*తిరుమల సర్వస్వం -147*
*తొండమాన్ చక్రవర్తి -2*
ఆ రంగదాసు స్వామివారి నిత్యపూజకు కావలసిన, పరిమళ భరితమైన, రంగురంగుల పువ్వులను పెంచటానికి భూతీర్థం లోని నీటిని వినియోగించే వాడు. ఆ తీర్థమే నేడు సంపంగి ప్రదక్షిణంలో ఉన్న "పూలబావి".
అలా, శ్రీమహావిష్ణువు తన దేవేరుల ద్వారా నిర్మింపబడ్డ తీర్థాలను తన భక్తుల ద్వారా పునరుద్ధరింప జేయించి తన మనోరథాన్ని నెరవేర్చుకోవడమే గాకుండా, ఆ తీర్థాలను ఈనాటికీ ఉపయుక్తంగా ఉంచి ఆ భక్తులిరువురినీ చరిత్రపుటల్లో చిరస్థాయిగా నిలిపాడు.
ఈ విధంగా, గోపీనాథుడు-రంగదాసులు ఇరువురు సుదీర్ఘకాలం పాటు అత్యంత భక్తిశ్రద్ధలతో శ్రీవారిని సేవించుకున్నారు.
*వరమా? శాపమా?*
కొంతకాలం తరువాత ఒకనాడు ఒక గంధర్వ చక్రవర్తి తన భార్యలతో కలిసి స్వామిపుష్కరిణిలో స్నానమాచరిస్తుండగా, అతని భార్యల అందచందాలను చూచిన రంగదాసు వికలమనస్కుడై, ఆ గంధర్వుడి భోగ భాగ్యాలకు అసూయాగ్రస్తుడై, పూలసేకరణలో జాప్యం చేశాడు. ఇంతలోనే జరిగిన పొరపాటుకు చింతిస్తూ, పుష్కరిణిలో తిరిగి స్నానమాచరించి, మరలా పుష్పాలను కోసుకుని, పూలమాలలతో దేవాలయానికి చేరుకున్నాడు. జరిగిన కాలాతీతానికి కారణమేమని ప్రశ్నించిన గోపీనాథునితో, తన తప్పిదానికి పశ్చాత్తాప పడుతూ జరిగినదంతా యథాతథంగా వివరించాడు.
ఆ సంభాషణను విన్న భగవంతుడు అశరీరవాణితో ఇలా పలికింప జేశాడు. *"జరుగవలసిన సమయానికి పూజ జరుగక పోవడం క్షమార్హం కాదు. కామవాంఛతో కలుషితమైన మనసుతో సాధన జరగటం దుర్లభం. ఈ దేహం విడిచిపెట్టేంతవరకూ ఆ పరమాత్ముడినే సేవిస్తూ, అవసానదశలో స్వామిపుష్కరిణి తీరంలోనే పరమపదం చెంది, మరుజన్మలో 'సుధర్ముడు" అనే ధర్మవర్తనుడైన రాజుకు పుత్రునిగా జన్మించి, తొండమండలానికి ప్రభువై, పెక్కుభార్యలతో భోగభాగ్యాలననుభవించి, ఆ జన్మలో కూడా శ్రీనివాసునికి ఆంతరంగిక భక్తుడై, శ్రీవారికి వెంకటాద్రి శిఖరంపై వైభవోపేతమైన ఆలయాన్ని నిర్మించి, ఆ దేవదేవుని సేవించుకుంటూ చరితార్థుడవుతావు".*
ఈ విధంగా, క్షణికమైన కామవాంఛకు లోనైన పాపానికి సుదీర్ఘకాలం మోక్షసిద్ధికై వేచి ఉండేలా శాపాన్ని; అచిరకాలం తనను సేవించు కున్నందుకు ఫలితంగా మరుజన్మలో మహారాజుగా జన్మించి ఆనందనిలయాన్ని నిర్మించి తరించేలా వరాన్ని; ఏకకాలంలో అనుగ్రహించాడు.
తరువాత రంగదాసు మరుజన్మ కోసం నిరీక్షిస్తూ, నూరు సంవత్సరాల సుదీర్ఘకాలం పాటు శ్రీనివాసుణ్ణి పుష్పకైంకర్యంతో సేవించుకొని, స్వామి పుష్కరిణీ తటాన కాలధర్మం చెందాడు.
తిరుమలేశుని ద్వారా శాపాన్ని, వరాన్ని ఏకకాలంలో పొందిన రంగదాసు నూరు సంవత్సరాల పాటు జీవించి, ఎల్లవేళలా శ్రీవారిని సేవించుకొని, స్వామి పుష్కరిణి తటంలో పరమపదించాడు.
*రంగదాసు మరుజన్మ*
కలియుగారంభంలో ఒకానొకప్పుడు సుధీరుడనే చక్రవర్తి కుమారుడైన సుధర్మ మహారాజు వేట నిమిత్తం కపిలతీర్థం ఆలయ ప్రాంతానికి విచ్చేశాడు. ఆ సమయంలో అక్కడ విహరిస్తున్న సౌందర్యరాశి యైన ఒక నాగకన్యను చూచి మోహించిన సుధర్ముడు, తనను గాంధర్వవివాహం చేసుకోవలసిందిగా ఆమెను వేడుకొన్నాడు. అంతట ఆ నాగకన్య తాను పాతాళలోక వాసుడైన "ధనుంజయుడు" అనే సర్పరాజు కుమార్తెనని, తన తండ్రి ఓ రాకుమారునికే తననిచ్చి వివాహం చేయ సంకల్పించాడని, తనకు జన్మించిన పుత్రునికే రాజ్యాభిషేకం జరగాలనే అభిలాషను కలిగి ఉన్నాడని, తన తండ్రి కోరిక ప్రకారం అటువంటి రాకుమారుడినే తాను వివాహమాడతానని బదులిచ్చింది. సుధర్ముడు, తాను సుక్షత్రియుణ్ణని, సుసంపన్నమైన "నారాయణవన" రాజ్యానికి రాజునని, కావున సర్పరాజు కోరుకున్న లక్షణాలన్నీ తనలో ఉన్నట్లేనని నాగకన్యతో చెప్పాడు. అయితే, అప్పటికే తనకు "ఆకాశరాజు" అనబడే తనయుడున్నాడని, జ్యేష్ఠపుత్రునికే రాజ్యాధికారం సంప్రాప్తిస్తుంది గావున నాగకన్యకు పుట్టే బిడ్డను రాజ్యాభిషిక్తుణ్ణి చేయలేనని విన్నవించుకున్నాడు. అయితే, మార్గాంతరంగా తన సామ్రాజ్యాన్ని రెండు భాగాలు చేసి, నాగకన్య తనను వివాహమాడితే ఆమెకు పుట్టబోయే కుమారునికి అర్థరాజ్య మిస్తానని వాగ్దానం చేశాడు. ఆ ఒప్పందానికి నాగకన్య అంగీకరించడంతో, వారిరువురూ గాంధర్వవివాహం చేసుకొని, కొండకోనల్లో విహరిస్తూ, కపిలతీర్థం వద్దే చాలా కాలం గడిపారు.
*శ్రీనివాసుని శ్రీచరణాలను సేవిద్దాం, సకల శుభాలనూ పొందుదాం*
*రచన*
*పల్లపోతు కృష్ణ బాలాజీ గారు- వాణి శ్రీ దంపతులు*
ఫోన్ నెంబర్
99490 98406
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి