*సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*
*ద్రోణ పర్వము ప్రథమాశ్వాసము*
*285 వ రోజు*
*సంశక్తులతో అర్జునుడి యుద్ధం*
అర్జునుడు ఆకలిగొన్న సింహమువలె సంశక్తులను ఎదుర్కొన్నాడు. వారు అర్ధచంద్రాకారంలో మొహరించి అర్జునుడిని ఎదుర్కొన్నారు. అర్జునుడు దేవదత్తఘోష విన్న సంశక్తుల హృదయాలు దద్ధరిల్లాయి అంతలోనే తేరుకుని ఒకరిని ఒకరు ప్రోత్సహించుకుంటూ అర్జునుడిని ఎదుర్కొన్నారు. అర్జునుడిని చుట్టిముట్టి వాడి అయిన శరములు అర్జునిపై ప్రయోగించారు. అర్జునుడు వాటిని మధ్యలో త్రుంచి తన వాడి అయిన బాణములతో పది వేలమంది రధికులను చంపాడు. తన మీద పది శరములను ప్రయోగించిన వారిని కేవలం అయిదుబాణాలతో యమసదనానికి పంపాడు. సుశర్మ, సుభాహుడు, సుధన్వుడు, సురధుడు అర్జునితో పోరాడుతున్నారు. అర్జునుడు వారి కేతనములు విరుగకొట్టాడు. సుధన్వుని హయములను చంపి , విల్లువిరిచి, ఒకేఒక బాణంతో అతడి తల నరికి విజయ సూచకంగా శంఖారావం చేసాడు. అర్జునుడు సంశక్తుల సైన్యంపై పడి వారి రధములను విరుగకొట్టాడు. అర్జునిని ధాటికి సంశక్తుల సేన చెల్లాచెదురు అయ్యాయి. అది చూసి సుశర్మ కలవర పడి " భయపడకండి వెనక్కు రండి అర్జునిని పరాక్రమం మనకు తెలియనిదా ! చేసిన ప్రతిజ్ఞ మరిచారా ! సుయోధనుని ముందు తల ఎత్తుకుని ఎలా తిరుగగలము " అని బిగ్గరగా అరిచాడు. అతడి మాటాలకు సైన్యం వెనుతిరిగి వచ్చి అర్జునుడితో తలపడింది. అర్జునుడు " కృష్ణా ! త్రిగర్తులు ప్రాణం ఉన్నంత వరకు పోరాడుతుంటారు. రథమును వెనుకకు మరల్చి వీరిని యమసదనముకు పంపినగాని మన పని పూర్తి కాదు " అన్నాడు.
*నారాయణాభిదాసుల సమరం*
కృష్ణుడు రధమును వెనుకకు మరల్చాడు ఆ సమయంలో నారాయణాభిదాసులు పదివేల మంది వారిని ఎదుర్కొన్నారు. వారందరికి కృష్ణార్జునుల మీద కోపంగా ఉంది. యుద్ధానికి ముందు ద్వారకకు వచ్చి అర్జునుడు, సుయోధనుడు సహాయం కోరిన సమయంలో అర్జునుడు తమను కృష్ణుని నుండి వేరు చేసి సుయోధనుడి పరం చేసినందుకు వారికి కృషార్జునుల ఇరువురి పైన కసిగాను కోపంగాను ఉంది. వారు కృష్ణార్జునులపై శరవర్షం కురిపించాడు. వారిని చంపనిచ్చగించని అర్జునుడు తనకు త్వష్ట ప్రజాపతి ప్రసాదించిన దివ్యాస్త్రమును వారిపై ప్రయోగించాడు. ఆ అస్త్ర ప్రభావంతో నారాయణాభిదాసులలో ప్రతి వారికి తన ఎదుటి వాడు అర్జుడిలా కనిపించసాగాడు. ఆ అస్త్ర ప్రభావంతో ఒకరిని ఒకరు నరుక్కుని అనేక మంది చని పోయారు. ఇంతలో అస్త్ర ప్రభావం తగ్గి పోయింది. మిగిలిన నారాయణాభిదాసులు మగధ, కేరళ మొదలగు రాజులతో కలిసి మహోగ్రంగా కృష్ణాంజ్ఞులను చుట్టుముట్టి అర్జునుడిపై శక్తి వంతములైన అస్త్రశస్త్రములు వేసారు. అర్జునుడు వారి అస్త్రములను త్రుంచి వారి శిరములను తన వాడి బాణములతో ఖండించాడు. వారి సైన్యములోని హయములు, ఏనుగులు, కాల్బలము అర్జునుడి బాణములకు ఆహుతి అయ్యాయి.
*అర్జునుని సంశక్తులు తిరుగి ఎదుర్కొనుట*
ఇంతలో సంశక్తులు తమ సైన్యాలను సమీకరించి అర్జునుడిని ఎదుర్కొని అర్జునుడి మీద శరవృష్టి కురిపించారు. వారిలో కొంత మంది రధములు దిగి అర్జునుడి రధము మీద హయముల మీద దాడి చేసారు. అన్ని దిక్కుల నుండి శరప్రయోగం చేయడంతో పాండవ సేనకు అర్జునుడి రథం కనిపించ లేదు. కృష్ణార్జునులు సంశక్తుల చేతిలో మరణించారు అనుకుని ఆందోళన పడ్డారు. వారి ఆందోళన గమనించి సంశక్తులు సింహనాదాలు చేసి శంఖారావములు చేసారు. నొగల మీద కూర్చున్న కృష్ణునికి అర్జునుడు కనిపించక కలవర పడి " అర్జునా! అర్జునా ! " అని ఎలుగెత్తి అరిచాడు. పరిస్థితి అర్ధం చేసుకున్న అర్జునుడు వాయవ్యాస్త్రం ప్రయోగించి సంశక్తుల సైన్యాలను చెదుమదురు చేసాడు. కృష్ణార్జునులు కనిపించగానే పాండవ సైన్యం ఊపిరి తీసుకుని హర్షధ్వానాలు చేసారు. సంశక్తులు తిరిగి సైన్యములను కూడగట్టుకుని ఒక్కుమ్మడుగా అర్జుడి మీద దాడి చేసారు. అర్జునుడు వారు వేసిన శరములు మధ్యలో త్రుంచి వారిపై అతి క్రూర నారాచములు వేసి వారి సైనికుల శిరస్సులను త్రెంచాడు. ఏనుగులు, హయములు, రథములు తునాతునకలు ఔతున్నాయి. మొండెములు ఇతర అవయవములు ఎగిసి పడుతున్నాయి. అయినా బెదరక సంశక్తులు అర్జునుడిపై శరపరంప కురిపించారు. తీవ్రంగా పోరు సాగుతుంది.
*రేపు *
*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*
*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి