26, జులై 2024, శుక్రవారం

శ్రీదత్త పురాణము ప్రథమ భాగం

 శ్రీదత్త పురాణము

ప్రథమ భాగం

నై మిశారణ్యములో మునులకు దత్త ప్రత్యక్షం


ఓం శ్రీ గణేశాయనమః ఓం శ్రీ సరస్వత్యైనమః  

ఓం శ్రీ గురుభ్యోనమః జై శ్రీగురుదేవదత్త


శ్లో "ధ్యానమూలం గురోర్మూర్తిః పూజా మూలం గురోః పదమ్ |

      మంత్ర మూలం గురోర్వాక్యం మోక్షమూలం గురోః కృపా ॥


శ్లో "గురుర్ర్బహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః ॥

      గురుసాక్షాత్ పరంబ్రహ్మ తస్మైశ్రీ గురవే నమః ॥




 శ్లో " *మాలాం కుండించ డమరుం శూలం శంఖం సుదర్శనం|*

        *దధానం భక్తవరదం దత్తాత్రేయం నమామ్యహమ్ |*

      

 శ్లో " *దత్తాత్రేయ హరేకృష్ణ ఉన్మత్తానంద దాయక|*

          *దిగంబరమునే బాలపిశాచ జ్ఞానసాగర ||*



శుక శౌనకాది మునులందరూ కలసి నైమిశారణ్యంలో దీర్ఘసత్రయాగం చేస్తున్నారు. నిరాటంకంగా హోమాలు జరుగుతున్నాయి. ఒకరోజు విరామ సమయంలో ప్రశాంత వాతావరణంలో మునులందరూ ధ్యానంలో నిమగ్నమైయున్నారు. అందరూ పద్మాసనములు వేసుకొని రెండు చేతులూ ఒడిలో సంధించి అరమోడ్పు కన్నులతో అంతర్ దృష్టిని భ్రూ మధ్యస్థానంలో బంధించి శ్వాస ప్రక్రియలను క్రమ మార్గంలో వుంచి తేజ స్వరూపుడైన నారాయణుని నిష్టతో ఏకాగ్రమైన మనస్సుతో ధ్యానిస్తున్నారు. మనఃశరీరాలను స్తంభింపజేసి శిలా ప్రతిమలై అత్యంత నిష్టలో ధ్యానంలో వున్నారు. అంతలో చల్లని గాలి ఆ ప్రాంతాన్ని పరిమళ భరితంతో ముంచెత్తింది. కోటి సూర్యులకాంతితో ఒక దివ్యజ్యోతి వారి నడుమ సాక్షాత్కరించింది. అదొక అద్భుత కాంతి. కేవలమైన తేజస్సు. ఆకారం లేని తేజస్సు, కోటి సూర్యుల కాంతితో కోటి చంద్రుల చల్లదనం కలగలిపిన మహా మహస్సు. ధ్యానంలో వున్న మునులందరూ దివ్యమైన అనుభూతితో కళ్ళు తెరిచారు. ఎదురుగా కన్నులు మిరుమిట్లు గొలిపే కాంతి పుంజం.ఆ తేజస్సు దశదిశలా వ్యాపించింది. మంగళవాయిద్యాలు మనోహరంగా వినిపిస్తున్నాయి. శౌనకాది మునులందరూ

ఆ కాంతిపుంజాన్ని చూడలేక కన్నులు మూసుకున్నారు. చేతులు జోడించి ఆర్తితో “మహానుభావా ! తేజ స్వరూపా! నువ్వు అనుగ్రహించి మా ఎదుట నిలిచినా నిన్ను దర్శించలేని అశక్తులము. అద్భుతమైన ఆ తేజస్సును మా కన్నులు తట్టుకోలేకపోతున్నాయి. మనస్సులు మాత్రం పరమానందంలో మునిగివున్నాయి. ఈ అనుభూతిని మేమెన్నడూ అనుభవించనిది. దయామయా నీ రూపాన్ని దర్శించగల్గే శక్తి మాకు ప్రసాదించు” అంటూ మునులందరూ సాష్టాంగ ప్రణామములు ఆచరించారు. అప్పుడు ఆ తేజస్సు నుండి ఇలా వినిపించింది. మహామునులారా ! కన్నులు తెరవండి. మునులందరూ కన్నులు తెరిచారు. అదే తేజోస్వరూపం. ఎరుపూ, నలుపూ, తెలుపూ కలయికగా కాంతి. ఆ కాంతిలోనే

శ్రీమన్నారాయణుడు దర్శనమిచ్చాడు. అత్రి, భృగు, మరీచి మొదలగు మహర్షులందరూ పరివేష్టించి యున్నారు.

చతుర్వేదాలను పఠిస్తున్నారు. ఆ నీల నీరదశ్యాముడు చిరునవ్వులు చిందిస్తున్నాడు. వక్ష స్థలంలోని కౌస్తుభమణితో వాసుదేవుని ముఖం మరింత కాంతిమంతం అయింది. నాలుగు భుజాలతో శంఖం, చక్రం, గద, పద్మం నాలుగు  

 తంతువులు

చేతుల్లో విరాజిల్లుతున్నాయి. కటికి పట్టు పీతాంబరం వ్రేలాడుతూ వుంది. దాని అంచులకున్న బంగారుకాంతులు ధగధగలాడుతూ స్వామి పాదాలకు ఒక వింత శోభని కలిగిస్తున్నాయి. శిరస్సున వజ్రకిరీటం, చెవులకు మకరకుండలాలు భుజాలకు మణిమయమాలలు, చేతి వ్రేళ్ళకు రత్నాలతో పొదిగిన ఉంగరాలు, మెడలో వనమాల, బంగారు యజ్ఞోపవీతం. వక్షస్థలంలో ఒకవైపు లక్ష్మి మరొకవైపు శ్రీవత్సలాంఛనం. బంగారుకొండ మీద కూర్చున్నట్లుగా గరుత్మంతుని మీద ఠీవిగా కూర్చుని దర్శనమనుగ్రహించాడు. సనక సనందనాదులు నారద తుంబురులూ స్తుతిగీతాలు ఆలపిస్తున్నారు. జయవిజయులు ఇరువైపులా సేవలు అందించుచున్నారు. విష్వక్సేనాదులు జయజయ ధ్యానాలు

పలుకుతున్నారు. మహామునులందరూ ఆనందపరవశులై చూస్తున్నారు. ఉన్నట్టుండి ఆ నీల మేఘశ్యాముడు మల్లికార్జునుడుగా మారిపోయాడు. వెండికొండమీద నంది వాహనాన్ని అధిష్టించి పరమశివుడుగా మారిపోయాడు. శిరస్సున చంద్రరేఖ. జటాజూటం నుండి దుముకుతున్న గంగమ్మ, శరీరంనిండా వీభూతి ధరించి సర్వాంగాలకు సర్పములను ఆభరణములుగా ధరించి ఒకచేతిలో త్రిశూలం, మరొక చేతిలో ఢమరువు, మరొక చేతిలో కమండలం, మరొక చేతిలో జపమాల, కటి భాగాన పులితోలు, నాగజందెం నాగహారములు శరీరం నిండా రుద్రాక్షలను నాగకుండలాలు నాగమంజీరాలు, సర్ప భూషిత సర్వాంగుడు, నందీశ, భృంగీశ, గణేషులూ, వీరభద్ర, షణ్ముఖులు, మాతృగణాలు

ప్రమథగణాలు అందరూ పరివేష్టించి యుండగా దర్శనమిచ్చాడు.

ఆశ్చర్యచకితులై మునులందరూ చూస్తున్నారు. అంతలో ఆ తేజోమండలం చతుర్ముఖుడుగా మారిపోయింది. తెల్లకమలంపై ఎర్రని రంగులో సృష్టికర్త. నాలుగు ముఖాలు, నాలుగు వేదాలు శ్రావ్యంగా గానం చేస్తున్నాయి. బ్రహ్మర్షులందరూ చుట్టూ కూర్చుని ఉపనిషత్ వాక్యాలను వల్లిస్తున్నారు. మలయ మారుతంలాగా వీణానాదం వినిపిస్తోంది. దివ్యమాలలను ధరించి అర్థ నిమాలిత నేత్రుడై జపమాల త్రిప్పుతూ ధ్యానం చేస్తూ బ్రహ్మదర్శనమిచ్చాడు.

శౌనకాది మునులందరూ కన్నార్పకుండా చూస్తున్నారు. ఆ కాంతి పుంజం త్రిమూర్తుల కలయికగా మారిపోయింది. మూడు రంగులు మూడు మూర్తులూ కలగలిసి కనిపిస్తున్నాయి. ఆరు చేతులు దర్శనమిచ్చాయి. శంఖము, చక్రము, త్రిశూలం, ఢమరువు, మాల, కమండలము చేతులలో కనిపించాయి. సకల దేవతలు సేవిస్తున్నారు.

సూర్యచంద్రులు అష్టదిక్పాలకులు, మను, వసు, రుద్రులూ నక్షత్రగ్రహాది దేవతలు కిన్నర కింపురుష సిద్ధ సాధ్య

గరుడోరగ దివ్యజాతులూ ఆ త్రిమూర్తి స్వరూపుడ్ని పరివేష్టించి సోత్రాలు చేస్తున్నారు. సప్తసముద్రాలు సకల నదీనదాలు

పర్వతాలు సకల సృష్టీ సకలజీవరాసులూ ఆ దివ్య స్వరూపంలో సాక్షాత్కరించాయి. శౌనకాది మునులందరూ ఆశ్చర్య, ఆనందాల నుండి తేరుకొని సాష్టాంగ దండ ప్రణామములు చేస్తూ “మహానుభావా, త్రిమూర్తి స్వరూపా, మా జన్మలు ధన్యమయ్యాయి. చరితార్థులమయ్యాము. మా జపములు తపస్సు నేటికి ఫలించింది. మహా మహా యోగీశ్వరులకు కూడా లభించని దివ్యదర్శనాన్ని అనుగ్రహించావు. కరుణా స్వరూపా! ధన్యులమయ్యాము. దేవాధిదేవా! భక్తితో మేము చేసే షోడశోపచారములు స్వీకరించి మమ్ములను కృతార్థులను చేయమని వినయముతో అభ్యర్థించారు. త్రిమూర్తి స్వరూపుడు చిరునవ్వుతో తలఊపాడు. మునులందరూ స్వామిని పూజించి సేవించి ఇలా స్తుతించారు. చక్రాసి గదాధరా! శార్హధరా! సకల కారణ కారణా! కారణాతీతా! అవక్ర పరాక్రమా! పురుషోత్తమా! సృష్టి, స్థితి,లయ, కారకా! జగత్ర్కీడా వినోదీ! త్రిమూర్తి స్వరూపా! నమోనమః చిదగ్ని స్వరూపా! వేదాంతులు నిన్ను పరబ్రహ్మవనీ సాంఖ్యవిధులు నిన్ను పురుషోత్తముడవనీ, యోగులు పరమాత్మ అనీ, మీమాంసకులు ధర్మమనీ, విజ్ఞానులు శూన్యమని,

చార్వకులు పంచభూతాత్మకమనీ అంటూస్తుతిస్తున్నారు. వేదాలు నిన్ను విశ్వస్వరూపడవంటున్నాయి. మళ్ళీ కాదు అంటున్నాయి. నీ స్వరూపాన్ని నిర్ణయించలేక నీరసపడుతున్నాయి. వాచామగోచరా! తేజోమయా! నమోనమః ఏ సాధనము లేకపోయినా నీకు అసాధ్యమన్నది లేదు. నిజానికి సాధ్యము. అసాధ్యము రెండూ నీవే. వెలుగులకు వెలుగువి. సకల ప్రాణికోటిలోని జీవశక్తివి. సృష్టిలో నీవుకానిది, నీవు లేనిది ఏదిలేదు. సకలవ్యాపకా! ఆది దేవా! దివ్య

పీతాంబరం ధరించావు. సువర్ణకాంతులు జిమ్మే శరీరం నిండా బూడిద ధరించావు. కోటి సూర్యులకాంతిలో వెలిగిపోతున్నావు నీ పాదాలను స్మరిస్తే చాలు భవరోగాలు నాశనమౌతాయి. కర్మఫలప్రదాతా! కర్మసాక్షి! అరిషడ్వర్గాలను జయించి సమాహితచిత్తులై నీ పురాణగాధను విన్నవారు సంసార సముద్రాన్ని అవలీలగా దాటుతారు. ఆనంద స్వరూపా! అమృతమయా! నమోనమః

నీ శ్రీమన్నారాయణుని నాభి కమలము నుండి ఉద్భవించి రజోగుణ ప్రధానుడవై కర్మఫలానుసారంగా నీవు సకల చరాచర సృష్టిని చేస్తున్న వేళ భవబంధ విముక్తులైన బ్రహ్మర్షులు యోగీశ్వరులూ నిన్ను స్తుతిస్తుంటారు. సృష్టి విధాతా! నామస్మరణలో భక్తుల పాపాలను పటాపంచలు చేసి భవసాగరాన్ని అనాయాసంగా తరింపజేసే సత్వగుణ ప్రధానా! స్థితి కారణా! శ్రీమన్నారాయణా! ముముక్షువులందరూ నిన్నే ధ్యానిస్తుంటారు. ఉపమన్యువు అభ్యర్థిస్తే సాక్షాత్తూ పాలసముద్రాన్నే ప్రసాదించిన దయామయుడవు. తమోగుణ ప్రధానుడవై ప్రళయవేళ సకల సృష్టిని ఉపసంహారించే

మహాకాల స్వరూపా! భయంకరా! అభయంకరా! శంకరా! నమోనమః నైమిశారణ్యవాసులు చేసిన ఈ స్తోత్రమునకు త్రిమూర్తి స్వరూపుడు సంతుష్టుడయ్యాడు. మునీశ్వరులారా నా దర్శనముతో మీరు కృతార్ధులయ్యారు. ఏమికావాలో కోరుకోండి అన్నాడు. సృష్టి, స్థితి, లయ, కారకా ధన్యులమయ్యాము. నీ విరాడ్రూపాన్ని దర్శింపజేసావు. ఇంతకన్నా మేము కోరుకోవలసింది ఏముంది. అయినా అడగమన్నావు కనుక అడుగుతున్నాము. ఇన్ని ఆకారాలలో మాకు

కనిపించావు వీటిలో నీ అసలైన రూపం ఏది? నీ నివాసం ఎక్కడ? నీ జన్మకర్మల వృత్తాంతం ఏమిటి? నువ్వు త్రిమూర్తులకు అతీతుడవని పరాక్రముడవనీ విన్నాము ఇది నిజమా ? కాదా ? మా అజ్ఞానాన్ని మన్నించి మాసంశయాలు తొలగించు. నిశ్చల జ్ఞానాన్ని ప్రసాదించు. అవ్యయ ఆనందాన్ని అందించు అన్నారు. మునీశ్వరులారా! మీరు ఎన్నో జన్మల నుండి జపతపాలను యజ్ఞాలను నియమనిష్టలతో ఆచరిస్తూ జీవితాలు గడుపుతున్నారు. అందుకు సంతోషించి ఇలా దర్శనం అనుగ్రహించాను. నా నామ రూపాలు జన్మకర్మలు అడిగారు

కదా యోగోపదేశం చేయటానికి సాధన సాగించటానికి తగిన పుణ్యఫలం అందించటానికి నేను అత్రిమునికి పుత్రుడుగా జన్మించి దత్తాత్రేయుడు అనే నామంతో సకల లోకాలలో సంచరిస్తూ వుంటాను. ఇది ఒక అవతారం. ఇంకా ఎన్నో జన్మలు, ఎన్నో రూపాలు, ఎన్నో నామాలు నాకు ఉన్నాయి. వాటిని చెప్పటం వెయ్యినోళ్ళు కలిగిన వానికైనా అసాధ్యము. కాని వీనిలో కొన్నింటిని సూతమహర్షి చెప్పగలడు. అతడు వ్యాసమహర్షి ప్రత్యక్ష శిష్యుడు. గురు అనుగ్రహం వల్ల సకల పురాణాలు అతనికి కరతలామలకములు. ప్రవచనంలో కూడా నేర్పరి. అతడిని అడిగి నా జన్మకర్మలుతెలుసుకోండి. ఈ యాగాన్ని పూర్తి చేసి పూర్ణఫలాన్ని పొందండి. ముమ్మూర్తులా నాకు అభిన్నుడైన గురువు సన్నిధిలో ప్రత్యక్ష, పరోక్ష జ్ఞానాన్ని పొంది చివరికి పరమానంద స్వరూపులు కండి. మీరంతా ఏక కంఠంతో చేసిన స్తోత్రము నన్ను ఆనందింపజేసింది. ఇది భక్తి ముక్తిదాయకంగా యోగసిద్ధిదాయకంగా విరాజిల్లుతుంది. భక్తిశ్రద్ధలతో ఇది పఠించిన వారికి సకలాభీష్టాలు నెరవేరును అని చెప్పి ఆ కాంతిపుంజం అదృశ్యమైంది. శౌనకాది మునులందరూ దివ్యానుభవంలో ఆనంద పారవశ్యంలో మునిగితేలుతున్నారు. అంతలో నైమిశారణ్యంలోని బ్రహ్మచారులు అక్కడకు వచ్చారు. వారంతా సమిధలు, ఫలాలు సేకరించుకోవటానికి అడవికి వెళ్ళి వాటిని తీసికొని అక్కడ దర్శించిన అద్భుత దృశ్యములను మహర్షులకు చెప్పాలన్న ఆతృతతో ఆశ్రమంలోకి పరుగు పరుగున ప్రవేశించారు. ఆనంద సాగరంలో వున్న మునులకు నమస్కరించారు.

గురువర్యులారా! రోజూ చూసే అరణ్యం ఈ రోజు వింతగా మారిపోయింది. ఎక్కడా కౄరమృగాలు లేవు. పళ్ళూకాయలతో విరగకాచిన చెట్లు, రంగురంగుల పూవులతో లతలు. కలువల్ని, తామరల్ని గట్టు చేరుస్తున్న సరోవరాలు, హంసలు ఆనందంతో కళకళలాడుతున్నాయి. అడవిలో ఎటుచూచినా పురివిప్పిన మయూరముల నాట్యాలు. ఇదివరకటి అడవిలా లేదు నందనవనంగా మారి వుంది. ఈ వింత మీకు చెబుదామని కారణమేమిటో మీరు చెపుతారని పరుగు పరుగున వచ్చాం అన్నారు.

ఈ సందడిలో తేరుకున్న మునులు నలువైపులా దృష్టి సారించారు. శిష్యులు చెప్పింది నిజమే. నందనవనంలా మారింది నైమిశారణ్యం. ఇది అంతా స్వామి సాక్షాత్కార మహిమ అని గ్రహించారు. జరిగినదంతా శిష్యులకు వివరించారు. మా అదృష్టమే అదృష్టమంటూ పరవశించిపోయారు. వటువులకు ఒకవైపు ఆనందం ఒకవైపు దుఃఖం పొంగివచ్చాయి. తమ గురువులకు స్వామి సాక్షాత్కారం లభించినదని ఆనందమూ, తాము ఆ సమయంలో లేకపోయామే అనే దుఃఖమూ పొంగివచ్చాయి. సరిగ్గా ఇదే సమయానికి మనం అడవికి వెళ్ళాలా, ఎంత దురదృష్ట వంతులం. అయ్యయ్యో మళ్ళీ ఎన్ని జన్మలకి ఈ అవకాశం లభిస్తుంది. ఇంత కాలంగా చేస్తున్న వేదాధ్యయనం ఆశ్రమ సేవ, జపతపములు. గురుసేవ పరిపక్వం కాలేదు కాబోలు అని దుఃఖించారు. అలా విలపిస్తున్న శిష్యులను మునులందరూ జాలిపడి ఓదార్చారు

పరిపరివిధాలుగా. “మీ గురు శుశ్రూష ఫలం వృధాగాపోదు. శిష్యులు కనుక మా పుణ్యంలో మీకూ భాగం ఉంటుంది. సత్సాంగత్యం, సత్ఫలాలను ప్రసాదిస్తుంది. సమయం వచ్చినపుడు మీకూ ఆ ఫలాలు దక్కుతాయి. పరాత్పరుడు కటాక్షిస్తాడు.” అని ఊరడించేసరికి శిష్యులంతా ఊరడిల్లారు. సాయాహ్న విధులను ముగించుకొని ఎవరి కుటీరములలోకి వారు వెళ్ళి విశ్రమించారు.



కామెంట్‌లు లేవు: