12, ఫిబ్రవరి 2025, బుధవారం

తిరుమల సర్వస్వం-146*

 తిరుమల సర్వస్వం-146* 

   

           *తొండమాన్ చక్రవర్తి -1*


 *తొండమాన్ చక్రవర్తి* 


 మనం వివిధ ప్రకరణాలలో ఇంతవరకూ ఆకాశరాజు తమ్ముడైన తొండమానుడు పద్మావతీపరిణయం లో ముఖ్య భూమిక వహించటం; శ్రీనివాసుని ఆనతిపై ఆనందనిలయం నిర్మాణం కావించి కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీవారు శాశ్వతంగా తిరుమల క్షేత్రం మీద కొలువై ఉండటానికి కారణభూతుడు అవ్వటం గురించి మాత్రమే తెలుసుకున్నాం. అయితే, ఈ భక్తశిఖామణికి ఎంతో విశిష్టమైన వృత్తాంతం ఉంది.


 *శ్రీతీర్థం – భూతీర్థం* 


 కృతయుగంలో ముల్లోక పర్యటనలో భాగంగా శ్రీదేవి భూదేవి సమేతుడై భూలోకానికేతెంచిన శ్రీమహావిష్ణువు, ఆనాడు క్రీడాద్రిగా పిలువబడే, నేటి వెంకటాద్రి పర్వతం పైనున్న ప్రకృతి సోయగానికి ముగ్ధుడై కొంతకాలం అక్కడే విహరిస్తూ ఉండిపోయాడు. ఆ సమయంలో శ్రీమహావిష్ణువుకు కావలసిన భోజనాదుల నిమిత్తం, ఆ పర్వతశిఖరంపై దేవేరులిద్దరూ చెరొక తీర్థాన్ని (బావులను) ఏర్పాటు చేశారు. శ్రీదేవి ఏర్పరచిన తీర్థం *'శ్రీతీర్థం"* గానూ, అలాగే భూదేవి ద్వారా ఏర్పాటు చేయబడ్డ తీర్థం *"భూతీర్థం"* గానూ ప్రసిద్ధికెక్కాయి. కాలాంతరాన, కలియుగారంభం నాటికి ఈ రెండు తీర్థాలు శిథిలమై పోయాయి. తన ప్రియసఖుల ద్వారా ఏర్పాటు చేయబడిన ఈ తీర్థాలను ఎంతగానో ఇష్టపడే విష్ణుమూర్తి, వాటిని ఎలాగైనా పునరుద్ధరింప చేయాలని సంకల్పించి తగిన సమయం కోసం వేచి చూస్తున్నాడు.


 *సద్భాహ్మణుడు - శూద్ర భక్తుడు* 


 ఇదిలా ఉండగా, కలియుగారంభం నందు చోళరాజ్యంలోని హరిద్రానదీ తీరాన ఉన్న కృష్ణ క్షేత్రమనే గ్రామంలో, శ్రీకృష్ణునికి పరమభక్తుడైన వైఖానసుడనే సద్ర్బహ్మణుడు భగవత్సాక్షాత్కారం కోసం కఠోరమైన తపమాచరించాడు. అతని నిష్ఠాగరిష్టతకు ప్రీతి చెందిన శ్రీమహావిష్ణువు శ్రీకృష్ణుని రూపంలో ప్రత్యక్షమై ఏదైనా వరం కోరుకోవలసిందిగా ఆదేశించాడు. అందుకు వైఖానసుడు భౌతిక సంపదలను కోరుకోకుండా; తనకు మోక్షాన్ని ప్రసాదించమని, ఎల్లవేళల శ్రీకృష్ణుని రూపంలో తన పూజలు స్వీకరించమని కోరుకున్నాడు. 


‌ అతని నిస్వార్థభక్తికి మెచ్చిన శ్రీమహావిష్ణువు, తాను వెంకటాద్రి పర్వతంపై శ్రీనివాసునిగా స్వయంవ్యక్తమై ఉన్నానని; అతను కోరుకున్నట్లే నిత్యము ఆ శ్రీనివాసుణ్ణి సేవించి తరించవచ్చునని వరమిచ్చాడు. అంతే గాకుండా ఇకనుండి వైఖానసుడే *"గోపీనాథుని"* గా ప్రసిద్ధి కెక్కుతాడని; అతనికి *"రంగదాసు"* అనే శూద్రభక్తునితో పరిచయం ఏర్పడుతుందని; కృతయుగంలో వేంకటాద్రిపై *"శంఖరాజు"* అనే భక్తునిచే నిర్మించబడిన విమానగోపురం కలిగిన తన ఆలయం శిథిలమవ్వగా, అందున్న విగ్రహం సమీపంలోనే ఉన్న ఒక చింతచెట్టు క్రింద ఉన్నట్టి పుట్టలో పడిఉన్నదని; వారిరువురూ (వైఖానసుడు, రంగదాసు) కలసి ఆ విగ్రహాన్ని పుట్టలో నుండి బయటకు తెచ్చి, ఒక వైభవోపేతమైన దేవాలయాన్ని నిర్మించి, అందులో విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించి, నిత్యము పూజాదికాలు జరుపవలసిందని కూడా శెలవిచ్చాడు. 


‌ తదనంతరం, భగవదాజ్ఞ మేరకు వెంకటాద్రి పర్వతానికి బయలుదేరిన గోపీనాథునికి మార్గమధ్యంలో రంగదాసు కలువగా; ఇరువురూ కలసి సువర్ణముఖీ నదిలో స్నానమాచరించి, సమీపంలోనే ఉన్న శుకపురి (నేటి తిరుచానూరు) అనే పుణ్యక్షేత్రం లోని శ్రీకృష్ణ బలరాముల ఆలయాన్ని దర్శించుకుని, వేంకటాచలానికి తరలి వెళ్ళారు.


 *శ్రీనివాసుని సేవలో భక్తద్వయం* 


‌ శ్రీవారి ఆనతి మేరకు వెంకట పర్వతాన్ని చేరుకున్న భక్తులిరువురు స్వామి పుష్కరిణియందు స్నానమాచరించి; పుష్కరిణికి దక్షిణాన ఉన్న చింతచెట్టు క్రింది పుట్టను త్రవ్వి, అందులో నిక్షిప్తమైయున్న, దివ్య తేజస్సు ఉట్టిపడే, సాలగ్రామశిలా నిర్మితమైన స్వామివారి మూర్తిని వెలికి తీసి; ఎంతో కాలంగా పుట్టకు నీడనిచ్చిన చింతచెట్టును, శ్రీమహాలక్ష్మికి ప్రీతిపాత్రమైన చంపక వృక్షాన్ని మాత్రమే ఉంచి; ఇతర వృక్షాలను, తుప్పలను, బండరాళ్లను తొలగించి; ఆ ప్రదేశాన్ని శుభ్రపరిచి విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించారు. విగ్రహం చుట్టూ అందుబాటులో ఉన్న బండశిలలతో కుడ్యాలను నిర్మించి, రెల్లుగడ్డితో పైకప్పు నేర్పరచి శ్రీవారికి తాత్కాలిక వసతి కల్పించారు.


 ప్రతిరోజూ శ్రీనివాసునికి గోపీనాథుడు పూజాదికాలు సమర్పించుకునేవాడు. పూజకు కావలసిన పుష్పాలను సమయానికి సమకూర్చే బాధ్యతను వహించిన రంగదాసు, పూదోటను పెంచటం కోసం ఆ సమీపంలోనే రెండు బావులను కూడా నిర్మించాడు. భగవత్సంకల్పంతో ఆ బావులు నిర్మించబడ్డ ప్రదేశంలోనే శ్రీదేవి భూదేవిలచే ఎప్పుడో నిర్మించబడి శిథిలమై పోయిన శ్రీతీర్థం, భూతీర్థం బహిర్గత మయ్యాయి. శ్రీతీర్థం నందలి పవిత్ర జలాలను గోపీనాథుడు శ్రీవారి వంటలకు, అభిషేకార్చనాదుల నిమిత్తం ఉపయోగించేవాడు. అదే నేడు విమానప్రదక్షిణ ప్రాకారంలో ఉన్న *"బంగారుబావి".*


[ రేపటి భాగంలో... *రంగదాసు మరుజన్మ* గురించి తెలుసుకుందాం]


*శ్రీనివాసుని శ్రీచరణాలను సేవిద్దాం, సకల శుభాలనూ పొందుదాం* 


*రచన* 

*పల్లపోతు కృష్ణ బాలాజీ గారు- వాణి శ్రీ దంపతులు*

ఫోన్ నెంబర్

99490 98406

కామెంట్‌లు లేవు: