🙏పోతన భాగవతం 🙏
నాలుగవ భాగం
భాగవతం మరొక విశిష్టత ఏమిటంటే
పోతన గారు భాగవతంలో భక్తి జ్ఞాన వైరాగ్యములను చక్కగా బోధించారు. .జీవితం గురించి బంధాలు గురించి ఆయన చెప్పిన విషయాలు వింటే జీవితం బుద్బుదప్రాయం అనే విషయం అవగతం అవుతుంది. అంతేగాక మనకు మోక్ష మార్గం కూడా భాగవతంలో నిర్దేశం చేశారు.
భాగవతమును శ్రీశుకుడు ఉపదేశం చేసేప్పుడు పరిక్షిత్తుమహారాజు ఒక్కరే లేరు. ఆయన చుట్టూ ఎన్నో వేల మంది ఉన్నారు. రాజు రాజ్యం వదిలి పెట్టి ఉంటే వారంతా ఆయన చుట్టూ చేరి ఉన్నారు. ఋషులు కూడా అక్కడ చేరి ఉన్నారు. గంగను మించిన జన ప్రవాహం ఉంది అక్కడ. అందరూ భాగవతమును విన్నారు, మరి అందరూ తరించారా? ఊహు ... తరించింది ఒక్క పరిక్షిత్తుమహారాజు మాత్రమే. ఎందుకంటే అది విన్న వారి యోగ్యతపై ఆధారపడి ఉంటుంది. అందులో కొందరు రాజుగారికి సప్తదినాల్లో మరణమని తెలిసి, ఏం జరుగుతుందో చూద్దామని వచ్చి విన్నవారు, మరికొందరు ఏదో కాలక్షేపం కోసం అన్నట్లు విన్నవారూ ఉన్నారు. కానీ పరిక్షిత్తుమహారాజుకే మోక్షఫలం దక్కింది. అదేమి పక్షపాతం కాదు. విన్నవారి యోగ్యతబట్టే ఫలితం. తెలుసుకోవాలని తపన మూర్తీభవించి విన్నవాడు తరించాడు. శ్రవణం చేస్తుంటే తిండి నీరు నిద్ర అసలేం వద్దు అన్నాడు. దాహం, ఆకలి, అలసట అనేది అనిపించటం లేదు అని అన్నాడు. ఆయనకున్న శ్రద్ధ, తపన అలాంటిది. అందుకే ఆయనకి మోక్షం వెంటనే లభించింది
చుట్టాలు దొంగలు సుతులు ఋణస్థులు;-
కాంతలు సంసార కారణములు;
ధనము లస్థిరములు; దను వతి చంచల-
గార్యార్థు లన్యులు; గడచుఁగాల
మాయువు; సత్వర మైశ్వర్య మతి శీఘ్ర-
మని కాదె తమ తండ్రి నతకరించి
మా తాత సాధుసమ్మతుఁడు ప్రహ్లాదుండు-
నీ పాదకమలంబు నియతిఁ జేరె
భద్రుఁ డతనికి మృతి లేని బ్రతుకుఁ గలిగె
వైరులై కాని తొల్లి మా వారుఁ గాన
రర్థివై వచ్చి నీవు న న్నడుగు టెల్ల
బద్మలోచన! నా పుణ్య ఫలము గాదె?"
భావము:
పురాణపురుషా! “చుట్టాలు దొంగలు కొడుకులు అప్పులవాళ్ళు. భార్యలు ముక్తిని దూరంచేసేవారు. సంపదలు నిలకడ లేనివి. శరీరం స్థిరం కాదు. ఇతరులు తమప్రయోజనాన్నే కోరుతారు. కాలం నిలువదు. ఆయుస్సు త్వరగా గడుస్తుంది. ఐశ్వర్యం తొందరగా వెళ్ళిపోతుంది” అనుకున్నాడు పుణ్యాత్ముడైన మా తాత ప్రహ్లాదుడు. ఆయన తన తండ్రిని విడనాడి నీపాదాలను సేవించాడు. అదృష్టవంతుడైన అతనికి మరణంలేని మనుగడ దొరికింది. పూర్వం మావారు శత్రువులుగా మారితే తప్ప నిన్ను దర్శించలేకపోయారు. నీవు అర్థివై వచ్చి నన్ను దేహి అనడం మా పూర్వ పుణ్య ఫలమే కదా స్వామీ
హిరణ్యకశిపుడు సాక్షరుడైన రాక్షసుడు. విద్య ఉన్నా వివేకం లేనివాడు. వేదాంతం తెలిసినా భేదాంతం కాని వాడు- భేద బుద్ధి నశించనివాడు. ఎంతైనా ద్వైతబుద్ధి- భేదబుద్ధి అనే ‘దితి’ పుత్రుడేకదా! కనుక మాటల్లోనే వేదాంతం. అంటే, వాడిది మెట్టవేదాంతమే కాని తుది ముట్టే పట్టుకలిగిన గట్టి వేదాంతం కాదు. అది కేవలం ‘వాచా జ్ఞానం’. అనుభవం లేని పరోక్ష జ్ఞానం. ఇట్టి వాచా (నోటిమాటల) జ్ఞానాన్ని శాస్త్రం అజ్ఞానమనే అన్నది. వివేక, వైరాగ్యాలు లేని వాచా జ్ఞానాన్ని నాటకాల్లో వాడే దూది గదతో పోల్చారు ప్రాజ్ఞులు- తత్త్వవేత్తలు. అది ప్రదర్శనకు, ప్రవచనానికే గాని యుద్ధానికి, పరమార్థానికి పనికిరాదు.
‘పరోపదేశే పాండిత్యం’- పరులకు నీతిని బోధించడంలో హిరణ్యకశిపునికి ఉన్న పాండిత్యానికి ఈ ‘సుయజ్ఞ’ ఉపాఖ్యాన ప్రసంగం ఒక ప్రకృష్ట ప్రతీకం- సంకేతం. తన తల్లికి, కోడండ్రకు వైరాగ్యం ఉపదేశించే వీడు తాను మాత్రం మదించి మహావిష్ణువుతో విరోధం పెంచుకున్నాడు. తాము ఆచరించక ఇతరులకు బోధించి, తమను తాము బాధించుకొనే వారే అసురులు- హిరణ్యకశిపులు.
సశేషం
సమర్పణ
మారేపల్లి ఉదయ భాస్కర శర్మ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి