*సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*
*ద్రోణ పర్వము ప్రథమాశ్వాసము*
*286 వ రోజు*
ద్రోణుడు పాండవసైన్యమును ఎదుర్కొనుట*
ద్రోణుడు ఎలాగైనా ధర్మరాజును పట్టుకోవాలని ప్రయత్నంతో పాండవ సైన్యాలను తరిమి తరిమి కొట్టి ధర్మజుని సమీపించాలను చూస్తున్నాడు. దుర్ముఖుడు ధృష్టద్యుమ్నుని ఎదుర్కొన్నాడు. ద్రోణుని ధాటికి పాండవ సన్యాలు వెనక్కు తగ్గాయి. ధర్మరాజు తనసేనను ప్రోత్సహిస్తూ యుద్ధోన్ముఖులను చేస్తున్నాడు. ద్రోణుని చేతిలో వేలకు వేలు సైనికులు వీరస్వర్గం చేరుకున్నారు. రక్తం ఏరులై ప్రవహిస్తుంది. రథముల క్రింద కొందరు, ఏనుగుల పాదముల క్రింద కొందరు మరణిస్తున్నారు. మదపుటేనుగులు తమ తొండముతో సైనికులను పైకెత్తి నేలకేసి కొడుతున్నాయి. యుద్ధభూమి భయానకంగా ఉంది. ద్రోణుడు తన సైన్యంతో ధర్మరాజు మీదకు వెళ్ళాడు. అతడిని ధర్మరాజు ఎదుర్కొన్నాడు. ద్రోణుడు సత్యజిత్తు విల్లు విరిచాడు. సత్యజిత్తు వేరు విల్లు తీసుకుని క్రూర భల్ల బాణాలు ముప్పది ద్రోణుని మీద వేసాడు. పాంచాల రాకుమారుడు వృకుడు సత్యజిత్తుతో కలిసి అరవై బాణములు ద్రోణునిపై ప్రయోగించాడు. అది చూసి పాండవసేన హర్షధ్వానాలు చేసాడు. ద్రోణుడు కోపించి సత్యజిత్తుని, వృకుని తన బాణపరంపరతో ముంచెత్తాడు. వారిరువురు వెరువక ద్రోణుని సారథిని, హయములను, కేతనములను కొట్టారు. ద్రోణుడు సత్యజిత్తు శరీరంపై పది నారాచములు వేసాడు. సత్యజిత్తు మరొక విల్లు తీసుకుని ద్రోణునిపై శిలీఖములు వేసాడు. ద్రోణుడు సత్యజిత్తు విల్లు విరిచి వృకుని తల నరికి సత్యజిత్తు రథమును విరిచి, హయమును, సారథిని చంపాడు. సత్యజిత్తు వేరొక విల్లు తీసుకుని ద్రోణునిపై శరవర్షం కురిపించాడు. ద్రోణుడు సత్యజిత్తు విల్లు విరిచాడు సత్యజిత్తు తీసుకుంటున్న ప్రతి విల్లు విరుస్తూ అతడి శిరస్సుని ఒక అర్ధ చంద్ర బాణంతో ఖండించాడు. సత్యజిత్తు మరణం చూసిన ధర్మరాజు అర్జునుడి మాటలు గుర్తుకు వచ్చి కలవరపడి ద్రోణునికి పట్టుబడక అక్కడి మెల్లగా నుండి తప్పుకున్నాడు. తనకు ఎదురు వచ్చిన వారినందరిని చంపుతూ ధర్మజుని కొరకు వెతుకుతున్నాడు. అంతలో విరాటుని తమ్ముడు సూర్యదత్తు ద్రోణుని ఎదుర్కొని అతడిపై కరకుటమ్ములు ప్రయోగించాడు. చిరాకు పడ్డ ద్రోణుడు ఒకే బాణంతో అతడి శిరస్సు ఖండించాడు. అది చూసి విరాటుని సేనలు పారిపోయాయి. ద్రోణునికి ఎదురు నిలిచేవారు లేక పోయారు. ఆ రోజు అలాగైనా ధర్మజును పట్టుకోవాలన్న దృఢ సంకల్పంతో ఉన్నాడు. అప్పుడు యుధామన్యుడు, ఉత్తమౌజుడు, వసుదాసుడు, శిఖండి ఒక్కుమ్మడిగా ద్రోణుడిని ఎదుర్కొని ఒక్కొక్కరు అయిదేసి బాణములు ద్రోణునిపై ప్రయోగించారు. సాత్యకి పన్నెండు బాణములు, క్షాత్రధర్ముడు పది బాణములు ద్రోణునిపై ప్రయోగించారు. యుధిష్టరుని కాపాడుతూ ధృష్టద్యుమ్నుడు, చేకితానుడు ద్రోణుని ఎదుర్కొని ద్రోణుని మీద ఒక్క సారిగా మూడు వందల బాణములు వేసారు. వారి అండతో ధైర్యం తెచ్చుకుని ధర్మరాజు ద్రోణునికి ఎదురుగా వచ్చి ద్రోణునిపై పన్నెండు బాణములు ప్రయోగించాడు. ధర్మజుని చూసి రెచ్చి పోయిన ద్రోణుడు ఒకే శరముతో వసుదాసుని శిరస్సు ఖండించాడు. ఉత్తమౌజుడు, సాత్యకి, శిఖండి మీద కరకుటమ్ములు వేసాడు. ధర్మరాజు వైపు ద్రోణుడు రావడం గ్రహించి ధర్మరాజు అక్కడి నుండి నిష్క్రమించాడు. చేతికి చిక్కిన ధర్మజుడు కనపడక ద్రోణుడు చిరాకు పడ్డాడి పాండవ సేనను చెండాడ సాగాడు. రథములు, కేతనములు విరిగి పడుతున్నాయి, హయములు, గజములు నేల పడుతున్నాయి. కౌరవ సేనలు ఉత్సాహంగా పాండవ సేనలను తరుముతున్నాయి. ఇంతలో వార్ధక్షేమి, చిత్రసేనుడు, సేనాబిందుడు, సువర్చనుడు, ధృష్టద్యుమ్నుడు, చేకితానుడు, సుమిత్రుడు, సాత్యకి, శిఖండి తమ సేనలతో ఒక్కుమ్మడిగా ద్రోణుని ఎదుర్కొన్నారు. ద్రోణుడు రథమును వేగంగా త్రిప్పితూ అనేక రూపములు ధరించాడా అన్నట్లు శరవర్షం కురిపిస్తూ సుమిత్రుని చంపాడు. ఇది చూసిన కేకయరాజులు, మత్స్య రాజులు తమ సేనలతో పారిపోయారు. ధృష్టద్యుమ్నుడు, సేనాబిందుడు, సాత్యకి మొదలగు ప్రముఖులు నిశ్చేష్టులై ద్రోణుని యుద్ధ వైఖరిని చూడ సాగారు. ఇది చూసిన సుయోధనుడు " కర్ణా ! చూసావా పెను గాలికి కూలి పోయిన వృక్షములవలె పాండవ సేన కూలి పోయింది. ద్రోణుని ఎదిరించగలిగిన వాడు పాండవ సేనలో లేడు. భీముడు ఒంటరిగా నిస్సహాయం నిలబడి ఉన్నాడు చూడు అన్నాడు. ద్రోణుని అస్త్రధాటికి నిలువ లేక రాజ్యకాంక్ష వీడి పారి పోతున్నాడు చూడు " అని ఆనందంగా అన్నాడు. కర్ణుడు " సుయోధనా ! పాండవులను అంత తేలికగా తీసి వేయకు. వారు మహావీరులు. అంతా కలిసి భీముని ముందు నిలిపి ద్రోణుని ఎదుర్కొంటారు. మనం ద్రోణుని రక్షణకు వెళ్ళాలి " అన్నాడు
*రేపు *
*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*
*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి