదే అగ్నితో స్నేహం చేస్తే శుద్ధమై నిర్మలమవుతుంది.


*కనుక సంగ ప్రభావం అద్భుతమైనది. కనుక పామరులకు దూరంగా ఉండాలి*.


*సత్సాంగత్యం అనేది ఏకాంతవాసం కన్నా - అన్నింటికన్నా అధిక ఫలదాయకం*,


. సత్సాంగత్యం వల్లనే రత్నాకరుడు వాల్మీకియై రామాయణాన్ని రచించాడు.


. సత్సాంగత్యం వల్లనే దాసీ పుత్రుడు దేవర్షి నారదుడయ్యాడు.


. సత్సాంగత్యం వల్లనే పరీక్షిత్తు ఏడు రోజులలో ముక్తిని పొందాడు.


*కనుక సత్పురుషులకు దగ్గరగా ఉండాలి. దుర్జనులకు, పామరులకు దూరంగా ఉండాలి. నిజంగా సత్పురుషులతో సాంగత్యం చేస్తూ జ్ఞానార్జన చేస్తూ ఉంటే పామరజనులతో సంబంధం దానంతట అదే తెగిపోతుంది


*నీవు ఏ పనులు చేస్తున్నా, ఏ ఆలోచనలు చేస్తున్నా భగవంతుని స్మరణ - ఆత్మస్మరణ - పరమాత్మ స్మరణ నేపథ్య సంగీతంలా జరిగిపోతూనే ఉండాలి. పడవ ఎటు తిరుగుతున్నా దిక్సూచిలో ఉత్తర దిక్కు వైపుకే ముల్లు చూపుతున్నట్లు ఈ జీవన నావ సంసారమనే సముద్రంలో ఎటు తిరుగుతున్నా మనస్సు అనే దిక్సూచిలో ముల్లు మాత్రం ఆత్మవైపే - పరమాత్మ వైపే తిరిగి ఉండాలి. అదే జ్ఞాని ముఖ్యాతి ముఖ్యమైన లక్షణం*.


తగలబడుతున్న ఇంటిలో నుండి తప్పించుకొని బయటపడాలని తాపత్రయం చెందినట్లుగా; నీటిలో మునిగి ఊపిరాడక ఉక్కిరిబిక్కిరైనవాడు బయటపడాలని తాపత్రయపడినట్లుగా అజ్ఞానంతో కూడిన ఈ సంసారబంధం నుండి త్వరగా విముక్తి చెందాలని ఆవేదన పడే వాడే - ఆర్తితో ఏడ్చే వాడే *ముముక్షువు. మోక్షం పట్ల తీవ్ర ఆసక్తి గలవాడు* అని తెలుసుకోవాలి.

కామెంట్‌లు లేవు: