20, జూన్ 2024, గురువారం

గో క్షీరం

 గో క్షీరం


అది కుంబకోణం ప్రధాన కేంద్రంగా శ్రీమఠం కార్యకలాపాలు జరుగుతున్న సమయం. మఠం వెనక భాగంలో పెద్ద గోశాల ఉండేది. ఒకరోజు మఠానికి సంబంధంలేని ఒక గోవు గోశాలలో గడ్డిమేస్తూ, నీరు తాగుతూ కనిపించింది. ఆ ఆవు ఎవరిదో ఎవ్వరికి తెలియదు. చుట్టుపక్కల వారికి ఈ విషయం తెలియపరచినా ఎవ్వరూ ఆ ఆవుకోసం రాలేదు. నాలుగైదు రోజులు అలాగే గడిచిపోయాయి. మఠం శ్రీకార్యం పరమాచార్య స్వామిని “ఆవుని బయటకు పంపిద్దామా?” అని అడిగాడు. 


”అది మఠం ఆవు కాదు కాబట్టి దాన్ని బయటకు పంపించాలి అనుకుంటే, ఈ మఠంలో ఉన్న చాలా మందిని బయటకు పంపవలసి ఉంటుంది” అని బదులిచ్చారు. 


నిజానికి అప్పటికి శ్రీమఠంలో చాలామంది ఊరికే ఏ పనీ లేక అక్కడే ఉంటూ తిని పడుకుంటున్నారు. “ఆవు ఏమీ మాట్లాడదు కాబట్టి దాని యజమాని ఎవరో మనకు తెలిసే అవకాశం లేదు,మన గోశాలోనే ఉండనివ్వండి. దాన్ని కాపాడడం మన కర్తవ్యం” అని స్వామివారు సెలవిచ్చారు. 


కొన్ని రోజుల తరువాత ఆ ఆవు ఈనడానికి సిద్ధంగా ఉంది. కొన్ని రోజుల తరువాత అది ఈనింది. మేనేజరు స్వామివారి వద్దకు వచ్చారు. “ఆవు ఈనిన తరువాత వచ్చే జున్నుపాలు రావడం ఆగిపోయాయి. ఆ ఆవు మంచి జాతి ఆవు అనుకుంటాను. మంచి ఆహారం తీసుకున్నట్లు ఉంది. రోజుకు నాలుగు శేర్ల పాలు ఉదయం మరియు సాయింత్ర రెండుపూటలా ఇస్తుంది” అని చెప్పారు. వెంటనే స్వామివారు “మొత్తం పాలని కలతీశ్వర దేవస్థానంలో అభిషేకానికి ఇవ్వండి. ఆ ఆవు శ్రీమఠానికి సంబంధించినది కాదు కాబట్టి ఆ పాలను శ్రీమఠం అవసరాలకు వినియోగించరాదు” అని చెప్పారు. 


రెండు రోజులు గడిచిపోయాయి. పరమాచార్య స్వామివారు మేనేజరుని అడిగారు, “ఆ పాలను ఏం చేస్తున్నారు?” అని. 


మేనేజరు కాస్త కంగారుగా, “ఆ పాలని రోజూ కాలతీశ్వర దేవస్థానంలో ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు చేశాను” అని చెప్పారు. 


”అలాగే ఆ ఆవు దూడని శివాలయానికి ఇచ్చేయండి. అవి ఇక్కడే ఉంటే పొరపాటున ఆ పాలని శ్రీమఠంలో వాడుకుంటారు” అని ఆజ్ఞాపించారు. 


స్వామివారి ఆజ్ఞప్రకారం మేనేజరు చేశాడు. కాని దేవస్థానంలో అప్పటికే చాలా గోవులు ఉండడం వల్ల ఇంకొకటి తీసుకోవడానికి కొంత విముఖత చూపించారు,ఆలయ ధర్మకర్తలు ఆవులను వేలం వెయ్యాలని తలచారు. అలా అమ్మిన ఆవులు నేరుగా వధశాలలకు వెళ్తాయని స్వామివారు ఆందోళన చెందారు. వేలం వేసిన మొత్తం ఆవులను కొనుగోలు చెయ్యవలసిందిగా ఒక ధనిక భక్తుడిని ఆదేశించారు. తరువాత ఒక్కొక్కటిగా వాటిని బాగా చూసుకొనే భక్తులకు ఇచ్చేశారు. గోవులపై పరమాచార్య స్వామికి ఉన్న ప్రేమ అటువంటిది.


గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం

లోకాః సమస్థా సుఖినో భవన్తు ||


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

కామెంట్‌లు లేవు: