12, ఫిబ్రవరి 2025, బుధవారం

13-23-గీతా మకరందము

 13-23-గీతా మకరందము

           క్షేత్రక్షేత్రజ్ఞవిభాగయోగము

-పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,

శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.


ఉపద్రష్టానుమన్తా  చ 

భర్తా భోక్తా మహేశ్వరః | 

పరమాత్మేతి చాప్యుక్తో 

దేహేఽస్మిన్ పురుషః పరః || 


తాత్పర్యము:- పురుషుడు (ఆత్మ) ఈ శరీరమందున్నప్పటికిని శరీరముకంటె వేఱైనవాడును, సాక్షి భూతుడును, అనుమతించువాడును, భరించువాడును, అనుభవించువాడును, పరమేశ్వరుడును (గొప్పప్రభువు, నియామకుడును), పరమాత్మయు అని చెప్పబడుచున్నాడు.


వ్యాఖ్య:- 'ఉపద్రష్టా’ యజ్ఞమునందు 'ఉపద్రష్ట’ అనువాడు సాక్షిమాత్రుడుగ నుండును. అట్లే ఆత్మ శరీరమందున్నను 'పరః’ - శరీరముకంటె వేఱుగ, పరముగనున్నవాడై దేహేంద్రియాదులకు సాక్షిగ వెలయుచున్నాడు. కావున జీవుడు తాను వాస్తవముగ అట్టి పరమాత్మస్వరూపుడే యనియు దేహేంద్రియాదులుకాదనియు లెస్సగ భావనచేయవలెను.

‘మహేశ్వరః, పరమాత్మా దేహేఽస్మిన్’ - అని చెప్పబడినందువలన జగన్నాథుడైన పరమేశ్వరుడు, పరమాత్మ ఈ దేహమందే వర్తించుచున్నాడని స్పష్టమగుచున్నది. ఈ ప్రకారముగ భగవానుడు జీవునకు అతిసమీపమున నుండుటవలన ప్రయత్నముచే సులభముగ పొందగలడు. వారికై దూరదూరములందు ప్రయాసపడి వెతుకనక్కఱ లేదు. మఱియు శిక్షించువాడు, శాసించువాడు, (ఈశ్వరుడు) చెంతనేయుండుట వలన పాపులివ్విషయమును గమనించి పాపకృత్యము లెవ్వియు చేయకనుండవలెను.


'పరః' - అని చెప్పుటవలన ఆత్మ దేహముతో, ఉపాధితో, సంబంధములేక దానికి పరముగా వేఱుగ, అతీతముగ నున్నదని తెలియుచున్నది.

 ‘పరః పురుషః’ - అను పదములకు పరమపురుషుడు, పరమాత్మ అనియు అర్థము చెప్పవచ్చును.


ప్రశ్న:- పరమాత్మ యెట్టివాడు?

ఉత్తరము:- (1) శరీరమందున్నను, శరీరముకంటె వేఱుగనున్నవాడును, (2) సాక్షిభూతుడును, (3)అనుమతించువాడును, (4) భరించువాడును, (5) అనుభవించువాడును, (6) గొప్పనియామకుడును, (పరమేశ్వరుడును) అయియున్నాడు.

కామెంట్‌లు లేవు: