6, సెప్టెంబర్ 2023, బుధవారం

*🌹శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర -36🌹

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

*🌹శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర  -36🌹*


🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁


*ఆళ్వారులు లేదా అళ్వార్లు :*


 శ్రీవైష్ణవ సంప్రాదాయంలోనూ, తమిళ సాహిత్యంలోనూ విశిష్టమైన స్థానం కలిగిన విష్ణు భక్తులు. తమ పాశురాలతో విష్ణువును కీర్తించి దక్షిణాదిన భక్తిసంప్రదాయాన్ని పరిమళింపజేశారు. 


వీరు పాడిన (రచించిన) పాశురాలు అన్నీ (నాలుగు వేలు) కలిపి దివ్య ప్రబంధం లేదా నాలాయిరం లేదా ద్రవిడ వేదం అనబడుతాయి. 


భక్తి, పారవశ్యము, శరణాగతి - ఇవి ఈ అళ్వారుల జీవితంలోనూ, రచనలలోనూ, వారిని గురించిన గాథలలోనూ ప్రముఖంగా కానవచ్చే అంశాలు. ఆళ్వారులు అందించిన సాంస్కృతిక వారసత్వం వలన వైదిక కర్మలతోనూ, సంస్కృతభాషా సాహిత్యాలతోనూ ప్రగాఢంగా పెన వేసుకొని పోయిన హిందూ మతాచారాలు దక్షిణాదిన కొంత స్వతంత్రతను సంతరించుకొన్నాయికుల వ్యవస్థను తోసిపుచ్చడం కూడా ఆళ్వారుల జీవితంలోనూ, శ్రీవైష్ణవ సిద్ధాంతాలలోనూ ముఖ్యమైన అంశాలు.


 ఆళ్వారుల ఔన్నత్యాన్ని గురించి ఎన్నో అలౌకికమైన ఘటనలు, మహత్తులు, నమ్మకాలు ప్రచారంలో ఉన్నాయి. ఆళ్వారులు అందరూ దైవాంశ సంభూతులనీ, సామాన్య జనానీకానికి భక్తిని ప్రబోధించి శ్రీమన్నారాయణుని పదపద్మాలను చేరుకొనే మార్గాన్ని ఉపదేశించిన మహనీయులనీ ప్రధానమైన విశ్వాసం.


శైవభక్తుల చరిత్రనుగూర్చి పెరియ పురాణము అను గ్రంథముతెలుపునట్లే వైష్ణవాచార్యుల చరిత్రను తెలిపేది గురుపరంపర అనుగ్రంథము. 


అందు వీరిని గూర్చి అనేకమైన అద్భుత కథలు ఉన్నాయి.

ఆళ్వారులు అంటే 'దైవ భక్తి లోమునిగి ఉన్నవారు' అని అర్థం. వారు శ్రీమన్నారాయణుని ఆరాధనా సంకీర్తనాదులలో పరవశించి ఉన్నందున వారికి ఆళ్వారులు అన్న పేరు వచ్చింది

ఆళ్వారులు అనగా జ్ఞానఖని అని మరియొక అర్ధము.


మరొక వివరణ ఇలా ఉన్నది - " భగవద్గుణానుభవము నిరర్గళముగా స్వర్గ గంగవలె వీరి వాక్కులనుండి ద్రవిడ భాషా రూపమున వెలువడినందున వీరికి ఆళ్వారులు అను పేరు కలిగినది. ఆళ్వారు అనిన 'కాపాడువారు' అని వ్యుత్పత్తి.


 తమ కవితలతో వీరు మనలను కాపాడుటకే అవతరించినారు. భగవదనుభవ పరీవాహ రూపమయిన భక్తిసాగరమున మునకలు వైచి యందలి లోతులను కనుగొన్నవారని కూడ ఈ మాటకు అర్ధము చెప్పవచ్చును.


 తమపై నమ్మకము కలిగిన బద్ధ జీవులను తమతోబాటు భక్తిరసామృత సింధువున ముంచి యుక్కిరిబిక్కిరి చేసి బ్రహ్మానందమున తేల్చుట కూడ వీరికి వెన్నతో బెట్టిన విద్య" 


పన్నిద్దరు ఆళ్వారులు

కృష్ణ దేవరాయలు తన ఆముక్తమాల్యదలో ఆళ్వారులను ప్రస్తుతించే ప్రసిద్ధ పద్యం:


అల పన్నిద్దరు సూరులందును సముద్యల్లీలగావున్న బె

గ్గలికం దానము బావ నా నిజ మన:కంజాత సంజాత పు

ష్కల మాధ్వీక ఝురిన్ మురారి పొగియంగా జొక్కి ధన్యాత్ములౌ

నిల పన్నిద్దరు సూరులం దలతు మోక్షేచ్ఛామతిం దివ్యులన్"


ద్వాదశాదిత్యులు - అనగా పన్నెండు మంది సూర్యులు. వారి వేడిమి తీవ్రత దుర్భరమైనది. ఆ తాప తీవ్రత తగ్గించి మానవుల హృదయాల్లోని అఙ్ఞానాంధకారం దూరం చేసి ఙ్ఞాన దీపం వెలిగించడానికే భూమి మీద ఈ ద్వాదశ దినసూర్యు లవతరించారు. వారికి ప్రణామములు.

ఆళ్వారుల నందరికీ వారి సంస్కృత నామాలు చెప్పి సంగ్రహంగా నమస్కరించే శ్లోకమిది:


భూతం సరస్య మహదహ్వాయ భట్టనాథ

శ్రీ భక్తిసార కులశేఖర యోగివాహాన్;

భక్తాంఘ్రీ రేణు పరకాల యతీంద్ర మిశ్రాన్

శ్రీమత్పరాంకుశమునిం ప్రణతోస్మి నిత్యమ్"


ఈ శ్లోకంలో 11 ఆళ్వారుల పేర్లున్నాయి - వారు (1) పొయ్‌గై యాళ్వార్ (2) పూదత్తాళ్వార్ (3) పేయాళ్వార్ (4) పెరియాళ్వార్ (5) తిరుమళిశై యాళ్వార్ (6) కులశేఖరాళ్వార్ (7) తిరుప్పాణాళ్వార్ (8) తొండరడిప్పొడి యాళ్వార్ (9) తిరుమంగై యాళ్వార్ (10) ఉడయవర్ (11) నమ్మాళ్వార్.


● ఉడయవర్‌ (రామానుజాచార్యులు) ను ఈ జాబితాలోంచి తొలగించి పదుగురు ఆళ్వారులు అనికూడా అంటారు.


● ఉడయవర్ బదులు మధుర కవి మరియు గోదాదేవి పేర్లు కూడా జోడించి మొత్తం పన్నిద్దరు ఆళ్వార్లని చెబుతారు. ('శ్రీ', 'భక్తిసార' అనే పదాలను విడదీసి 'శ్రీ' అనగా అండాళ్ అని కూడా వివరించడం జరుగుతుంది. 


● ఒకోమారు మధుర కవిని కలుపకుండా అండాళ్‌ను మాత్రమే జాబితాకు జోడించి పన్నిద్దరు ఆళ్వారులని లెక్క కట్టడం కూడా కద్దు.


అతి సాధారణంగా చెప్పబడే పన్నిద్దరు ఆళ్వారులు, వారి సంస్కృత నామములు ఇక్కడ ఇవ్వబడ్డాయి.

1. పొయ్‌గయాళ్వార్ - మరొక పేరు సరోయోగి

2. పూదత్తాళ్వార్ - మరొక పేరు భూతయోగి

3. పేయాళ్వార్ - మరొక పేరు మహాయోగి

4. పెరియాళ్వార్ - మరొక పేరు భట్టనాథులు

5. తిరుమళిశై యాళ్వార్ - మరొక పేరు భక్తిసారులు

6. కులశేఖరాళ్వార్ - మరొక పేరు కులశేఖరుడు

7. తిరుప్పాణాళ్వార్ - మరొక పేరు మునివాహనులు

8. తొండరడిప్పొడి యాళ్వార్ - మరొక పేరు భక్తాంఘ్రి రేణువు

9. తిరుమంగయాళ్వార్ - మరొక పేరు పరకాలయోగి

10. ఆళ్వారుక్కు అదియాన్ - మరొక పేరు మధురకవి (శ్రీవైష్ణవ సాంప్రదాయానికి ప్రవర్తకులైన 'ఉడయవర్', 'ఎమ్బెరుమనార్' అనే నామాంతరాలుగల భగవద్రామానుజాచార్యుల వారిని కొంతమంది మధురకవికి మారుగా చేరుస్తారు ఈ పన్నిద్దరిలో.)

11. ఆండాళ్ - మరొక పేరు గోదాదేవి

12. నమ్మాళ్వార్ - మరొక పేరు శఠకోపముని


ఆళ్వారుల కాలం గురించి నిర్దిష్టమైన ఆధారాలు లేవు. వీరు ద్వాపర యుగాంతంనుండి కలియుగారంభం మధ్య ఉద్భవించారని సంప్రదాయ గాథలు. కాని శాస్త్రీయ పరిశోధకులు వీరి కాలం క్రీ.శ. 7వ శతాబ్దం - 9వ శతాబ్దం మధ్యకాలమని అభిప్రాయపడుతున్నారు.


శ్రీ విశ్వ తేజా గోవిందా, శ్రీ గిరి నిలయ గోవిందా, నిర్గుణ రూప గోవిందా, తిరుమల వాస గోవిందా; |

గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా, గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా. ||36||


*శ్రీవేంకటేశ్వరుని దివ్య లీలల లో మరికొన్ని తదుపరి సంపుటిలో*


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

కామెంట్‌లు లేవు: