31, జులై 2023, సోమవారం

సత్యశోధకుని ఆత్మకథ

 "ఒక సత్యశోధకుని ఆత్మకథ" - 27వ భాగము.

- శాస్త్రి ఆత్రేయ(ఆకుండి శ్రీనివాస శాస్త్రి).


సత్యంతో కూడిన ధర్మము ఎలావుంటుందో శ్రీసీతారాముల జీవితమే నిదర్శనమని, జ్ఞానాన్ని ప్రభోదించే అన్ని ఉపనిషత్తుల సారాంశము భగవద్గీతలో లభిస్తుందని, ఆ రెండింటిని పరిపూర్ణంగా అవగాహన చేసుకుంటే సత్యశోధనకు మార్గము సులువవుతుందని, ఆ పిమ్మట ఒక సద్గురువును ఆశ్రయించి, సేవించుటద్వారా ఆత్మజ్ఞానం కలిగి సత్యదర్శనం సిద్ధిస్తుందని బోధించేరు నా మొదటి గురువైన నాన్నగారు. ఆ మార్గాన్నే ఆచరిద్దామని మనస్సులో నిశ్చయించుకున్నాను. 


సద్గురువు లభించడం మన ఆధ్యాత్మిక పరిపక్వత బట్టీ వుంటుందని, అన్యఆలోచన చేయకుండా సత్యశోధన చేసుకుంటూ పొతే గురువు తనంతటతానే సాధకుడి వద్దకు వస్తాడని నాన్నగారు సూచించేరు. 


ఏ భావంతో సాధన చేస్తామో అదే సిద్ధిస్తుందని, అటువంటి శక్తిని జీవునికి ఆ పరమాత్మ ప్రసాదించేడని, కాబట్టి తత్వసాధనకు భావన స్వచ్ఛమైనదిగా వుండాలని, భావమే బాహ్యకర్మలుగా వ్యక్తమౌతుందని, అందుకే జీవుడు ముందుగా మనస్సును తన ఆధీనంలోకి తెచ్చుకునే సాధన చెయ్యాలని బోధించేరు నాన్నగారు.


జ్ఞానం పొందడానికి, అజ్ఞానంతో జీవించడానికి మనస్సే ప్రధాన కారణము. మనస్సే మన మిత్రుడు లేదా శత్రువు కూడా. ఆలోచనలు కలిగేది, కోరికలు పుట్టేది మనస్సులోనే. మనస్సు ఆధీనంలోనే ఇంద్రియాలు వుంటాయి. ఇంద్రియాలు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోలేవు కానీ మనస్సును ప్రభావితం చెయ్యగలవు. సాధకుడు ఈ విషయాన్ని పూర్తిగా అవగాహన చేసుకున్న తరువాతే సాధన ప్రారంభించాలి, లేకపోతె సాధన మధ్యలోనే పతనమౌతుందని నాన్నగారు అనేకసార్లు పేర్కొన్నారు.


పునాది ధృడంగా వుంటేనే ఆకృతి చిరకాలం నిలుస్తుందని మృదువుగా హెచ్చరించేరు. 


నాన్నగారి బోధనలు పునరావృత్తము చేసుకుంటూ నా సత్యశోధన ముందుకు సాగింది............

కామెంట్‌లు లేవు: