12, ఫిబ్రవరి 2025, బుధవారం

13-24-గీతా మకరందము

 13-24-గీతా మకరందము

           క్షేత్రక్షేత్రజ్ఞవిభాగయోగము

-పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,

శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.


అవతారికII ఈ ప్రకారముగ ప్రకృతిపురుషులనుగూర్చి యొఱుంగుటవలన గలుగు ఫలితమును వచించుచున్నారు –


య ఏవం వేత్తి పురుషం 

ప్రకృతిం చ గుణైః  సహ | 

సర్వథా వర్తమానోఽపి 

న స భూయోఽభిజాయతే || 


తాత్పర్యము:- ఎవడీ ప్రకారముగ పురుషుని (ఆత్మను), గుణములతో గూడిన ప్రకృతిని తెలిసికొనుచున్నాడో, ఆతడేవిధముగ నున్నప్పటికిని మఱల జన్మింపడు.


వ్యాఖ్య:- మఱల జన్మను బొందకుండుటకు అనగా మోక్షప్రాప్తికి ఉపాయమేమియో ఇచట సెలవిచ్చుచున్నారు. పురుషుడు (ఆత్మ) యెట్టివాడు? ప్రకృతి యెట్టిది? అను ఈ ప్రకారముగ ఆత్మానాత్మవిచారణాసమర్థుడై యుండు మనుజుడు, దృక్, దృశ్యములను బాగుగ వివేచించి చూడగలడు. కాబట్టి అట్టి విచారణాశీలుడు త్రిగుణాత్మకమై, బంధజనకమై, దుఃఖప్రదమైనట్టి ప్రకృతిని ఆశ్రయింపక గుణరహితమై, బంధచ్ఛిదమై, పరమానందరూపమైనట్టి పురుషునే (ఆత్మనే) ఆశ్రయించును. కావున ఆతడిక జన్మింపడు, ముక్తుడేయగును. ఏలయనగా ప్రకృతి, పురుషుల జ్ఞానముకలవాడు, అనాత్మను, అనగా దృశ్యమును, ప్రకృతిని తనకంటె (పురుషునికంటె) వేఱుగజూచుచు అద్దానితో సంగము (కలయిక) లేకుండును. కనుకనే అట్టివాడు ముక్తుడై మరల జన్మింపడని వచింపబడినది.


‘సర్వథా వర్తమానోఽపి’ - అట్టివాడు ఎట్లున్నప్పటికిని - అని చెప్పుటచే సమాధినిష్ఠుడైయున్నను, లేక లోకమున (ప్రజోపకార) కార్యములను జేయుచున్నను, బ్రహ్మచర్యాదిరూపమగు ఏ ఆశ్రమమందున్నను, మఱల జన్మింపడని భావము. అతడెట్లువర్తించినను సర్వథాముక్తుడేయగును. అయితే “ఎట్లు వర్తించినను" అనుదానికి అర్థము 'నిషిద్ధాచరణ' గలిగియుండినప్పటికిని అని యెవరును భావింపరాదు. ఏలయనిన నిషిద్ధాచరణగలవాడు ఆత్మానాత్మవివేకి యెన్నటికిని కానేరడు. మఱియు వివేకియగువాడు నిషిద్ధకృత్యముల నెన్నటికిని  చేయడు. కావున ఇట్టి వాక్యముల యర్థమును గ్రహించుటయందు బహుజాగరూకుడై యుండవలెను.


ప్రశ్న:- ప్రకృతి, పురుషులనుగూర్చిన జ్ఞానము గలిగియున్నచో ఫలితమేమి?

ఉత్తరము:- అట్టి జ్ఞానము కలవాడు ఏ ప్రకారము వర్తించినను జన్మరాహిత్యమును బొందును. అతడు మఱల జన్మింపడు.

కామెంట్‌లు లేవు: