20, జూన్ 2024, గురువారం

నన్నయ కవితా చాతుర్యం!

 శు భో ద యం🙏


నన్నయ కవితా చాతుర్యం!


వర పూజ

----------------

                   మనం యీరోజు ఆదికవి నన్నయ భట్టారకుని పద్యం చవిచూద్దాం!


             చం: " అతి రుచిరాగతుండయిన యాతనికిన్ హృదయ ప్రమోద మా


                       తతముగ నవ్వనంబున లతాలలనల్ మృదులాని లాప వ


                       ర్జిత కుసుమాక్షతా వళులు సేసలు పెట్టిన యట్టులైరి సం


                       పత దళినీ నినాద మృదుభాషల దీవెన లొప్పనిచ్చుచున్;


                      ఆం- భారతము- దుష్యంతోపాఖ్యానము- నన్నయ్య; 


                          ఆదికవి నన్నయ భారతం ఆదిపర్వంలో దుష్యంతో పాఖ్యానంలో ఈపద్యం ద్వారా దుష్యంతునకు వరపూజ 

నిర్వహింప బూనుకోవటం ఆచ్చెరువును కలిగిస్తుంది. 


                    నన్నయ కవితా గుణాలు మూడు . అవి అక్షర రమ్యత ,ప్రసన్నకథ , లోనారయుట,లు యీమూడు కవితా గుణాలలో

చివరిదియైన లోనారయుట ద్వారా మనమీ వరపూజను తిలకించాలి. దానికి మనలోచనాలు పనికిరావు. సులోచనాలున్నా దండగే!

ఆలోచనా లోచనాలు కావాలి. మరి ఉన్నాయా? యెందుకుండవు ? మనస్సు నటుత్రిప్పి మనోలోచనంతో తిలకించుదాం. ఇంక ప్రకృతం!


కఠిన పదాలకు అర్ధం:- అతి-మిక్కిలి; రుచిరాగతుడు- అందంగా వచ్చినవాడు( చూడ ముచ్చటయైన వాడు) హృదయ ప్రమోదము-హృదయానందము; ఆతతముగ- విరివిగ; లతాలలనల్- ఆడపిల్లలవంటి తీగెలు; మృదులానిల--చిరుగాలి;అపవర్జితము-రాల్చుట; కుసుమాక్షతావళి-పూవులనే అక్షతలు; సేసలు-దీవెనలు; అళినీ నినాదము- తుమ్మెదలధ్వని; మృదుభాషలన్-మెత్తనిమాటలతో;


భావము; పెళ్ళికొడుకులా అందంగా ఆకర్షణీయంగా వచ్చుచున్న దుష్యంతుని తీగెలనే వనితలు స్వాగతిస్తున్నాయి.చిరుగాలులతో పూలురాల్చి, అక్షతలుజల్లి దీవిస్తున్నాయి. తుమ్మెదల ఝంకారాలతో మంగళప్రదమైన పాటలు పాడుతూ తీయనిమాటలతో స్వాగతం పలుకు తున్నాయి. ఇదీభావం!


                   విశేషములు:- దుష్యంతుడు వేటకు వచ్చాడు వేటాడి అలసిపోయాడు.కొంచెం సేదతీర్చుకుందామని కణ్వాశ్రమానికి వస్తున్నాడు. మహా రాజుగదా అందంగా అలంకరించు కొన్నాడు.వయసులో ఉన్నాడు. నిత్య పెళ్ళికొడుకులా ఉన్నడన్నమాట!

రాజానాం బహువల్లభాః అన్నారు. కాబట్టి యెప్పుడంటే అప్పుడే పెళ్ళికి సిధ్ధం!


                       కణ్వాశ్రమంలో ప్రకృతి చాలా హృదయంగమంగా ఉంది.లతలుగాలికి ఊగుతున్నాయి.పూలురాలుతున్నాయి. తుమ్మెదలు ఝంమ్ఝమ్మని గానం చేస్తున్నాయి. ఈమనోహరమైన ప్రకృతిని కవి వరపూజ గా వ్యంగ్యంగా తీర్చిదిద్దాడు. ముందుముందు శకుంతల దుష్యంతులకు వివాహం కానున్నది.పనిలోపనిగా వరపూజ జరిపించేయాలను కున్నాడు. ఒక రూపకాలం కారం సాయంతో ఆకాస్తా జరిపించేశాడు.


                           లతలు గాలికి ఊగుతోంటే అందమైన మగువలు చేతులూపుతూ స్వాగతిస్తూన్నట్లున్నవట! పూలురాలుతుంటే అది సేసలు జల్లుతున్నట్లున్నదట. మరి మంగళకరమైన పాటలో?తుమ్మెద గీతాలే! అవే మధురమైన స్వాగత వచనాలు!ఇంతకీ పెళ్ళికొడుకు? యింకెవ్వరు అందంగా పెళ్ళికొడుకులాఉన్నదుష్యంతుడే! 


                              పెళ్ళి కూతురు శకుంతల సిధ్ధం గానే ఉందిగదా! సరిపోయింది;


ఇదే దర్శనం -ప్రదర్శనం.


                                      ఇదీ నన్నయ గారి లోనారయుట!


                                                          స్వస్తి!🙏🙏🌷🌷🌷🌷🌷🌷💐💐💐🌷🌷🌷🌷🌷💐💐🌷🌷🌷

కామెంట్‌లు లేవు: