5, అక్టోబర్ 2024, శనివారం

అన్నపూర్ణా దేవి*

 🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

           *అన్నపూర్ణా దేవి*

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

*ప్రతీ ఆస్తీకునికి ఈ చిత్తరువు సుపరిచితమే. “భిక్షాం దేహి కృపావలంబనకరి మాతాన్నపూర్ణేశ్వరి” అని ఆది శంకరాచార్యులు కీర్తించిన అన్నపూర్ణాష్టకం అందరూ నోరారా పాడుకుని అమ్మవారి కరుణగా అన్నం తింటున్నాము. మనలాంటి అల్పులకు అన్నం పెట్టింది అమ్మవారు సరే మరి సంపూర్ణ పరబ్రహ్మ అయిన ఈశ్వరునికి అమ్మవారు భిక్ష ఇవ్వడం ఏమిటి?*


*అసలేది అవసరం లేని భవుడు దేహి అని అమ్మవారిని అడగడం ఏమిటి? ఆదిభిక్షువు గా అలా ఎందుకు అవతారం ఎత్తవలసి వచ్చింది? అంటే అంతా ఆయన లీల. శివ, శక్తి  అవిభాజ్యం, కానీ లీలావినోదంగా ఇద్దరూ కలిసి ఆడిన నాటకం ఏమిటో ఒకసారి చూద్దాం.*


*ఒకానొక శుభోదయం నాడు అమ్మవారు అయ్యవారు కైలాశ శిఖరం మీద సుఖాశీనులై ఉండగా ఎప్పటిలాగానె పార్వతీదేవి శివుని ప్రకృతి పురుషులలో ఎవరు అధికులు అని ప్రశ్న సంధించింది.*


*శుద్ధసత్త్వమైన పురుషుని వలననే ప్రకృతికి అస్తిత్వం ఉన్నదని శివుడు చెప్పగా ఇరువురి మధ్య చిన్న వాదోపవాదాలు జరిగి ఆఖరకు అమ్మవారు ప్రకృతి ప్రాభవం తెలియజేయసంకల్పించి అమ్మవారు శక్తిని ఉపసంహారం చేసి అంతర్ధానం అవుతుంది.*


*దానితో పోషణ లేక లోకాలన్నీ అల్లకల్లోలం అయిపోతాయి. కానీ తన సృష్టిలో ఉన్న జీవులన్నీ ఆకలితో అలమటిస్తుంటే తట్టుకోలేక అమ్మవారు కాశీ పట్టణంలో తానే గరిట పట్టుకుని వండి కోటానుకోట్ల జీవులకు వండి పెట్టడం మొదలుపెట్టింది.*


*శివగణమంతా ఆకలికి తట్టుకోలేక హాహాకారాలు చేస్తుంటే తనను నమ్ముకున్న వారి బాధ చూడలేక ఏ ఆకలి దప్పులు లేని నిరతిఆనందస్వరూపుడు శివుడు భిక్షాటనకై భిక్షపాత్ర తీసుకుని కాశీకి వెళ్లి అన్నపూర్ణ చేతిలో అన్నం స్వీకరిస్తాడు.*


*అప్పుడు ఇద్దరిలో ఎవరూ అధికులు కారని, ప్రకృతి పురుషులిద్దరూ అన్నింటా సమానమని చాటి చెప్పి మరల కైలాశానికి వెళ్ళిపోతారు. కాశీ లో అన్నపూర్ణగా అమ్మ శక్తి నిలుస్తుంది.*


*లౌకికంగా చూస్తె ఏమిటి వీరు పోట్లాడుకోవడం ఏమిటి ఆధిక్యం కోసం పోటీ పడ్డట్టు అనిపిస్తుంది కానీ వారు ఆడిన నాటకం ద్వారా చెప్పబోయిన పరమసత్యం మనం అర్ధం చేసుకోవాలి. పురుషాధిక్య ప్రపంచంలో ఎవరైనా పురుషుడే అధికుడని అనుకుని పొరబడే అవకాశం ఉండడం వలన అందరికీ తగు పాఠం చెప్పడానికి దివ్యదంపతులిద్దరూ కలిసి ఆడిన నాటకం ఇది. శక్తి లేకపోతే స్థూల శరీరం ఉండి లాభం లేదు. ఎవరైనా శక్తి హీనుడు అంటారు కానీ విష్ణుహీనుడు, శివహీనుడు అని అనరు. శరీరం లేని శక్తి నిరర్ధకం. శక్తి ఉన్న శరీరం శివం లేకపోతే శవం. కాబట్టి రెండూ సమపాళ్లలో ఉంటేనే మనుగడ అని చాటి చెప్పడానికి ఇద్దరిగా ఉన్న ఒక్కరు ఆడిన నాటకం.*


*అన్నపూర్ణ అమ్మ మహిమ గురించి మరొక రెండు సంఘటనలు చెప్పుకుని ముగిద్దాం.*


*ఒకసారి ఆది శంకరాచార్యులవారు శిష్యులతో కూడి భిక్షాటనకు వెళ్ళినా వారికి ఆహారం దొరకలేదు. శిష్యుల క్షుద్బాధ చూడలేక ఆచార్యులు అమ్మవారిని శరణు వేడారు. అప్పుడు ఆయన గానం చేసినదే అన్నపూర్ణాష్టకం.*


*అమ్మవారు ఎంతో ప్రేమగా అందరికీ వండి వడ్డించింది. అమ్మవారి అనుగ్రహంతో ఆవిడ చెప్పిన బోధవలన ఆయన ప్రస్థానత్రయానికి భాష్యం రాయడం మొదలుపెట్టారు. ఆవిడ పెట్టిన జ్ఞానభిక్ష స్వీకరించిన ఆదిశంకరులు అత్యద్భుతమైన రచనలు చేసారు. ఇక్కడ అమ్మవారు అన్నం అంటే కేవలం భౌతికమైన ఆకలిని మాత్రం తీర్చేది కాదు జ్ఞాన పిపాసను తీర్చే అమృతతుల్యమైన జ్ఞానాన్ని భిక్షగా వేస్తుంది. ఎలాగైతే ఆకలి తీరి శరీరానికి పటుత్వం వస్తుందో, అమ్మవారు పెట్టిన జ్ఞానభిక్ష ద్వారా ఆధ్యాత్మిక అభ్యుదయం కలుగుతుంది. జీవనం పరిపుష్టమవుతుంది.*


*ఒకసారి వ్యాస మహర్షి తన శిష్యకోటితో కాశీ సంచారం చేస్తూ అమ్మవారి లీల వలన వరుసగా రెండు మూడు రోజులు భిక్ష దొరకక చాలా క్లేశాలకు గురవుతారు. తనకు భోజనం పెట్టలేని కాశీని శపించబోతే అమ్మవారు ఒక ముసలి ముత్తైదువులా అక్కడకు వచ్చి గంగా తీరాన వేదవ్యాసునికి, అతని శిష్యబృందానికి షడ్రసోపేతమైన విందు వడ్డిస్తుంది. అటువంటి భిక్ష కేవలం అన్నపూర్ణ అమ్మ మాత్రమె ఇవ్వగలదని గుర్తించి తన అజ్ఞానానికి చింతించి అమ్మవారి పాదాలపై పడతాడు. అప్పుడు తనకెంతో ఆప్తమైన కాశీని శపించబోయిన వ్యాసుని శివుడు కోపగించి ఇక కాశీలో అతనికి ప్రవేశం లేదని శాపవాక్కు ఇస్తారు. అందుకే నేటికీ కూడా గంగకు ఆవలి ఒడ్డున వ్యాసకాశీ వుంటుంది. కాశీలో అమ్మవారు నిలిచి అందరికీ భోజనం పెడుతూ వుంటుంది. అక్కడ అమ్మవారి విగ్రహాన్ని చూస్తె ఒళ్ళు గుగుర్పాటుకు గురవుతుంది. సాక్షాత్తు అమ్మవారు నిలిచి ప్రాణులందరికీ ఆహారం అందిస్తున్న క్షేత్రం అది.*


*ఓం శ్రీ అన్నపూర్ణా దేవ్యే నమః।*

*ఓం శ్రీ అన్నపూర్ణా దేవ్యే నమః।*

*ఓం శ్రీ అన్నపూర్ణా దేవ్యే నమః।*

పూర్తి శ్లోకాలు*

 🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐

*వాడుకలోని సంస్కృత వాక్యాలు*

      *వాటి పూర్తి శ్లోకాలు*

🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐              

 *ఆలస్యం అమృతం విషమ్*

🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐

*పూర్తి శ్లోకం :~*


*సిద్ధ మన్నం ఫలం పక్వం*


*నారీ ప్రథమ యౌవ్వనం।*


*కాలక్షేపం నకర్తవ్యం*


*ఆలస్యం అమృతం విషమ్॥*


*భావము:~*


*వండిన అన్నాన్ని భుజించడానికీ, పండిన పండును కొరుక్కు తినడానికీ, యౌవ్వన వతి పొందును స్వీకరించడానికీ ఆలస్యం చేయ రాదు సుమా ! ఆలస్యం చేస్తే అమృతం కూడా విషమై పోతుంది.*


*ఆలస్యం చేయడం వల్ల అన్నం చల్లారి పోవడం, పండు కుళ్ళి పోవడం, యౌవ్వనం తరగి పోవడం జరుగుతాయి. ఆలస్యం చేయడం వల్ల అమృతం కూడా విషతుల్యమవుతుంది.*


*శ్రీ గురుభ్యో నమః।*

🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐

*ఓం శాంతిః శాంతిః శాంతిః!*

*సర్వేజనా సుఖినోభవంతు!!*

*ఓం తత్సత్!!*


*సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు!!*

*ఓం నమః శివాయ!!!*

🛐🛐🛐🛐🛐🕉️🛐🛐🛐

*(సంకలనం భగవంతుని కృపతో మీ ఆత్రేయపురపు వెంకట రమణమూర్తి)*

🛐🛐🛐🛐🛐🛐🕉️🕉️🛐

దక్షిణ దిక్కుకి

 🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

*దక్షిణ దిక్కుకి తిరిగి నమస్కరించకూడదు.........!!*

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

*దక్షిణ దిక్కుకి తిరిగి నమస్కరించకూడదు. ఎందుకంటే దక్షిణ దిక్కున యమధర్మరాజు గారు ఉంటారు. ఎవరైనా మనకి నమస్కరిస్తే దానిని ఊరికే పుచ్చుకోకూడదు. వారిని ఆశీర్వదించి వారిని మనం ఏ రకంగా అనుగ్రహించగలమో ఆ విధంగా కాపాడాలి.*


*ఇప్పుడు యమధర్మరాజు గారికి నమస్కరిస్తే? ఆయన శక్తి అనుసారంగా ఆయన ఎలా అనుగ్రహించగలరో అలా అనుగ్రహిస్తారు.*


*తప్ప నమస్కారాన్ని ఊరికే పుచ్చుకోరు ఎవరు. తప్పనిసరిగా ఆశీర్వదించి తీరాలి. ఎంత మేరకు వీలైతే అంత వరకు. ఒహో వీడికి పాపం ఈ శరీరం బాధాకరంగా ఉన్నట్టుంది అందుకని నన్ను శరణు వేడుతున్నాడు అని శరీరంతో ఉన్న బంధనాన్ని తీసి వేస్తారు.*


*లేదా, రోగాలు ప్రబలడానికి కారణం యమధర్మ రాజు గారి ఆగ్రహం అంటారు. ఒహో। నాకు నమస్కరించావు కదా, సరేరా అబ్బాయి, నువ్వు చేస్కున్న పాపాలన్ని ఈ రోగం రూపంలో అనుభవించేయి, అప్పుడు ఇక నీకు వాటితో ఒక గొడవ వదిలిపోతుంది అని ఒక రోగాన్ని ప్రసాదిస్తారు చేస్కున్న పాపాలు అన్ని పోయేలాగ.*


*ఆయన చేతుల్లో పనులేంటో అవి కటాక్షించగలరు. కానీ ఈ రెండూ కూడా సహజంగా ఎవరూ కోరుకునే కోరికలు కాదు కాబట్టి దక్షిణ దిక్కుకి తిరిగి నమస్కరించకూడదు.*


*ఓం నమఃశివాయ॥*

🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐

*గో మాత వైభవం

 


🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐

          *గో మాత వైభవం*

🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐

*జగన్మాత "శ్రీ ఆది పరా శక్తి" అయిన "శ్రీ లలితాంబికా దేవి" ఈ లోకంలో 4 రూపాలతో ఉంటుంది. వారు:-*


*1. జనక మాత - మనకు జన్మ ఇచ్చిన అమ్మ (కన్న తల్లి)*


*2. గో మాత - గోవు (ఆవు)*


*3. భూ మాత - భూదేవి (భూమి)*


*4. శ్రీ మాత - దేవాలయాలలోని అమ్మవారు (సరస్వతి, లక్ష్మి, పార్వతి, గాయత్రి, దుర్గా దేవి, కాళికా దేవి, చౌడేశ్వరి దేవి, etc మరియు గ్రామ దేవతలు - గంగమ్మ, ముత్యాలమ్మ, పోలేరమ్మ, సుంకాలమ్మ, నూకాలమ్మ, పుట్టాలమ్మ, అంజేరమ్మ, ఆరేటమ్మ, చెంగాళమ్మ, etc)*


*మనకు కష్టాలు, బాధలు వచ్చినపుడు వాటిని తొలగించడానికి అమ్మవారు ఈ 4 రూపాలలో మనతో పాటు మన మధ్యనే ఉండి మనలను కాపాడుతుంది.*


*గో మాత:-*


*జగన్మాత "శ్రీ ఆది పరా శక్తి" అయిన "శ్రీ లలితాంబికా దేవి" యొక్క 1000 నామాలలో (శ్రీ లలితా సహస్ర నామ స్తోత్రం లో) "గోమాతా" అనే పేరు ఒకటి. అంటే "గో మాత" సాక్షాత్తూ పరదేవత యే (శ్రీ ఆదిపరాశక్తి యే). కనుక గోమాత "శ్రీ లలితాంబికా దేవి" యొక్క స్వరూపం. గోవులో 33 కోట్ల మంది దేవతలు ఉంటారు.*


*1. గోవుకు ప్రదక్షిణం చేస్తే సాక్షాత్తూ పరదేవతకు మరియు 33 కోట్ల మంది దేవతలకు ప్రదక్షిణం చేసినట్లే.*


*2. గోవుకు పచ్చగడ్డి తినిపిస్తే సాక్షాత్తూ పరదేవతకు నైవేద్యం పెట్టినట్లే.*


*3. గోవుకు పూజ చేస్తే సాక్షాత్తూ పరదేవతకు పూజ చేసినట్లే.*


*4. గర్బగుడిలో దేవుని విగ్రహాన్ని తాకి, మన చేతులతో అలంకరణ చేయడానికి అనుమతించరు. కానీ మనం గోవుకు అలంకరణ చేస్తే సాక్షాత్తూ పరదేవతకు అలంకరణ చేసినట్లే.*


*5. గోవులు, దూడలు నేల మీద నడిచి వెళుతుంటే, వాటి వెనుకన మనం నడిచినపుడు వాటి కాళ్ళ నుండి లేచిన మట్టి, దుమ్ము మన మీద పడుతుంది. అప్పుడు మనం ఒక పవిత్ర గంగా స్నానం చేసినట్లు. ఇటువంటి పవిత్రత ఒక్క ఆవులకు మాత్రమే ఈ భూమిపై ఉంది.*


*6. గోవులకు సేవ చేయడం వలన ఎన్నో జన్మలలోని పాపాలు నశిస్తాయి, మంచి సంతానం కలుగుతుంది, సులభంగా దైవ అనుగ్రహం లభిస్తుంది, అష్టైశ్వర్యాలు కలుగుతాయి, ఎల్లపుడూ శుభమే జరుగుతుంది.*


*గోవులకు హాని చేస్తే మొదట ఆగ్రహించువాడు "గోవిందుడు" (గోవులను రక్షించువాడు - శ్రీ మహా విష్ణువు). గోవులకు హాని చేసి, తర్వాత దేవతలను ఎంత ప్రార్థించినా దేవతా అనుగ్రహం లభించదు.*


*"గో" అనగా గోవులు, పశువులు, ధర్మం, భూమి, జలం, ఆకాశం, వేదం, వాక్కు అని అర్థం. వీటినన్నింటినీ రక్షించువాడు "గోవిందుడు".*


*గోవు నందు చతుర్దశ భువనాలున్నాయని వేదం చెబుతుంది. అంటే గోవు పృథ్వీ రూపమని అర్థం.*


*క్షీర సాగరమధన సమయంలో నంది, శుభద్ర, సురభి, సుశీల, బహుళ అనే అయిదు గోవులు ఉద్భవించాయని భవిష్యపురాణం తెలియజేస్తుంది. వీటినే కామధేనువులు అంటారు.*


*ఓం శ్రీ మాత్రే నమః।*

🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐

*శ్రీ ఆది శంకరాచార్య చరిత్రము33

 *శ్రీ ఆది శంకరాచార్య చరిత్రము33 వ భాగము* 

🦃🦃🦃🦃🦃🦃🦃🦃🦃🦃🦃🦃


*గాణాపత్యులు:*

సుబ్రహ్మణ్యక్షేత్రమున అద్వైతమత ప్రచారముచేసి బహుమతములలో నుండిన లోపములను తెలియ జేసి వారల నందరిని సంతుష్టులను జేసి అద్వైత మతమును అవలంబింప జేసిన తరువాత ప్రసిద్ధి కెక్కిన గణవరపురము ప్రవేశించారు శంకరా చార్యస్వామి. 

ఆ పురమందున్న గణపతి ఆశ్రమంలో బసచేశారు.


అచ్చట కౌముదియను పేరు గల నది పారుచు న్నది. అందు వారందరు స్నానాదు లాచరించి విఘ్నేశ్వరాల యమునకు జని గణపతిని దర్శించి షోడశోప చారములతో అర్చించారు. అచట వారందరూ ఒక నెల దినము లుండి ఆ ప్రాంతంలో ఆచరణలో నుండిన మతవిధాన ములను తెలిసికొని అందుగల లోపముల ప్రేమతో తెలియజేసి సవరించుచు నిజ తత్త్వమును బోధించు చు అద్వైతమతస్థాపన చేసారు. 

పద్మపాదాదులందరు పంచా యతన పూజా పరాయణులైరి. శిష్య బృందమంతటికిని ఆహారపదార్థములు తయారు చేయుటకు శంకర శిష్యులలో నొకడైన హరలబలు డను వాడు ఏర్పాటు గావింపబడ్డాడు. పద్మ పాదుడు గురువులను యథా విధిగా పూజించు చు భిక్ష నొసగువాడు. ఏ లోపము లేకుండ శిష్యులందరు మృష్టాన్న భోజనముతో తృప్తి చెందెడివారు. 


సాయంకాలమందు ప్రతి శిష్యుడు ద్వాదశ సాష్టాంగవందనములను అర్పించేవారు. శిష్యులు జగద్గురు వులను వేయి విధాల స్తుతించుచు ఢక్కా మొదలయిన మంగళ వాద్యములు మ్రోగించు చు, కరతాళధ్వనులు సల్పుచు లయానుకూలముగా నృత్యములు చేయుచుండెడి వారు. ఆవిధముగ శ్రీశంకరా వతారమూర్తిని శ్రద్ధతో, భక్తితో, ఆనందపరవశులై కొలుచుచుండే వారు. 


'సకలలోకములకు కారణ భూతుడు, త్రిగుణాతీతుడు, చిదానందుడు, అగమ్యుడు, సత్యస్వరూపుడు, (ప్రపూర్ణాహం, బ్రహ్మాహం) పరిపూర్ణ బ్రహ్మను నేనే, అట్టివాడు సంసార లంపటములో పడిపోక శాశ్వతానందమును పొందుచున్నాడు'ఇట్టి వాక్యములు ఉచ్చరిస్తూ మహానందమును పొందేవారు శిష్యులు. ఆ విధానము నంతను గణవరపుర వాసులు చూచి వింత పడేవారు, కొందరి కది శంకరుల మీద అనుమానము కలిగించినది.


గణవరంలోనున్న గణపతి మతస్థులు శంకరులశిష్యులు చేయుచున్న నృత్య ములు మొదలైనవి చూడగా ఆచార్య పాదులు ప్రబోధచేయు చున్న అద్వైతమతం వారికి నచ్చలేదు. వారందరు శంకరులతోసంభాషించ దలచి యొకనాడు శంకరు లను కలిసికొన్నారు. అందొకడు,


'శంకరాచార్యస్వామీవందనములు! మీరందరు అద్వైత మతము నవలంబించి ఈలాటి కోలాహలం లో మునిగి యుండ చూడగా తెలివైన వాళ్ళు మీ మతమును గౌరవించెదరా? 


వాక్కునకు, మనస్సునకు అందరాని పరమాత్మను ద్వైతం కాదని, అద్వైతమని మీరింక లోకానికెట్లు నచ్చచెప్ప గలరు? కనుక వెంటనే మీ మతమును విడనాడి మా మతమును అవ లంబించుడు. మాది గాణాపత్య మతం. ఇది వేదములకు గౌరవకర మైనది. ఇందు పరమ శాంతి లభించును. స్థిరమైన మోక్షము నిచ్చునది. దీనిని ఆచరించుటకు అవరోధము లెందునా కానరావు. గణపతి మహాదేవుని అనన్య చింతన జేయుచు, గణపతి మహామంత్ర మును జపించుకొను చుండిన, తప్పక మోక్షము లభించును, ఆయన గొప్పతనం

అనంతమైనది'. 


గాణాపత్య మతపద్ధతి శ్రీశంకరపాదులు విని అందుగల లోపాలను ఈవిధంగా చూపించారు:‘గాణాపత్యులారా! మీ మతమందుగల లోప మును గ్రహించ లేకుండుట విచార కరము. విఘ్నేశ్వరుడు ఈశ్వరునికి కుమారుడు అని లోకానికి సువిది తమే గదా! అప్పట్టున కుమారుడు కారకు డెట్లగును? మీ విధానం నిరాధారము. ఎన్ని వాక్యములు పలికినా ఎన్నినామము లున్నా అవన్నియు పరబ్రహ్మకే చెందు చున్నవి’ అని వివరించారు.


పిమ్మట హరిద్రా గణపతి మతస్థులు క్రోధంతో తమ మత ధర్మాలను ఏకరువు పెట్టసాగారు.


గాణాపత్యులలో హరిద్రాగణపతి మతస్థులు ఒక అంతశ్శాఖ. శ్రీ శంకరులు గాణాపత్యులను కాదనడం, వాళ్ళందరు శంకరుల మతంలో లీనమై పోవడం కండ్లార గాంచి సహించ లేకపోయారు హరిద్రా గణపతి మతస్థులు. తమ శాఖకు అది యొక గొడ్డలిపెట్టుగా భావించి బాధపడి, గణకుమారు డను నాతడు ఆవేశంతో లేచి చరచర నడచి శ్రీ శంకర పాదులను చేరి, "యతివరా! ఏ కార్యమును తలపెట్టినా ముందుగా గణపతినే పూజించాలి గదా! దేవతలకు గురువైన బృహస్పతి మొదలైన వాళ్ళను ఆదేశిస్తూం టాడు. బ్రహ్మ మొదలైన దేవతలకు ప్రభువై బ్రహ్మను రక్షించు చుండును. కనుక అతడే జ్యేష్ఠుడు. అట్టి వానిని ఉపాసించ వలెనని వేదములు పలుకుచున్నవి. ఆతడే పూజింప దగినవాడు. అందువలన సమస్త మైన దేవతలు, త్రిమూర్తులు, గణపతి దేవుని పూజిస్తూన్నారు.


యతీశ్వరా! గణపతి దేవుని ఏవిధంగా థ్యానించవలెనో స్కాంద పురాణమందు వివరించబడి యున్నది' 


కరుణా మయుడగు శ్రీజగద్గురువులు గణ కుమారునితో అన్నారు. ‘గణకుమారుడా! నీవాడిన మాటలను అట్లుంచు. పరమేశ్వరు డు అనంతకోటి పేర్లతోపిలువబడు చున్నాడు. గణాధిపతి యనునది సమస్త లోకాలను సృష్టించు పరమాత్మకే చెందవచ్చును. పరమాత్మ కంటె బ్రహ్మాది దేవతలు వేరు గాదు. వారందరు పరమాత్మ యొక్క అంశ గలవారలే! రుద్రుని కంటె గణపతియు వేరుగాదు. సర్వవిఘ్నము లను నిర్విఘ్నంచేసే సర్వాంతర్యామి గణపతి రూపంలో నున్న పరమాత్మను ఉపాసించ వలసినదే!


బాహ్మణులందరు గణపతి మొదలయిన పంచదేవతలను యథావిధిగా నుపాసించ వలసినదే! ఇంక గణపతి చిహ్నము లైన తుండం, దంతం మొదలైన చిహ్నము లను శరీరములను కాల్చి అంకితములు చేసికోవడం పాషండ లక్షణ మగును. కనుక అద్దానిని విడనాడి పంచాయతన పూజలు సల్పు కొనుచు అద్వైత తత్త్వజ్ఞానమును ఆర్జించుకొందురేని ముక్తి తప్పక లభించును.' అని వివరముగ బోధించారు.


అంతట గణకుమారుడు మొదలైన వారందరు శ్రీశంకర పాదుల కరుణా రసపూరిత రహస్య బోధలను విని, తమ మతములోని లోపాలను గ్రహించి, శ్రీశంకరులకు జోహారు లర్పించి సాష్టాంగ వందనము చేసి శిష్యులై ధన్యులయ్యారు. 


పిమ్మట ఉచ్ఛిష్టగణపతి మతస్థుల వంతు అయ్యింది. గణపతి మతములో ఇంకా నాలుగు అంతశ్శాఖలు గలవు. అందు ఉచ్ఛిష్టగణపతి మతము ఒకటి. వారిలో నొకడు లేచి శంకరుల నుద్దేశించి, ‘ఆచార్యస్వామీ! వందనములు! శైవాగమరహస్య మందు ఆరు విధములైన మతములున్నాయి. మహాగణపతి మతము హరిద్రా గణపతి మతము ఉచ్ఛిష్టగణపతి మతము నవనీత గణపతి మతము స్వర్ణగణపతిమతము, సంతాన గణపతి మతము అను నారింట మాది ఉచ్ఛిష్టగణపతి శాఖ పేరెన్నిక గన్నది. మాలో తిరిగి వామ, వామేతర మతము లున్నవి. వామమార్గ మునే ఉచ్ఛిష్టమార్గ మంటారు',


శ్రీశంకరాచార్యస్వామి ఆ కుమారుడు వ్యక్తం చేసిన భావాలను విని, వారికి కూడ హితబోధ చేసారు. పిమ్మట మిగిలిన గణపతి మత శాఖలవారు (నవీన, స్వర్ణ, సంతాన శాఖలు) శ్రీశంకర పాదులతో ముచ్చటించి దోషము లను తెలిసికొని తరించారు.


కాంచీపురము: గణవరపురము నుండి శ్రీ శంకరపాదుల తరువాతి మజిలీ కాంచీపురము చేరు కొన్నారు. “అయోధ్యా మధురా మాయా కాశీ కాంచీ అవంతికా పురీ ద్వారావతీచైవ సప్తైతే మోక్షదాయికాః”


భూమి ఏనాడు పుట్టినదో ఆనాట నుండీ కంచి పేరొందిన పురం. కంచిమోక్షపురం. భారతభూమి యందు సప్తమోక్ష పట్టణాలు ఉన్నాయి. ఇవి కీలకస్థానాలుగా వన్నెకె క్కాయి. పురంపేరు స్మరించి నంత మాత్రాన క్షేత్ర మహిమతో సర్వపాపములు హరించి పోవును. ఏనాడు పరాత్పరుడు ఏ విశ్వాసం తో, ఎవరి ప్రేరణతో సప్తపురము లకు పునాదులు వేసి యుండెనో ఎవరి కెఱుక? మోక్షపురమును దర్శించ నెంచి ప్రవేశించారు. తీరా కంచిలో కాలుపెట్టుసరికి ఆనందం మఱుగై ఆవేదన చోటు చేసికొన్నది. కాంచీ పురము ఆ నాడు వామాచారులతోను తంత్రవిద్యలతోను మునిగి అడుగిడిన ఏమి కీడు మూడునో యను భయము యాత్రికులకు కలుగు చుండెడిది. కొంతకాలం కంచిలో కానవచ్చే భయానక దృశ్యాలకు వెఱగొంది దర్శించడం మానుకొన్నారు. అట్టి మోక్షపురి శంకరపాదు లకు యమపురిగా గోచరించుటచే ఆయనలో జనించిన ఆవేదన పోవు మార్గము ఆలోచించిరి. కరుణామయుడు తలంచిన ఏకార్యము కాకుండును! కంచిలో నున్న వామమార్గాన్ని అనుసరించిన తంత్ర జ్ఞులకు శక్తి లేకుండ జేయడమే వారు ఎంచిన ఉపాయము. అందులకై శ్రీదేవీ దేవాలయమును కట్టించిరి. బహు రమణీయమగు ఆ ఆలయములో శ్రీదేవిని ప్రతిష్ఠించి కామాక్షి యను నామ మిడి అర్చనాది పూజలు, సమస్త ఉపచారములు ఏర్పాటుచేసి నిత్య ధూపదీప నైవేద్యములు కలుగ జేసిరి. శక్తివంత మైన ప్రతిష్ఠయగుటచే తంత్రాది విద్యలకు ఆ ప్రాంతమున ప్రభావం లేకుండపోయెను.


ఆ మహాపవిత్ర మైన కంచిపుర మందే ఒక శివాలయమును నిర్మించి, అచ్చట ఒక పట్టణమును కట్టించి దానికి శివకంచి యను పేరుపెట్టినారు. అచ్చోటనే యున్న శ్రీవరదరాజ స్వామి వారిని ఆశ్రయించి మరి యొక పట్టణము నిర్మించి దానికి విష్ణుకంచి యను నామకరణము జేసిరి. నూతన శివాలయ మందున్న శివునకు, విష్ణ్వాలయమందున్న విష్ణువునకు సర్వోప చారములు గావించు టకు బ్రాహ్మణులను, భక్తులను నియమించి నారు. శంకరపాదులు కాంచీపురమందొక నెల దినము లుండి వేదాంత విజ్ఞాన ప్రబోధము చేయుచుండెడి వారు. వేలాది జనులు వచ్చి వారి బోధలను విని వారలలో కరుడుగట్టు కొని యున్న లోపాలను సవరించు కొనుచు పుణ్యమూర్తులై సుఖముగా నుండెడి వారు. అసహ్యకరమైన కాంచీపురం కన్నుల పండువుగా తయారై మరల స్వస్థానమైన మోక్షపుర అర్హతను సంపాదించు కొన్నది. 


అచ్చోటు వీడి శ్రీశంకరాచార స్వామి శిష్య సమేతముగ తామ్రపర్ణీ నదీ తీరమునకు ప్రయాణమైనారు.


*తామ్రపర్ణీ తీరస్థులు:*


శ్రీ శంకరాచార్యస్వామి కాంచీపురము నుండి తామ్రపర్జీ నదీ తీరమును జేరుకొనిరి. తత్తీరవాసులందరు శ్రీశంకర పాదులు వచ్చారనిన వార్త విని తమకున్న సంశయము లను నివారణ చేసికొన వచ్చునని తలంచి శ్రీశంకరచార్యస్వామిని దర్శించి వందనము లర్పించి, 'యతీశ్వరా! ప్రతి వాని యందును భేద మనునది విధిగా అంటి యున్నది. మన శరీరమందేభేద మున్నది. ఈ భేదము ఈ లోక మందే కాదు, ఇతర లోకములలో కూడ స్పష్టముగ కావచ్చు చున్నది. మానవులు చేసికొనిన కర్మల ననుసరించి పుణ్యలోక ములు, పాపలోక ములుపొందుచున్నారు. ఈ విధముగ ఇహలోక పరలోక ముల యందు భేద మను నది సత్యముగ నున్నది. ఇంత స్పష్టముగ నున్నది వేరొకటి కానరాదు.' అని శ్రీశంకర పాదులకు తామ్రపర్ణి తీరస్థులు తమ సంశయములను నివేదించుకొనిరి.


శ్రీశంకరాచార్యస్వామి 'బ్రాహ్మణోత్త ములారా! నిజమైన విషయములు తెలియక తికమకలు పడు చున్నారు. అజ్ఞాని కి సదా భేదమే యుండును. ఇదంతా బ్రహ్మ మయమని కంటికి కనుపించున వన్నియు నశించునని యు, చూచేవాడు, చూడ బడునది కూడ నాశనమగునని జ్ఞాని దృఢంగా నమ్ముచు న్నాడు. అట్టి జ్ఞానికి భేద మనునది లేదు. భేద భావననశించడమే జ్ఞానోదయం. శ్రీ పరాత్పరుడు లోకము లను సృష్టించి అందే ప్రవేశించును. అనగా జీవాత్మరూపంలో ప్రాణులయందున్నాడు. కనుక ప్రాణులన్నీ పరమాత్మే యగు చున్నవి గదా! దేవత లెందరని ప్రశ్నించి, అనేకమంది దేవతలలో పరమాత్మ ఇమిడి ఉన్నాడని తేల్చింది వేదమే. కడకు భగవంతు డొక్కడే యని నిర్ణయం చేసింది. ప్రాణ మనినా పరబ్రహ్మ మనినా ఆ దేవాదిదేవు నకే చెందు చున్నది. ఆయనే అనేకముగ ఉంటున్నాడు. ఇంక ఆయన కంటె మరి యొకడు లేనే లేడు. పరమాత్మ తత్త్వం తెలిసికొనిన వానికి భేద మనునది యుండదు. అట్టి జ్ఞానమును సముపార్జించవలెనన్న పరబ్రహ్మను ఉపాసించ వలెను.’ అని వివరించి వారల ఆనుమానము ను నిర్మూలించారు.

తామ్రపర్ణి తీరస్థులు శంకరుల ఉపదేశా మృతపానం చేసి సంతుష్టులైనారు. వారందరు శ్రీ ఆచార్యస్వామికి శిష్యులై అద్వైత తత్త్వజ్ఞానమును ఆర్జించు కొనుచు బ్రహ్మానందమును పొందుచుండిరి. 


శ్రీ ఆచార్యస్వామి తామ్రపర్ణి నదీతీరము నుండి ఆంధ్రదేశ సంచారమునకై పయన మయ్యారు.  


*కాలడి శంకర కైలాస శంకర*


*శ్రీ ఆది శంకరాచార్య చరిత్రము 33 వ భాగము సమాప్తము*

🌺🌺🌺🌹🌹🌹🌺🌺🌺🌺🌺🌺

*శ్రీ ఆది శంకరాచార్య చరితము32

 _*శ్రీ ఆది శంకరాచార్య చరితము32 వ భాగము*_

🐄🐄🐄🐄🐄🐄🐄🐄🐄🐄🐄🐄


*హిరణ్యగర్భమతము*:


అనంతశయన క్షేత్రము నుండి శ్రీ ఆచార్య స్వామి శిష్య పరివార సహితంగా బయలుదేరి అయిదు దినములకు సుబ్రహ్మణ్యక్షేత్రం చేరు కొన్నారు. 


ఆ క్షేత్రమందు గల కుమార ధారా నది మిగుల పవిత్రమై ప్రసిద్ధి కెక్కి యున్నది. అచట షణ్ముఖస్వామివారి ఆలయ మున్నది. అది గొప్ప యాత్రా స్థలము.


శ్రీశంకరావతారమూర్తి, కుమారధారానదిలో స్నానమాచరించి విభూతి నలంకరించు కొని కాషాయాంబర ములు ధరించి దండకమండల ధారియై దివ్యమైన తేజస్సుతో బయలుదేరి షణ్ముఖ స్వామివారిని దర్శించు టకు వెడలుచున్నారు. ఆ మహాతేజస్సం పన్నుని జూచి కైలాస వాసుని వలె భావించి అబ్బురపడి వారితో ముచ్చటించు భాగ్యము పొందుటకై పరితపిం చారు. తమ మత ప్రభావమును వారికి నివేదించుటకు ఆయత్త పడ్డారు. యాత్రీకులలో నొకడు పట్టజాలక శంకరపాదుల కడకు వచ్చి,


'యతివర్యా! మేమందరం బ్రాహ్మణ కులంబున జన్మించి ద్విజులమై మనుధర్మ శాస్త్రానుసారం కర్మల ను చేయుచున్నాము. ఆది పురుషుడైన హిరణ్యగర్భుని మనసార సేవిస్తూ నిర్మల హృదయం గల వారలమై ఆ దేవదేవుని అనుగ్రహం వలన ఏచింతా చీకూ లేకుండ సుఖముగ నుంటున్నా రము. స్వామీ! సమస్త ప్రాణి కోటి పుట్టుటకు ముందుగ హిరణ్యగర్భు డు ఉద్భవించాడు. అర్హుడగుటచే ఆయనకే హవిస్సునిస్తున్నారు. వేదవాక్యము లందుకు పరమ ప్రమాణములుగ నున్నవి. సృష్టికర్తయై పాలకుడై లయకారకుడై ఉత్తమోత్తముడై పరమానందధాముడై యున్నాడని తెలుప బడుచున్నది. ‘తదైక్షత' ఇత్యాది వాక్యములు ఆయనను స్తుతించు చున్నవిగదా! ఆ ప్రభువు తన భుజము లచే శివకేశవులను సృష్టిస్తున్నాడు. అట్టి సర్వాంతర్యామి అయిన హిరణ్యగర్భుని భక్తులమై యున్నాము. సర్వదా యోగనిష్ఠలో నుండి కూర్చ కమండ లులను ధరించు వారలము. 

మహా యశస్సంపన్ను లైన మిమ్ములను దర్శించుటతో నిశ్చయంగా కృతార్థుల మైతిమి. ఒకించుక మా మాట నాలకించుడు.


'యోగీశ్వరేశ్వరా! జీవేశ్వరాభేద తత్త్వము తో నేమి ప్రయోజ నము గలదు? సర్వ లోకాధిపతియైన హిరణ్యగర్భుని ఉపాసించుడు. ఆ పరాత్పరుని వలన సర్వప్రాణులు పుట్టు చున్నవి. కర్మఫలం వలన దుఃఖ భూయిష్ట మైన సంసార సాగరంలో బడుచున్నారు. హిరణ్యగర్భుడే సర్వ మూలకారణుడై యున్నాడు. ప్రళయ కాల మందు జీవకోటి యావత్తు బ్రహ్మలో లయమగుచున్నది. దీనినే మోక్ష మనుచు న్నారు. వారల వాసనా బలంతో సృష్టి జరుగు నప్పుడు మరల జీవులుపుట్టుచున్నారు. ఇది నిజమైన మోక్షం కాదు. ఒక్క బ్రహ్మజ్ఞాన సంపన్నుడే పరమ పదమగు బ్రహ్మలోక నివాసము నొందు చున్నాడు. వానికి పునర్జన్మ లేదు. కావున హిరణ్యగర్భుడు సేవింపదగినవాడై యున్నందున తాము దండ, కమండలములను ధరించి యతీశ్వరులై జగద్గురువులై బ్రహ్మ జ్ఞానులై యుండుటచే బ్రహ్మలోకమును పొంద తగి యున్నారు. కనుక తామట్లు హిరణ్యగర్భుని ఉపాసించుడు' అని వివరించాడు. 


హిరణ్యగర్భ మతస్థు డు చెప్పుకొన్న దంతా చక్కగా విని,

'భక్తులారా! బ్రహ్మాదు లందరు ఎవరి వలన ఉద్భవించారో తెలిసి కొనవలెను.పరాత్పరుని గురించి క్షుణ్ణంగా తెలిసి కొన్నచో ముక్తి తప్పక లభ్యంకాగలదు. ముక్తి హేతువైన తత్త్వజ్ఞానం కావలెనన్న వేదాంత శ్రవణాదులు చేయాలి. మీరనినట్లు లయకాల ముక్తి శాశ్వతంకాదు. అది ఒక దీర్ఘ నిద్ర వంటిది. బ్రహ్మను ఆశ్రయిస్తే జ్ఞానం రాదు, తత్త్వ జ్ఞానార్జనతోనే బ్రహ్మత్వాన్ని పొందేది. ఈ విధాన మంతయు వివరంగా శ్రుతులు తెల్పుచున్నవి.' అని శ్రీఆచార్యస్వామి తెలియచెప్పారు.


శ్రీశంకరపాదులు తెల్పిన తత్వరహస్య మును గ్రహించి హిరణ్యగర్భమతస్థులు బ్రహ్మానంద భరితులై శ్రీ ఆచార్య స్వామికి శిష్యులయ్యారు. 


పిమ్మట అగ్నిదేవో పాసకులు శంకరులతో ముచ్చటించ నెంచిరి.


*అగ్ని దేవోపాసకులు:*


అగ్నిని ఆరాధించే మతములోని వారొకరు లేచి శంకరులను

సమీపించి, "స్వామీ! నమస్కారములు! మేము అగ్నిహోత్రుని యథావిధిగా పూజించు వారలము. ఆయన మాకు పరమదైవం. సృష్టికి పూర్వం ఒక్క అగ్నిదేవుడే ఉన్నాడు. దేవతలందరు అగ్ని నుండి జనించారు. ఆ దేవగణమందు గల అగ్నిదేవుడే విష్ణుమూర్తి అయ్యాడు. అగ్నియే మొదట హవిస్సును గైకొనుచున్నాడు. పిమ్మట దేవతలకిచ్చు చున్నాడు. వేదము అగ్నికి ప్రముఖస్థానం కల్పించి బ్రాహ్మణులను పూజించ మనుచున్నది. వారు దానిని అత్యంత భక్తితో భద్రపరచు కొనినిత్యము ఉపాసిస్తూ ముక్తులగు చున్నారు. కావున మోక్ష హేతువునకు అగ్నిని పూజించుట మూలకారణము అగుచున్నది.


సర్వపాప హరుడని,ఉపాస్యుడని, అగ్నిదేవుడని వేదము లు తెలియజేయు చున్నవి. తామును మా వలెనే అగ్ని దేవుని ఆరాధించి ముక్తి నొందుడు. మీ మతం వలన ప్రయోజనం శూన్యం.' అని వెల్లడించారు. 


శ్రీ శంకరపాదులు వహ్ని మత పద్ధతిని విని,


‘అగ్ని దేవోపాసకులారా! అగ్ని దేవతలందరి కంటే తక్కువ వాడు. దేవతలు మధ్యమము గను, విష్ణువు అందరి కంటే గొప్పవాడుగను చెప్పబడినది. పైగా అగ్ని దేవతలందరకు హవిస్సు తెచ్చి ఎవరి భాగం వాళ్ళకు అందిం చే వాడుగను కర్మ దేవతగను ఉన్నాడు. అగ్నిదేవుని గురించి చెప్పబడే వాక్యము లన్నియు ఆత్మకు సంబంధించిన వని తెలిసికొనుడు. కావున ఇంతటి నుంచి తత్త్వమును గ్రహించి అగ్నిహోత్రాది సత్కర్మ లుచేస్తూ విష్ణుదేవుని ఉపాసించుడు. అప్పుడు జ్ఞానార్జనకు అవకాశం లభించి తద్వారా ముక్తిని బడయగలరు.’ అని నిజస్థితిని తెలిపిరి.


అంతట అగ్నిమత స్థులు శ్రీశంకరుల సుభాషితముల ఆంత ర్యం గృహించి అద్వైత మతము నవలంబించి శ్రీ ఆచార్య స్వామివారికి శిష్యులయ్యారు. 


పిమ్మట సౌరమతస్థులు శంకరులకు తమ మతప్రభావమును వ్యక్తం చేయ నుద్యుక్తు లయ్యారు.


సౌరమతస్థులు:


సూర్యుని ఉపాసించు వారిని సౌరమతస్థు లందురు. సూర్యునకు ప్రీతికరమైన రక్త పుష్ప మాలికలను ధరించు కొని భాస్కరచక్రాంకిత ములను వేసికొన్నవారు వచ్చియున్నారు. అందు భాస్కరుడను పేరు గలవాడు లేచి, “ఆచార్యస్వామీ! నమస్కారములు! అన్ని మతముల కంటె బహు శ్రేష్ఠమైన మా మత మెట్టిదో వినండి. ఎవరి మట్టుకు వారు, వారి మతమే గొప్పదని చెప్పుకొన్నను,అందున్న రహస్యమును తెలిసి కొనినగాని నిజం తేలదు. శ్రుతిలో సర్వలోకములకు సూర్యుడు నేత్రమై ప్రకాశించుచున్నాడని తెలుపబడి యున్నది కదా. ఆతడే తిమూర్త్యా త్మకమై సృష్టి స్థితి లయములకు కారకుడై యున్నాడు. ఆదిత్యుడే పరబ్రహ్మమని వేదము లు పల్కుచున్నాయి.


సూర్యోపాసకు లందరు వేదమందున్న సూర్య మహా మంత్రాన్ని (శ్రీఘృణి సూర్య ఆదిత్య) జపిస్తూ ఉంటారు. రక్తచందనం తిలకముగ ధరించి, ఎఱ్ఱటి పుష్పమాలిక లను అలంకరించు కొనెదము. మా సూర్య ఉపాసకులు ఆరు రకములుగా నున్నారు. (1) ఉదయభాస్కరుని బ్రహ్మగా భావించి ఉపాసించువారు, 


(2) మిట్టమధ్యాహ్నపు సూర్యుని ఈశ్వరుని గను లయకారునిగను, భావించి పూజించువారు


(3) సూర్యాస్తమయ భాస్కరుని సర్వరక్షకు డైన విష్ణుమూర్తిగ ఉపాసించువారు, 


(4) త్రిసంధ్యల యందున్న భానుని త్రిమూర్తిగా భావించి అర్చించువారు,


(5) సూర్యుని గగన మండలంలో ఎచ్చోట నైనను చూచుటే ప్రధానంగా గలవారు, వీరలు సూర్యదర్శనం చేయకుండ భోజనం చేయరు. ఎప్పుడు కన్పించిన అప్పుడే భుజించువారు. కన్పించు వరకు ఉపవసించెదరు, 


(6) నుదుటను భుజములయందు వక్షస్థలమందు, సూర్య మండల చిహ్నములను అంకితంచేసికొన్నవారు, అను ఆరు శాఖలవారు అనుక్షణము సూర్య మంత్రమును జపించు కొందురు. ఇది మావిధి విధానము, ఇందులకు శ్రుతి ప్రమాణము లనేకము లున్నవి. పురుష సూక్తమందు భానుని గురించియే స్తుతించబడి యున్నది. 'పురుషంకృష్ణపింగళమ్' అని రుద్రమంత్ర మందు ఆదిత్యుని తెలియజేయుచున్నది. 


ఇట్లనేక ప్రకారముల శ్రీసూర్యదేవుని తెలియ జేయుచున్నందున మా కారాధ్యదైవమయ్యాడు. 


అరుణ, సూర్య, భాను, చంద్ర, తపన, మిత్ర, హిరణ్యరేత, రవి, అర్యమ, గభస్తి, విష్ణు, దివాకర అను పండ్రెండు పదములతో విరాజిల్లుచుండుటచే ద్వాదశాదిత్యుడను బిరుదు పొంది యున్నాడు. ఆ నామ ములలో విష్ణునామ ముండుటచే సూర్యుడే విష్ణువై యున్నాడనుట నిర్వివాదము. శ్రీకృష్ణపరమాత్మ పండ్రెండుగురు ఆదిత్యులలో విష్ణువును నేనే యని యనుటకు కారణ మైనది. జ్యోతులలోకెల్ల కిరణా (దాతా, అర్యమా, మిత్ర: వరుణః ఇన్ద్ర: వివస్వాన్, పూషా, పర్జన్యః అంశుః భగః త్వష్టా, విష్ణుః అనునది మరియొక పాఠము) లతో కూడిన రవిని నేనే (ఆదిత్యానామ హం విష్ణుర్జ్యోతిషాం రవి రంశుమాన్) అని యుండుటచే రవిని శ్రీకృష్ణపరమాత్మగా తెలిపియున్నారు. కనుక బ్రహ్మాది దేవత లందరు రవినుండి ఉద్భవించారు. సమస్త విషయములకు కారణ భూతుడగుట వలన మోక్షకాము లందరు సూర్య భగవానుని ఆరాధించి తీరవలెను' అని వ్యక్తం అవు తున్నది. శ్రీశంకరాచార్యస్వామి సౌరమత భావములను పూర్తిగా విన్నారు. సౌరమతమందు గల లోపాలను సవరించ నెంచి,


దివాకరా! మీ రందరు ఒక చిన్న విషయము తెలిసికొనలేక చిక్కు లలో పడియున్నారు. 'చంద్రమా మనసో జాతః చక్షో స్సూర్యః' అని యున్నది గదా! అనగా పరాత్పరుని మనస్సునుండి చందురుడును నేత్రమునుండి సూర్యుడును పుట్టి యున్నారు అని వేదమే ప్రమాణమై యున్నది. 


‘యజ్జ న్యం తన్నశ్యమ్' పుట్టినది నశించునదే గదా! సూర్యుడు పుట్టిన వాడాయెను. కనుక ఆతడును నశించువాడే. నశించు వాని యందు బ్రహ్మత్వ మెట్లుండును?


మరియొక విషయము నాలకించుడు. గాలి వీచుచున్నది.సూర్యుడు నిత్యము ఉదయించు చున్నాడు. అగ్ని వెలుగుచున్నది. దేవేంద్రుడు స్వర్గమును పరిపాలిస్తున్నాడు. మృత్యువు పరుగులు వారుచున్నది. వీళ్ళం దరు పరాత్పరుని ఆజ్ఞకు బద్ధులై వాళ్ళ వాళ్ళకు నియమింప బడిన పనులు నెరవేర్చుచున్నారు. అట్టి పరిస్థితులలో సూర్యుణ్ని భగవంతు డని అనడం మూఢత్వం కాక మరేమున్నది! పరమాత్మకు అపార మైన ప్రకాశమున్నది.


ఆ ప్రకాశములో ఇతరు లెట్లు ప్రకాశింప గలరు. పరమాత్మను అనుస రించి మిగిలినవన్నియు ప్రకాశించుచున్నవి. అప్పుడు సూర్యుడు పరబ్రహ్మ ఎట్లగును? జ్యోతిష శాస్త్రమందు సూర్యుడు మొదలైన వారికి నిత్యత్వము లేదని చెప్పబడినది. బ్రహ్మ ఉదయకాల మందు దేవతలందరు పుట్టుచున్నారు. బ్రహ్మ దినాంతమందు వారందరు లయమగు చున్నారు. ఈ రెండు కల్పముల కాలము బ్రహ్మకు ఒక దిన మగుచున్నది. అట్టితరి అందరికీ మూలకారణ త్వం సూర్యునకు అంట కట్టడం న్యాయం కానరాదు. కావున పరమాత్మనే ఉపాసిం చుడు. మీ పాషండ చిహ్నాలను విడనాడి సదాచారములను,

అలవరచుకొనండి. పరమ పవిత్రమైన ఆత్మ తత్త్వ మును తెలిసికొనండి. జ్ఞానము నార్జించుకొని ముక్తిని పొందుడు.' అని ఉపదేశించారు. ఆచార్యపాదులు.


శ్రీ శంకరాచార్యస్వామి సౌరమత లోపాలను ఏరివేయుటతో దివాకరాదులందరు సంతోషించిరి. నాటితో సౌరమతమునకు నీళ్ళువదిలి అద్వైత మతము నవలంబించి శ్రీ శంకర పాదులకు శిష్యులై బహుభంగుల కీర్తించారు.


శ్రీ శంకరపాదులకు అప్పటికి మూడు వేలమంది శిష్యులు ఉన్నారు. జగద్గురువులయెడ గాఢమైన భక్తి కలుగ కొందరు శంఖములు పూరించిరి. మరికొందరు దివ్యమంగళ ధ్వనులు గావించారు. కొందరు ఏకకంఠంతో స్వస్తి వాచకములు పలికారు. మరికొందరు కరతాళ ధ్వనులు చేసారు. శంకరులకు ఇరు పార్శ్వములందుండి వింజామరలతో వీచుచున్నారు. మిగిలినవారు నెమలి పింఛములు ధరించారు ఆనందం పెల్లుబుకు నట్లు సకలోపచారము లర్పించేవారు. అట్లు శిష్యకోటి అర్చించు చున్నను కించిత్తెనను భోగములను అనుభ వించక తామరాకు మీది నీటిబిందువు పగిది యుండెడివారు

 శ్రీ ఆచార్యస్వామి. నెలరోజులయినతోడనే సుబ్రహ్మణ్యక్షేత్రం వీడి శిష్యకోటితో గణవర పురమునకు ప్రయాణ మైనారు.


*కాలడి శంకర కైలాస శంకర* 


*శ్రీ ఆది శంకరాచార్య చరిత్రము 32 వ భాగము సమాప్తము*

🪴🪴🪴🪴🪴🪴🪴🪴🪴🪴🪴🪴

పరాశక్తి, లక్ష్మీ దేవి

 


శ్రీభారత్ వీక్షకులకు శరన్నవరాత్రి శుభాకాంక్షలు 🌹 ఆశ్వయుజం అటు దుర్గా దేవి కి, ఇటు లక్ష్మీ దేవికి కూడా ఎంతో ప్రీతికరమైన మాసం.  పరాశక్తి, లక్ష్మీ దేవి ఇద్దరూ పూజలందుకొంటారు. అయితే ఆ పరాశక్తి అంశలతో లక్ష్మీ దేవి ఎన్ని రూపాలు ధరించింది, ఏ పేరుతో ఎలా ప్రాముఖ్యత సాధించింది, దేవీ భాగవతం లో ఆ వివరాలు ఏం తెలుస్తున్నాయో ఈ ఎపిసోడ్ లో వినిపించారు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త డా. తిరుమల నీరజ గారు. లక్ష్మీదేవి క్షీర సాగరం నుండి ఎలా ఉద్భవించింది, కనకధారా స్తోత్రం చదివితే కలిగే ప్రయోజనమేమిటో వినండి. ఇటువంటి విశిష్టమైన ఎపిసోడ్స్ ఉచితంగా వీక్షించడానికి వెంటనే చానల్ ను subscribe చేయండి, శ్రీభారత్ కుటుంబ సభ్యులు కండి.🙏

Kalla Jodu కళ్ల జోడు


 కళ్ళజోడు 


కళ్ళజోడు అంటే తెలియనివారు వుండరు. దృష్టి దోషం ఉన్నవారు కళ్ళజోడు పెట్టుకోక తప్పదు. కానీ ఈ ఆధునిక కాలంలో చాలామంది రంగు రంగుల కళ్లజోళ్లు, సన్ గ్లాస్, అని ఫోటో గ్రే అని ఇలా అనేక రకాల కళ్ళ జోళ్ళు వాడటం కూడా పరిపాటి. స్థూలంగా చెప్పాలంటే సాదారణంగా కళ్ళు సరిగా కనపడని వారు అంటే చేత్వారం వచ్చిన వాళ్ళు లేక దూర దృష్టి సరిగా లేనివారు ముఖ్యంగా (చిన్న పిల్లలు ఈ కోవకు చెబుతారు.) కళ్ళ జోడులు వాడతారు. నిజానికి కళ్ళ జోడు లేకపోయినా మనిషికి కనపడుతుంది కానీ స్పష్టంగా కనపడదు. సాధారణ మనుషులకు 6/6 దృష్టి (sight ) వుండాలని వైద్యులు అంటారు. 5/5 దృష్టి (sight ) ఉంటే వారి చూపు పరిపూర్ణంగా ఉన్నట్లు లెక్క. దృష్టిలో వున్న దోషాలకు తగిన కళ్ళ జోడు ఇచ్చి వైద్యులు దృష్టిని 6/6 వచ్చేటట్లు సవరిస్తారు. అట్లా చేయటం వలన సాధారణంగా చూడగలరు. నిజానికి కళ్ళజోడు ద్రుష్టి దోషాన్ని సవరిస్తుంది కానీ అంధులకు దృష్టిని ఇవ్వదు. ఒక్క మాటలో చెప్పాలంటే కళ్లజోడుతో ఒక మనిషి తన దృష్టిని పెంచుకుంటాడు కానీ చూడలేనివాడు వైద్యుడు ఇచ్చే కళ్ళజోడు పెట్టుకున్నంత మాత్రాన చూడలేడు. ఇది బౌతికంగా ప్రతి మనిషికి తెలిసిన విషయం. ఇక అసలు విషయానికి వస్తే ఒక సాధకుడు మోక్షాన్ని పొందటానికి ఒక గురువు వస్తాడు అని అతని వలన తనకు మోక్షం సిద్ధిస్తుందని మనలో చాలామంది సాధకులు ఒక అభిప్రాయాన్ని కలిగి వుంటారు. కానీ అది ఎంతమాత్రమూ నిజాము కాదు. ఒక సాధకునిని ఒక గురువు ఎట్టి పరిస్థితిలోను మోక్షాన్ని ప్రసాదించలేడు. గురువు సాధకునికి కొంతవరకు మాత్రమే మోక్షమార్గానికి దోశదపడతాడు. అందునికి కళ్ళజోడు పెట్టుకున్నా ఏరకంగా కనపడదో అదే విధంగా ఆధ్యాత్మిక మార్గంలో లేనివారికి గురువు చేసే ఉపదేశాలు చెవిటి ముందు ఊదిన శంఖం లాగ ఏరకంగాను దోహదపడవు. కాబట్టి ముందుగా ప్రతి సాధకుడు గుర్తించాల్సిన విషయం ఏమిటంటే ముందుగా తనకు తానుగా తానూ ఎంతవరకు ఆధ్యాత్మిక సాధనలో ముందుకు సాగాను అని పరిశీలనచేసుకోవాలి, తరువాత తనకు తన మార్గంలో అవరోధంగా వున్నవి ఏమిటి అన్నవి గుర్తించాలి. కొందరికి అరిషడ్వార్గం మొత్తంగా లేక ఏదోఒకటి లేక ఒకటికన్నా ఎక్కువ అవరోధంగా ఉండవచ్చు. ఉదాహరణకు ఒక సాధకుడు కామ క్రోధాదులను జయించిన కూడా జిహ్వ చాపల్యానిని త్యజించక పోవచ్చు. నాకు ఫలానా వంటలే కావలి ఫలానా తినుబండారాలే కావలి అని అనుకున్నాడనుకోండి. తానూ కోరిన తినుబండారం దొరికితే సరే లేకపోతె మనస్సు తాను కోరుకున్న వస్తువు (వంటకం) మీదకు పరిపరి విధాలుగా వెళ్లి దానిని సాదించటానికి ప్రయత్నం చేస్తుంది. మనకు తెలుసు సాధకుని మనస్సు స్వాధీనంలో లేకపోతె సాధన కుదరదు. మనందరకు తెలిసిన సాధారణ ఆధ్యాత్మిక నియమం " మనః ఏవ కారణః మనుష్యాణాం బంధః ఏవ మోక్షహ" కాబట్టి తాను కోరుకున్న వంటకం మీదకు మనస్సు మళ్లినప్పుడు సాధకుడు సాధనలో ముందుకు సాగలేడు . నేను చాలా చిన్న ఉదాహారణ ఇచ్చాను. సాధకుడిని కామ క్రోధ, మొహా, మద మాత్సర్యాలు పరిగెట్టే గుర్రాలుగా వచ్చి దాడి చేస్తాయి. సాధకుడు కొంత మేరకు సాధనలో ముందుకు సాగితే తనకు తెలియకుండానే కొన్ని అద్భుత శక్తులు వస్తాయి. ఉదాహరణకు సంకల్ప సిద్ది. అంటే సాధకుడు తాను తన మనస్సులో ఏది అనుకుంటే అది సిద్దించటం అనుమాట. అలాగే సాధకునికి వాక్సుద్ధి కలుగుతుంది. ప్రారంభంలో ఇలాటివి సంక్రమిస్తాయి. వాటికి తాను ఉప్పొంగిపోయి తాను ఏదో సాదించాననే భావన మదిలో కలిగిందా ఇక ఇంతే కొండమీద నుండి జారీ క్రిందపడ్డ వాడి గతే మరల తాను సాధనలో ముందుకు వెళ్ళటానికి చాలా సమయం పట్టవచ్చు లేక చాలా జన్మలు పట్టవచ్చు. ఇక్కడ ఒక విషయం చెప్పాలి 84 లక్షల జీవరాసులలో మనుష్య జన్మ ఒకటి. తాను ఈ దేహం వదలిన తరువాత తిరిగి మనుష్య జన్మ సిద్దిస్తుందనటానికి నమ్మకం లేదు. ఈ జీవన మరణ భ్రమణలో ఎప్పటికో తిరిగి తన పుణ్య ఫలం కొద్దీ తిరిగి మనుష్య జనమ లభించ వచ్చు. అది ఏంటో దుర్లభామ్. కాబట్టి ఈ జన్మను సార్ధకత చేసుకోవటానికే సదా సాధకుడు కృషి చేస్తే మంచిది. . సాధకుడు సదా తన మనస్సును నిర్మలంగా నిర్వికల్పంగా ఉంచుకోవాలి. నిరంతరం ద్రుష్టి భగవంతుని మీదనే లగ్నాత చేయాలి. తన చుట్టూ ప్రక్కల అనేక విషయాలు తనని మాయలో పడేసేవి ఉంటాయి. అవి సుందరమైన స్త్రీలే కావచ్చు, ధన కనక వస్తు వాహనాదివి అయినా కావచ్చు. వేటికికూడా సాధకుని మనస్సు చెలించనీయకుండా చూసుకోవాలి. అప్పుడే సాధకుని సాధన ముందుకు వెళుతుంది. 

సాధకుడు ఎంతో శ్రమదమాలకు ఓర్చి నిరంతర కృషిచేస్తేనో సాధన చతుష్టయాన్ని సాధించగలరు. నిరంతర సాధనతో ముముక్షత్వన్ని సాధిస్తే అప్పుడు గురువు తనకు మార్గదర్శనం చేస్తాడు. ఇక్కడ అసలు ప్రశ్న ఉదయిస్తుంది. ముముక్షత్వస్థితిని చేరిన సాధకునికి ఇంకా గురువు ఆవశ్యకత ఏముంది అని అనుకుంటాము. ఎప్పుడైతే సాధకుడు నిరంతరం సాధన చేస్తూ భగవంతునివైపు పయనం అవుతుంటాడో అప్పుడు అనుకోకుండా ఎన్నో అడ్డంకులు వస్తూవుంటాయి. కొన్ని అవరోధాలు ఎలా ఉంటాయి అంటే తాను సరైన మార్గంలో లేడు అని అనిపించేవిధంగా ఉంటాయి. కొన్ని సందర్భాలలో తాను సాధనలో విఫలమైనాను అని తలచేవిధంగా కూడా భావనలు మదిలో మెలగవచ్చు. అట్టి తరి ఒక సద్గురువు తారసపడి తనను సరైన మార్గంలో పెట్టి తన జన్మకు సార్ధకతను కలుగ చేస్తాడు. ఏరకంగా అయితే వివేకానందస్వామికి రామకృష్ణ పరమహంస దొరికారో అలాగ.  

ఇక్కడ ప్రతి సాధకుడు తెలుసుకోవలసింది ఏమిటంటే ముందుగా సాధకుని ద్రుష్టి సంపూర్ణంగా భగవంతుని మీద మాత్రమే కేంద్రీకరించబడి ఉండాలి తరువాత తాను సరిగా చూడ లేకపోతే కళ్ళ డాక్టారు ద్రుష్టి దోషాన్ని సవరించి కళ్ళజోడు ఇచ్చి దృష్టిని మెరుగు పరుస్తాడో అదే విధంగా సద్గురువు సాధకుని దృష్టిని పూర్తిగా భగవంతుని వైపే మళ్ళేటట్లు తన బోధనల వలన చేస్తాడు. భగవంతుని దర్శించుకునే పని మాత్రం సాధకునిదే. సాధకుడు నిరంతర సాధన చేస్తే మాత్రమే భగవత్సాక్షాత్కారం కాదు. అది మరవ వలదు. కాబట్టి సాధక మిత్రమా నిన్ను ఎవరో వచ్చి ఉద్ధరిస్తారని కాలయాపన చేయక ఈ క్షణమే మోక్షార్థివి కమ్ము సాధన మొదలుపెట్టు. ఆత్మసాక్షాత్కారాన్ని పొందటానికి కృషి చేయి. నిరంతర సాధన తప్పకుండ మోక్షాన్ని సిద్ధిస్తుంది. అందులో అనుమానమే లేదు. 

ఓం తత్సత్ 

ఓం శాంతి శాంతి శాంతిః 

ఇట్లు 

మీ భార్గవ శర్మ 

*శ్రీ అమ్మవారి స్ధల పురాణం:*

 



           *శ్రీ అమ్మవారి స్ధల పురాణం:*

                       ➖➖➖✍️


విజయవాడ పట్టణంలో దుర్గాదేవి వెలసిన పర్వతం పేరు ‘ఇంద్రకీలాద్రి,’ పర్వత రూపుడైన కీలుడు దుర్గాదేవి ఉపాసకుడు. ఆ దుర్గాదేవిని తన హృదయ కుహరంలో (గుహలో) నివశించమని అపార తపస్సు చేశాడు.   కీలుని భక్తికి కరుణారస ప్రపూర్ణ అయిన జగదంబ దుర్గ కనకదుర్గగా  వాని హృదయ కుహరంలో  స్వయంభువుగా వెలసింది. స్వర్ణ మణిమయ కాంతులతో ప్రకాశిస్తున్న ఆ కనకదుర్గను ఇంద్రాది దేవతలు వచ్చి,  శ్రీ కృష్ణ రూపిణి అయిన కృష్ణవేణీ నదిలో స్నానమాడి కనక దుర్గను పూజించి ప్రణమిల్లారు. నాటి నుండి కీలాద్రి ఇంద్రకీలాద్రిగా ప్రసిద్ధి చెందింది. దుర్గమాసురుని సంహరించిన దుర్గ కీలాద్రిన నిలచిపోగా ఈశ్వరుడు జ్యోతిర్లింగ రూపముతో స్వయంభువుడుగా ఈ ఇంద్రకీలాద్రి మీద వెలశాడు. బ్రహ్మాది దేవతలు ఆ లింగమును మల్లికా కదంబ పుష్ఫాలతో పూజించగా అప్పటి నుండి మల్లేశ్వరుడుగా పిలువబడుతున్నాడు.


అర్జునుడు ఈ కీలాద్రి మీద తపస్సు చేసి శివుని మెప్పించి పాశుపతాస్త్రాన్ని పొంది విజయడైనాడు. కనుక ఈ క్షేత్రానికి ఫల్గున క్షేత్రమని, విజయపురి అనే పేర్లు పురాణ ప్రసిద్ధాలైనాయి. 


దుర్గాదేవి శుంభ నిశుంభులను వధించి జయం పొందటం చేత జయవాడ అని పేరున్నదని ఒక ఇతిహాసమున్నది. ఆ కాలములోనే కనకవాడ అని కూడా పిలువబడేదని కూడా కొన్నిచోట్ల చెప్పబడినది.

పూర్వమెన్నడో సృష్టికర్త అయిన బ్రహ్మ శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్ళి ‘హరీ! కలియుగము లో జనులు అనేక పాప చింతనలతో ధర్మమార్గం తప్పి చరిస్తారు. కనుక వారికి తరించే మార్గం ఏదైనా చెప్పు’మని కోరాడు. బ్రహ్మ మాటను మన్నించి హరి తన అంశతో కృష్ణను సృజించాడు. ఆమె రూపలావణ్యాలకు ఆశ్చర్యపడిన బ్రహ్మ ఆమెను తన కూతురిగా ఇమ్మని అడిగాడు. కృష్ణను విష్ణువు బ్రహ్మకు ఇవ్వగా కృష్ణ బ్రహ్మపుత్రి అని పిలువ బడుతున్నది.


కొంతకాలనికి కలియుగం పాప భూయిష్టం కాగా ఆ పాప పరిహారార్ధం విష్ణువు మరల కృష్ణను తనకిమ్మని బ్రహ్మను అడిగాడు. విష్ణు స్వాధీన అయిన కృష్ణను ఎక్కడ వుంచాలని ఇంద్రాది దేవతలను హారి అడిగాడు. అప్పుడు వారు భూమినంతా పరిశీలించాడు. అప్పుడు శ్రీహరిని కోరి ఒకచోట పర్వత రూపంలో ఘోర తపస్సు చేస్తున్న సహ్యమునిని చూపించారు. దేవతలు వెంటనే సహ్యముని వద్దకు వెళ్ళి ‘సహ్యమునీ నీవు ఏ కోరికతో పర్వత రూపం ధరించి ఘోర తపస్సు చేస్తున్నావో ఆ విఘ్ణవే భూమిని ఉద్భవించటానికి విష్ణురూపిణి అయిన కృష్ణతో సహా వచ్చి ఉన్నాడు. కృష్ణ సకలాభీష్ట ప్రదాయిని అని చెప్పారు. పరమానందభరితుడైన సహ్యముని విష్ణువును విష్ణు స్వరూపిణి అయిన కృష్ణను షోఢశోపచారాలతో పూజించాడు. దేవతలారా! నేను శ్రీ మహా విఘ్ణవు కోరి తపస్సు చేస్తున్నాను. మీరు సమస్త ఫలదాయిని అయిన కృష్ణతోపాటుగా విష్ణువును ఇక్కడకు తీసుకొని వచ్చారు. నా జన్మతరించింది. నేను కృష్ణా నదీమ తల్లిని సేవించి నిశ్చల భక్తిని జ్జానాలను పొందుతాను. హే విష్ణూ! కృష్ణతో కూడి దయతో నా మీద నిలచి నన్ను కృతార్ధుడిని చేయమని వేడుకున్నాడు. అతని ఆత్మ నివేదనను కృష్ణ అనుగ్రహించింది. సహ్యమునీంద్రా నేను నా అంశతో ఈ సహ్యాద్రి మీద నివశిస్తాను. నీ తపస్సు ఫలించి లోకోపకారం అయింది. నీ ఉపకారం వల్ల లోకాలు పునీతం అవుతాయని వరమిచ్చింది. విష్ణువు కూడా సంప్రీతుడై పర్వత రూపంలో వున్న నీమీద (సహ్యాద్రి మీద) నిత్య నివాసం ఏర్పరచుకుంటానని ఇద్దరూ ఆ సహ్యాద్రి మీద పాదం మోపారు. సహ్యముని వారిని రత్నాలతోనూ పరిమళ పుష్ఫాలతోనూ అర్చించాడు.


శ్రీ మహ విష్ణువు శ్వేతాశ్వత్ధ వృక్షంగా (తెల్ల రావి చెట్టుగా) సహ్యాద్రి మీద ఆవిర్భవించాడు. ఆ రావిచెట్టు అంతర్భాగాన రెండు వైపుల ధవళాకృతిలో నదీమ తల్లిగా కృష్ణ ఆవిర్భవించింది. పడమటి కనుమలలో బ్రహ్మగిరి, వేదగిరి అని రెండు శిఖరాలున్నాయి. బ్రహ్మ ఒకప్పుడు బ్రహ్మ గిరి మీద నారాయణుని గురించి తపస్సు చేయగా నారాయణుడు తెల్ల రావిచెట్టు రూపంలో ప్రత్యక్షం అయినాడు. తరువాత విధాత వేదగిరి మీద తపస్సు చేయగా పరమేశ్వరుడు ఆమ్ల(ఉసిరి) చెట్టుగా ప్రత్యక్షం అయినాడు. శ్వేతాశ్వత్థ వృక్షం (నారాయణుడు) కృష్ణ గానూ ఆమలక వృక్షం (ఈశ్వరుడు) వేణి గానూ ఒకదానితో ఒకటి కలసి కృష్ణవేణి నదిగా ప్రభవించినట్లు విష్ణు పురాణంలో చెప్పబడినది. ఈ జలాలు సహ్యాద్రి నుండి శ్రీశైలం వరకూ గంగతో సమానమనీ, భగవత్ నిలయమైన సశ్య  శ్యామల క్షేత్రమని, ఆధ్యాత్మిక సంపదలకు ఆలవాలమనీ ప్రసిద్ధి చెందినది. అటువంటి క్షేత్రాలలో విజయవాడ ఎన్నదగినది.


సహ్యాద్రి పర్వతం మీద పుట్టిన ఓషధాలను బీజాలను తన ప్రవాహములో తరలించుకొని పోవుచుండగా కీలాద్రి అడ్డుపడి అక్కడే నిలచిపోగా ఆ బీజాలు మొలకెత్తి ఆ ప్రదేశము సస్యశ్యామలమైనది. సాగర సంగమాభిలాషతో ఉరకలుగా వచ్చిన కృష్ణవేణీ నది తనకు దారి ఇమ్మని కీలుని కోరినది. కీలుడు అంగీకరించలేదు. దేవతలు వచ్చి కీలునికి నచ్చ చెప్పగా సొరంగ మార్గం మాత్రం ఇవ్వడానికి అంగీకరించాడు. ఆ ప్రవాహ వేగానికి కీలాద్రి నుండి ఒక ముక్క విరిగి ప్రవాహ వేగములో రెండు క్రోసుల దూరము కొట్టుకుపోయి నిలచినది. ఈ రెండు క్రోసులదూరమును ఫల్గున తీర్ధమనీ, ఆ కొండ ముక్కకు తేలుకొండ (తేలిన కొండ) అని పేర్లు అని సహ్యాద్రి ఖండంలో చెప్పబడినది. అది యనమలకుదురు అని విజయవాడకు ప్రక్క గ్రామము ఈ ఇంద్రకీలాద్రి పర్వతము మంగళాచలము (మంగళగిరి) వరకు వ్యాపించివున్నది.


దుర్గా దేవి కుడికన్ను సూర్యుడు. ఎడమ కన్ను చంద్రుడు. కనకవర్ణంతో ప్రకాశించే పొలము రాత్రింబవళ్ళకు నడిమీ సంధ్య. దుర్గాదేవి తన చూపులతో శత్రువులను క్షోభ పెట్టిన చోట్లన్నిటికీ ఒక్కొక్క దృష్టి. ఆయా నామాలతో నేటికి ప్రసిద్ధాలై ఉన్నవి. కార్వేటి వంశ పల్లవ కేతు భూపాల శాసనానుసారము దుర్గా మల్లేశ్వరుల మహాత్యము, అనుగ్రహము మనకు తెలుస్తున్నవి. విజయవాడ మాధవ శర్మ పాలనలో వున్నప్పటి ఒక ఉదంతం కనకదుర్గా మల్లేశ్వరుల అనుగ్రహానికి నిదర్శనంగా చెప్పబడినది. మాధవ శర్మ కుమారుడు ఒకనాడు రథం మీద వెళ్ళుచుండగా ఆ రథము క్రింద చింత చిగురు అమ్ముకునే ఒక అభాగ్యురాలి కొడుకు పడి మరణించాడట. ధర్మ సంరక్షణా నిరతుడైన మాధవ వర్మ తన కుమారుని హత్యా నేరస్తునిగా ఉరిశిక్ష విధించినాడట. మాధవ శర్మ ధర్మ దీక్షకు కనకదుర్గా మల్లేశ్వరులు సంతసించి ఆ మరణించిన బాలురిద్దరి మీద కనక వర్షము కురిపించి ప్రాణదాన మొనరించగా కనకదుర్గా పండితుని ప్రభావాన్ని కూడా వెల్లడించినది. అప్పుడు విజయవాడ వేంగ రాజుల పాలనలో ఉన్నది.


కనకదుర్గా మల్లేశ్వరుల పరభక్త శిఖామణి ఆరాధ్య పండితుడు శ్రీ పతి పండితయ్య. ఆయన తాను కాంశీపుర వాసిననీ అయిననూ విజయవాడ మల్లిఖార్జున పాదపద్మారాధకుడననీ చెప్పుకున్నావాడు. శివ తత్వసారమనే మహా గ్రంధకర్త. శివుడు గాక వేరు దైవము లేడను పరమ భక్తుడు. అందుచేత ఊరి ప్రజలు అతని మీద అసూయ ద్వేషాలు పెంచుకున్నారు. యజ్ఞయాగాది క్రతువులకు పిలవటం మానివేశారు. ఆయనకు ఊరిలో నిప్పు కూడా పుట్టకుండా కట్టడి చేశారు.


అయినా శ్రీపతి పండితయ్య ఏ మాత్రమూ చింతించలేదు. తన ముక్కంటి దొరను ( త్రినేత్రుడైన శివుని) ప్రార్థించి అగ్నిని తన ఉత్తరీయములో మూటకట్టి ఒక జమ్మి చెట్టు కొమ్మకు వ్రేలాడ కట్టి, నగరంలో అగ్నిహోత్రుడు వెలగరాదని శపించాడు. తాను మాత్రము నియమము తప్పక అగ్నికార్యమును కొనసాగించుకొంటూనే ఉన్నాడు. ఆ కాలంలో వేంగీ రాజు అనంతపాలుని పాలనలో ఉన్నది నగరం. అంతట ప్రజలు అందరూ ప్రభువును ముందుంచుకొని శ్రీపతి పండితయ్యను అగ్నికి విడువుమని ప్రార్థించాడు. పండితయ్య అనుగ్రహించాడు. ఈ నాటికీ జమ్మిదొడ్డిగా పిలువబడుతున్న ప్రాంతమే ఆ నాడు పండితయ్య నిప్పును వ్రేలాడదీసిన శమీ వృక్షమున్న చోటు ఈ శాసనము కూడా అక్కడే లభించినది.


వేప చెట్టు మహాలక్ష్మీ. రావి చెట్టు విఘ్ణవు. శమీ వృక్షం (జమ్మిచెట్టు) శివ శకైక్య స్వరూపం. ఆ శమీ వృక్షం ఆదిపారాశక్తి అంశ వనదుర్గ. ఆమే రూపుదాల్చిన కుండలీని శక్తి. వివిధ శాఖావృతమైన శమీవృక్ష శిరోభాగమే భయంకర భుజంగ (సర్ప)రూపము. అనంతంగా విస్తరించిన వృక్షాగ్రం పగటిని సైతం రాత్రిగా చేయగల కాల స్వరూపం. శమీ వృక్షం వనదేవత. శుభకర తరువు. సంతాన ప్రదాయిని. సర్వశత్రు వినాశిని.


పుత్రదం సర్వ పాపఘ్నం సర్వ శత్రు వినాశకం అని శమీ వృక్షం చెప్పబడినది. బ్రహ్మ విఘ్ణవు మొదలైన దేవతల చేత ఆవరించబడి, ఢాకినీ మొదలైన భూత గణాలచే రక్షించబడుతూ ఉంటుంది. వనదుర్గ స్థలదుర్గ జలదుర్గ అని దేవికి పేర్లు. అన్నింటిలోకి వనదుర్గ సుఖప్రద. వనదుర్గా రూపంలో ప్రభవించి ప్రకాశించే శమీవృక్షం అనేక దేవతా నిలయం మహా మాయా సంపద కలది. అందుకే పాండవాగ్రజుడైన ధర్మరాజు వారి అజ్ఞాతవాసం ప్రారంభించే ముందు వారి ఆయుధాలను శమీ వృక్షం మీద దాచిపెట్టి వనదేవతారూపిణి అయిన వనదుర్గనిలా ప్రార్థించాడు. విషస్ఫురిత భుజంగ భంగి భయంకర రూపంతో మా ఆయుధాలను కనుపింప చేయమని కోరాడు.


చిత్త క్షోభం కలిగించే దీని ఆకృతి దేవీ స్వరూప స్వభావాలకు ప్రతీక. సమస్త ప్రాణులలోనూ వ్యాపించి చిత్త వికారాలను కలిగించే భ్రమరాంబ అష్టాదశ పీఠాలలో ఒకటైన శ్రీశైలపీఠశక్తి. శాకినీ, ఢాకినీ మొదలైన యోగినీ గణాలతో ఆవృతమై అరణ్య మధ్యంలో నెలకొన్న వనదుర్గా రూపమీ శమీ తరువు. కనుకనే ధర్మరాజు అజ్ఞాత వాసంలో భీముని ఆ గ్రహ ప్రవృత్తిని నిగ్రహించుకొనే విధంగా శాశించు తల్లీ అని వన దేవతా రూపిణి అయిన శమీ వృక్షాన్ని ప్రార్థించి తగిన నివేదనలు సమర్పించాడు. శత్రువులు ఎవరూ ఆ శమీ వృక్షాన్ని దాటి రాకుండా చూడుమని అర్థించాడు. శమీ వృక్షం శివ శకైక స్వరూపం కనుకనే మహా దేవ శక్తి పాశు పతాస్త్రాన్ని ధరించి భరించింది.


నాటికీ, నేటికీ శమీ పూజ పార్వేట వాడ వాడలా నవరాత్ర ఉత్సవాల ముగింపుగా జరుగుతూనే వున్నది. ఎందుకనగా గ్రామ దేవతా మూర్తులు లేని మరుమూల గ్రామాలలో కూడా రావి, వేప, శమీ వంటి వృక్షాలే వనదేవతలుగా గ్రామాలను కాపాడుతాయి అనే ప్రగాఢ విశ్వాసమే యుగయుగాలుగా చాటిన సత్యం.


దేవీ దుర్గ మహిషాసురుని వధించి మహోగ్రంగా కనిపిస్తుండగా దేవతలందరూ అమ్మా నీవు లోకాలను రక్షించే తల్లివి. ఇంతటి మహోగ్రరూపం మహిషాసురుని వంటి రాక్షస వధకే గాని మేమెట్లు భరించగలం? మూల ప్రకృతినైన నిన్నెట్లు సమీపించగలం? తల్లీ నీవు శాంతి రూపిణివై లోకాలను కాపాడుమని వేడుకున్నారు. ఆ తల్లి కరుణారస సంపూర్ణ అయిన రాజ రాజేశ్వరిగా అవతరించింది. కాలాంతములో జగద్గురువు ఆదిశంకరాచార్యుల వారు మహోగ్ర శక్తులను శ్రీ చక్రము నందు నిక్షిప్తం చేసి, శ్రీ అమ్మవారి పాదాల చెంత 

శ్రీ చక్రరాజమును స్థాపన చేయటమైనది.


ప్రతి సంవత్సరము ఆశ్వయుజ శుద్ధ పాఢ్యమి మొదలు నవమి వరకు దుర్గోత్సవం అను పేరుతో దేవీ శరన్నవరాత్రోత్సవములను, సంవత్సరారంభంలో చైత్ర శుద్ధ పాఢ్యమినుండి నవమి వరకు వసంత నవరాత్రోత్సవములను పేరుతో నన్ను ఆరాధించినా నా చరిత్రను వినినా ఇహలోకాన ఆయురారోగ్య, ఐశ్వర్యాలతో, పుత్ర పౌత్రాభి వృద్ధితో సమస్త సుఖశాంతులు పొందగలరని వరమిచ్చింది.


నాటి నుండి దుర్గమ్మ రాజరాజేశ్వరిగా లోకాలను పాలిస్తూ, బాలా త్రిపురసుందరిగా కోరికలీడేరుస్తూ, అన్నపూర్ణగా ఆకలి తీరుస్తూ, లలితగా లాలిస్తూ, సరస్వతిగా సకల విద్యలూ ప్రసాదిస్తూ అనేక అంశలతో అర్భామూర్తిగా ఆరాధించబడుతూ వున్నది. ‘ద’ కారం దైత్యనాశకం. ‘ఉ’ కారం విఘ్న నాశకం. ‘ర్’ కారం రోగ నాశకం. ‘గ’ కారం పాప నాశకం. ఆ భయనాశక వాచకం. కనుకనే అమ్మవారికి పర్యయపదమైన దుర్గా నామమును ఉచ్చరించినా, స్మరించినా పాపాలూ నశిస్తాయని సాక్షాత్తూ పరమ శివుడు చెప్పిన మాట అని సకల లోక పితామహుడు సృష్టి కర్త అయిన బ్రహ్మ మార్కండేయ మహర్షికి చెప్పిన ప్రమాణమున్నది.


ఈ విధంగా మహిషాసుర మర్థినీ బ్రహ్మ తేజస్విని శుద్ధ స్పటిక రూపిణి అయిన కనకదుర్గ కృష్ణా తీరాన వెలసి తూర్పున ఐంద్రి, పడమర వారుణి, ఉత్తరాన కౌమారి, దక్షిణ దిక్కున శ్రేష్ఠ ధర్మ దేవతా స్వరూపిణి అయిన హంసవాహినిగా లోకాలను కాపాడుతూ ఉన్నది. కొలచిన వారికి కొంగు బంగారము, సర్వర్థ ధాత్రి, మూల ప్రకృతి, సౌకుమార్య సౌందర్యలహరి, మల్లేశ్వర హృదయ సామ్రాజ్య పట్ట మహిషి అయిన చల్లని తల్లి అయిన దుర్గమ్మ. దూర దూరాల నుండి వచ్చే నీ బిడ్డలు అయిన భక్తుల మీద కరుణాంతరంగవై సుఖశాంతులను వర్షించుచూ, జ్ఞాన సిద్ధిని ప్రసాదించుమని నిత్యము సేవించుకుందాము.✍️


“ సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే

శరణ్యే త్రయంబకే దేవీ నారాయణి నమోస్తుతే”🙏


.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

                     ➖▪️➖

ఇలాటి మంచి విషయాలకోసం…

*“భగవంతుని విషయాలు గ్రూప్“*  లో చేర్చమని ఈక్రింది నెంబరుకి వాట్సప్ లో మాత్రమే మెసేజ్ పెట్టండి...  944065 2774.

లింక్ పంపుతాము.

దయచేసి ఫోన్ కాల్స్ చేయవద్దు.🙏

హైందవం వర్ధిల్లాలి 21*

 *హైందవం వర్ధిల్లాలి 21*




*ధర్మ ప్రచారకులు, ప్రవచనకారులు, ఆశ్రమాధిపతులు, పీఠాధిపతులు, హిందు నాయకులు హైందవ జాగృతికై ప్రజలలోకి రావాలి*:- 

ii) సుభాషితము

*శ్లో! దేశ రక్షా సమం పుణ్యం, దేశ రక్షా సమం వ్రతం, దేశ రక్షా సమం యోగో, దృష్ట్యా నైవచ నైవచ*. 

అర్థం:- దేశ రక్షణతో సమానమైన పుణ్యం, వ్రతం, యోగము గాని లేదు గాక లేదు. *ఇది పెద్దలు చెప్పిన మంచి మాట*.


మనం  హైందవ ధర్మం, సంస్కృతి ననుసరించి ఏమిచేస్తూలేమా అంటే చేస్తున్నాము. జీవిత పర్యంతం దైనందిన భక్తి నివేదనలతో  బాటు ధర్మ బోధనలు వింటూ, నీతి శాస్త్రాలు చదువుతూ, పెద్దల ప్రవచనాలు ఆలకిస్తూ, శబ్ద, దృశ్య మాధ్యమాలలో భక్తి కార్యక్రమాలు తిలకిస్తూ, పండిత గోష్టులలో పాల్గొంటూ, సత్సంఘ మాధుర్యాలు గ్రోలుతూ, వీలు చిక్కినప్పుడు దేవాలయ సందర్శనలు, తీర్థ యాత్రలు చేస్తూ *చర్మచక్షువులు, కర్ణేంద్రియాల ద్వారా  బాహ్యానందం మరియు ఆత్మానందానికి మాత్రమే పరిమితమవుతున్నాము*. కాని ఏది ఆచరణలోకి తెచ్చుకోము. *అంటే*  సదరు చర్మచక్షువులు మరియు  కర్ణేంద్రియాల ద్వారానే దేశంలో ,  పొరుగు దేశాలలో,  కాశ్మీర్ లో  మరియు మనదేశంలోనే  ఇంకొన్ని  ప్రాంతాల్లో హైందవానికి, హైందవ అనుయాయులకు,  సంస్కృతికి జరుగుచున్న  హాని, కీడు గురించి చూస్తూ , వింటూ గూడా స్పందనారహితులుగా, చైతన్య హీనులుగా మరియు క్రియా శూన్యులుగా అధిక భారతీయులు ఉండడం ఎంత మటుకు  సమంజసం.  *పైద్ధలు చెప్పిన పై సుభాషితం ప్రకారం దేశ హితము, రక్షణ కంటే  అధికమైనది ఏది లేదు కదా*. ఆచరణ  శూన్యులైన వారు ఏమి చదివినా, ఏమి విన్నా, ఏమి చూసినా సార్థకత ఏమిటి. 


మహా భారతంలో చర్మచక్షువుల దృష్టి లేని (అంధత్వము) కురురాజు ధృతరాష్ట్రుడు "ప్రజ్ఞాచక్షువుల" ద్వారా కురుక్షేత్ర యుద్దాన్ని గమనించగలిగాడు, సంజయుడి వివరణతో బాటు. *అన్ని ఉన్న "అధిక భారతీయులు" ప్రస్తుత దేశ పరిస్థితిని ఎందుకు అవలోకించడం లేదు*. హైందవ ధర్మరక్షణ మరియు సంస్కృతి రక్షణ ప్రోత్సాహానికై ఎందుకు అగ్రగాములు కావడం లేదు.


మన దేశంలో ఎన్ని వర్గాల ప్రజలు ఉన్నా అందరిలో నిహితమై ఉన్న , ఏకత్వాన్ని, సమన్వయాన్ని, ఐకమత్యాన్ని  ఆసేతు హిమాచలం మళ్ళీ ఒకసారి పునరుద్ధరించడానికి  ప్రవచనకారులు, ఆశ్రమాధిపతులు, పీఠాధిపతులు, ధర్మ ప్రచారకులు, హిందూ నాయకులు ప్రజల మధ్యకు రావాలి. ఈ సత్సంకల్పానికి రచయితలు, కవులు, గాయకులు, సామాజిక వైతాళికులు తోడు నిలవాలి. *కావున మన హిందూ ధర్మానికి, సంస్కృతికి ఊపిరులూదడానికి ప్రతి పౌరుడు కంకణం కట్టుకోవాలి*. 


ధన్యవాదములు

*(సశేషం)*

అది పరీక్ష. అంతా అయ్యాకే ఫలితం ఇస్తారు.

 ప్రసాదం అపవిత్రం అవుతున్నప్పుడు ఏం చేశాడు మీ దేవుడు అన్నవాళ్ళకు సరియైన సమాధానం.


కర్మలు జరిగేటప్పుడు దేవుడు ఆపడు. నీలో ఉన్న అంతరాత్మకే తప్పు, ఒప్పుల నిర్ణయం వదిలేస్తాడు. 

నీ నిర్ణయం అయ్యాక ఆయన లెక్కలు మొదలవుతాయి. మీరు చెప్పేది ఎలా ఉంది అంటే, పరీక్షలో తప్పులు రాసేప్పుడు *టీచర్ ఊరికే ఎందుకు ఉన్నాడు, అప్పుడే తప్పు రాయకుండా ఆపచ్చుగా?* అన్నట్టుంది. అది పరీక్ష. అంతా అయ్యాకే ఫలితం ఇస్తారు. 

ఇదీ అంతే... 

ఓం నమో నారాయణాయ🙏

*శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయం*

 🕉  *మన గుడి : నెం 460*






⚜ *కేరళ : హరిపాడు : అలెప్పి*


⚜ *శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయం*



💠 కార్తికేయ, మురుగన్ లేదా స్కంద అని కూడా పిలువబడే సుబ్రహ్మణ్య భగవానుడు భారతదేశం, శ్రీలంక, మలేషియా, సింగపూర్ మొదలైన తమిళం మాట్లాడే ప్రాంతాలలో అత్యంత పూజ్యమైన దేవుడు.  


💠 అతను శివుడు మరియు పార్వతికి కుమారుడిగా జన్మించాడు.  

అయ్యప్ప మరియు గణేశుడు అతని సోదరులుగా భావిస్తారు.


💠 హరిపాడ్‌లోని శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం కేరళలోని అతి పెద్ద మరియు పురాతన దేవాలయాలలో ఒకటి.

దీనిని " దక్షిణ పళని " అంటారు.  

కలియుగం రాకముందే ఈ ఆలయం స్థాపించబడిందని నమ్ముతారు.


💠 హరిపాడ్‌ను "క్షేత్రాంగాలుడే నగరం" లేదా 'దేవాలయాల పట్టణం' అని కూడా అంటారు.  హరిపాడు మరియు చుట్టుపక్కల 40-50 దేవాలయాలు ఉన్నాయి.


💠 ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం నాలుగు చేతులతో దర్శనమిస్తుంది.  

వేల్ (ఈటె) ఒక చేతిలో, వజ్రాయుధం మరొక చేతిలో, ఒక చేతిలో అబయహస్తం  మరియు మరొకటి తొడలపై విశ్రమిస్తుంది.  

విగ్రహం దాదాపు 8 అడుగుల ఎత్తు ఉంటుంది.  విగ్రహం తూర్పు ముఖంగా ఉంది.

దీనిని మొదట పరశురాముడు పూజించినట్లు నమ్ముతారు.


💠 ఇది పొడవైన బంగారు ధ్వజస్తంభం (మలయాళంలో కొడిమారం)తో కేరళలోని అతిపెద్ద సుబ్రహ్మణ్య స్వామి ఆలయం.  శివుడు మరియు  విష్ణువు కూడా విగ్రహంలో నివసిస్తారని విస్తృతంగా నమ్ముతారు, అందువలన ఇది అత్యంత శక్తివంతమైనదిగా పరిగణించబడుతుంది.


💠 'మురుగ' అనే పేరు మూడు దైవిక విధులను సూచిస్తుంది - సృష్టి (సృష్టి), స్థితి (రక్షణ), మరియు సంహార (నాశనం).

ఎందుకంటే 'ము' అనేది ముకుంద (విష్ణు), 'రు'రుద్ర (శివుడు),  మరియు కమల కోసం 'కా' (బ్రహ్మ).



🔆 *స్థలపురాణం*


💠 ఆలయంలోని సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాన్ని పిల్లలు లేని ధర్మకర్తలలో ఒక

బ్రాహ్మణ దంపతులకి సుబ్రహ్మణ్య విగ్రహాన్ని కనుగొనడం గురించి కల వచ్చిందని నమ్ముతారు.

ఆయన సమీపంలోని కాయంకుళం సరస్సులో కనుగొన్నారు.  


💠 అతను దేవుని ఆదేశాలను అనుసరించి 4 చేతుల విగ్రహాన్ని పతిరమణల్ ద్వీపం సమీపంలోని నదిలో కనుగొని హరిపాడుకు తీసుకువచ్చారు.  

ఈ సంఘటన జ్ఞాపకార్థం 3 రోజుల పాయిప్పాడ్ జలోత్సవం పండుగ సందర్భంగా ఆగస్టు-సెప్టెంబర్లో పాయిప్పాడ్ నదిపై పాము పడవ రేగట్టా నిర్వహిస్తారు.

అప్పటి నుండి ఇది పూజ్య స్థలంగా ఉంది.

 

💠 ఒక హెక్టారు విస్తీర్ణంలో విస్తరించి ఉన్న హరిపాడ్‌లోని శ్రీ సుబ్రహ్మణ్య దేవాలయం అద్భుతమైన చెక్క శిల్పాలతో చక్కటి సాంప్రదాయ కేరళ శైలి నిర్మాణాన్ని కలిగి ఉంది.


💠 ఇక్కడ ప్రధాన దేవతతో పాటు, దక్షిణామూర్తి , గణేష్ , తిరువంబాడి కన్నన్ , నాగ , శాస్తా వంటి అనేక ఇతర దేవతలు కూడా ఉన్నారు .


🔆 ఆలయ వివరణ


💠 హరిపాడు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో 4 గోపురాలు ఉన్నాయి. ధ్వజస్తంభం  ఆలయానికి తూర్పు వైపున అలంకరించబడి ఉంటుంది . 


💠 ఇది కేరళ దేవాలయాలలో 3వ అతిపెద్దది. ఆలయ ప్రాంగణం మురుగన్ యొక్క వాహనం నెమళ్లకు అభయారణ్యంగా పనిచేస్తుంది .  ముఖ్యంగా, "పెరుంకుళం" అని పిలువబడే ఆలయ చెరువు, సుమారు 5 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న కేరళలోని అతిపెద్ద ఆలయ చెరువులలో ఒకటి.


💠 శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం ఇతర దేవాలయాల నుండి వేరు చేసే కొన్ని ప్రత్యేకతలను కలిగి ఉంది. 

ఒక ముఖ్యమైన అంశం ఏమిటంటే , ఒక సంవత్సరంలో 3 కోడియెత్తులు ( ధ్వజస్తంభంపై ధ్వజ (జెండా) ఎగురవేయడం ) ఉత్సవాలు . 

ఈ పండుగలు తమిళ క్యాలెండర్‌ను అనుసరిస్తాయి . 

ఉత్సవ త్రయంలో చింగోంలో అవని ఉత్సవం , ధనువులో మర్కళి ఉత్సవం , 

మేదోంలో చితిర ఉత్సవం ఉంటాయి . 


💠 అవనిలో విష్ణువు , మర్కళిలో శివుడు , చితిరలో సుబ్రహ్మణ్యుడు ఇలా ప్రతి ఒక్క ఉత్సవం ఒక్కో దేవతకు అంకితం చేయబడింది . 

ఈ వేడుకలలో, వార్షిక చితిర తిరువుల్సవం పండుగకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది.

ఉత్సవ త్రయం కాకుండా, ఆలయం వృశ్చికంలో త్రికార్తిక, ఇడవంలో ప్రతిష్టా రోజు , తులంలో స్కంద అష్టమి , కన్నిలో నవరాత్రులు మరియు మకరంలో తైపూయం వంటి ఇతర ముఖ్యమైన పండుగలను కూడా పాటిస్తుంది .


💠 ఈ పండుగలో భక్తులందరూ ఆలయాన్ని చుట్టుముట్టి కార్తీక దీపం  "కర్ప్పొర ఆళి" చేస్తారు.


💠 ఈ ఆలయం "మకర విళక్కు" అని పిలువబడే వార్షిక పండుగకు ప్రసిద్ధి చెందింది, ఇది సాధారణంగా జనవరి మరియు ఫిబ్రవరి నెలల్లో జరుగుతుంది. 

 ఊరేగింపు మరియు ఇతర సాంస్కృతిక కార్యక్రమాలను చూసేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారు.


🔆 స్నేక్ బోట్ రేస్: 


💠 ఆలయానికి సంబంధించిన మరొక ముఖ్యమైన సంఘటన పాయిప్పాడ్ జలోత్సవం, ఇది పాయిప్పాడ్ సరస్సులో జరిగే పాము పడవల పోటీ. 


💠 ఈ ఆలయంలో ఇంకో ముఖ్యమైన విశేషం  కావడితో కావడియట్టం నృత్యం.

పసుపు లేదా కుంకుమ దుస్తులు ధరించిన భక్తుల గుంపు, కావడిలను భుజాలపై వేసుకుని కోలాహలంగా నృత్యం చేస్తారు. 


💠 ఈ ఆలయం అలపుజా నుండి 14 కిలోమీటర్ల దూరంలో ఉంది

36. " మహా దర్శనము

 36. " మహా దర్శనము " --ముప్పై ఆరవ భాగము --పూర్ణపు గుర్తు వైరాగ్యము


36. ముప్పై ఆరవ భాగము--  పూర్ణపు గుర్తు వైరాగ్యము 



         కులపతులైన ఉద్ధాలకులు ఏదో యాగమునకని కాశీ పట్టణమునకు వెళ్ళినారు . ఆశ్రమమంతా వారి పత్ని ఆలాపిని ఆధీనములో ఉండినది . ఆయా శాఖలలో జరిగినదంతా  వృద్ధ శిష్యులు వచ్చి ఆమెకు నివేదిక నిచ్చేవారు . యాజ్ఞవల్క్యుడు అవకాశము కలిగినపుడు పాఠములు జరుగుతున్నపుడు ఆయా వర్గములకు వెళ్ళి అక్కడ ఉండి , వచ్చేవాడు . కులపతులుంటే   వారి దగ్గర , లేకుంటే వారి పత్ని దగ్గర ఏదో ఒక విషయము చర్చిస్తూ ఉండేవాడు . అయితే అతడికి అవకాశము బహు తక్కువ. పొద్దుటినుండీ సాయంత్రము వరకూ చాలా మట్టుకు జపములోనే గడిపేవాడు . 


        ఆలాపిని మాత వచ్చి వేత్రాసనములో కూర్చున్నారు . యాజ్ఞవల్క్యుడు సమీపములోనే నేలపై దర్భాసనములో వినయముగా కూర్చున్నాడు . ఆలాపిని మాత అంటున్నారు ,


          " వారు చెప్పినది నిజము , యాజ్ఞవల్క్యా , బ్రహ్మ విద్య తనకు తానే రావలెను . స్వప్రయత్నము చేత మిగిలిన విద్యలన్నీ సాధించవచ్చు , అయితే బ్రహ్మవిద్య అటుల కాదు . పండిపోవలెను . అంటే , కాయ బలిసి ఉండవలెను . చెట్టుపైనే పండితే దాని రుచి చెప్పనవసరము లేదు . లేకున్నా , వాడవేయుటకైనా ( కృత్రిమముగా పండునట్లు చేయుట ) కాయ బలిసియే ఉండవలెను కదా ? అలాగే బ్రహ్మ విద్య కూడా . ప్రాచీనము ( పూర్వ ఫలము ) పక్వము కాకపోతే గురువు దొరకడు . గురువు దొరకని వారికి బ్రహ్మవిద్య లభించదు . "


యాజ్ఞవల్క్యుడు చేతులు జోడించి , నవ్వు ముఖముతో అడిగినాడు , " అది సరే , మరి , గురువు దొరికి కూడా కాదన్న మా వంటి వారి గతి యేమిటి ? "


        " నీదొక విచిత్రము లే , నువ్వొక విలక్షణ ప్రాణివి . నీకు మానవ గురువులు లేరని , దేవతా గురువులు కలుగు యోగము వచ్చినది . వైశంపాయనులు నిన్ను పంపించి వేసినా , నీకేమి తక్కువయినది ? మీ తండ్రి నీకు స్వశాఖను అధ్యయనము చేయించినారు . బుడిలులు నీకు ఋగ్వేదమును పునశ్చరణము చేయించినారు . వీరు నీకు సామమును పునశ్చరణ చేయించినారు . ఇప్పుడు నీకు అగ్ని దేవుడు , ప్రాణ దేవులు ప్రసన్నమైనారు . ఆదిత్యదేవుడిని గురించి తపస్సు చేస్తున్నావు ! ఆదిత్యుడిని ప్రసన్నుడిని చేసుకుంటే ఇక నిన్ను పట్టేవారుండరు . అదలా ఉండనీ , బ్రహ్మ విద్య సంగతి చెబుతుంటిని , దానిని కొనసాగించనా , నిలిపివేయనా ? "


" దయ చేసి కొనసాగించండి " 


         " మీరు శాంతి మంత్రములలో చెప్పుతుంటారు చూడు , ’ ఆ అంగములన్నీ ఆప్యాయనమును పొందనీ ’ అని , అది నిజము . దేహపు అంగములన్నీ తృప్తితో నిండి , సంతోషపడి , దారిని వదలు వరకూ బ్రహ్మవిద్య లభ్యము కాదు , ఎందుకో తెలుసా ? అంగాంగమూ ఒక్కొక్క దేవతా స్థానము . ఏ అంగము తృప్తి తో నిండి యుండదో , అక్కడ తద్విషయకమైన కోరిక నిలచి , అంతమేరకు వైరాగ్యము కొరతయగును . వైరాగ్యమంటే , ’ వద్దని వదలుట కాదు , ఇక చాలని విముఖమగుట ’ కాబట్టి , ఎద్దు బ్రహ్మచర్యమును పాటించినది యన్నట్లు , చేప నీటిలో ఉండి తపస్సు చేసిందన్నట్లు , మృగములు అడవిలో ఉన్నాయి యన్నట్లు , విధిలేక , వేరు దారి లేక చేసినది వైరాగ్యము కాదు . మనము విధి విధించినదాని పరముగా చూచుట అగత్యము , యాజ్ఞవల్క్యా ! అప్పుడు వైరాగ్యము నిషేధము వలన వచ్చునది కాదు , పూర్ణత కోసము , అపూర్ణ మానవుడు పూర్ణుడగుట యొక్క గుర్తుగా వచ్చునది . అలాగయితేనే మార్పు అన్నది తెలిసేది . "


       " ఔను , నిజమే , ఒప్పుకుంటాను . వైరాగ్యము పూర్ణము యొక్క చిహ్నముగా , పూర్ణమువైపు నడిపించు సాధనము కావలెను . సరే , అప్పుడేమవుతుంది , అమ్మా ? "


       " నేను కూడా నీలాగే మనిషిని . నన్నడిగితే నేనెంతవరకూ చెప్పగలను ? కాబట్టి భువన ప్రాణుడైన మాతరిశ్వుడిని అడుగు . అతడయితే సరిగా చెప్పగలడు . " 


" మీ అనుజ్ఞ , ఇక్కడే అడగమనా ? ఏకాంతములో అడగమనా ? " 


        " ఇది మరీ బాగున్నది . అంతటా నిండి  ఉన్న ఆ పూర్ణ పురుషుని అనుసంధానము చేసిన తరువాత ,అంతటా ఏకాంతమే కాదా ? అతడే కదా , లోపలా బయటా ఉండేవాడు ? ఆతడే సర్వమునూ వ్యాపించి యున్నవాడు . కాలమో ? అంటావేమో . అదికూడా అతడినే అడిగితే సరి . " 


" తమరు చెప్పునది సరియైనదే . ఇప్పుడే ఇక్కడే అతడిని అనుసంధానము చేయుదును " 


         యాజ్ఞ వల్క్యుడు అలాగే పద్మాసనములో కూర్చొని , కన్నులు మూసుకొని , ప్రాణ దేవుడిని అనుసంధానము చేసినాడు . ఆతడు దర్శనమిచ్చి , " దేవి వారు చెప్పినది సరియైనది . అంగాంగములూ నా వలన పుట్టిన దేవతల స్థానములు . కాబట్టి అంగాంగములు తృప్తిచెందు వరకూ వాటి కోరికలు తృప్తి పొందవు . హఠము చేసి దేవతలను లొంగదీసుకోవచ్చు.  అప్పుడు వారి ప్రసాదము దొరకదు . చెట్టుకొమ్మ స్వేఛ్చగా పెరిగి ఇవ్వవలసిన ఫలమును , చెట్టుకొమ్మను కొట్టేస్తే దొరుకుతుందా ? హఠము చేసినవాడు విఫలుడౌతాడు . కాబట్టి అంగాంగములూ ప్రసన్నము కావలెను . అవన్నీ ప్రసన్నమైనాక నేను కూడా ప్రసన్నమవుతాను . అప్పుడు బలిసిన బీజము పండును కోరకయే స్వతంత్రమగునట్లు , జీవుడు తృప్తుడై తన జీవత్వము దైవత్వమై , దైవత్వము బ్రహ్మత్వమగుటను ఆత్రముగా నిరీక్షించును.  . జీవత్వము చిన్నది . దైవత్వము దానికన్నా పెద్దది . బ్రహ్మత్వము  అంటే పూర్ణత్వము . అలాగ , అల్పమై , అపూర్ణమై ఉండినది , పూర్ణత్వమును -తనదైన పూర్ణత్వమును పొందుటకు సిద్ధమైనదాని గుర్తే వైరాగ్యము . " 


" సరే , తెలిసింది "


         " ఆ వైరాగ్యము మనసుకు రావలెనంటే దేహములోని దేవతలందరూ అనుగ్రహించ వలెనని రహస్యము . అప్పుడు మనసు అది కావలెను , ఇది కావలెను అని బయటి వస్తువును అపేక్షించు కామనలు లేకుండా పోతాయి . అంటే , వంద మనోరథములతో నిండియున్న మనస్సు , వందలకొద్దీ ఆశలతో కూడిన మనస్సు , ఆశను తన అపూర్ణత యొక్క గుర్తు అని తెలుసుకొని దానిని వదలుట. అప్పుడేమగునో తెలుసా ? ఇంద్రియముల ఉద్దీపనము లేకుండా పోతుంది . ఇంద్రియములకు శక్తి లేక , అవి దుర్బలమై ఉండిపోవును . మనసులో కామనలు బలముగా ఉన్నంతవరకూ ఇంద్రియములు బలముగా ఉంటాయి . కాబట్టి , దుర్బలములైన ఇంద్రియములు , ఓడిపోయి సారథి వశమైన గుర్రముల వలె , చెప్పినట్లు వింటాయి .  ఇదంతా కావలెనంటే పూజ్య వైవస్వతుడికి నచికేతుడు విజ్ఞాపన చేసినట్లు , భోగ భోగమూ ఇంద్రియముల తేజస్సును అపహరించును అనునది తెలుసుకోవలెను . తేజస్సులేని ఇంద్రియములు భోగములను అనుభవించలేవు . భోగమును పొందుట అంటే సంతకు వెళ్ళి వెల ఇచ్చి వస్తువును తెచ్చినట్లే అన్నది మనసుకు అర్థము కావలెను . అప్పుడు మనసు లోకపు వైఫల్యమును చూచి వెనుతిరుగును . అలాగ వెనుతిరుగుట వైరాగ్యము . అర్థమైనదా ? " 


" అర్థమైనది , దేవా. అలాగైతే , మనుష్యుడు భోగములను కోరునది తనకోసమా ?  ఇంకొకరికి కాదా ? "


        " కాదు , కానేకాదు . ఖచ్చితముగా కాదు . మనసు అపరితుష్టమైన దాని గుర్తే భోగాసక్తి . మొదట మనసులో ఆసక్తి పుట్టును . అప్పుడు , ఆ ఆసక్తిని గుర్తించలేని  వాడు ,  అది పెరిగి ఎదురుగా ఉన్న వస్తువు పైన మోహముగా పరిణమించి , అది కాంక్షగా మారినపుడు  , తనను ఆ కాంక్షకు క్షేత్రముగా భావించుకొనును . కాబట్టి , యాజ్ఞవల్క్యా , ఒకసారి నీకు ఉపనయనములో చెప్పిందేమిటో గుర్తు తెచ్చుకో . ధియో యోనః ప్రచోదయాత్ , మన వృత్తులను , బుద్ధులను ప్రచోదనము చేయువారెవరు ? దానిని మొదట చూడవలెను . "


" సరే , ఒక మాట అడుగవచ్చునా ? " 


" అడుగు , అయితే , ఆ మాటను అడగమన్నది ఎవరు ? మొదట అది చూడు . " 


" ఔను , ఒక తేజస్సు మనసును ప్రేరేపించును . అప్పుడు మనసులో ,  తూము వదలితే మరవ పారి వెడలెడు నీటి వలె ,  వృత్తి పారును . " 



         " చక్కగా చెప్పినావు . మనసు అని దేనిని పిలుస్తారో , అదికూడా నాయొక్క భాగమే ! వస్తు వస్తువు నందూ నిలచి , ఒక్కొక్క ప్రత్యేకమైన భావన ఏది ఉందో , అదే మనసు . ప్రత్యేకమన్న తర్వాత , దానికీ దీనికీ ( వస్తువుకూ భావనకూ )  ఒక సంబంధమును కల్పించవలెను కదా ?  ఆ కల్పనకు సాధనమైనది మనసు . సంబంధము ఏర్పడిన తరువాత ఆ సంబంధము సుఖము కావచ్చును , దుఃఖము కావచ్చును . ఈ సుఖదుఃఖాలు మనసుయొక్క ఇఛ్చాద్వేషములను అవలంబించినవి . సంబంధము ఏర్పడినప్పుడు అనుభవము మాత్రము వచ్చును . ఇప్పుడు చెప్పు, నీ సుఖదుఃఖములు , లేదా , నువ్వు సుఖ దుఃఖములు అనునవి నిజమైనవా ? " 


         యాజ్ఞవల్క్యుడు పరిభావించి చూచినాడు . " ఔను , మనసు అనునది ఇంద్రియ ధర్మములనన్నిటినీ కలిగియున్ననూ , దానిని ఇంద్రియము అనుటకు వీలులేని ఏదో ఒక విలక్షణ వస్తువు . ప్రాణపు బలము చేత తనకొక ప్రత్యేకతను సంపాదించుకున్ననూ , నిజానికది ప్రాణముయొక్క ఒక అంగము . అది సుఖ దుఃఖములను ఇంద్రియ మూలకముగా పొందిననూ , అనుభవము దానిని చేరు వరకూ సుఖమూ కాదు , దుఃఖమూ కాదు . మనసులోనున్న ఇఛ్చా ద్వేషములు ఆ అనుభవములపైన , తమకు తోచినట్లు సుఖ దుఃఖపు ముద్ర వేస్తాయి . ఇదంతటినీ పరిభావించి చూచినాడు . అక్కడ ఒక అంశము అతనికి తెలియలేదు , అడిగినాడు, .


" దేవా , అక్కడ నల్లగా , సంచీ వలె నున్నదే , అది ఏమిటి ? "


" బాగా అడిగినావు యాజ్ఞవల్క్యా , అలాగే చూస్తూ ఉండు , అదేమిటన్నది తెలుస్తుంది . "


         యాజ్ఞవల్క్యుడు కళ్ళకే కన్నుగా మారి చూచినాడు . ఏదో ఒక తేజస్సు మనసుపై ప్రకాశిస్తోంది . అప్పుడు ఆ సంచీ వలెనున్న వస్తువు నోరు తెరచింది . దానినుండీ ఏదో ఒక ప్రవాహము వలె వెడలి , మనసు నుండీ ఇంద్రియముల మూలముగా ప్రకటమైనది . 


         ప్రాణదేవుడన్నాడు , " చూడు , అదే కర్మ బీజపు గ్రంధి. వెనుక నిలచి వెలగిన తేజస్సు ఆదిత్య దేవుడిది . ఆతని తేజస్సు ఎండగా నేలపై పడినపుడు , నీటి సహాయముంటే , భూమిలోని బీజములన్నీ మొలకెత్తి పైకి వచ్చునట్లు , ఆతని తేజస్సు మనసుపైన పడగానే మనసు లోనున్న కర్మబీజ గ్రంధి నుండీ కర్మ వాసన వెడలి ఇంద్రియ మూలకముగా వ్యాపించి , లోకములో ప్రకటమై ఫలాఫలములను ప్రతీక్షించును . ఫలము ఎక్కువైనచో జయమంటారు . అఫలము హెచ్చయితే అపజయమంటారు . కాబట్టి , జయమైనా , అపజయమైనా అది ఎదుటివారి మాట. అదే సుఖ దుఃఖాలను ప్రకటముగా ప్రతిబింబించేది . లోపలి సుఖ దుఃఖాలకే అస్తిత్వము లేనపుడు , బయటి జయాపజయములకు అస్తిత్వము ఉంటుందా ?  చెప్పు . " 


        యాజ్ఞవల్క్యునికి ఆశ్చర్యమైనది . అయినా , కనబడుతున్నదానిని లేదనుటెలా ? అన్నాడు , " లేదు దేవా, లేదు . అవి వృత్తి యొక్క ఫలములు . వృత్తి ఆదిత్యునిది . వృత్తి ప్రకటమగు మనసు నీది . వృత్తి యొక్క  ఫలాఫలములను సుఖ దుఃఖములుగా అనుభవించు ఇంద్రియముల గూడైన దేహము అగ్నిది . " 


ప్రాణదేవుడు నవ్వినాడు , " ఈ చివరి మాట ఎవరన్నారో చూడు . " 


        యాజ్ఞవల్క్యుడు చూచినాడు , ;" ఔను , ఆ వాక్యపు కర్త తానుకాదు . వెదకి చూచినాడు . కుడిపక్క ఎవ్వరో నవ్వినట్లైంది . చూడగా , అగ్ని దేవుడు . అతనికి నమస్కారము చేసి , ప్రాణదేవుడికి నివేదించినాడు , " ఔను దేవా, ఆ మాట యొక్క కర్త నేను కాదు , అగ్ని దేవుడు " 


      " సరే , చూచితివా ? దేవతలు తమ స్వరూపములను ప్రకటము చేయకుండానే నీతో కావలసినది పలికించగలరు . అలాగే , కావలసినది చేయించనూ గలరు . ఇప్పుడు చెప్పు , ఇలాగ పరోక్షముగా ఉండి , బొంగరమును ఆడించునట్లు మిమ్మల్ని ఆడించు దేవతలు ప్రసన్నులు కాకుంటే నీకు వైరాగ్యము ఎలా వస్తుంది ? " 


" సరే " 


       " కాబట్టి , దేవీ మాత చెప్పినది సరియైనది . వైరాగ్యము వచ్చుటకు దేవతా ప్రసాదము కారణమగునట్లే , బ్రహ్మ విద్య కలిగితే అంగాంగములు , అంగాంగములలోనున్న దేవతలు ప్రసన్నులవుతారు . ఎందుకనగా  , దానివలన వారికి అమృతాభిషేకము అయినంత తృప్తి కలుగును. "


        ఆలాపినీ దేవి లేచి నిలుచున్నారు . యాజ్ఞవల్క్య , ప్రాణ దేవుల సంభాషణము వారికి వినిపిస్తుండినది ఒక ఆశ్చర్యము !.  అలాగ ప్రాణదేవుడు సాక్షాత్తుగా సంభాషిస్తున్న దానిని విన్నపుడు  వారు  లేవకుండా ఎలా ఉండగలరు ? 


Janardhana Sharma

లాక్షారంజితపాదపద్మయుగళీం

 లాక్షారంజితపాదపద్మయుగళీం సౌవర్ణజంఘద్వయీం 

మౌంజీభూషితసింహమధ్యవిలసద్వాల్లభ్యశాతోదరీం 

రాకాచంద్రముఖాంబుజం ప్రవిమలత్కంజాతపత్రేక్షణాం 

వందే శారదచంద్రికాప్రియమతిం వందే శుభాకారిణీమ్ 

*~శ్రీశర్మద*

4, అక్టోబర్ 2024, శుక్రవారం

Bhargava Sarma pravachan at vinayaka mandapa


 

Pillala Kadhalu పిల్లల కధలు


 

వ్యసనపరుడుVYASANA PARUDU


 వ్యసనపరుడు


ఏదైనా దుర్వ్యసనాలకు ఒక మనిషి బానిసగా మారితే అతనిని వ్యసనపరుడు అనడం మన మెరుగు దము. ఒక మనిషి రోజు మద్యం సేవిస్తూ, ఉన్న సంపాదన, ఆస్తి అంతా ఖర్చుపెట్టి భార్యా బిడ్డలను పట్టించుకోకుండా వుండే వారిని మనం సమాజంలో అక్కడక్కడ చూస్తూ ఉంటాం. అతని భార్యను చూసి నలుగురు అయ్యో పాపం ఆ తల్లి ఏ జన్మలో ఏ పాపం చేసుకుందో ఇటువంటి వ్యసనపరుడికి భార్యగా వచ్చింది అని ముక్కు మీద వేలు వేసుకుని అంటూ ఉంటారు. ఆ తల్లి తల్లిదండ్రులు బాద్యతపరులు అయితే ఆమెను ఆమె పిల్లలను పుట్టింటికి తీసుకొని తన కూతురు మనవలు మనవరాళ్ల బాధ్యత తీసుకుంటే సరి అదే వాళ్ళు కూడా పట్టించుకోకుండా వదిలివేస్తే ఆ కుటుంబం పరిస్థితి చాలా హృదయ విదారకంగా మారుతుంది. పిల్లలు దొంగలుగా, మోసకారులుగా రౌడీలుగా మారి అక్రమ సంపాదన చేస్తూ సమాజానికి చీడపురుగులుగా పరిగమిస్తారు. మనం కొన్ని సందర్భాలలో అటువంటి పిల్లలను చూస్తూ ఉంటాం. వారిని చూసి జాలి కూడా పడలేము ఎందుకంటే ఎప్పుడైతే తండ్రి సంరక్షణ ఉండదో అప్పుడు పిల్లలు తెగించి జీవిస్తారు దాని పర్యవసానమే వారి దుష్టత్వం.

తల్లిదండ్రులు పిల్లలను ప్రేమతో, బాధ్యతతో పెంచితే పిల్లలు సమాజానికి ఎంతో ఉపయోగపడే వారుగా తయారవుతారు. మనం సాధారణంగా ఎవరైనా సంఘంలో ఉన్నత స్థితికి చేరుకుంటే అతను ఏ తల్లి కన్న బిడ్డో చూడు ఎంత పెద్దవాడు అయ్యాడు అని అతని తల్లిదండ్రులను తలుచుకుంటాము. అందుకే సంతానం ఉంటే తల్లిదండ్రుల పేరు ని నిలపెట్టేవారు వుండాలని అంటారు. అదే ఒక దుర్మార్గుడిని గురించి సమాజం వీడిని ఏ పాపిష్టి తల్లి కన్నదో అని అనవసరంగా నవమాసాలు మోసి జన్మనిచ్చిన తల్లిని కూడా దూషించటం పరిపాటి.

వ్యసనపరుడికి సమాజంలో తన భార్య పిల్లలు ఏమైపోయినా పట్టదు, తన గురించి సంఘం ఏమనుకుంటున్నాదో అది కూడా పట్టదు. కేవలం అంటే కేవలం అనుక్షణం సారా మత్తులో మునిగి తేలుతూ వుంటారు. వారు వీధులలో తాగి పడిపోయి నిద్రించటం కూడా మనకు అప్పుడప్పుడు గోచరిస్తుంది. అంటే వారికి తన గురించి తన కుటుంబం గురించి అంతేకాక సమాజం గురించి కూడా ఏమి పెట్టి ఉండదు. ఒక్క మాటలో చెప్పాలంటే వారు నిత్యానంద స్వరూపులు అదేమిటి అలా అంటున్నావు అని నీవు అనవచ్చు కానీ ఇది నూటికి నూరుపాళ్లు నిజం సదా సారా మత్తులో జీవితాన్ని గడపడమే వారి జీవన లక్ష్యం.

ఇదేమిటి భార్గవ శర్మ కి ఏమైంది తాగి ఇది వ్రాస్తున్నాడా అని మీకు అనిపించవచ్చు. కానీ నిజానికి ఒక ఆధ్యాత్మిక విషయం చెప్పాలంటే సమాజంలో ఉన్న ఏదో ఒక ఉపమానంతో చెబితే కానీ అది మనస్సుకు హద్దుకుని సాధకుని తన సాధనలో ముందుకు తీసుకొని వస్తుందని భావించి చెప్పడం జరుగుతున్నది.

మనం భగవంతుని కేవలం ఒక పది నిముషాలో లేక ఒక అర్ధగంటో ప్రార్ధిస్తే కలిగే ప్రయోజనం కేవలం స్వల్పంగా ఉంటుంది. అదే ఒక తాగుబోతు లాగా అనుక్షణం భగవంతుని జాసలో గడిపిన అప్పుడుగాని జీవన్ముక్తి అంటే మోక్షం లభిస్తుంది. ఒక తాగుబోతు ఉపమానం నీచంగా కనిపించవచ్చు కానీ నిజానికి అదే సరైన ఉపమానం తాను తన జీవిత లక్ష్యమైన మధుపానం కోసం సంఘములో తన మర్యాదను, తన భార్య పిల్లలను చివరకు తన ఆరోగ్యాన్ని సహితం పణంగా పెట్టి తన వ్యసనానికి బానిస అయ్యాడు. మరి ముముక్షువు అని చెప్పుకునే నీవు నిజంగా సంఘంలో నీ మర్యాదను, నీ భార్యాపిల్లలను పణంగా పెట్టి ధ్యానం చేస్తున్నావా అంటే లేదంటే లేదనే చెప్పాలి. ప్రతి క్షణం దేహ వ్యామోహంతో కొట్టుమిట్టాడుతూ నాకు మోక్షం కావాలని అనుకోవడం కేవలం అందని ద్రాక్ష కోసం ఆరాట పడటమే. 

ప్రతి సాధకుడు ముందుగా తెలుసుకోవలసింది తన శరీరం తనకు ఆ భగవంతుడు ప్రసాదించిన ఒక పరికరం లాంటిదే అని భావించి శరీర ఫై మొహం లేకుండా అంటే శరీరాన్ని అందంగా ఆకర్షణీయంగా కనిపించాలని భావిస్తూ సమయాన్ని వ్యర్థం చేసుకోకుండా కేవలం శరీర శుభ్రత పాటిస్తూ పూర్తిగా మానసిక శుద్ధికి మాత్రం ప్రయత్నించాలి. మనస్సు పరిశుభ్రంగా లేకుండా శరీరం ఎంత పరిశుభ్రంగా ఉన్నాకూడా భగవంతుని చేరుకోలేవు.

సాధకుడు శరీరానికన్నా మనస్సుకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. సదా మనస్సును శుద్ధి గా ఉంచుకోవాలి. నిత్యం అనుక్షణం ద్యాస భగవంతుని మీదనే ఉంచాలి ఎలా అయితే వ్యసనపరుడు నిత్యం మత్తులో మునిగి ఉంటాడో అలా. కానీ భార్య పిల్లలను విడనాడాల్సిన పనిలేదు. సంసారాన్ని కేవలం ఒక బాధ్యతగా భావించి జీవనం చేయాలి. భార్యాపిల్లలకు భగవంతుని పట్ల ప్రేమ, భక్తిని పెంపొందించే విధంగా తర్ఫీదు ఇవ్వాలి. తాను మాత్రం నిత్యం భగవంతుని ధ్యానంలో గడపాలి, తన కేశాలు ఎలా ఉన్నాయి, దుస్తులు ఎలా ఉన్నాయి అనే విషయాల మీద పూర్తిగా శ్రద్ధను వదలాలి, ఒక మాటలో చెప్పాలంటే ఒక సాధకునికి అడ్డంపడి విషయాలు ఏమిటంటే అవి అరిషడ్వార్గాలు అందులో ప్రతి ఒక్కటి దాని దాని ప్రభావం కలిగి సాధకుని సాధనలో ముందుకు వెళ్లకుండా ఆపుతుంది. ఎప్పుడైతే సాధకుడు వాటిని అధిగమిస్తాడో అప్పుడే సాధనలో ముందుకు వెళ్లగలుగుతాడు. ముందుగా జయించాలసింది మొహాన్ని మొహం అనేది దేహ వ్యామోహం తో మొదలవుతుంది. దేహం అందంగా వున్నది అనే భావనే మొహానికి మొదటి మెట్టు. కాబట్టి ఆ భావనను విడనాడాలంటే ముందుగా కేశాలను నిర్ములించాలి అంటే ముండనం చేయించుకోవాలి. అప్పుడు సాధకుడు తనను తానూ అద్దంలో చూసుకొని నేను అందంగా లేను అనే భావం కలిగివుంటాడు దానివలన శరీర మొహం కొంతవరకు తగ్గుతుంది. సాధకుడు ఎట్టి పరిస్థితిలోను కేశాలకు రంగు వేయరాదు. ఇలా చేసాడంటే వాడు ఈ జన్మలో సాధనకు పనికి రాడు .

తానూ ఏ పరిస్థితిలో వున్నా అంటే స్నానమాచరిస్తూవున్న, మల మూత్ర విసర్జన చేస్తూ వున్నా భగవంతుడి ధ్యానం నుండి విడివడకూడదు. ఎందుకంటే మనకు వున్న సమయం చాలా కొద్దిది ఈ సమయాన్ని మంచి ముహూర్తం అని పరిశుభ్రం అని ఇంకా ఏదో ఏదో అని వ్యర్థం చేస్తే మన జీవిత లక్ష్యం ఆయిన్ మోక్షాన్ని చేరుకోలేము. సాధకుడు సదా పరిశుద్ధుడే. ఎందుకంటె సాధకుని మనస్సు ఎల్లప్పుడూ శుద్ధిగానే ఉంటుంది. కాబట్టి సాధక ఇంకా ఆలస్యం చేయక ఇప్పుడే నీ సాధనను మొదలు పెట్టు మోక్షార్థివి కమ్ము.

ఓం తత్సత్

ఓం శాంతి శాంతి శాంతిః

ఇట్లు

మీ భార్గవ శర్మ

 

 

హైందవం వర్ధిల్లాలి 20*

 *హైందవం వర్ధిల్లాలి 20*


సభ్యులకు నమస్కారములు.


ధర్మ ప్రచారకులు, ప్రవచనకారులు, ఆశ్రమాధిపతులు, పీఠాదిపతులు, హిందూ నాయకులు హైందవ జాగరణకై ప్రజాలలోకి రావాలి. :- i ) రామాయణ మహా కావ్యంలోని ఒక ఘట్టం చూద్దాం. జనక మహారాజు సభలోకి అష్టావక్రులవారు ప్రవేశించినప్పుడు, ఆ సంవాదంలో  అష్టావక్రుల వారినుద్దేశించి, ద్వారపాలకుడంటాడు బాలుడివి వృద్ధుడులాగా చాలా జ్ఞాన సంపదతో మాట్లాడుతున్నావు అని. అష్టావక్రుల వారి సమాధానం *న జ్ఞాయతే  కాయ వృద్ధ్యా నివృద్ధిః, యథా ష్టీలా శాల్మలే: సంవృద్ధా, హ్రస్వోల్పకాయః ఫలితో వివృద్ధ:, యశ్చా ఫలస్థస్య న వృద్ధభావః*. అర్థం :- శరీరం పెరిగినంత మాత్రాన జ్ఞానం పెరుగదు. బూరుగు విత్తనం పెరిగేకొద్దీ సారం లేనిదే అవుతుంది. చిన్న చెట్టైనా పండ్లు, కాయలు ఎక్కువగా ఉంటే అదే పెద్ద చెట్టు. అంతే కాని పెద్దదయినా ఫలాలు లేని చెట్టు వ్యర్థమే. *నీతి:- వయస్సు పైబడిన వారు, వృద్ధులు అయినా జ్ఞాన శూన్యులు వ్యర్తులే*.


మన సమాజంలో అధిక జనాభాకు ఇది (క్రియాశీల జ్ఞాన శూన్యతకు)  చక్కటి దృష్టాంతము. యుక్త వయస్సు, మధ్య వయస్సు పర్యంతం తమ అభివృద్ధికి, తమ వారసుల అభివృద్ధికి నిరంతరం,  అహర్నిశలు శ్రమించి, వారి వారి లక్ష్యాలు సాధించి, ఒక స్థాయికి చేరినా, మిగతా జీవిత కాలం, *ఏ సమాజ సహకారము, సహాయము గైకొని ఇంత వృద్ధి చెందారో* ఆ సమాజ మరియు దేశ హితం కొరకు పాటుపడదామన్న  కనీస స్పృహ పెంచుకోరు, పాటించరు. స్వలాభానికై ఇంకా సంపాదిద్దాము.  ఉదయం లగాయతు సాయంత్రం వరకు సంసార తాపత్రయాలతోనే కాలక్షేపం చేద్దాము అను స్వార్థ ధృక్పథంతో ఉంటారు. *వయస్సు పైబడిన వారైనా ఇటువంటి వారు "సుసమాజం" దృష్టిలో వ్యర్థులే*.  


మన ప్రాంతము, మన దేశము, మన సంస్కృతి, మన ధర్మము పట్ల మమకారము, ఈ జాతీయత పట్ల అభిమానము, సేవానిష్ఠ లేని వారు మరియు నివసించుచున్న నేల పట్ల మాతృ భక్తి లేని నీతిభాహ్యులు *గుడ్డి కన్ను తెరిచినా ఒకటే మూసినా ఒకటే చందాన జీవితం వెళ్ళదీస్తుంటారు*. ఈశ్వరా రక్షించు మమ్ములను.  


మన భారత  ప్రజలలో వర్గ, భాషా, ఆహార, ఆహార్య, సంస్కృతి, సంప్రదాయ మరియు తదితర అనేకానేక వైవిధ్యాలు, భిన్నత్వాలు  కల్గిఉన్నా *అందులో నిహితమై ఉన్న సమన్వయాన్ని, ఏకత్వాన్ని, ఆసేతు హిమాచలం (కాశ్మీరు నుండి కన్యాకుమారి వరకు) మళ్ళీ ఒకసారి పునరుద్దరించడానికి* ప్రవచనకారులు, ఆశ్రమాధిపతులు, పీఠాధిపతులు, ధర్మప్రచారకులు, హిందూ నాయకులు ప్రజల మధ్యకు రావాలి. *ఈ సత్సంకల్పానికి రచయితలు,  కవులు, గాయకులు, సామాజిక వైతాళికులు తోడు నిలవాలి*. *కావున మన హిందు ధర్మానికి, సంస్కృతికి ఊపిరులూదడానికి ప్రతి పౌరుడు కంకణం కట్టుకోవాలి*. 


ధన్యవాదములు

*(సశేషం)*

*శ్రీ ఆది శంకరాచార్య చరితము 31

 *శ్రీ ఆది శంకరాచార్య చరితము 31 వ భాగము* 

❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️


ఆ తరువాత  శార్ఞపాణి అనే వైష్ణవ శ్రేష్ఠుడు శంకరులతో మాటాడ నెంచెను.


శార్ఞపాణికి తత్త్వబోధ:

తెలియనంత వరకు ఎవరి మతం వారికి గొప్పదిగా కన్పించుట సహజం. శార్ఙ్గపాణి వైష్ణవమత మందు గొప్ప వాడని ప్రసిద్ధి పొందియున్నాడు. ఆయన తన మత విధానమును శ్రీ శంకర పాదులకు వినుపించ నెంచి లేచి, 'స్వామీ! విష్ణుమూర్తి యొక్క శంఖచక్రాలు ముద్రలు గా ధరించి, సదా "ఓం నమో నారాయణాయ" అనే మహా మంత్రాన్ని స్మరణ చేయుచుం దుము. విష్ణుభక్తులకు వైకుంఠ నివాసము తప్పక ప్రాప్తించును. కనుక ఈ సంసార బంధము నుండి విముక్తి నొంది ఇప్పుడే వైకుంఠమునకు వెడలుచున్నాను. శంఖచక్రాది చిహ్నధార ణలకు పురాణము ల యందు ప్రమాణము లున్నవి. ఏ వైష్ణవుడు శంఖచక్రాది చిహ్నము లను ధరించుకొని కంఠమున తులసి, పద్మబీజ మాలలను అలంకరించుకొని ఊర్థ్వ పుండ్రధారణ చేసికొని యుండునో అట్టివానిని చూచినంత మాత్రాన శ్రీ మహావిష్ణు వును దర్శించినట్లే యగును' అని తన అభిమతాన్ని వ్యక్తం చేశాడు.


ఆచార్యస్వామి శార్ఞపాణి పలుకులు ఆలకించి 'భక్తుడా తగు ప్రమాణంగల మాట లకు విలువ కలుగును. చక్రాంకితములు వేద విహితములు కావు. అందువలన అది ప్రమాణ రహితము. వ్రతాల నాచరించ కుండా శరీరం తప్తం కాదు. తప్తంకాని శరీరం గల వానికి మోక్షం రాదని శ్రుతి తెలుపు చున్నది. పాపాలు పోవలెనన్న శరీరాలు శుష్కించి తీర వలెను. వ్రతాదుల వలన శరీరం తప్తం కానిచో ధ్యానం చేయవలెను. పురాణ ములు కేవలం ప్రమాణ ములుగా ఎంచకుడు. శంఖ చక్రాంకితములు తక్షణం విడిచి పెట్ట తగి యున్నవి. మోక్షం కావ లయునన్న బ్రహ్మజ్ఞానం కలుగ వలెను, అని శ్రుతి ఎలుగెత్తి చాటు చున్నది. పుణ్యం క్షీణించిన స్వర్గాది పుణ్యలోకవాసం అంతమై తిరిగి మానవుడై జన్మించునని శ్రుతి తెలుపుచున్నది. చిహ్న ధారణలను శ్రుతి స్మృతులు అంగీకరిం చుటలేదు. బృహ న్నారదీయమందు గాని, పురాణముల యందుగాని చిహ్న ధారణ నిషేధమనియే విధించబడినది. చిహ్న ధారణతో నేను విష్ణువుతో సమాన మనుకొనుట భావనా రాజ్యము వంటిది. వేదములు వల్లించక బాహ్మణ చిహ్నములైన శిఖా యజ్ఞోపవీతం మొదలయినవి ధరించి నంత మాత్రాన జ్ఞానార్జనచేయనిచో బ్రాహ్మణుడు కాజాలడు. బ్రహ్మజ్ఞానార్జన చేయు వానినే బ్రాహ్మణు డందురు. భ్రష్ఠుడైన బ్రాహ్మణుడు తిరిగి బ్రాహ్మణుడు కాగలడా! బ్రహ్మజ్ఞానం వల్లనే ముక్తి ప్రాప్తించునని శ్రుతివాక్యములు ఢంకాధ్వని చేయు చున్నవి. కనుక ప్రతీ క్షణం తత్త్వవిచారణ చేయుచుండుడు. అంతట జీవేశ్వరాభేదం దృఢమై జీవుడే శివుడగుచున్నాడు. 'శివోహం' అని నిరంతరం మననం చేసికొను వానిని ఆ శివుడే వానిని శివునిగ చేయును. వాసన క్షయించి భేద బుద్ధి నశిస్తుంది. ఈ విధంగా  శివగీత పలుకుచున్న’ దని వచించారు.


శార్ఙ్గపాణి శ్రీ ఆచార్య స్వామి వెలువరించిన తత్త్వబోధవిని సాష్టాంగ వందనములర్పించి కృతార్ధుడనైతి' నని తన నిశ్చయాన్ని వ్యక్తం చేశాడు.


వైఖానసుడు:


శ్రీ ఆచార్యస్వామి గావించు మతప్రబోధ మెటులున్నను తాము బహుకాలమునుండి ఆచరించు విధానము ను తిరస్కరించుటను సహించలేక వైఖానసు లలో ప్రముఖుడైన వ్యాస దాసుడు శ్రీశంకరపాదులను సమీపించి, 'స్వామీ! మాకు శీమన్నారాయణ మూర్తియే పరమదైవం. కావున మా పక్షమును కాదనుటకు బ్రహ్మతరం కాదు. 'తద్విష్ణో: పరమం పదమ్' మొదలయిన శ్రుతి వాక్యములు శ్రీమన్నా రాయణ మూర్తికే అగ్రస్థానమిచ్చినట్లుగ తెలుపుచున్నవి. అదియును గాక ఆయనలోనుండి బ్రహ్మ, రుద్రుడు పుట్టుచున్నా రని 'నారాయణాద్బహ్మా జాయతే రుద్ర ఏవచ' శ్రుతి వెలువరించినది కనుక నారాయణ మూర్తినే సేవించ వలసి యున్నది.


ఆయన సర్వాంతర ర్యామియై వెలయు చున్నాడు. విష్ణుభక్తుల లక్షణములు మొదలగు నవన్నియు వైఖానస మతమందు విపులంగా తెలుపబడి యున్నవి. శంఖ చక్రాది విష్ణు చిహ్నములను ధరించి ఊర్థ్వపుండ్రములను పెట్టుకొన్నవాడే విష్ణు భక్తుడని తెలియ బడును.' అని వివరించెను.


వ్యాసదాసుడు వివరించిన విధానము నాలకించి అందు గల లోపములను సవరించనెంచి, 'వ్యాస దాసా! ఈ లోకాలను సృష్టించు వాడు బ్రహ్మా? విష్ణువా? నారాయణ మూర్తి సృష్టి చేయు వాడగుచో పరిపాలించు వాడెవడు? ఇందులో వివాద మెంతేని గలదు. ఇది అటుండ నిమ్ము. సృష్టిస్థితిలయ కారకులు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు అను మువ్వురున్నారు.వీరలేమగుదురు? ఇది కూడ అటుండనిమ్ము, నారాయణమూర్తి యనినా విష్ణు వనినా ఒకటేకదా! విష్ణుపద మనగా నిత్యముక్తి. అది కేవలం తత్త్వజ్ఞాన ముండిననే లభ్య మగును. జ్ఞానం వినా ముక్తికి మరియొక మార్గం కానరాదు. నీవు విష్ణుభక్తుడవే యగుచో ఆయన ప్రీతి కొరకు వైదికకర్మలను ఆచరిం చుమా! శంఖచక్రాంకితా లనుచు కాల్చుకొన్నంత మాత్రాన ముక్తి రాదు. ఆగమాచారాలు బ్రాహ్మణత్వమును నాశనం చేయుటకు కారణమగుచున్నవి. అట్టివి లేకుండిన యోగ్యత కలిగి యుండేది.' అని శ్రీశంకరపాదులు తెలియజేశారు.


శ్రీ ఆచార్యస్వామి చెప్పినది విని సంశయ గ్రస్తుడై మరల, 'పూర్వకాలంలో దత్తాత్రేయ యోగీంద్రుల వారు పంచముద్రలు ధరించియున్నారు కదా! ఆయనది మోక్షమార్గమే కదా! అందు వలననే మేమందరం ఆయన మార్గాన్ని అనుసరించుచున్నాము. పురాణ ములలో శంఖ చక్ర ధారణ చెప్పబడి యున్నది. ఇన్నిట చక్రాంకితములు యోగ్యమై యున్నవి. ఇవిలేనిచో వైష్ణవ మతమునకే హాని సంభవించును. కావున భగవంతుని చిహ్నము లను ధరించడం విధి!' అన్నాడు వ్యాస దాసుడు.


శ్రీశంకరపాదులు వ్యాసదాసుడు తెలిపిన విషయము మరల ఆలకించి, వ్యాసదాసా! నీ అవివేకమును  ఏమనవలెను! బాలకు లు కూడ ఈ చక్రాంకిత ములు లాభము లేద నుచున్నారు. 


మహాతత్త్వవేత్త, పరమ యోగీంద్రులు అయిన దత్తాత్రేయులు ముద్రాంకితములు పొందియుండలేదు. చక్రాంకితములు ధరించినటుల ఎందునా కానరాదు. పురాణ ములయందు గలద నుట ఉచితము కాదు. ఇప్పుడైనను నీ మూఢ భక్తిని విడనాడి సుఖముగానుండుము. భక్తుడా! ప్రహ్లాదుడు, గజరాజు, ధ్రువుడు, హనుమంతుడు, ద్రౌపది, గోపికలు, గోపకులు, వీరందరికీ చక్రాంకితములు చేసిన గురువు ఎవరు? అట్టి ఊహలు విడవాడి 'బ్రహ్మాస్మి' అనే అద్వైత భావమును పొంది సుఖంగా మోక్షమును పొందుమా!

చక్రాంకితములు తప్పు కాదందువా, కపోల తలముల యందు శేషునిముద్రలు, కంఠమున గరుత్మంతు ని ముద్ర, భుజముల యందు, జ్ఞానేంద్రియ సమీపమున చక్రాంకిత ములు ధరించరేల? అచ్చట ప్రమాద మనియా!' అని వ్యక్తం చేశారు.


‘యతివర్యా! తమ అనుగ్రహంతో వివేక ముదయించినది. నేనింక చక్రాంకితాలు ధరించబోను. చిన్న తప్పును తెలిసికొన జాలక, ముందుకు పోజాలకుంటిని. ఇట్టి పరమ రహస్యమును తెలిసికొనలేక పోవడం ఇంత వరకు మాకొక గొప్ప అవరోధమే ఏర్పడింది. దానిని తృణప్రాయంగా తొల గించినందుకు కృతజ్ఞుడను. మిమ్ములను 'జగద్గురువు' లనియే పిలువవలెను. కరుణించుడు!' అని వ్యాసదాసుడు  శ్రీ శంకరపాదులకు కృతజ్ఞతలు అర్పించాడు.వ్యాసదాసునకు ముక్తిమార్గం చూపనెంచి శ్రీశంకరాచార్య స్వామి, 'వ్యాసదాసా! 'నేనే బ్రహ్మను. బంధములు లేని వాడను’ అని సదా భావన చేయు చుండుమా! అట్లు చేయ లేనిచో ‘బ్రహ్మైవాహం న సంసారీ ముక్తోహమ్' అని యైనను నిరంతర మూ మననం చేయు చుండుమా! ఇట్లాచరించినచో బంధముల నుండి విడివడి పరమాత్మను తెలిసికొనగలవు. అట్లు తెలిసికొనడమే ముక్తి.  ముక్తినొందుడు మరో దారిలేదు” అని ఉపదేశించారు.


కర్మహీన శాఖీయులు:


కర్మహీనులని పిలువ బడే శాఖయొకటి వైష్ణవమతమందు గలదని ఇదివరలో తెలుపబడినది. ఆ శాఖకు చెందిన నామ తీర్ధుడను ప్రముఖుడు సభలోనుండి లేచి శ్రీశంకరాచార్యులను సమీపించి, 'యతివర్యా! నమస్కారములు! మా మత ధర్మములు వినండి! విష్ణుమూర్తి మతమగుటచే దీన్ని కాదనుటకు ఆదిశేషు నికి కూడ శక్యం కాదు. కారణమేమన, జగమంతావిష్ణుమయం. శిష్యునికి ముక్తిని ప్రసాదించు నిమిత్తం గురువు విష్ణుమూర్తిని ప్రార్థించాడు.'నాశిష్యుని తమపాదారవిందముల కడకు చేర్చుకొను’ డని ఆ ప్రార్థన విని శ్రీపరమేశ్వరుడు అట్లు తన పాదసన్నిధికి చేర్చుకొన్నాడు.


‘యతివర్యా! నాకు తిరిగి జననం లేదు.  మీరందరూ సర్వలోక ప్రభువైన విష్ణువును పూజించుడు. ముక్తి తప్పకరాగలదు.' అని నివేదించాడు.


శ్రీ శంకరాచార్యస్వామి కర్మహీనుని పద్ధతి విని అతనిని బాగుచేయ నెంచి, 'నామతీర్ధ! కర్మ చేయని వాడవు! జీవన్ముక్తుడ వైతివా! ఇది ఎంతనింద్యము! ఇది మంచి, అది చెడ్డది అనే తేడా నీకు లేనందున నీది పిశాచ వృత్తి! వేద విహితమైన విధికర్మల నాచరిస్తూ తత్ఫలితాన్ని ఈశ్వరా ర్పణ చేసినచో అయ్యది జ్ఞానమార్గ మగును, ఫలాపేక్ష తో కర్మచేసినప్పుడు అది కర్మమార్గము. అన్ని విధాలా కర్మభ్రష్ఠుడవే యగుచున్నావు. అందువల్ల శ్రుతి స్మృతులు నీకు శిక్షను విధించుచున్నవి. ఏవిధంగా జూచినను నీవు విష్ణుభక్తుడవు కానేరవు. స్వధర్మము నాచరించువాని లక్షణాలు చెప్పెదను, విను. విష్ణుభక్తుడు సదా ధర్మమును చలించకుండ ఆచరిం చవలెను. ఇష్టుడు, అయిష్టుడు అను భేదం లేకుండ సమబుద్ధితో నుండవలెను. అట్లు ఆచరించుచు పరిశుద్ధ మైన అంతఃకరణ బుద్ధితో నుండవలెను.


'శ్రుతులలోను, స్మృతు లలోను ఏది చెప్పబడి యున్నదో, అదినాఆజ్ఞ' ఆ శ్రుతిస్మృతులకు వ్యతిరేకముగ ప్రవర్తిం చు వాడు నాకు ద్రోహి. అతడెంతటి భక్తుడైనా నరకమును పొంద వలసినదే!' అని పరమేశ్వరుడు వచించినట్లు ప్రబల మైన ప్రమాణములు ఉన్నవి. 'బ్రాహ్మణం కర్మ కుర్వీత' అనే వాక్యము ననుసరించి బ్రాహ్మణు లైన వారందరు కర్మ విధిగా ఆచరించ వలసినదే. బ్రాహ్మణుల కెక్కడా కర్మత్యాగం చెప్ప బడి యుండ లేదు. పైగా దేవాంతర పూజను విడువ గూడదు. 'అగ్నిర్దేవో ద్విజాతీనాం' అని శాసించడంవల్ల బృహ్మ చారి మొదలయిన వారందరు కర్మత్యాగం చేయరాదని తేలినది. త్రికాలముల యందు సంధ్యావందనం విధిగా ఆచరించ వలెను. అట్లు చేయనందువలన వచ్చు దోషం పోగొట్టు కొన వలయునన్న మూడు కృచ్ఛవ్రతము ల నాచరించవలెను. విప్రునకు కర్మ చేయడం తో శూద్రత్వం పోయి ద్విజత్వము వచ్చునని శాస్త్రము వచించు చున్నది. రెండు పుట్టుకలు అందొకటి శూద్రత్వము, రెండవది బ్రాహ్మణత్వము కలది గనుకనే బ్రాహ్మణులను ద్విజులన్నారు. కర్మ చేయనివాణ్ని ద్విజుడు అనడం మహాదోషం.


‘నకర్మణా నప్రజయా' అను శ్రుతి వాక్యము న్నది గదా యనెద వేమో అది ద్విజుల కొరకు చెప్పబడి యుండలేదు. సన్న్యాసం పొందిన యతుల కొరకై

పరిత్యాగం చెప్పబడినది అని వివరించి చెప్పిరి.


శ్రీ శంకరులు వచించిన ధర్మం బుర్రకెక్కి సంతుష్టుడై నామ తీర్థుడు జగద్గురు వులకు సాష్టాంగ వందనము లర్పించి అప్పటి నుండి కర్మలు చేయడం ప్రారంభిం చాడు. మిగిలిన వారందరు ధర్మసూత్రా లను గ్రహించి జ్ఞాన మార్గమందు సంచరిం చడం ప్రారంభించి అద్వైతులయ్యారు. శిష్యులతో అచ్చట నుండి సుబ్రహ్మణ్య క్షేత్రమునకు శ్రీఆచార్య స్వామి పయన మయ్యారు.


*కాలడి శంకర కైలాస శంకర*


*శ్రీ ఆది శంకరాచార్య చరితము 31 వ భాగముసమాప్తము*.

🌺🌺🌺🌼🌼🌼🌺🌺🌺

*శ్రీ ఆది శంకరాచార్యచరితము 30

 *శ్రీ ఆది శంకరాచార్యచరితము 30 వ భాగము*

🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸


పరమేశ్వరుని తెలియ జేయుటకు మాటలు చాలవు, మనసున భావించుటకు శక్యం కాదు. అట్టి పరమాత్మ సచ్చిదా నంద స్వరూపమై ప్రకాశించుచున్నది. శివుణ్ని ఉపాసించుటకు యోగ్య మైన విభూతి, రుద్రాక్షలను ధరించ వచ్చును. ప్రమాణ రహితము లైనవి విడనా డండి.'అని ఉపదేశించారు.


అంతలో మరియెక లింగధారి లేచి, 'స్వామీ! లింగధారణ నిషేధమను చున్నారు. అద్దానిని మే మెన్నటికీ సహించ జాలం. తామట్లనవలదు. ధారణకు ఆధారములు ప్రబలంగా నున్నవి. ఒకప్పుడు దేవత లకు త్రిపురాసురులకు గొప్ప పోరు సంభవించి నది. అందు దేవతలు  అసమర్థులయ్యారు. అప్పుడు వాళ్ళందరు సమావేశమై త్రిపురాసురులను సంహరించుటకు ఉపాయమాలోచించారు. అగ్ని చంద్ర, విష్ణువులను ప్రతిష్ఠించారు. ఆ ముగ్గురి చేత ఒక బాణాన్ని సృష్టింపజేశారు. అది బహు బరువుగను, బలముగను తయారైంది. అట్టి దాన్ని ఎత్తడం వాళ్ళకసాధ్యమైంది. దాన్ని ఎత్తేవారెవరా యని ఆలో చించగా  రుద్రుడందులకు సమర్ధుడని  నిర్ణయించి వారందరు పరమశివుని ప్రార్థించారు. వారి మొరాల కించి రుద్రుడు ప్రత్యక్షమై తానొక వరమును కోరు కొందుననగా దేవతలం గీకరించారు. 'పశువులకు పతిని కావాలి' అని రుద్రుడు వ్యక్తం చేశాడు. అప్పుడు దేవతలందరు పశువులైనారు. రుద్రుడు పశుపతి యైనాడు. దేవత లప్పుడు భక్తితో పశుపతి చిహ్నాలను ధరించారు. అంతట పరమశివుడు మేరువును విల్లుగను, వాసుకిని నారిగను, భూమిని రథముగను, సూర్యచంద్రులను చక్రము లుగను వేదాలనుగుఱ్ఱము లుగను, బ్రహ్మను రథ సారధిగను నియమిం చాడు. అట్టి సమయ మందు దేవతలు స్తోత్రం చేయుచుండ పరమశివుడు రాక్షనులను సంహరించాడు. కనుక లింగం మొదలై నవి ధరించడం భావ్యమే కదా! పరమశివుని సేవకు లగుట చేత వారి యందు మాకుండేభక్తిని పురస్క రించుకొని వారిని గౌరవిం చుటకు శివచిహ్నాలను ధరించి యున్నాము. ఇది తప్పా? ప్రభువులు ధరించే ఆయుధాలు వారి యెడ నుండే భక్తికొలది సేవకులు ధరించడం లోకాచారమై యున్నది కదా!' అని శ్రీ శంకరాచార్యులకు వివరించాడు.

లింగధారి చెప్పినదంత యు శ్రీశంకర పాదులు చక్కగా విని 'భక్తాగ్రగణ్యా! నీ వాడు మాటలకు విలువ లేదు. త్రిపురాసుర వధలో దేవతలు లింగధా రులయ్యారన్న విషయం ఏ గ్రందమందును కానరాదు. అది ఎంత మాత్రము నిజంకాదు. విభూతి, రుద్రాక్షలు ధరించారంటివి. అది సమంజసముగ  నున్నది. ప్రమాణ రహిత మైనది సత్యమనుటకు ఆస్కారమేది? కనుక లింగ ధారణ నిరాధారము,నిష్ప్రయోజనమును. భక్తి, శ్రద్ధ,ధ్యానం మొదలైనవాని వల్ల ఆత్మను తెలిసికోమని సత్యోపనిషత్తు తెలుపు చున్నది. శూలం మొదలైన చిహ్నధారణ జ్ఞానార్జనకు హేతువని ఎక్కడా చెప్పి యుండలేదు. ముక్తికి మార్గం జ్ఞానార్జన పరమ శరణ్యం. చిహ్నధారణ శరీరమునకు బాధ కలుగ డంతప్ప వేరు ప్రయోజనం కానరాదు.


రాజచిహ్నములను సేవకులు ధరించడం లోకాచారమైనచో మాత్రం చామరం మొదలైనవి ధరించుటలేదే! అట్టివి సేవ కులు ధరించ వచ్చునా? కనుక పరాత్పరుని చిహ్నా  లను ధరించడం బరువు చేటు! భక్తాగ్రగణ్యా! పరమ శివునకు పన్నగములు భూషణములుగా నున్నవి కదా! భక్తులు పాములను ధరించరేల? త్రాటిని జూచి పామనుకొని భయపడే మానవులు నాగధరులగు దురా! కావున పరమేశ్వర చిహ్నాలను ధరించడం భక్తులకు పాడి గాదు. ఇవి పామర చేష్టలు! అవి విడనాడి వేదోక్తమైన కర్మల నాచరించుడు! మీ మీ చిహ్నములను పరమేశ్వరు న కర్పణ చేయుడు. 'నేనే ఇదంతా చేస్తున్నాను' అను బుద్ధిని వీడి ఆత్మ సంయమనం అలవాటు పరచుకొనుడు. దానివలన కలిగే జ్ఞానంతో ముక్తిని బడయగలరు!' అని శ్రీ ఆచార్యస్వామి వివరించారు.


అంతట విపక్షశూలుడను లింగధారి శ్రీ శంకరాచార్య స్వామి వచించినది సత్య మని నమ్మి నిష్కల్మష హృదయుడై వారి పాదము లపైబడి శరణు వేడు కొన్నాడు. బంధుమిత్రుల తో అద్వైతము నవలం బించుటకు విపక్షశూలుడుకృతనిశ్చయుడైనాడు. ఆవిధంగా శ్రీశంకరాచార్య స్వామి కాంచీపుర మందు శివమతస్థులనందరినీ అద్వైతులను గావించి అచ్చోటు వీడి కొలది దినములలో అనంతశయ న క్షేత్రం చేరుకొన్నారు.


అనంతశయన క్షేత్రము:

శ్రీశంకరాచార్య స్వామి అనంతశయన క్షేత్రం ప్రవేశించి అందు వేంచేసి యున్న అనంత పద్మనాభ స్వామిని దర్శించుచు విష్ణుభక్తుల లోపాలను సవరించుచు ఒక నెలరోజు లపాటు నివసించారు. తిరువనంతపురము, త్రివేండ్రము అని అనంత శయన క్షేత్రమునకు పేరులు. ఈనాడు  అది కేరళ రాష్ట్రమునకు రాజధానీనగరమై ప్రకాశించుచున్నది. ఆనాడ చ్చట నున్నవారందరు విష్ణుభక్తులు. వారలు ఆచార వ్యవహారములను బట్టి ఆరు రకములుగా నున్నారు. వైష్ణవులు, భక్తులు, భాగవతులు, పాంచరాత్రులు,  వైఖాన సులు, కర్మహీనులు అనునవి వైష్ణవశాఖలు. శ్రీ శంకరాచార్య స్వామి వచ్చారన్న వార్త వినుటతో వారందరుచూడవచ్చిరి. శ్రీ ఆచార్యపాదులు వారలతో కుశల ప్రశ్నలు గావించారు. వారలలో విష్ణుశర్మ లేచి శంకరాచార్యులతో,


'స్వామీ! వాసుదేవుడు శ్రీ రామావతారము, కృష్ణావ   తారము ఎత్తియున్నారు. మేమందరం మూఢుల మైనను వాసుదేవుని ఉపాసించుటవలన పవిత్రులమై విష్ణు సాలోక్య ము పొందుచున్నారము. పూర్వమందు కౌండిన్య మహర్షికి సాక్షాత్కరించిన అనంతపద్మనాభుని మిగుల భక్తితో సేవించు చుంటిమి. ప్రతి నిత్యము మేము చేయుచున్న పని అదియే.


మాలో కర్మఠులు, బృహ్మగుప్తులు, జ్ఞానులు మొదలయిన వారందరం ఇచ్చోటనే ఉండి కర్మలు చేస్తూ జ్ఞానార్జన చేయుచు న్నాము.' అని విన్నవిం చాడు.


శ్రీఆచార్యస్వామి, విష్ణుశర్మ పలుకులు విని జ్ఞాన లక్షణము  ఎట్టిదో వివరిం చమన్నారు. "స్వామీ! పరాత్పరుని ప్రమేయం లేనిదే గడ్డి పరకైనను కదలలేదు. అట్టి పరాత్పరు ని పాదపద్మములే శరణని విశ్వసించి మౌనం వహించి యుండడమే స్థిరమైన జ్ఞాన" మని విష్ణుశర్మ శంకరులకు జవాబిచ్చాడు.


శ్రీ ఆచార్యపాదులు వాని అజ్ఞానమునకు జాలినొంది, 'నాయనా! బ్రాహ్మణుడు జన్మచేత శూద్రుడు. కర్మ చేత ద్విజుడగు చున్నాడు. ద్విజుడు మూడు వేళలా సంధ్యావందన మాచరించ వలెను. త్రికాలముల యందు అగ్నిని పూజిం చాలి. ఇట్టి కర్మలు బ్రాహ్మణుడు విధిగా చేయవలెనని శ్రుతి ఘోషించుచున్నది. సంధ్యా వందనం చేయనిచో ప్రత్యవాయ దోషం సంభ విస్తుంది. వేదవిహితము లైన కర్మల నాచరించిన సకలశుభములు పొందు చున్నాడు. అట్లాచరించని వాడు సకల దుఃఖములకు లోనగుచున్నాడు. ఇది మనువు శాసించినది. మనువు శాసించిన నిత్య కర్మలను ఆచరించని వాడు జీవకోటి యున్నంత వరకు నరకమును పొందు చున్నాడు. యతులు కర్మలు చేయనక్కర లేదని తలంచకు. స్నానం, జపం, తపం, దేవతార్చన వారల కు విహితములు, సర్వ సంగ పరిత్యాగులయిన సన్న్యాసులకే కర్మలు విధించ బడినప్పుడు ఇతరుల విషయం వేరుగ వచించవలెనా? బ్రాహ్మణు డు విధికర్మల నాచరించని నాడు వాని బ్రాహ్మణ్యం మంట గలసిపోతుంది. ఏ కొంతకాలమైనను కర్మను విడనాడినచో భ్రష్టుడై యమయాతనలకు లోను గావలసినదే' అని విష్ణు శర్మాదులకు ఉపదేశం చేశారు.


*పంచాయతన పూజ:*


శ్రీశంకరపాదులు విష్ణుభక్తు లను మంచి మార్గమందు ఉంచనెంచి, ‘మానవులై జన్మించి నందుకు జ్ఞానము నార్జించుకొని ముక్తి నొందు టయే పరమావధి. దాని నెట్లు పొందవలెనో తెలిసి కొనుడు. పరమేశ్వరుడు, విష్ణువు, ఆదిత్యుడు, పార్వతి, గణపతి అనువా రైదుగురు దేవతలు, వీరం దరు ఉత్తమోత్తములు. మీరందరు ఈ పంచదేవతా పూజను ప్రారంభించుడు. ఏ కోరికలు మనసు నందు తలంచక బ్రహ్మార్పణ బుద్ధితో అర్చించు కొనుడు. తద్వారా మీ మీ అంత:క రణలు పరిశుద్ధమై మీకును, పరాత్పరునకును అభేదముదయించును. అందులో మీకు గల అజ్ఞానం మాయమై 'నేనేపరమాత్మను' అనే నిశ్చయజ్ఞానం కలుగును. అదియే మోక్షము. అట్టి ముక్తి కలుగుట కనేక కారణము లున్నవి. చెప్పెదను ఆలకించుడు.


జీవేశ్వరాభేదం దృఢంగా నమ్మునప్పుడే లింగదేహం నశించును. ఆ స్థితిలో సంకల్పములు మొలక లెత్తుటకు ఆస్కారం కాన రాదు. అట్టి నిస్సంకల్ప స్థితిలో మాయా వరణలు తొలగుటతో ఆత్మ దేదీప్య మానంగా ప్రకాశించును. దానినే శాశ్వతానందస్థితి లేక శాశ్వతమైన ముక్తి యందురు.' అని తత్త్వము నొకించుక ఉపదేశించారు.


శ్రీఆచార్యస్వామి వెదజల్లిన తత్త్వ రహస్యబీజములు విష్ణుశర్మాదులలో నాటు కొని మొలకలెత్తినవి. నాటినుండి వారందరు పంచాయతన పూజ ప్రారంభించి, ఆయన శిష్యవర్గమంతా శంకరులు చెప్పినచొప్పున చేయుచు, నిత్యం మృత్తికాస్నానము లాచరించుచు, భస్మ చందనములతో త్రిపుండ్ర ములను ధరించుచు, నియమనిష్ఠలు గలిగి ప్రవర్తించుచు జ్ఞానార్జన చేసికొనిరి.


బృహ్మగుప్తుడను వైష్ణవ మతకర్మఠుడు పేరొందిన భక్తుడు. విష్ణుభక్తులకు శంకరులు బోధించిన దంతయు శ్రద్ధగానాలకించి శ్రీశంకరపాదులను సమీపించి, 'యతిశ్రేష్ఠా! నమస్కారములు! మేమందరము స్మృతులలో తెలిపిన ప్రకారము కర్మల నాచరిం చుచున్నాము. అట్లు సత్కర్మల నాచరించుచు పద్మనాభస్వామి వారి క్షేత్ర మందు నివసించు చున్నాము' అని నివేదించుకొన్నాడు. 


శ్రీశంకరాచార్యులు బృహ్మ గుప్తుని విధానమును విని, మీరందరు నిర్మలమైన మనసుతో పరమేశ్వరా ర్పణ భావంతో భక్తిశ్రద్ధలు గలిగి పంచాయతనపూజ సల్పుకొనుడు. జీవుడు, ఈశ్వరుడు అను భేద భావం లేకుండ జేసి కొనుచు సూక్ష్మ దేహానికి లోనుగాక, అజ్ఞానమును పారద్రోలి శాశ్వతానందము ను పొందుడు! అని వెలువరించుటతో బ్రహ్మ గుప్తాదులు సంతసించి, అనేక నమస్కారము లర్పించి నిర్మల చిత్తుల య్యారు. ఆ నాటి నుండి వారు అద్వైతులై స్థిరమైన ఆనందమును పొందు మార్గము నవలంబించారు.


పిమ్మట భాగవత శాఖకు చెందినవారు శ్రీ ఆచార్య పాదునితో ముచ్చటించ నుద్యుక్తులయ్యారు.

భాగవతశాఖకు చెందిన విష్ణుభక్తు డొకడు శంకరు లకు నమస్కరించి, 'వేదములలో ఎన్నివిధాల పుణ్య మార్జించు కొను విధానములు తెలుపబడి యున్నవో అవన్నియు విష్ణుమూర్తిని స్తుతించుట వలననే కలుగుచున్నవి. అందువల్లనే మేమందరం విష్ణువును కీర్తించడమందే నిమగ్నులమై శంఖం, చక్రం మొదలయిన చిహ్నాలను అంకితం చేసికొని కంఠాన తులసిమాలలు అలంక రించుకొని ఊర్థ్వపుండ్రాలు ధరించుచున్నాము. కావున ముక్తి మా అరచేతులలో నున్నది. ఇంక మాకు చింతా చీకూ అన్నది లేదు.' అని తన మతధర్మములను వివరించాడు.


శ్రీఆచార్యస్వామి భాగవతుని విధానము విని, 'భక్తులారా! విష్ణువు నాలుగు రకముల మూర్తులుగలిగియున్నాడు. అందొకటి గగనము వలె నున్నది. అది చెప్పుటకు గాని, తలంచుటకు గాని శక్యం కానిది. దీనినే పరామూర్తి యందురు. అట్టి మూర్తికి ఏవిధమైన చిహ్నములు లేవే! అతడు కేవలం నిర్గుణుడు, నిర్వికారుడు, సర్వవ్యాపి.


అట్టివాని రూపమును ఏవిధముగ ధరించగలరు? రెండవమూర్తి వ్యూహమ ను పేరుతో వెలయు చున్నది. ఇది సర్వాత్మ స్వరూపముగా నున్నది. అట్టి రూపము నెట్లు ధరించు కొనగలరు? ఒక వేళ సమర్థత గలదందురా, అట్లయిన ఆయన యొక్క ఒక చిహ్నము చేత శిరస్సు మొదలుకొని పాదాల వరకు కాల్చుకొనుడు! అప్పుడు మీకు తప్పక ఈ శరీరం విడచిన తరువాత వైష్ణవత్వమును పొంద గలరు. ఇది దుస్సాధ్యం గదా! మూడవమూర్తి మీనాది అవతారమూర్తు లు. దీనికే విభూతి యనిపేరు. ఈ చేప మొదలయినవి లోహంతో తయారు చేసుకొని దానిని కాల్చి శరీరం మీద గుర్తులు పెట్టుకొనుడు. నాల్గవ మూర్తి అర్చామూర్తి. ఇవి రాళ్ళతో తయారు కాబడును. శిలారూపాన్ని మీమీ శరీరాలయందు చిహ్నాలుగా ధరించెదరా? శంఖచక్రాలపేరుతో కాల్చు కోవడమేల? లోహాదులతో తయారైనవే ధరించిన సమంజసంగా నుండు నేమొ! భాగవతులారా! శంఖచక్రాంకితాలు పాషండమతమునకు చెందియున్నవి. పరాత్ప రుని ప్రీతికొరకు సత్కర్మల నాచరించుడు. కర్మఫలితం పరాత్పరునకు అర్పణ చేయండి. అట్లాచరించిన పరిశుద్దులగుదురు. అద్వైత తత్త్వ వేత్త యగు పరమగురువు నాశ్రయించి వారి తత్త్వోప దేశాలను పొందుడు. అప్పుడు కర్మ బంధములు తొలగి మోక్షమును బడయగల' రని గంభీరోపన్యాస మిచ్చారు. 


*కాలడి శంకర కైలాస శంకర*

*శ్రీ ఆది శంకరాచార్యచరితము*

*30 వ భాగముసమాప్తము*

💕💕💕💕💕💕💕💕💕💕💕💕

శ్రీ ఆది శంకరాచార్య చరిత్రము 25

 *శ్రీ ఆది శంకరాచార్య చరిత్రము 25 వ భాగము*  

🥦🥦🥦🥦🥦🥦🥦🥦🥦🥦🥦🥦


ఆనందగిరి ఒకనాడు గురువుల కౌపీనములు శాఠీలు శుభ్ర పరచుటకు తుంగా తీరానికి వెళ్ళాడు. పని పూర్తి కాలేదు. ఈ లోగా కూడా వచ్చిన సహ శిష్యుడు ఆనందగిరిని తొందర చేశాడు పాఠానికి వేళ అవుతోందని. తన పని అయ్యే దాకా వేచి ఉండమని ఆనందగిరి కోరినా ఆ శిష్యుడు ఉండక విడచి వెళ్ళాడు. అక్కడ భాష్య పాఠాన్ని ఆరంభించడానికి శంకరుడు, శిష్యులు ఆసీనులై ఉన్నారు. గురువులు ఆనందగిరి లేకపోవడం చూచి అతని కోసం వేచి ఉందామని పాఠం మొదలు పెట్టలేదు. "ఆనందగిరి తుంగభద్రా నదికి శాఠీలు శుభ్ర పరచడానికి వెళ్ళాడు. అతడు వచ్చుటకు ఆలస్య మగుతుంది” అని శిష్యులు గురువు గారిని పాఠం ప్రారంభిం చమని కోరారు. పద్మపాదుడు తన మాట గురువు మన్నించునని ఎంచి “గురుదేవా! ఆనంద గిరికి ఈ పాఠములు అత్యంత అవసరమా? ఈ గోడ ఎంతో అతడంత. మీకు తెలియని విషయమా!” అని విన్నవించాడు. వారి అందరి అజ్ఞానము, అహంకా రము చూచిన శంకరాచార్యునకు వారికి కనువిప్పు కలిగించాలని నిశ్చయిం చారు. వారి అపార కరుణా సంపత్తితో ఆనందగిరిని ఆ క్షణంలో మార్చివేశారు. అతని లోని అంధకారం మటుమాయ మైనది. పదునాలుగు విద్యలలో ఒక్క క్షణంలో నిష్ణాతు డయ్యాడు! తత్త్వ విచారము కరతలా మలక మయింది. గురుదేవుని స్మరిస్తూ తొందరగా అడుగులు వేస్తూ ఆశ్రమం చేరుకొన్నాడు. వచ్చీ రాగానే ఈ శ్లోకాలు వినిపించాడు:


*"భగవన్ను దధౌ మృతి జన్మ జలే,* 

*సుఖదుఃఖ ఝషే పతితం* *వ్యధితమ్  కృపయా శరణాగత ముద్ధర మా,మనుశాధ్యుపసన్న మనన్యగతిమ్||*


"ఈ విధంగా పలికి గురువు సన్నిధానంలో నిలబడి తనకు తెలిసిన తత్త్వ రహస్యాన్ని నివేదిం చాడు. అది విని నిర్విణులయిన శిష్య గణం తాము ఎంత తక్కువ శ్రేణిలో ఉన్నారో అర్థం చేసి కొని గురుకరుణ దీటు లేనిదని ఆనందగిరిని గౌరవాదర దృష్టితో చూశారు. తోటక వృత్తములతో వేద తత్వాన్ని అంత చక్కగా విశ్లేషించిన ఆనందగిరికి 'తోటకాచార్యుడు' గా నామకరణం చేశారు శంకరస్వామి!


*శ్రీ శంకరాచార్యుల శిష్యులు నలుగురు:*


పద్మపాదుడు, హస్తామలకుడు, సురేశ్వరాచార్యుడు, తోటకాచార్యుడు. 


ఒకరిని మించిన వారొకరు. శ్రీమహావిష్ణువు చతుర్భుజాలతో ధర్మార్థకామమోక్షములనే నాలుగు పురుషార్థాలను ధరిస్తాడంటారు. శ్రీశంకరాచార్యుడు నాలుగు వేదాలను నాలుగు భుజాలుగా ధరించాడు. నిష్కామకర్మ యోగము, ధ్యానయోగము, భక్తియోగము, జ్ఞానయోగము అనునవి సాలోక్య, సామీప్య, సారూప్య, సాయుజ్యము లనే నాల్గు మోక్షాలను ఇచ్చేవి. చతురాననునకు సనక, సనందన. సనత్కుమార, సనత్సుజాతులనే నలుగురు కుమారులు. శంకరులకు నాలుగు మహావాక్యాలను పాలించే నలుగురు శిష్యులు నాలుగు బాహువులుగా భాసిల్లారు.


*‘నైష్కర్మ్యసిద్ధి'*


శృంగగిరిలో ఉండగా సురేశ్వరాచార్యుడు శంకరాచార్యస్వామి దగ్గరకు చేరి పాదాభి వందనము చేసి "స్వామీ! నాకొక ఉద్గ్రంథమును వ్రాయాలని కోరిక ఉన్నది. మీఆజ్ఞ సెలవియ్యండి” అని చెప్పాడు. శంకరుని హృదయము ద్రవించి తాను రచించిన సూత్ర భాష్యములకు వార్తికములు వ్రాయ మన్నాడు. దానితో సురేశ్వరాచార్యుని ఆనందానికి పట్టపగ్గము లు లేవు. ఈ వార్త విన్న శిష్యులు ఆ నిర్ణయానికి సుముఖులుగా లేరు. సూత్రభాష్యాలకు వార్తికాలు వ్రాయడ మంటే మాటలా? అసలు ఆ భాష్యాలను అర్థం చేసికొనడమే అసాధ్యం. ఇక వార్తికాలు రచించగల సామర్థ్యము మాటలతో వస్తుందా? తమలో తాము చర్చించుకొని శంకరులను చేరి ఈ విధంగా విన్నవించారు: "స్వామీ! సురేశ్వరా చార్యుడు నిన్న మొన్నటి వరకు కర్మలో మునిగి యుండి పరమాత్మ తత్త్వాన్ని కాదన్నవాడు. వాద సమరంలో మీచే విజితుడై మార్గాంత రము లేక విధిగా సన్న్యాసస్వీకారము చేసినవాడు. పూర్వ వాసనలు ఊరక పోగలవా? మా అందరి అభిప్రాయము సురేశ్వరుని పాలబడిన అధ్యాత్మ తత్త్వమునకు ముప్పే గాని మేలు జరగదని భావిస్తున్నాము. తరువాత మీ దయ” అని వినయంగా విన్నవించుకొన్నారు.


శంకరులు ఆలోచనలో పడ్డారు. ఈలోగా హస్తామలకాచార్యుడు వచ్చి గురువులకు వందనము చేసి ఇట్లా చెప్పాడు: “జగద్గురో! పద్మ పాదుడు బ్రహ్మచర్యాశ్రమములో నుండి నేరుగా మీ దగ్గరకు వచ్చి శిష్యుడై వేదవేదాంగాలను క్షుణ్ణంగా ఆకళించుకొని సర్వమూ తెలిసిన వాడు. వార్తిక రచన అతని చేతిలో కడు సమర్థంగా జరుగ గలదు. మీరు ఎరుగనిది లేదు. ఒకవేళ అతడు కాదను కుంటే తోటకాచార్యుడే ఇందుకు సర్వసమర్థుడు” అని విన్నవించి వెళ్ళి పోయాడు. తరువాత వచ్చిన పద్మపాదుడు శంకరులను కలసి వందనము చేసి, వార్తిక రచనకు హస్తామలకుని పేరు సూచించి అతడు వ్రాస్తే 'బంగారమునకు పరిమళం అబ్బినట్లుం టుంది' అన్నాడు. శంకరాచార్యుడు ఆ మాట విని "పద్మపాదా! నీవన్నది నిజం.నీకు తెలుసును. అతడు బాహ్యప్రపంచం తో సంబంధం లేని వాడు. పుట్టిననాటి నుండి జడుడై యున్నపుడు అతని తండ్రి నా కడకు వచ్చి వానికి జ్ఞానభిక్ష ప్రసాదించమని అర్థించాడు" అనగా పద్మపాదుడు “గురువర్యా! అంతటిలో అతనికి అంత జ్ఞానం ఎలా లభించింది? ఆశ్చర్యం గా ఉంది.” అని శంకరుని ప్రశ్నించాడు. అప్పుడు శంకరాచార్య స్వామి హస్తామలకుని పూర్వగాథ పద్మపాదు నికి ఈ విధంగా తెలియజేశారు.


“ఒకప్పుడు యమునా నదీ తీరాన సిద్ధు డొకడు పరమాత్మ తత్త్వమందే విహరించే వాడు ఉండేవాడు.


రెండేండ్ల ప్రాయము కల తన కొడుకుని తీసికొని ఒకామె నదీతీరానికి వచ్చింది. చంకలో నున్న బిడ్డను సిద్ధుని దగ్గర  ఉంచి బిడ్డను చూస్తుండమని సిద్ధునికి చెప్పి నదిలోనికి స్నానానికి దిగింది. సిద్ధునకు ప్రాపంచిక స్పృహ లేదు కాబట్టి ఆమె మాటలు చెవికి వినబడ్డా సిద్ధుని మనస్సుకు అందలేదు. తప్పటడుగులు వేసు కొంటూ పిల్లవాడు మెలమెల్లగా నీటి లోనికి జారి మునిగి పోయాడు. ప్రాణాలు పోయిన తరువాత నీళ్ళపై తేలింది పిల్లవాని శవం. తల్లి స్నానం చేసి వచ్చేలోగా జరిగిపోయిన ఘోరం చూసి తల్లి లబో దిబో అని ఏడ్వడం మొదలు పెట్టింది. సిద్ధుని ముందు శవాన్ని ఉంచి ఎలాగైనా బ్రదికించమని దీనంగా వేడుకొంది. ఈ లోగా సిద్ధునికి తెలివి వచ్చింది. చూచి జాలి పడ్డాడు. కాని ఏమి చేయగలడు? చచ్చిన బిడ్డను బ్రతికించడం సాధ్యమైన పనియేనా! ఏమీ చేయలేక తల్లి దు:ఖం పోగొట్టుదా మన్న సంకల్పంతో ఒక నిర్ణయానికి వచ్చాడు. యోగశక్తితో బాలుని మృతకళేబరంలో ప్రవేశించాడు. పిల్లవాని కి ప్రాణం వచ్చి లేచి కూర్చున్నాడు. ఆ బాలుడే మన హస్తామలకుడు" అని చెప్పి మరల ఇలా అన్నారు శంకరులు: “అలాంటి వాడు హస్తామలకుడు. అతడికి లోకంతో పరిచయం పూర్తిగా మృగ్యమే! వార్తికాలు వ్రాయడానికి పనికి రాడే! పైగా మండన మిశ్రుడు సామాన్య పండితుడు కాడే! ఇక వేరొకడు కానరాడ  య్యెనే!" అప్పుడు శిష్యులు శంకరునితో "స్వామీ! ఇది మహా కార్యము. మీరు తొందర పడకండి" అని వేడు కొన్నారు. సరే నన్నారు గురువు. ఆ తరువాత సురేశ్వరుని కలిసికొని శంకరుడు 'సూత్రభాష్యాన్ని వ్రాయడం మానుకో. దానికి బదులు నీ స్వతంత్ర రచనగా ప్రపంచానికి పనికివచ్చే ఒక ఉద్గ్రంధాన్ని వ్రాయి' అని ఆదేశించారు. వార్తిక రచనకు అవరోధం కలిగినా ఒక మహా గ్రంధాన్ని రచించమన్న గురుదేవుని ఆజ్ఞ శిరసా వహించి ఆ పనికి ఉపక్రమించాడు సురేశ్వరుడు. అనతి కాలంలో పూర్తి చేసి గురుదేవునికి చూపాడు. శంకరుడు ఆ రచనను ఆమూలాగ్రం పరిశీలించి మెచ్చి శిష్యులకు చూడమని ఇచ్చారు. ఆ గ్రంధం సామాన్యమైనది కాదని, ఆధ్యాత్మిక తత్వాన్ని విపులీకరిస్తూ ముక్తిపథానికి యుక్తియుక్తముగా చక్కని బాట వేసిన గ్రంధమని కొనియాడ బడుచున్న ఆ గ్రంధమే 'నైష్కర్మ్యసిద్ధి' అన్న సార్థక నామంతో ఈ నాటికీ యతి లోకానికి శిరోధార్యమై ఉన్నది. 


ఈ గ్రంధం తరువాత సురేశ్వరాచార్యుడు తనకు సూత్రభాష్యా లకు వార్తికాలు రచించే అవకాశం దక్క నీయ లేదన్న కోపంతో 'ఎంతటివాడైనా బ్రహ్మసూత్రాలకు వార్తిక గ్రంధరచన చేసినచో అది నశించు గాక!' అని శపించాడు. తర్వాతి కాలంలో శంకరుని ఆదేశాను సారమే బృహదారణ్య కోపనిషత్తుకు, తైత్తిరీయ ఉపనిషత్తుకు శంకరులు వ్రాసిన భాష్యాలకు వార్తికాలు వ్రాశాడు.


పద్మపాదుడు సూత్ర భాష్య టీకా గ్రంధాన్ని వ్రాసి శంకరాచార్యులకు సమర్పించాడు. మొదటి భాగానికి 'పంచపాదిక' అని, రెండవ భాగానికి ‘వృత్తము' అని పేరు పెట్టాడు. 


పంచపాదికను ఆమూలాగ్రం గురువుకు చదివి వినిపించాడు. ఈ భాగానికి చిరతరకీర్తి కలుగుతుందని శంకరులు అనుగ్రహించారు. దానితో ఆవిధంగా సురేశ్వరుని శాపం పరిహరింప  బడింది. శంకరుడు హస్తామల కాచార్యుని పిలిచి అతనిని కూడా అద్వైత ప్రచారమునకు అనువైన గ్రంధాలను వ్రాయమని ప్రోత్స హించారు.


ఒకనాడు సురేశ్వరుని పిలిచి “సురేశ్వరా! నీవు మరల ఈ లోకంలో 'వాచస్పతి' అనే పేర జన్మించి భామతీ వ్యాఖ్యానము అను పేర సూత్ర భాష్యమునకు వార్తిక గ్రంథమును వ్రాస్తావు. అది వేదాంతులకు చాలా ఆదరణీయ మవుతుంది".


*ఆర్యాంబ అవసానదశ:*


శ్రీశంకరుని తల్లికి వృద్ధాప్యం వచ్చింది. శరీరపాటవం తప్పు కొన్నది. నిత్యకృత్య ములు స్వయంగా చేసుకోలేకపోతోంది. జ్ఞాతులు ఆమెను ఎంతో భక్తితో చూచుకొంటున్నారు. వేళకు తప్పకుండా స్నానం చేయించి మంచి బట్టకట్టి భోజనం తినిపిస్తు న్నారు.పుణ్యకథలు వినిపిస్తున్నారు. మలమూత్ర విసర్జనలు మంచం దగ్గరే జరుగుచున్నవి. తన స్థితి తెలిసి కొని ఇక ఎక్కువ రోజులు జీవించనని ఒకనాడు మనస్సులో తలచు కొంది తనయుడు ఇచ్చిన మాట. 'నన్ను తలచిన మరు క్షణం నీ దగ్గర ఉంటానమ్మా! అని శంకరుడు చెప్పిన సంగతి. నాకు ఏ కొరతా లేకుండా అన్నీ అమరుస్తున్నారు నాయనా! నీ చేతులలో వెళ్ళిపోవాలన్న కోరిక తప్ప నాకే కోరికా లేదు' ఇలా మంచం మీదనే ఉండి చీకటి పడిన తరువాత తలపోసింది. అదే తలపుతో ఆ రాత్రి చాలా సేపు నిద్ర పట్టక తెల్లవారు ఝామున కునుకు పట్టింది. ఆ రాత్రి శృంగగిరిలోనున్న శంకరాచార్యునికి నిద్ర రాలేదు. కోడి కూసిన సమయంలో తల్లికి ఇచ్చిన మాట స్పృహకు వచ్చింది. తన తల్లికి అవసాన సమయం వచ్చిందని గ్రహించాడు. ఆలస్యం చేయకూడదనుకొన్నాడు. ఒక్కసారిగా యోగశక్తితో వాయుమార్గాన వచ్చి తల్లిపాదాల దగ్గర వాలాడు. కళ్ళు తెరచి చూడగానే కనిపించిన శంకరుని చేరదీసికొని ఆమాత కౌగిలించు కొన్నది. "అమ్మా! నీ కోరిక ప్రకారం నేను వచ్చాను. నీకుకావలసి వన్నీ తీరుస్తాను. బెంగ వలదు” అని తల్లికి ధైర్యం చెప్పాడు శంకరుడు. అతని మాటలలోని ఆంతర్యం ఎరిగిన ఆర్యాంబ నాయనా! ఎన్నాళ్ళకు నిన్ను చూస్తున్నాను! నిన్ను చూడాలన్నదే నా కోరిక. తండ్రీ! ఈ శరీరం పని చేయడం లేదు. శక్తి ఉడిగింది. లేవలేకు న్నాను.


ఈ కాయంఎన్నాళ్ళుమన్నుతుంది? ఇంక విడిచి వేయాలి. నీ చేతులతో దీనిని బూడిద చేయి. జ్ఞానబోధ చేసి అందర్నీ తరింప జేస్తున్నావట. నాకుకూడ పుణ్య లోకాలకు పోవాలని ఉన్నది. ఆ భాగ్యం నీ వల్లనే చేకూరుతుంది” అని పలికింది ఆర్యాంబ.


శంకరుడు సంగాన్ని వీడినా సత్యాన్ని వీడ లేదు. లోకంలోని వారందరినీ తల్లులుగా భావించిన శంకరుడు ఆర్యాంబను జగన్మాత గా భావించాడు. తన తల్లికి పునరావృత్తి రహితమైన పరమపద సిద్ధి కలిగించడం తన ధర్మం. అప్పుడు పరాత్పరుని గూర్చి ధ్యానం చేశారు. అపుడు పరమేశ్వరుడు సపరివారుడై వచ్చాడు ఆమెను తీసికొనే సంకల్పంతో. అప్పుడు ఆర్యాంబ “నాయనా! వీళ్ళు మరోలా ఉన్నారు. నాకు విష్ణులోకానికి వెళ్ళాలని ఉంది” అని కోరుతుంది. వెంటనే శంకరుడు శ్రీకృష్ణుని మదిలో నిల్పుకొని ప్రార్థించాడు. ఆర్యాంబకు అప్పుడు లభించింది శ్రీమహావిష్ణు దర్శనం.చతుర్భుజుడై శంఖ చక్ర గదా శార్ఞ ఖడ్గధారియై వైజయంతీ మాల కంఠాన మెరయగా శేషతల్పుడై మహాలక్ష్మీ సహితుడైన శ్రీహరి! పార్శ్వముల నుండి భూదేవి, నీలాదేవి వింజామరలు వీస్తున్నారు. ఆర్యాంబ తన అభీష్టసిద్ధిగా వైకుంఠవాసురాలైంది. జగజ్జననికి చేసిన వాగ్దానములో మిగిలినది దహన సంస్కారము. "శంకరా! నీవు యతివి. నీకు కర్మ చేయనర్హత లేదు. కావలసిన వారము మేము ఉన్నాము కదా! విద్యుక్తంగా మేమే ఆ కార్యం నిర్వహిస్తాము. నీవు తొలగు అని జ్ఞాతులు, బంధువులు నివారించ ప్రయత్నం చేశారు.వారికి సమాధానంగా “నారాయణ స్వరూపులారా! సన్న్యసించుటకు ముందే నేను ఈమెకు వాగ్దానము చేసి యున్నాను. అది నా ధర్మము. పైగా ఈ జగన్మాత కోరిక కూడా. లేకున్నచో జరిగే ధర్మ అతిక్రమణమే నివారింపదగినది. నన్ను నమ్మి ఈ నా విధి నిర్వహణ ధర్మానికి తోడవ్వండి” అని వారందరికీ నచ్చజెప్పాడు. కాలడి లోని ఇంటి వెనుక దొడ్డి భాగములో చితి పేర్చి, దానిపై తల్లి భౌతిక కాయాన్ని అమర్చి, తల్లి కుడి భుజమును మధించాడు. అందు నుండి అగ్ని పుట్టు కొచ్చినది. యధావిధిగా అగ్ని సంస్కారము పూర్తి అయింది. కాలడి వాసులు మొదటిలో వైరుధ్యం చూపినా తరువాత నేటికీ ఈ పద్ధతినే పాటిస్తున్నారు.


*కాలడి శంకర కైలాస శంకర*


*శ్రీ ఆది శంకరాచార్య చరిత్రము* 

*25 వ భాగము సమాప్తము*

🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷