6, సెప్టెంబర్ 2023, బుధవారం

భారత్‌ అనే పేరు

 భారత్‌ అనే పేరు వినగానే ఎందుకు ఉలిక్కిపడుతున్నారు.. గతంలో హిందుస్థాన్‌ అంటే కూడా విలవిలలాడిన వారు ఉన్నారు.. మన దేశంలోని అతి కుహనా లౌకికవాద మౌడ్యులు దశాబ్దాలుగా దేశ ప్రజల కళ్లకు కడుతున్న గంతలు తొలగిపోతుంటే బెంబేలెత్తిపోతున్నారు.. 

' भारत हमारा देश है । हमें अपना देश प्राणों से प्यारा है ।.. , భారతదేశము నా మాతృభూమి. నేను నా దేశమును ప్రేమించుచున్నాను.. , India is my country.All Indians are my brothers and sisters..' దేశ వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో చేసే ప్రతిజ్ఞ ఇది..

'జంబూ ద్వీపే భరత వర్షే భరత ఖండే దండకారణ్యే కృష్ణాగోదావరీ మధ్యదేశే..' మన ఇళ్లలో ఏ శుభకార్యం జరిగినా పూజారి పఠించే సంకల్పంలోని ఈ పదాల మీద ఎప్పుడైనా దృష్టి పెట్టారా? 

'భరతఖండంబు చక్కని పాడియావు, హిందువులు లేగ దూడలై యేడ్చుచుండ..' అనే చిలకమర్తి లక్ష్మీనరసింహం గారి పద్యం చిన్నప్పుడు తెలుగు పాఠ్య పుస్తకంలో చదువుకొనే ఉంటాం..

మన జాతీయ గీతం 'జనగణమన అధినాయక జయహే భారత భాగ్యవిధాతా..'తో ప్రారంభమై చివరలో 'జైహింద్‌' అని ముగిస్తాం.. మన జై ఇండియా అని ఎందుకు అనడం లేదు?

మన దేశంలోకి విదేశీయులు రాక ముందు నుంచే భారత్‌ లేదా భరత అనే పదాలు ఉనికిలో ఉండటం గమనించాలి.. అలాగే హిందుస్థాన్‌, హిందూ అనే పేర్లు కూడా.. బ్రిటిష్‌వారు తమ పాలనా కాలంలో మన దేశం పేరును India(ఇండియా)గా వ్యవహరించారు. అంతకన్నా ముందు నుంచే భారత్‌వర్ష్‌, భారత్‌ అనే పేర్లు ఉనికిలో ఉన్నాయి. భరతముని, శకుంతల-దుష్యంతుల తనయుడు భరతుడి పేరుతో ఈ పేరు వచ్చిందనే చరిత్ర కూడా ఉంది. 

యూరోప్‌, అరబు దేశాల వారు వారికి తూర్పువైపున సింధూనదికి అవతల కనిపించిన మన దేశాన్ని  సింద్‌ అని పిలిచేవారు, అది క్రమంగా హిందు, హిందుస్థాన్‌ అని వాడుకలోకి వచ్చింది.

స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఏర్పడిన స్వదేశీ పాలక ప్రభుత్వం రాజ్యాంగం రచిస్తున్న సమయంలో మన దేశాన్ని ఏ పేరుతో పిలుద్దాం అనే చర్చ జరిగింది. 'భారత్‌' అని మనం పిలుచుకుంటున్నా ప్రపంచ వ్యాప్తంగా 'ఇండియా'అనే పేరుతో గుర్తింపు ఉన్నందున రెండు పేర్లను కొనసాగించాలని నిర్ణయించారు. 

ఇప్పుడు మన దేశం అనేక రంగాల్లో సాధిస్తున్న విజయాల కారణంగా అంతర్జాతీయంగా మన పాత్ర పెరిగింది. మన దేశం పేరును ఇండియా బదులు 'భారత్‌'గానే స్థిరపరచుకోవాలి. ఇందుకు ఇదే సరైన సమయం..

తాజాగా మన దేశంలో జరగనున్న జీ-20 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము వివిధ దేశాల అగ్రనేతలకు ప్రత్యేక విందు ఇస్తున్నారు. ఈ అహ్వాన పత్రాల మీద President of India బదులుగా President of Bharat అని ముద్రించారు. జీ-20 సదస్సు కోసం రూపొందించిన బుక్‌లెట్‌లోనూ దేశం పేరు ‘భారత్‌’ అని పేర్కొన్నారు. ‘భారత్‌, మదర్‌ ఆఫ్‌ డెమోక్రసీ’ అని అందులో రాశారు. ఇది చూసి కాంగ్రెస్‌ పార్టీ ఏదో వారి కొంపలు అంటుకున్నట్లు గగ్గోలు పెడుతోంది. ఇందుకు మోదీ సర్కారును నిందిస్తోంది. 

రానున్న పార్లమెంట్‌ సమావేశాల్లో మన దేశం పేరును ఆంగ్లంలోనూ ‘ఇండియా’ నుంచి ‘భారత్‌’గా పేరు మారుస్తూ ప్రధాని మోదీ ప్రభుత్వం ప్రత్యేక తీర్మానం తీసుకురానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం రాజ్యాంగంలో ‘ఇండియా: దటీజ్‌ భారత్‌’ అని ఉండగా.. ఇకపై ‘भारत' (భారత్‌) అనే పేరు మాత్రమే ఉండేలా సవరణ చేయనున్నట్లు తెలుస్తోంది. 

నిజంగా ఈ మార్పు జరిగితే దేశ ప్రజలంతా సంతోషించాలి.. గర్వపడాలి.. ఇప్పటికే విదేశీ పాలనా ముద్రలను క్రమంగా తొలగించడం మొదలైంది.. ఈ దిశలో 'భారత్‌' అనే శాశ్వత పేరు ఉండటంలో తప్పేమీ లేదు.

జైహింద్‌, జైభారత్‌, భారత్‌ మాతాకీ జై..

#भारत #భారత్‌ #Bharat

కామెంట్‌లు లేవు: